‘ఎన్.గోపి జలగీతం కావ్యం’-సుస్థిరాభివృద్ధి లక్ష్యాల పర్యావరణ దృక్పథం

వాతావరణ మార్పుల ప్రభావంతో నీటి కొరత ప్రపంచవ్యాప్తంగా తీవ్రమవుతోంది. తాగునీటి కరవు, నీటి అసమాన పంపిణీ, దానికి తోడు నీటి కాలుష్యం వల్ల పేద ప్రజలు, దేశాలు తీవ్రంగా బాధపడుతున్నాయి. వర్షపు నీరు నిల్వ చేయడం, నదుల సంరక్షణ, నీటి పునర్వినియోగం వంటి చర్యలు తీసుకోవడం అత్యవసరం. తెలుగు సాహిత్యంలో ప్రకృతి కవిత్వానికి, పర్యావరణ స్పృహకీ విశిష్టమైన స్థానముంది. ఆ విభాగంలో డా.ఎన్.గోపి రాసిన జలగీతం ఒక ప్రత్యేకమైన ప్రయోజనాత్మకమైన దీర్ఘకావ్యం. ఈ కావ్యం జలాన్ని కేవలం సహజ వనరుగా మాత్రమే కాకుండా, జీవనాధారమైన శక్తిగా, తాత్త్విక చింతనల ప్రతీకగా, పర్యావరణ పరిరక్షణ పిలుపుగా నిలుస్తుంది. నీరు – ఆది మూలం, జీవన చక్రం, ఆధ్యాత్మికత, మానవ సమాజంలో దాని అన్వయాలు, ఆధునిక పర్యావరణ సంక్షోభాలు – అన్నీ ఈ కావ్యంలో గోపిగారు ప్రతిఫలింపజేశారు. ఈ వ్యాసంలో జలగీతంలోని వచన శైలి, రూపకాలు, కవితాత్మక విస్తరణల కంటే కూడా పర్యావరణ తాత్త్విక దృక్పథానికి ప్రాధాన్యమిస్తూ చర్చ సాగింది.

ఉద్దేశాలు

  1. జలగీతంలో జలప్రతీక విశ్లేషణ.
  2. పర్యావరణ తాత్త్వికతను కవిత్వంలో గోపి ఎలా ప్రతిబింబించారు అన్నది అధ్యయనం చేయడం.
  3. గోపి వచన శైలి ప్రత్యేకతలు గుర్తించడం.
  4. జలగీతం ద్వారా ఆధునిక పర్యావరణ చైతన్యాన్ని విశ్లేషించడం.
  5. తెలుగు సాహిత్యంలో ప్రకృతి కవిత్వానికి జలగీతం చేసిన కృషిని గుర్తించడం.

                   ప్రపంచవ్యాప్తంగా వస్తున్న పర్యావరణ మార్పులు మానవ సమాజానికి కొత్త సవాళ్లను విసురుతున్నాయి. ముఖ్యంగా నీటి సమస్య ప్రస్తుతం ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న అతి పెద్ద సంక్షోభంగా మారింది. వాతావరణ మార్పుల ప్రభావంతో వర్షపాతం అనిశ్చితంగా మారడం, మంచుకొండల కరుగుదల వేగవంతం కావడం, భూగర్భజలాల అధిక వినియోగం, పరిశ్రమల వల్ల నీటి కాలుష్యం పెరగడం వంటి అంశాలు కలిసివచ్చి ఈ సమస్యను మరింత జఠిలం చేస్తున్నాయి. తాగునీటి కొరత, సాగు నీటి సంక్షోభం, పరిశ్రమలకు కావాల్సిన నీటి వనరులు ప్రపంచ ఆర్థికవ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. దీనికి తోడు నీటి అసమాన పంపిణీ కారణంగా పేద, వెనుకబడిన వర్గాల ప్రజలు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఆఫ్రికా, ఆసియా ఖండాలలోని అనేక దేశాలలో నీటి కోసం జరుగుతున్న పోరాటాలు, ఉద్యమాలు మానవ హక్కుల సమస్యలుగా మారాయి. నీటి వనరుల కోసం పోటీ పెరగడం వల్ల పొరుగు దేశాల మధ్య విభేదాలు ఉధృతమై యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. వర్షపు నీరు నిల్వచేయడం, నదుల సంరక్షణ, వ్యర్థ జలాల పునర్వినియోగం వంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం అత్యంత కీలకంగా మారింది. ఈ విషయాలపై స్థానిక స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయి ఒప్పందాల వరకు ‘నీరు మన భవిష్యత్తు’ అనే అంశంపై మేధోమధనం విస్తృతంగా సాగుతున్నది.

