ఎమెథిస్ట్ అనేది క్వార్టజ్ యొక్క ఊదా రంగు ప్రభేదం (sio2). భారతీయ సంస్కృతిలో దీనిని ఉపరత్నంగా పరిగణిస్తారు. ప్రపంచవ్యాప్తంగా బిషప్‍లు దీనిని మతపరమైన ఉంగరాలు/ప్రయోజనాల కోసం. ఉపయోగిస్తారు కాబట్టి దీన్ని బిషప్ రాయి (bishop stone) అని, దీనికి ఆపాదించిన లక్షణాల వల్ల నిగ్రహ రాయి (soberity stone) అని అంటారు. దైవ రాయి (divine stone), ఆత్మ శిల (soul stone) వంటి ఇతర పేర్లు కూడా దీనికి ఉన్నాయి. ఇలా రాజులు, ధనికులు, మతాధికారులతో సహా సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉన్న రత్నాలకు అమెధిస్ట్ అనే పేరు రావటానికి వెనుక ఒక గ్రీకుపౌరాణికగాధ ఉన్నది.
డైయొనైసిస్ (dionysus) మధుపానానికి, సౌఖ్యానికి అధిదేవత. ఏదో కారణం వల్ల ఆయనకు అవమానం జరిగింది, ఆ కోపాన్ని దారినపోయే ఒక అమాయక కన్యమీద చూపించబోయాడు. ఈ పరిస్థితుల్లో ఉన్న కన్యను రక్షించడానికి ఆర్టిమిస్ (artemis) అనే ఇంకో దేవత ఆమెను శిలగా మారుస్తాడు. తరవాత తనతప్పు తెలుసుకొని పశ్చాత్తాపం చెంది డైయొనైసిస్ తన మధుపాత్రలోని మధువును ఆశిలపై పోస్తాడు. అందువల్ల తెల్లనిశిల నేరేడుపండు రంగులోకి మారిపోతుంది. డైయొనైసిస్ ను ప్రభావితంచేసిన కారణంవల్ల దీనికి మత్తుతగ్గించే శిలగా పేరు వచ్చింది.
Amethyst (A =not: Methostus = Intoxicated)
చరిత్రలో ఎమిధిస్ట్
చరిత్రలో ఎమిధిస్ట్ చాలారకాల నమ్మకాలకు,కధలకు,మత విశ్వాసాలకు కేంద్రంగా నిలిచింది. 2000 బిసి నుండి దీని చారిత్రక ఆధారాలు ఉన్నాయి. సెయింట్ వాలెంటైన్ క్యుపిడ్ ప్రతిమఉన్న ఎమిధిస్ట్ ఉంగరాన్ని ధరించేవాడు అంటారు. పాత నిబంధనల ప్రకారం ఇజ్రాయెల్ లోని పన్నెండు జాతులకు ప్రతీకగా ఉన్న పన్నెండు రత్నాలలో ఎమిధిస్ట్ ఒకటి.
ఈజిప్టు పిరమిడ్లలో ఉన్న తుతన్ఖామున్ సమాధిలో స్కరాబ్ బీటిల్ (scarab beetle) ఆకారపు ఎమిధిస్ట్ కడియం కనుగొనబడింది.
క్రైస్తవ మత పెద్దలు, రాజులు అప్పటిలో ఎమిధిస్ట్ను వజ్రానికి సమానమైన విలువనిచ్చే వారు. క్రమంగా ఇవి అన్ని చోట్లా దొరకటం ప్రారంభం కాగానే విలువ కాస్త తగ్గింది.
లియోనార్డో డావిన్సీ ఎమిధిస్ట్ వివేకాన్ని పెంచి చెడు ఆలోచనలను రాకుండా చేస్తుందని నమ్మేవాడు. నబేతియన్లు భారత దేశంలో దొరికింది ఎమిధిస్ట్తో వివిధ దేశాల్లో వ్యాపార చేసినట్టు చరిత్రకారులు భావిస్తున్నారు. 1660లో రాజ్యాభిషేకం జరిగిన చార్లెస్×× రాజుగారి ఆభరణాలలో ఎమిధిస్ట్ ప్రముఖగా ఉండేది.
