రైతులు తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు గడించే విధంగా వ్యవసాయంలో అనేక సంస్కరణలు వచ్చాయి. అన్నదాతలు అతితక్కువ పెట్టుబడులు పెట్టి… అధికంగా లాభాలు గడించే విధంగా ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. అందులో భాగంగానే వరిలో వెదజల్లే పద్ధతిని పలు క్లస్టర్ల పరిధిలో రైతులకు అవగాహన కల్పిస్తున్నాయి. వెదజల్లే వరిసాగు విధానం ద్వారా అధిక దిగుబడి వచ్చినందున రైతులు ఎక్కువ శాతం ఈ విధానంపై దృష్టి సారించారు. ప్రస్తుతం అదే విధానంతో ముందుకు సాగుతున్నారు.
రైతులంతా ఒకేసారి నారు పోసుకోవడంతో ఒకేసారి నారు ఎదిగి నాటుకు వస్తుంది. ఈ సమయంలో రైతులు, కూలీల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అసలే రైతు కూలీల కొరత ఉందంటే.. దీన్ని అదునుగా తీసుకుని వాళ్లు తమ కూలీరేట్లను కూడా ఇష్టానుసారంగా పెంచేస్తున్నారు. దీంతో ఈ సమస్య నుంచి రైతులు బయటపడేందుకు నూతన విధానానికి శ్రీకారం చుట్టింది. వరిసాగులో నాట్లువేసే పద్ధతికి స్వస్తికి పలుకుతూ వెదజల్లే విధానంపై రైతులు దృష్టి సారించే విధంగా అవగాహన కల్పించారు. ఇప్పటికే మార్కెట్లోని రకరకాల నాటువేసే మిషన్లు వచ్చినప్పటికీ ఆశించిన ఫలితాలు రాకపోవడంతో రైతులు వాటివైపు మొగ్గుచూపలేదు. ఈ క్రంమలోనే పురాతన కాలం నాటి వెదజల్లే పద్ధతి అనుకూలంగా ఉండటంతో ప్రస్తుతం రైతులు ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారు. గత నాలుగేళ్లుగా తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా ఈ పద్ధతి వెలుగులోకి వస్తుండటంతో చాలామంది రైతులు ఈ విధానంపై మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఈ వెదజల్లే పద్ధతిలో సాగువిధానం బాగా పెరిగింది.
ఖర్చు తక్కువ.. దిగుబడి ఎక్కువ..
సాధారణంగా ఎకరా పొలం నాటు వేయాలంటే కూలీలు రూ.3500 నుంచి రూ.4000వరకు తీసుకుంటారు. వెదజల్లితే ఎకరాకు కేవలం రూ.400 నుంచి రూ.500 ఖర్చు మాత్రమే అవుతుంది. ఇక రైతే స్వయంగా జల్లుకుంటే ఆ ఖర్చు కూడా
ఉండదు. దిగుబడులు ఎకరాకు 35 నుంచి 45బస్తాల వరకు వస్తున్నాయి. ముందుగా జిల్లా వ్యాప్తంగా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రైతులకు ప్రత్యేక అవగాహన కల్పించి ప్రతి క్లస్టర్లో 50 ఎకరాల చొప్పున వెదజల్లే పద్ధతిలో సాగు చేయించారు. పలు క్లస్టర్ల పరిధిలో రైతులతో వెదజల్లే పద్ధతిలో సాగు చేయటంతో రైతులు అధిక దిగుబడి సాధించారు. దీంతో ఇతర రైతులు ఫీల్డ్ విజిట్ చేసి అధికశాతం రైతులు వెదజల్లే విధానంపై చొరవ చూపుతున్నారు.
వెదజల్లే విధానంతో ఎంతో దిగుబడి..
వెదజల్లటం రైతుకు చాలా తేలికైనా పని. ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానం అవసరం లేకుండానే వరి విత్తనాలను జల్లుకోవచ్చు. అన్ని విధానాల్లోకెల్లా ఇదే ఉత్తమమైన విధానం. మంచి అనుభవం ఉన్న వ్యక్తితో జల్లిస్తే మడిలో సమానంగా వరి విత్తనాలు పడి ఎక్కువ పిలకలు పెడుతుంది. వెదజల్లిన దగ్గరి నుంచి ఎరువులు, మందులు కావల్సిన మోతాదులో సరైన సమయంలో అందిస్తే ఆశించిన దిగుబడి వస్తుంది.
- బాలారణ్య,
ప్రజ్ఞాపురం, గజ్వేల్ - balaranya.info@gmail.com