                   తెలుగు సాహిత్యంలో ప్రకృతి వర్ణన, పర్యావరణ చైతన్యం అనేవి ఎన్నో రూపాలలో ప్రతిఫలించాయి. ప్రాచీన కావ్యాలలో పర్వతాలు, నదులు, అడవులు, వర్షాలు కవుల మనస్సులో కేవలం అలంకారభూతాలు కాదు, జీవన సంబంధిత మూలాధారాలుగా నిలిచాయి. ఆధునిక యుగంలో సాంకేతిక నాగరికత వల్ల పర్యావరణ సంక్షోభం మరింత ఎక్కువైందని మనం గ్రహిస్తున్నాం. ఈ నేపథ్యంలో ప్రముఖ కవి డా.ఎన్.గోపి రచించిన ‘జలగీతం’ దీర్ఘకావ్యం చారిత్రాత్మకమైన బాధ్యతను తలకెత్తుకుంది.  ఈ కావ్యం కేవలం జల స్తోత్రం మాత్రమే కాదు, పర్యావరణ–సామాజిక తాత్త్వికతకు ప్రతిబింబం. ఎన్.గోపి జలగీతంలో నీటి పుట్టుకనుంచి నాగరికతల నిర్మాణం వరకు, సహజ వనరుల సద్వినియోగం నుంచి దుర్వినియోగం వరకు, ప్రకృతి వైపరీత్యాలనుంచి మానవ బాధ్యతల వరకు విస్తృతంగా ఆవేదనాస్వరంతో కవితాత్మకంగా చర్చించారు. నీరు అనే ఒకే ఒక అంశాన్ని ఆధారంగా చేసుకుని, దాని రూపాంతరాలు, జీవనంలోనూ, సాహిత్యంలోనూ, ప్రాపంచిక మనుగడలోనూ ఉన్న ప్రాధాన్యతను కవి ఆవిష్కరించడం ఈ కావ్యం ప్రత్యేకత.

                   2030 నాటికి సాధించవలసిన సుస్థిరాభివృద్ధి కోసం ఐక్యరాజ్య సమితి 2015లో ఒక అజెండా సిద్ధం చేసుకుంది. దీనిలో 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలున్నాయి (Sustainable Development Goals – SDGs). వీటిలో ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన 6వ లక్ష్యం ‘శుభ్రమైన నీరు మరియు పారిశుద్ధ్యం’ (Clean Water and Sanitation) అందరికీ అందుబాటులో ఉండాలని స్పష్టంగా పేర్కొంది. అయితే దీనికి తోడు మిగిలిన అన్ని లక్ష్యాలు కూడా నీటి అవసరాలతోనే ముడిపడి ఉన్నాయన్నది నిజం. ఉదాహరణకు, పేదరిక నిర్మూలన (SDG-1) నీటి సమాన పంపిణీ లేకుండా సాధ్యం కాదు; ఆకలి లేని ప్రపంచం (SDG-2) వ్యవసాయ ఉత్పత్తి పెంపు కోసం నీటిపై ఆధారపడుతుంది; ఆరోగ్యకర జీవనం (SDG-3) పరిశుభ్రమైన నీరు, పారిశుద్ధ్యం లేని స్థితిలో అసాధ్యం. అదేవిధంగా పరిశ్రమలలో ఆవిష్కరణలు (SDG-9), వాతావరణ మార్పులపై చర్యలు (SDG-13), భూమి మరియు నీటి పర్యావరణ పరిరక్షణ (SDG-14, SDG-15) అన్నీ నీటి సంరక్షణకు సంబంధించి ఉంటాయి. అంటే నీటి వనరుల సంరక్షణ ఒకే లక్ష్యం సాధనగా కాకుండా అన్ని లక్ష్యాలకు పునాది వంటిది. అందువల్ల నీటిని భవిష్యత్తు తరాల కోసం సంరక్షించడం, సమర్థంగా వినియోగించడం, సమానంగా పంచడం ప్రపంచ దేశాల అత్యంత ప్రాధాన్యకరమైన బాధ్యతగా నిలుస్తోంది. కాబట్టి నీటి వనరులను సంరక్షించడం కేవలం 6వ లక్ష్యాన్ని సాధించడమే కాకుండా మిగిలిన అన్ని సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు పునాదిగా నిలుస్తుంది. ఈ వ్యాసంలో కవి నీటిని ఎలా తత్త్వస్వరూపంగా, జీవనాధారంగా, పర్యావరణ సమస్యల కేంద్రంగా చూపించారో విశ్లేషిస్తూ, ఆ సందేశాన్ని సుస్థిరాభివృద్ధి లక్ష్యాల (Sustainable Development Goals – SDGs) పర్యావరణ దృక్పథంతో అనుసంధానించుదాం.

