సృష్టి, స్థితి, లయ కారుల్లో శివుడు లయకారుడు. శివున్ని, శివరూపంలోనూ, శివుని ఇతర రూపాల్లో పూజించటం అనాదిగా వస్తున్నదే. శివున్ని, దేవతా రూపంలో కాకుండా, లింగరూపంలో పూజించటం సా.శ.పూ.2వ శతాబ్ది నుంచి ఊపందుకొంది. ఒక్కడుగు ముందుకేసి చూస్తే, సిందునాగరికత స్థావరాల్లో లింగాల్ని పోలిన పురుషాంగాలు అనేకం బయల్పడినాయి. అపురూపంగ రూపాలకూ శివలింగరూపాలకూ సామీప్యత ఉన్నా, సింధు నాగరికత నాటికి ప్రస్తుత శివవ్రతానికి గల సంబంధం ఏమిటో ఇప్పటికీ తెల్చుకోలేక పోతున్నారు పురావస్తు పరిశోధకులు. ఇక శివుడు లింగరూపంలో ఆరాధించబడటం చారిత్రక, తొలియుగంలోనే ప్రారంభమైందని పురావస్తు ఆధారాలు రుజువు చేస్తున్నాయి.
రెండు తెలుగు రాష్ట్రాల్లోకీ, తిరుపతి జిల్లా, గుడిమల్లంలోని సా.శ.ఊ. 2వ శతాబ్దినాటి శివలింగమే అత్యంత ప్రాచీనమైందనీ, ఆ తరువాత అమరావతిలో బయల్పడిన సా.శ.1వ శతాబ్ది నాటి ఇష్టలింగం రెండోదని ఐకె శర్మగారు చెప్పారు. ఆ తరువాత పురావస్తు తవ్వకాల్లో మరికొన్ని చిన్న శివలింగాలు వెలుగు చూశాయి. వాటిల్లో హైదరాబాదు నగర శివారులోని కీసరగుట్ట వద్ద డా.వివి.కృష్ణశాస్త్రిగారు జరిపిన తవ్వకాల్లో ఇతర పురావస్తువులతో పాటు విష్ణు కుండిన కాలం (సా.శ.5వ శతాబ్ది) నాటి చిన్న మట్టి శివలింగం, చిన్నమట్టి నంది విగ్రహంతోపాటు చిన్న స్పటిక లింగం కూడా బయల్పడి, పురావస్తు శాస్త్రవేత్తల దృష్టినాకర్షించింది.
సా.శ.1వ శతాబ్ది నుంచి ఇటుకతో నిర్మించిన శివాలయాల్లో ఇటుక పానవట్టాలపై పెద్ద సైజు శివలింగాలను ప్రతిష్టించటం ప్రారంభమై, కొనసాగిన ఆధారాలు సా.శ.3వ శతాబ్ది నాటి నాగార్జున కొండ వద్ద, సా.శ.4వ శతాబ్ది నాటి చేజర్ల, సా.శ.5వ శతాబ్ది నాటి ఏలేశ్వరం, కీసరగుట్టల వద్ద బయల్పడినాయి. ఈ నేపథ్యంలో ఇళ్లల్లో పూజించుకోవటానికి గాను చిన్న శివలింగాల తయారీ అవసరమైంది. అదిగో అలా తయారైన అలనాటి ఆచారానికి ఆనవాళ్లుగా కీసరగుట్ట చిన్న శివలింగాల్ని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకూ బయల్పడిన చిన్న శివలింగాల్లో, కీసరగుట్టలో వెలుగు చూచిన స్పటిక శివలింగమే రెండు తెలుగు రాష్ట్రాల్లోకీ మొదటిది కాగా, మట్టితో చేసిన త్రిడీ నంది విగ్రహం కూడా మొట్టమొదటిదే. చిన్న స్పటిక శివలింగం, చిన్నమట్టి నంది, తెలంగాణా చిన్న శైవ ప్రతిమల చరిత్రలో మైలురాళ్ల కాక మరేమిటి?
(తెలంగాణా వారసత్వ శాఖకు కృతజ్ఞతలు. ఈ చిన్న విగ్రహాలు, గన్‍ఫౌండ్రి ప్రధాన కార్యాలయంలోని సెంటెనరీ మ్యూజియంలో ప్రదర్శనలో ఉన్నాయి).
-ఈమని శివనాగిరెడ్డి-స్థపతి,
ఎ : 9848598446