మనలో అందరికీ కాకపోయినా ఎక్కువ మందికి గ్లోబల్ వార్మింగ్ అడవుల నరికివేత వల్ల తలెత్తే పర్యావరణ సమస్యలు ఎలా ఉంటాయో తెలుసు. వాటి తీవ్రత కూడా మనలో చాలా మందికి అవగాహనలో ఉన్న విషయమే. ఒకవైపు ఈ సమస్యలు ఇట్లా ఉండగా, ఇంకొకవైపు సామాజిక సమస్యలైన పేదరికం, పట్టణ పేదరిక వాడల పెరుగుదల ఈ రెండూ తోడయితే విధ్వంసం తీవ్రంగానే ఉంటుంది. అడపాదడపా ఈ రెండిటివల్ల ఉత్పన్నమయ్యే సమస్యలను ఎదుర్కొంటూనే ఉన్నాం. అంతే కాకుండా డా. హైబర్గ్ అంచనా వేసినట్లుగా మానవ ప్రేరిత వాతావరణ మార్పులు, త్వరితంగా మారుతూ ఉన్న సామాజిక ఆర్థిక స్థితిగతులు ఏకమై ఒక శృంఖలా బద్ధమైన విధ్వంసాలు మరిన్ని మహా విపత్తులకు దారులు పరుస్తూ ఉన్నాయి.
గ్లోబల్ వార్మింగ్ గురించి అద్భుతమైన అధ్యయనాలు జరిగాయి. గ్లోబల్ వార్మింగ్‍ను నిలుపుదల చేయడానికి ఏం చేయాలనే విషయంగానూ శాస్త్రవేత్తలు సిఫారసు చేసి ఉన్నారు. వాటిని తిరిగి సమీక్షించకుండానే భూతాపాన్ని అరికట్టగల అవకాశాలకు కొదువ లేదు. యూరప్ అంతటా ఉష్ణసంబంధ మరణాలు 2003 గ్రీష్మకాలంలో పెరిగాయి. ఆగస్ట్ 28, 2005లో న్యూ ఆర్లీన్స్ను ముంచెత్తిన కత్రీనా తుఫాన్ ఎంతటి విధ్వంసం సృస్టించిందో తెలిసిందే. ఈ తుఫాన్ పర్యావరణ సంక్షోభ ఫలితంగా సంభవించిందే. అనేక మంది పౌరులు విస్తాపతులయ్యారు. విద్యావ్యవస్థ ఛిన్నాభిన్నమైంది. ఒక విధంగా పౌరసమాజం మానసికంగా ప్రబలిపోయింది. కత్రీనామ సూపర్ డిజాస్టర్‍గా అభివర్ణించవచ్చు. గ్లోబల్ వార్మింగ్ కారణంగానే ఈ పెను విపత్తు సంభవించింది. రానున్న సూపర్ డిజాస్టర్‍లకు ఇది ఒక ప్రారంభం మాత్రమే. ముందు ముందు ఇటువంటి ఘటనలు పరంపరగా జరుగుతాయని శాస్త్రవేత్తలు అంచనా వేశారు కూడా. ప్రతి మహా విధ్వంసం కూడా దేనికదే ప్రత్యేకమైంది. ఊహించడానికి కూడా అలవికానటువంటిది.
ఎక్కడో అమెరికాలో కత్రీనా తుఫాన్ వస్తే మనకు జరిగే నష్టమేమిటి అని ప్రశ్నించే ధోరణి కూడా మహావిద్వంసాలకు గురికాని ప్రాంతాల నుండి సహజంగానే వస్తుంది. గల్ఫ్ జలసంధిలో నీటి ఉష్ణోగ్రతల స్థాయి పెరిగినందువల్ల కత్రినా హరికేన్ సంభవించింది. కత్రినామ కారణం గ్లోబల్ వార్మింగ్. గ్లోబల్ వార్మింగ్‍కు మూలం పెరిగిన ఉష్ణోగ్రతలు. ప్లోరిడా ద్వీపకల్పంలో తలెత్తిన తుఫాన్ గల్ఫ్వైపు ప్రయాణించి అక్కడి అతితీవ్ర నీటి వేడికి పెరిగి పెరిగి 5వ స్థాయి తుఫాన్ భూతంగా భీతావహప్రపంచం కళ్లముందు పెను విధ్వంసాన్ని నిలిపింది.