                   కావ్య ప్రారంభంలోనే కవి నీటిని మూలతత్వంగా, విశ్వసృష్టికి ఆది మూలాధారంగా ప్రతిష్టించారు. మూడు పరమాణువుల ముత్యమై భూమి ఒడిలో పడిన నీరు జీవనానికి పునాది అయిందని చెప్పడం ద్వారా, శాస్త్రీయ సత్యాన్ని కవితాత్మక భాషలో ఆవిష్కరించారు. భూగోళమనే పదంలో ‘భూమి’ ఆధిపత్యం పెరిగింది కానీ అసలు జీవాన్ని నిలబెట్టింది నీరే అనే కవి వ్యంగ్యం, మనిషి అహంకారానికి చెంపపెట్టు. ఇది SDG–6 (Clean Water and Sanitation) లక్ష్యానికి ముడిపడిన ఆలోచన. ఎందుకంటే నీరు లేకుండా జీవం అసాధ్యం; కానీ మనిషి నీటి అసలైన ఆధిపత్యాన్ని విస్మరిస్తూ వస్తున్నాడు. విశ్వ మూలాధారమైన నీటి ఆది ప్రయాణం ఆకాశంలో మొదలై భూమి వరకు కొనసాగుతుంది.

‘ఆకాశంలో వున్నప్పుడు నీటికి హద్దులు లేవు
మేఘాల చూపుల్లో ప్రాంతాల నిర్దేశం లేదు.’ (జల గీతం)
నీటి ఆకాశగమనాన్ని, సరిహద్దుల లేని విశాలతను కవి చూపుతున్నారు. భూమిమీదికి వర్షరూపంలో చేరిన తర్వాత నీరు నదులుగా, చెరువులుగా, సముద్రాలుగా మారే స్థితి ద్వారా నీరు శాశ్వతమైనా దాని రూపాలు భిన్నంగా  ఉంటాయి అంటూ కవి నీటి వైవిధ్య అవతారాలను గుర్తించమంటున్నాడు.

                   జలం, సముద్రం, మేఘం, పర్వతం, సూర్యుడు, చంద్రుడు – ఇవన్నీ ఒక సహజ చక్రంలో అనుసంధానమై ఉన్నాయని కవి సజీవ రూపకాలతో చెప్పారు. సముద్రాన్ని సహనమూర్తిగా, మేఘాలను సముద్రపు పిల్లలుగా, పర్వతాలను వాటి తలపాగా వంటి అలంకారంగా చిత్రించడం ద్వారా కవి ప్రకృతి సంబంధాలను మనిషి–కుటుంబ సంబంధాలతో పోల్చారు. ఈ ప్రకృతి సహజసమతౌల్యం కదలికలోనే వర్షపాతం, పంటల పుష్టి, జీవన నిరంతరత ఉంటుందని సూచించారు. కానీ ఈ సమతౌల్యం భంగమైతే వరదలు, కరువులు సంభవిస్తాయని హెచ్చరించారు. ఇది నేరుగా SDG–13 (Climate Action) తో అనుసంధానమై ఉంది.