గ్రీకు రోమన్ నాగరికతలలో ఎమెధిస్ట్కు మధ్యపాన వ్యతిరేక లక్షణాలు ఉంటాయనే నమ్మకం బలంగా పాతుకుపోయింది. అంతే కాకుండా దీనికి సమతుల్యత, ప్రశాంతత కలిగించే లక్షణాలు ఉంటాయనే నమ్మకం కూడా బలంగా పాతుకుపోయింది. చాలారకాల పారలౌకిక శక్తులు, జ్యోతిష్య పరమైన శక్తులు ఈ రత్నాలకు ఆపాదించడం జరిగింది. ఎమెధిస్ట్ను శనిగ్రహం యెక్క ప్రతీకగా కూడా భావిస్తారు.భారతదేశ సంస్కృతిలో ఎమెథిస్ట్ చాలా పురాతనకాలం నుండి భాగంగా ఉంది. దీని నేరేడుపండు రంగు వల్ల జంబుమణి, జమునియా అని, అమెథిస్ట్ కు దగ్గరగా ఉన్న సిట్రైన్ పసుపు రంగులో
ఉండటం వల్ల కాంచన మణి అని స్పటికరూపంలో ఉండటం వల్ల కటెల్లా వంటి అనేక పేర్లతో వ్యవహరిస్తారు.
వరాహమిహిరుడు (సౌగంధిక అనేపేరుతో) ప్రస్తావించిన 22 మణులలో ఇదికూడా ఒకటి. సాధారణంగా నీలమణులలో ఒకటిగా పరిగణించబడుతుంన్నందున దీని ప్రస్తావన సాహిత్యంలో ప్రత్యేకంగా ఉండదు.

అమిధిస్ట్ ఖనిజ సమాచారం:
దీని రసాయనిక కూర్పు సిలికాన్ డయాక్సైడ్. కొద్దిగా ఐరన్ ఆక్సైడ్ మలినాలు ఉంటాయి. లవంగ/బైంజనీ వర్ణాల వివిధ ఛాయలు లోఉండే పారదర్శక స్పటికాలు ఒక్కో సారి దాదాపు నలుపు రంగులో ఉంటాయి.
స్పటిక వ్యవస్థ:
హెగ్జాగోనల్, వక్రీభవన సూచిక 1.543 నుండి 1.544. కాఠిన్యం 7, విశిష్ట గురుత్వం 2.65 గా ఉంటాయి. ఐరన్, అల్యూమినియం మలినాలు, రేడియో ధార్మికత, స్పటిక నిర్మాణం దీని నేరేడుపండు వంటి రంగుకు కారణం. అమిధిస్ట్ ఖనిజశిలలో ఉండే హైడ్రోధర్మల్ సిరలలో, గ్రానైట్ పెగ్మటైట్‍లో, బసాల్ట్ వంటి అగ్నిపర్వత శిలలలో జియోడ్స్ గాను, కావిటీలో ఏర్పడుతుంది.
ప్రపంచ వ్యాప్తంగా బ్రెజిల్, ఉరుగ్వేలు అమిధిస్ట్ జియోడ్ లకు ప్రసిద్ధి చెందాయి. రష్యా, అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఇంకా చాలా దేశాల్లో కూడా దొరుకుతుంది.
అమెథిస్టు లభ్యత:
భారత దేశంలో చాలా ప్రాంతాలలో అమిధిస్ట్ ఉంది. ఎక్కువగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో దొరుకుతుంది. హైదరాబాద్‍తో సహా తెలుగురాష్ట్రాల్లో అమిధిస్ట్ దొరికింది. బోయినపల్లి, ఉప్పల్, సికింద్రాబాద్ ప్రాంతాలలో అమిధిస్ట్ఉ న్నట్టుతెలిసింది. ఇటీవల మజీద్ బండ ప్రాంతంలో కూడా కనిపించినట్లు సమాచారం. సిద్దిపేట, జనగామ ఏరియా లో కూడా విరివిగా లభిస్తుందని తెలుస్తోంది. నోబుల్ బహుమతి గ్రహీత CV రామన్ తన పరిశోధన కోసం ఎమిధిస్ట్ ను హైదరాబాద్ ప్రాంతం నుంచి సేకరించటం గమనార్హం.