తరాలుగా అసమర్థ పాలక వర్గాల నిర్లక్ష్యం వేటువేసి న్యూ ఆర్డిన్స్ను బద్ధలు కొట్టింది. ముందుచూపు, దూరదృష్టి పర్యావరణ అవగాహన లాంటివి కలిగి ఉన్నట్లయితే కత్రీనా లాంటివి సంభవించకుండా చూడగలిగే వారు. లేదా విధ్వంస తీవ్రతలను తగ్గించగలిగి ఉండేవారు. ప్రణాళికలలో నిర్లక్ష్యం, లోపాలు లొసుగులు ఈ విపత్కర పరిస్థితులకు రాచబాట వేశాయి. మరొక విషయం ఏమంటే మిసిసిపి డెల్టాలోని చిత్తడి నేలలు పరిరక్షణ కూడా భయంకరంగా విస్మరించబడిందనేది వాస్తవం. సంపదను తక్షణమే సృష్టించడానికి దోహదపడకపోతే, దానిపట్ల ఉండే విస్మరణ కఠినంగా ఉంటుంది. మౌలిక వసతుల కల్పన, విస్తరణ, అభివృద్ధిలాంటి వాటిని సాకుగా చూపి వెంటనే ప్రయోజనాలను చేకూర్చే పనులు చేపట్టడం వలన దీర్ఘకాలిక ప్రయోజనాలు దెబ్బతినడమే కాకుండా ఎప్పుడో ఒకప్పుడు అవి విధ్వంస మూలకాలుగా మారతాయి. అవినీతి, బంధుప్రీతి, స్వపక్షాల ప్రయోజనాలకు పెద్దపీట, క్రోనీయిజం, అబద్ధాలు, అసత్యాల రూపకల్పన ప్రచారం లాంటివి పర్యావరణం విషయంలో తాత్కాలికంగా రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చగలిగినా, అవి దీర్ఘకాలంలో జనహితమైనవి కావు. బుష్ పరిపాలనా వైఫల్యమే కత్రీనాకు మూలమైందని తరువాత పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి.
అత్యవసర పరిస్థితులలో సహాయ పడటానికి నిర్మించుకునే వ్యవస్థలు, బృందాలు కత్రీనా సమయంలో స్వదేశంలో ముప్పును తొలగించడానికి, స్వదేశ పరిరక్షణలో కాకుండా ఇరాక్‍లో ఉన్నారని విమర్శ తలెత్తింది. సామ్రాజ్యవాదానికి నీరు అందించే పనిలో నిమగ్నమయ్యారని తేలింది. ఇరాక్ యుద్ధాన్ని నడుపుతూ ఉన్న శక్తులకు తోడ్పాటునిస్తాయని కూడా విమర్శ గ్లోబల్ వార్మింగ్ ఎంతటి విధ్వంసకారియో ఈ శక్తులు అంతకు మించి విధ్వంసాలకు కారణభూతమయ్యాయని జోయల్ కోవెల్ ‘ది ఎనిమీ ఆఫ్ నేచర్’లో ఉటంకించాడు. కోవెల్ ప్రకృతికి తొలిశత్రువు పెట్టుబడి అని నిర్ధారించాడు.
గత ఏడాది జులై ఆగస్ట్ నెలల్లో రుతు పవనాల ప్రభావం వల్ల కొంత, అల్పపీడనాలు ఆకస్మికంగా తలెత్తడం వల్ల మరికొంత. రెండు తెలుగు రాష్ట్రాలను వానలు, వరదలు అతలాకుతలం చేశాయి. తిరిగి ఈ ఏడాది జులై, ఆగస్ట్లలో కురుస్తున్న వానలు అదే దుస్థితిని పునరావృతం చేశాయి. సహజ వర్షపాతం కంటే పదింతలు వానలు కురిశాయి. వరదలు ముంచెత్తాయి. వాగులు, వంకలు పొంగాయి. ఏర్లు ఉరకలెత్తాయి. చెరువు కట్టలు తెగాయి. నగరాలు అతలా కుతలం అయ్యాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. దీనికి తోడు అటు కాశ్మీర్‍లో, ఇటు ఉత్తరాదిన సంభవించిన క్లౌడ్ బరస్ట్తో చూస్తుండగానే గ్రామాలను తుడిచిపెట్టాయి. ఈ సకాలంలో కురిసే అతి వర్షాలకు మూలం గ్లోబల్ వార్మింగ్ కాదని చెప్పటం సాహసమైనా కావాలి. లేదా అజ్ఞత అయినా అవుతుంది. కాబట్టి ప్రజలు ప్రభుత్వాలు ముందుగా వాతావరణ అసమతుల్యత గురించి గ్లోబల్ వార్మింగ్ సమస్య గురించి కొంచెం తీవ్రంగానే స్పందించాలి. గ్లోబల్ వార్మింగ్‍ను తగ్గించటంలో కానీ, అరికట్టడంలో గానీ అవగాహన, చైతన్యంతో ముందడుగు వేయాలి. ఈ ఏడాది హరిత హారం ఎటుపోయిందో తెలియదు. బడిపిల్లలకు, కళాశాలలో విద్యార్థులకు పర్యావరణ గురించి పోటీలు నిర్వహించటంతోనే పర్యావరణ సంక్షోభాలు సమసిపోవు. రాష్ట్రాలు, దేశం గ్లోబల్ వార్మింగ్ గురించి గ్లోబల్ స్థాయిలోనే ఆలోచించాలి. స్థానికంగా ఆచరించాలి.
- డా।। ఆర్. సీతారామారావు
ఎ : 9866563519