‘నేలమీద గడ్డి మొలవనప్పుడు కాగితమ్మీద పద్యాలేం మొలుస్తాయి’ అంటూ వనరుల దుర్వినియోగంలో మనిషి నిర్లక్ష్యం, పరిసరాల పరిశుభ్రతపై బాధ్యతారాహిత్యం, పరిశ్రమల కాలుష్యం, రసాయనాల మేళవింపు, నదులు, సరస్సుల ‘స్తన్యాన్ని’ క్రూరంగా పీల్చడం వంటి భావచిత్రాలు కవి ఆవేదనను ప్రతిబింబిస్తాయి. నీరు ఒకప్పుడు పరిశుభ్రమైన ప్రాణవాయువుగా ఉండగా, ఇప్పుడు దుర్వాసన, విషతత్వం, రంగు కలిసిన మృతజలంగా మారిందని గోపిగారి ఆవేదనాత్మక వ్యాఖ్యానం. భూగర్భజలాల దోపిడీ, వాణిజ్యపరమైన దోపిడీ (privatization) పై కవి ఘాటైన విమర్శలు చేశారు.

‘నన్ను మీరే కలుషితం చేస్తూ
శుద్దిచేశామంటూ
అంగడి సరుకుగా మార్చకండి,
ముందు మీ మనస్సుల్ని
శుభ్రపరచుకోండి’ అన్న కవితా వాక్యాలు, సుస్థిరాభివృద్ధిలో ప్రవర్తనా మార్పు (behavioural change) అవసరాన్ని గుర్తుచేస్తుంది. ఇది SDG–12 (Responsible Consumption and Production) లక్ష్యానికి అనుసంధానంగా చూడవచ్చు.

                   కరువు, వరదలు, వలస, ఎడారీకరణ, భూసారం నష్టం, హిమన్నగాల కరుగుదల – ఇవన్నీ పర్యావరణ హెచ్చరిక స్వరంతో వర్ణిస్తారు. రైతు ఆకాశం వైపు నిరీక్షణ, పొలాల్లో మృత్యువు పరచుకున్న దృశ్యాలు, తుఫానుల ఉగ్రరూపం, కరువుతో పల్లెల ఖాళీ కావడం – ఈ బింబాలు పాఠకుని మనసును కదిలిస్తాయి. ఇవన్నీ నేటి పర్యావరణ సంక్షోభాలకు ప్రతిరూపాలు. SDG–15 (Life on Land) లక్ష్యంలో చెప్పబడినట్లుగా అడవుల వినాశనం, భూమి దెబ్బతినడం జలచక్రాన్ని దెబ్బతీస్తాయని కవి ఇప్పటికే హెచ్చరించారు. అలాగే, SDG–2 (Zero Hunger) లక్ష్యంతోనూ ఈ హెచ్చరిక ముడిపడి ఉంది, ఎందుకంటే నీరు లేకపోతే వ్యవసాయం అసాధ్యం.

                   గోపిగారు జలగీతంలో ప్రతీకాత్మకంగా పురాణ గాథలను ప్రస్తావించారు. భగీరథుడు గంగను భూమికి తెచ్చిన కథ, గంగను భారతీయ ఆధ్యాత్మిక ప్రతీకగా వర్ణించడం, వాల్మీకి నుంచి వేమన వరకు కవులందరూ జలస్ఫూర్తిని పొందినట్లు చూపించడం – ఇవన్నీ నీటిని భౌతిక వనరుగా కాక, సాంస్కృతిక ఆత్మస్వరూపంగా ప్రతిష్టించాయి.