సర్ CV రామన్ ఎమిధిస్ట్ ఖనిజం పట్ల ఆసక్తి కనబరిచారు. 1954లో తన పరిశోధనల ఫలితాలు కరెంట్ సైన్స్ అనే పరిశోధనా పత్రిక లో ‘‘Amethyst it’s nature and origin’’ అనే శీర్షికతో ప్రచురించారు. దీనికి కావలసిన ఎమిధిస్ట్ ఖనిజం కొంత శ్రీలంక నుండి కొంత హైదరాబాద్ ప్రాంతం నుంచి తెచ్చినట్లు తెలిపారు.
ఆ పరిశోధనా పత్రం ప్రకారం స్పష్టమైన క్వార్టజ్ మరియు అమెథిస్ట్ల లో తులనాత్మకభౌతిక శాస్త్ర పారామితులు పరిశీలిస్తే, వాటి సాంద్రతలో తేడా లేదని నిశ్చయంగా తెలుస్తోంది. అమెథిస్ట్ మరియు స్పఛ్ఛమైన క్వార్టజ్ కూడా ‘‘టిండాల్ ప్రభావాన్ని’’ (TYNDAL EFFECT) ఇవ్వకపోవడంలో ఒకదానికొకటి పోలి ఉంటాయి, అయితే ఈ ఎఫెక్ట్ స్మోకీ క్వార్టజ్లో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. పరిశోధన ఫలితాలు అమెథిస్ట్ యెక్క నిర్మాణంలో స్ఫటికార క్వార్టజ్ను పోలి ఉంటుందని చూపిస్తున్నాయి, కానీ ఎలక్ట్రానిక్ కాన్ఫిగ రేషన్‍లో తేడా ఉంటుంది. తక్కువ సమరూపతరగతికి చెందిన మోనోక్లినిక్ అణు నిర్మాణం ఎమిధిస్ట్లో ఉన్నట్టు తెలు స్తోంది.అందువల్ల ఎమిధిస్ట్ యెక్క ఆప్టికల్ బైయాక్సియాలిటీ, ప్లియోక్రాయిసమ్ వేరుగా ఉంటాయి. ఈ ఫలితాలు యుగ్మత లేని (Twinning free) ప్రత్యేకంగా ఎంపిక చెయ్యబడిన ఎమిధిస్ట్లపై చేసిన భౌతిక శాస్త్ర పరిశోధనా ఫలితాల వల్ల వెలుగులోకి వచ్చినట్లు ఆ పరిశోధనా పత్రం వల్ల తెలుస్తోంది.
ఉపయోగాలు
అన్ని ప్రదేశాలలో ఎక్కువగా లభించడం వల్ల ఈ రత్నాలకు అనేక ఉపయోగాలు ఉన్నాయి, ఆధ్యాత్మికతతో సంబంధించిన ఉన్నందున బిషప్‍లు ధరిస్తారు. బౌద్ధమత పక్రియలో భాగంగా కూడా ఉంది. అనేకరకాల ఆభరణాలలో వాడతారు. పెద్ద పెద్ద స్పటికాలుగా లభించడం వల్ల అలంకరణకు కూడా పనికివస్తుంది. నీలిరంగుకు దగ్గరగా ఉన్నందున నీలాలకు ప్రత్యామ్నాయంగా కూడా పనికివస్తుంది.
ప్రశాంతత కోసం పనిచేసే లక్షణం ఉందన్న నమ్మకం వల్ల నిద్ర కోసం, వ్యసనాలకు విరుగుడుగా, ఆధ్యాత్మిక చింతన పెంపొందించే పదార్థంగా కూడా ఎమిధిస్ట్ వాడుతారు.
-చకిలం వేణుగోపాలరావు
డిప్యూటి డైరెక్టర్ జనరల్ జిఎస్సై(రి)
ఎ: 9866449348
కర్టెసీ: బి.వి.భద్రగిరీ