‘తాతల కోసం నీళ్లు తేవటానికి
తాతలు దిగొచ్చారు భగీరధుడికి’
ఈ పాదాలు గంగావతరణ గాథను గుర్తు చేస్తున్నాయి. నీటిని పూర్వీకుల ఆశీర్వాదంగా, భౌతిక–ఆధ్యాత్మిక జీవనానికి మూలాధారంగా కవి వర్ణించారు.

                   నీటి తత్త్వ స్వరూపంలోని త్రిగుణాలైన పారదర్శకత, సరళత, ప్రళయ శక్తిమత్వాన్ని కవి సుందరంగా ఆవిష్కరించారు. నీటి స్వభావం ‘మనసు పారదర్శకం’ అని చెబుతూ, అది సత్యానికి, స్వచ్ఛతకు ప్రతీక అని కవి భావించారు. నీరు ఎవ్వరినీ వేరుగా చూడదు; ధనవంతుడికి, పేదవాడికీ సమానంగా అందుతుంది. ఈ సామాజిక సమానత్వ భావం పర్యావరణ న్యాయ తాత్త్వికతను గుర్తుచేస్తుంది. నీరు స్రవంతిగా సజీవతను ప్రసాదించినా, అది కోపగించినప్పుడు పర్వతాలను ఛేదించే విధ్వంసశక్తిగా మారుతుంది. ఈ ద్వంద్వ స్వరూపం పర్యావరణ సంతులనాన్ని మనిషి విస్మరించరాదని హెచ్చరిక.

  ‘జలమందిరాలు కట్టి చూడు – దేవుడు కనిపిస్తాడు’ అన్న కవి వాక్యం, నీటి సంరక్షణే భక్తి, ధర్మమనే సందేశం ఇస్తుంది. ఇది SDG–11 (Sustainable Cities and Communities) లక్ష్యానికి దగ్గరగా ఉంటుంది, ఎందుకంటే చెరువులు, నదులు కేవలం జలనిధులు కాకుండా, నాగరికతకు, సంస్కృతికి నిలయాలు.

గోపిగారు ఈ కావ్యంలో ముత్యం, బంగారం, వస్త్రం, పుష్పం, స్తన్యం వంటి రూపాలలో నీటిని ప్రతీకాత్మకంగా వర్ణిస్తారు. వ్యతిరేక స్వరూప చిత్రణ, వ్యంగ్యాత్మకత ఈ కావ్యంలో మరో ప్రధాన లక్షణం.

   ‘గాలిని చెరబట్టలేనట్టే నీటినీ బంధించలేం
    ధరాగర్భాన్ని అతలాకుతలం చేసే విజృంభణశీలి నీరు’
ఇక్కడ నీరు ‘అమృతం’గా జీవనదాయకమయినా, ‘వజ్రాయుధం’గా విధ్వంసకారకమని కవి సూచించారు. ఇది నీటికున్న శక్తిని, ద్వంద్వ స్వభావాన్ని ప్రతిబింబిస్తుంది. వర్తమానంలో జరుగుతున్నా జలప్రళయాలన్నీ   గుర్తుచేసుకుంటే జలం రెందంచుల కత్తిలాంటి ద్రవ లోహంగా భావించాలి. మొత్తం మీద జలగీతం కేవలం ప్రకృతిసౌందర్య గీతం కాదు; అది మానవజాతిని జాగృతం చేసే సామాజిక వైతాళిక గీతం.

  • నీరు ఉచితం కాదు, విలువైనది – కాబట్టి దానిని సమానంగా పంచుకోవాలి. (SDG–6)
  • నీటి దుర్వినియోగం మానవ విలువల క్షీణతకు దారితీస్తుంది – కాబట్టి బాధ్యతాయుత వినియోగం అవసరం. (SDG–12)
  • కరువు, వరదల వంటి విపత్తులు వాతావరణ మార్పుల ఫలితాలు – కాబట్టి వాతావరణ చర్య అత్యవసరం. (SDG–13)
  • చెరువులు, నదులు కేవలం నీటి నిల్వలు కాదు; అవి జీవవైవిధ్య కేంద్రాలు – కాబట్టి భూమి సంరక్షణ కర్తవ్యము. (SDG–15)
  • జలవనరులను కాపాడటం అంటే ఆకలి సమస్యను, ఆరోగ్య సమస్యను, వలస సమస్యను తగ్గించడం. (SDG–2, SDG–3)

                        కవి తన కవిత్వం ద్వారా ఈ లక్ష్యాలన్నిటినీ మానవీయ, సాంస్కృతిక, ఆధ్యాత్మిక కోణాలలో ప్రతిబింబించారు. ఆవంత్స సోమసుందర్ తమ ‘అకాల బీభత్స లోకవృత్తానుశీలనంగా ‘జలగీతం’ అన్న వ్యాసంలో ‘సమయానుకూల భావుకరశ్మితో సమయోచిత సందేశాన్ని అందించాడు గోపి’ అన్నారు. జలగీతంలో నీరు కేవలం దాహం తీర్చే ద్రవం కాదు; అది విశ్వసృష్టి సారం, నాగరికతల ఆధారం, మానవ భావోద్వేగాల ప్రతీక, ప్రకృతి సమతౌల్యపు ప్రతిరూపం. కానీ అదే నీరు మానవ దుర్వినియోగం వల్ల విషపూరితమై, విపత్తుల రూపంలో తిరిగి వస్తుందని కవి గాఢమైన హెచ్చరిక చేశారు. ‘ఎన్.గోపి జలగీతం-వైజ్ఞానిక, మానవీయ తాత్విక దర్శనం’ అనే పేరుతో రాసిన విశిష్ట వ్యాఖ్యాన గ్రంథంలో డా.ధనుంజయ్ నాయక్ కవి జలగీతంలో నీటిపుట్టుక, స్వరూపం, అస్తిత్వం, విస్తృతి, జలచక్రం, నీటి రాజకీయాలు, జలకాలువ్య పరిణామాలు, జలసంరక్షణ, ప్రజల కర్తవ్యం తదితర అంశాలుగా విభజన చేసుకున్న తీరును అర్థం చేసుకుని ఒక పర్యావరణవేత్తగా సామాజిక దృక్పథంతో కావ్యాన్ని పరామర్శించారు. గోపి గారు వాస్తవిక విషయాలను, వైజ్ఞానిక విశేషాలను, సామాజిక  అంశాలను కవిత్వీకరించిన తీరును విశ్లేషించారు.

జలగీతం కేవలం కావ్యం కాదు పర్యావరణ ఉద్యమానికి స్ఫూర్తి, సామాజిక సమానత్వానికి తాత్త్విక వేదిక, సాంస్కృతిక మూలాల ఆవిష్కరణ, కావ్యంలోని రూపకాల, పురాణ గాథల ప్రయోగం, పర్యావరణ చైతన్య పిలుపు–అన్నీ కలిపి ఇది కేవలం అనుభూతి ప్రధానంగా మాత్రమేకాక, ఆవేదనాత్మక పర్యావరణ మానిఫెస్టోగా నిలుస్తుంది. ప్రతి పాదం ఒక పర్యావరణ సిద్ధాంతాన్ని ప్రతిబింబిస్తుంది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు అనుసంధానమై, ఈ కావ్యం మనిషి బాధ్యతను గుర్తుచేస్తుంది: ప్రకృతి, నీటిని కాపాడటం అనేది కేవలం పర్యావరణ కర్తవ్యమే కాదు; అది మానవ జీవనాధారాన్ని కాపాడుకోవడమే.

ఆధార గ్రంథాలు:

  1. Transforming our world: the 2030 Agenda for Sustainable Development-UNO
  2. జలదీపిక (ఎన్.గోపి ‘జలగీతం’ కావ్యంపై వ్యాసాలూ సమీక్షలు), జిష్ణు ప్రచురణలు, హైదరాబాద్
  3. జలగీతం-వైజ్ఞానిక, మానవీయ తాత్విక దర్శనం- డా.ధనుంజయ్ నాయక్.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *