వైట్‍ మొఘల్స్

చరిత్రకారుడు విలియం డాల్రింపుల్‍ రాసిన ‘‘వైట్‍ మెఘల్స్’’ నవల 1798 నుండి 1806 వరకు హైద్రాబాద్‍ దక్కన్‍ నిజాం అలీ ఖాన్‍ 2వ అసఫ్‍ ఝా సంస్థానంలో బ్రిటిష్‍ రెసిడెంట్‍గా ఉన్న ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారి జేమ్స్ అఖిలీస్‍ కిర్క్ పాట్రిక్‍ జీవిత చరిత్ర. ఇది భారతదేశంలో బ్రిటిష్‍ వలస పాలన సమయంలో నిజాం సంస్థానంలో విభిన్న సంస్కృతి, మతం, జాతులకు చెందిన కిర్క్పాట్రిక్‍, ఖైరున్నీసాల ప్రేమ, శృంగార, కుటుంబ కథనం. చాలాకాలం క్రితం మరుగున పడి, మరచిపోయిన ఉదంతాలను బ్రిటిష్‍ లైబ్రరీలోని కీలక పత్రాల విశ్లేషణతో ప్రేరణ పొంది రచయిత విలియం డాల్రింపుల్‍ కొన్ని నెలలపాటు హైద్రాబాద్‍లో నివసించి సాలార్‍జంగ్‍ మ్యూజియం మరియు చార్మినార్‍ ప్రాంతంలోని హజిక్‍-ఎన్‍-మెహి అనే అరుదైన పుస్తకాల దుకాణంలో దొరికిన పర్షియన్‍ మరియు ఉర్దూ పత్రాల ద్వారా రచించిన సుదీర్ఘ సంఘటనల నవల.

ఈ నవల 18వ శతాబ్దం చివర మరియు 19వ శతాబ్దం ప్రారంభంలో భారతదేశంలోని సామాజిక, రాజకీయ, సాంస్కృతిక జీవితాలను వివరణాత్మకంగా తెలుపుతుంది. ఆ రోజుల్లో ఎంతోమంది బ్రిటిష్‍ అధికారులు మన సంస్కృతిని, వేషభాషలను ఎలా ఇమిడ్చుకున్నారనే ఆసక్తికరమైన విషయాలు ఇందులో ఉంటాయి. ఆ కాలంలో కిర్క్పాట్రిక్‍ మరియు నిజాం రాజ్య ప్రముఖుల మధ్య రహస్య ఒప్పందాలు, కుట్రలు, కుతంత్రాలు కోర్టు కేసులు మరియు బ్రిటిష్‍ ఈస్ట్ ఇండియా కంపెనీ పోషించిన దుర్మార్గపు పాత్ర గురించి కూడా రచయిత వివరిస్తాడు. ఇందులో 18వ శతాబ్దంలో ఉన్నత స్థాయి ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారులు ముఖ్యంగా 1798 నుండి 1803 వరకు గవర్నర్‍ జనరల్‍గా పనిచేసిన లార్డ్ రిచర్డ్ వెల్లిస్లీ వీలైనంత భారతదేశ సంపాదన తరలించిన విషయాలు వివరంగా ఉన్నాయి.

మద్రాస్‍ ప్రెసిడెన్సీలో జన్మించిన కిర్క్పాట్రిక్‍ బ్రిటన్‍లో చదువుకొని, బ్రిటిష్‍ ఈస్ట్ ఇండియా సైన్యంలో చేరి భారత ఉపఖండాన్ని లొంగదీసుకోవడంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలనే ఆశయంతో భారతదేశానికి వస్తాడు. కొంతకాలం తర్వాత అతను తన సోదరుడు విలియం కిర్క్పాట్రిక్‍ స్థానంలో హైద్రాబాద్‍ నిజాం రాజ్యంలో బ్రిటిష్‍ రెసిడెంట్‍ పదవి చేపడతాడు. కిర్క్పాట్రిక్‍ 1795లో రెసిడెంట్‍ పదవి చేపట్టిన తర్వాత స్థానిక ఇండో పర్షియన్‍ సంస్కృతి పట్ల ఆకర్షితుడయ్యాడు. ఎందరో స్త్రీలతో విలాసంగా గడిపేవాడు. నాచ్‍ పార్టీలను అమితంగా ఆస్వాదించేవాడు. తన జననాఖానాలో ఒక చిన్న అంత:పురాన్ని కూడా నిర్వహించేవాడు. మద్రాసులో జన్మించడంతో తమిళంలో అనర్గళంగా మాట్లాడుతూ, పర్షిషన్‍, హిందుస్తానీ పర్షియన్‍ భాషలలో ఉన్న పట్టుతో ఆయన హైద్రాబాదులోని సామాజిక రాజకీయ ఉన్నత వర్గాలతో బహిరంగంగా కలిసి మెలిసి ఉండేవాడు. ఉర్దూలో కవిత్వం కూడా రాశాడు.

అవి 18వ శతాబ్దం చివరి సంవత్సరాల్లో బ్రిటిష్‍ ఈస్ట్ ఇండియా కంపెనీ తీరప్రాంతాలైన కలకత్తా, మద్రాస్‍, బొంబాయి ప్రెసిడెన్సీలను సుస్థిరం చేసుకొని దేశం లోపలి ప్రాంతంలో విస్తరించే రోజులు. ఆ సందర్భంలో ఈజిప్టు నుండి నెపోలియన్‍ ఇండియా దండెత్తుతున్నాడనే వార్తలతో ప్రెంచివారు బ్రిటీష్‍ వారికి ఇబ్బందులు కలిగిస్తున్న సమయం. కిర్క్పాట్రిక్‍ తీవ్ర ప్రెంచి వ్యతిరేకి. నిజాం సంస్థానంలో ఫ్రెంచ్‍ వారి ప్రభావాన్ని తగ్గించి బ్రిటిషు రాజ్యాన్ని భారత ఉపఖండం అంతా విస్తరింపజేయడానికి ఈస్ట్ ఇండియా కంపెనీని ఒక సాధనంగా వాడుకున్న సామ్రాజ్యవాది. ఆంగ్లేయుల ప్రభావాన్ని పటిష్టం చేస్తూ, 4వ మైసూర్‍ యుద్ధంలో నిజాం సైన్యం సహకారంతో శ్రీరంగ పట్టణంలో టిప్పుసుల్తాన్‍ అధికారాన్ని అణగద్రొక్కి విజయేత్సాహంతో నిజాం మెప్పుపొందాడు. హైద్రాబాద్‍ సంస్థానంలో ఫ్రెంచ్‍ వారి పాత్రను నిర్మూలించడానికి కిర్క్పాట్రిక్‍ పోషించిన పాత్ర, మూసీనది ఒడ్డున పదహారువేల ఫ్రెంచి సైన్యాన్ని అవలీలగా లొంగదీసుకోవడంలో చూపించిన ధైర్యం నిజాం నవాబును ఆకట్టుకున్నాయి. కిర్క్పాట్రిక్‍ను నిజాం సన్నిహితం చేసుకుని ఈయనకు ‘‘ముతామినుల్‍ ముల్క్ ’’ (రాజ్యరక్షణ), ‘‘హస్మత్‍ జంగ్‍’’ (యుద్ధంలో ధైర్యవంతుడు) లాంటి అనేక బిరుదులను ప్రసాదించాడు.
ఆ సమయంలోనే 35 సంవత్సరాల కిర్క్పాట్రిక్‍ అనుకోకుండా నిజాం రాజకుటుంబానికి చెందిన 14 సంవత్సరాల ఖైరున్నీసాను కలుస్తాడు. ఖైరున్నీసా అంటే మహిళల్లో అత్యంత అద్భుతమైనదని అర్థం. ఈమె నిజాం రాజ్య ప్రధాని ఆలం మేనత్త కొడుకు – బకర ఆలీఖాన్‍ కూతురు. గోషా పద్ధతిలో నిర్బంధంలో ఉన్నప్పటికీ, అప్పటికే ఒక కులీనుడితో నిశ్చితార్థం జరిగిన తరువాత కూడా మొదట ఖైరున్నీసా ఈ ప్రేమ వ్యవహారాన్ని ప్రారంభించిందని, ఆమె తల్లి, అమ్మమ్మ కొందరు మహిళా బంధువులు నిజాం సంస్థానంలో తమ ప్రభావాన్ని మరింతగా పెంచుకునే ప్రయత్నంలో వారి బంధాన్ని ప్రోత్సహించారని రచయిత నొక్కి చెప్పినప్పటికీ ఇది నిజమనే ఆధారాలు నవలలో లేవు.

కిర్క్పాట్రిక్‍ నిజాంతో మరియు అతని కుటుంబ ప్రముఖ వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు పెంచుకోవడం గవర్నర్‍ జనరల్‍ రిచర్డ్ వెల్లెస్లీకు అంతగా నచ్చకున్నా కిర్క్పాట్రిక్‍ చాకచక్యంగా మెలుగుతూ బ్రిటిష్‍, నిజాంల మధ్య ఎన్నో లాభదాయక ఒప్పందాలు చేయడంతో ఏమీ చేయలేకపోతాడు. వారి బంధం, ప్రేమ, అక్రమ సంబంధంతో ఖైరున్నీసా గర్భం దాలుస్తుంది. ఈ సంఘటన సమాజానికి తెలిసి ముస్లిం ప్రజల ఆగ్రహాన్ని ఒక స్థాయికి తీసుకువెళ్లింది. బాలిక కుటుంబ సభ్యులు అతను అత్యాచారం చేసాడని కూడా అభియోగం మోపారు. ఈ వ్యవహారం కోర్టు వరకూ వెళ్లడంతో కిర్క్పాట్రిక్‍ ప్రవర్తనపై కలకత్తాలో ఒక పెద్ద దుమారం చెలరేగింది. చివరకు రాజకుటుంబం మరియు కిర్క్పాట్రిక్‍ ఒక ఒప్పందానికి రావడంతో ఆమెను రహస్యంగా వివాహం చేసుకున్నాడు. ఈ ఒప్పందంలో భాగంగా కొన్ని సందర్భాల్లో ఈస్ట్ ఇండియా కంపెనీకి మరియు నిజాం నవాబుకు రహస్యంగా పనిచేస్తూ డబుల్‍ ఏజెంటుగా మారుతాడు.
నిజాం సంస్థానం వ్యవహారాల్లో కిర్క్పాట్రిక్‍ తీసుకున్న నిర్ణయాలు, వ్యక్తిగత శృంగార కార్యకలాపాలు, రహస్య వివాహం నాటి గవర్నర్‍ జనరల్‍ రిచర్డ్ వెల్లెస్లీని ఆందోళన కలిగించటంతో అతన్ని బ్రిటిష్‍ రెసిడెంట్‍గా తొలగించే ప్రయత్నం చేస్తాడు. గవర్నర్‍ జనరల్‍ ఈ విషయంపై విచారణ ఆదేశించటంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొవలసి వస్తుంది. కాని గవర్నర్‍ జనరల్‍ దగ్గర సైనిక కార్యదర్శిగా వున్న తన సోదరుడు విలియం కిర్క్పాట్రిక్‍ సహాయంతో బయటపడగలుగుతాడు. అంతకు పూర్వం రిచర్డ్ వెల్లెస్లీ మరియు విలియం కిర్క్పాట్రిక్‍ సౌత్‍ ఆఫ్రికాలో కలిసి పనిచేశారు.
అయితే కిర్క్పాట్రిక్‍ గర్భవతిగా వున్న తన ప్రేయసికి అన్యాయం చేయలేక ఆమెను గోప్యంగా వివాహం చేసుకున్న రెండు నెలలకు ఒక కొడుకు పుడతాడు. తర్వాత కిర్క్పాట్రిక్‍, ఖైరున్నీసాను అధికారికంగా రెసిడెన్సీ (ప్రస్తుతం కోఠిలో ఉన్న చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం) భవనంలోకి తీసుకువచ్చిన సంవత్సరానికి ఒక కూతురు పుడుతుంది. ఆ క్రమంలో సున్తీ చేసుకొని ఇస్తాం మతంలోకి మారాడు. మొఘలాయి దుస్తులను ధరించేవాడు. హుక్కాతో ధూమపానం చేసేవాడు. పాన్‍ నమిలేవాడు.

వెల్లెస్లీ నిజాంతో కఠినమైన వైఖరిని అవలంబించి నిజాం స్వయం ప్రతిపత్తిని తగ్గించే భాగంలో వ్యూహంగా ఖైరున్నీసాతో కిర్క్పాట్రిక్‍ రహస్య వివాహాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. వారి వివాహం చట్టబద్ధంగా నమోదుకాకున్నా చెల్లుబాటు అయ్యేదిగా లేకున్నా కిర్క్పాట్రిక్‍ తన వీలునామాలో ఈ వివాహం ద్వారా కలిగిన పిల్లలును తన వారసులుగా ప్రకటించి, ఖైరున్నీసా పట్ల తన ప్రేమను నొక్కి చెప్పాడు. అతని వర్ణాంతర, మతాంతర సంబందాలు చారిత్రాత్మకంగా సామాజిక ఏరివేత మరియు నేరారోపణలకు దారి తీసినప్పటికీ అతని తెలివి సామర్ధ్యాలు నిజాం – బ్రిటిష్‍ సంబంధాలు స్నేహపూర్వకంగా కొనసాగించ గలుగుతాయి. ఆ రోజుల్లో బ్రిటిష్‍ పురుషులు, భారతీయ స్త్రీల ద్వారా కలిగిన సంతానాన్ని సాధారణంగా బ్రిన్‍ పంపి వారి బంధువుల దగ్గర పెంచేవారు. ఆ నేపథ్యంలో ఎవరూ ఊహించని తండ్రి కిర్క్పాట్రిక్‍ అకాల మరణానికి ముందు 5 మరియు 3 సంవత్సరాల వయస్సులో పిల్లలను ఇంగ్లాండ్‍ పంపుతారు. కాని మళ్లీ వారు తల్లిదండ్రులను చూడటం జరుగలేదు.

తదనంతరం కిర్క్పాట్రిక్‍ 41 సంవత్సరాల వయసులో అనారోగ్యంతో కలకత్తాలో మరణిస్తాడు. ఆ సమయంలో కలకత్తా కోర్టులో కిర్క్పాట్రిక్‍ ఆస్తుల వ్యవహారాలు చూస్తున్న అతని అసిస్టెంట్‍ హెన్రీరస్సల్‍ను ఖైరున్నీసాను కలువడం, ప్రేమలో పడటం జరుగుతుంది. ఆ తర్వాత 1810లో హెన్రీరస్సల్‍ హైద్రాబాద్‍లో బ్రిటిష్‍ రెసిడెంట్‍గా నియమించపడుతాడు. కాని రస్సెల్‍, ఖైరున్నీసాతో తన సంబంధాన్ని కొనసాగించక ఒక అర్థ పోర్చుగీసు మహిళను వివాహం చేసుకున్నాడు. దాంతో ఖైరున్నీసా పరువు బజారు పాలవడం, హైద్రాబాద్‍ తిరిగిరావడానికి అనుమతి లేకపోవడంతో అత్యాశగల బంధువులు ఆమె ఆస్తిని స్వాధీనం చేసుకుంటారు. కొంతకాలం తర్వాత ఆమె ప్రభుత్వ అనుమతితో హైద్రాబాద్‍ వచ్చి ఒకనాడు తాను నివసించిన రెసిడెన్సీ భవనం చూడాలని హెన్రీరస్సల్‍ను కోరింది. తుదకు మచిలీపట్నంలో 27 సంవత్సరాల వయసులో 22 సెప్టెంబర్‍ 1813లో మరణించింది.

కిర్క్పాట్రిక్‍, ఖైరున్నీసాల ప్రేమ, శృంగారం, బంధం, అనుబంధం ఆనాటి సాంస్కృతిక, మత, రాజకీయ పరిధులు అధిగమించి చివరకు విషాదంగా ముగిసింది. ఇది భారత సంస్థానాలు మరియు ఈస్ట్ ఇండియా కంపెనీల మధ్య రహస్య మంతనాలు, కుట్రలు, కుతంత్రాలు రాజకీయ మత, కుటుంబ వివాదాలతో కూడిన చారిత్రక కథనం. ఆరోజుల్లో ప్రతి సంస్థానంలో ఇవి సమాన్యమైనవి అయినప్పటికీ 16వ శతాబ్ధంలో పోర్చుగీసువారు గోవాలో దోతీ ధరించడం నిషేధించిన తర్వాత బ్రిటీషువారు ఇతర వలసదారులను నివారించడానికి భారతీయ సాంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను పాటిస్తూ భారతీయ స్త్రీలను వివాహం చేసుకుని ప్రజలకు దగ్గరయ్యే క్రమంలో అవలంబించిన వ్యూహంలో భాగంగా జరిగిన యదార్థ ఘటన. ఆ నేపథ్యంలో ఉద్భవించిందే ‘‘ఆంగ్లో-ఇండియన్‍ కమ్యూనిటీ’’. 18వ శతాబ్ధంలో భారతదేశంలోని బ్రిటిష్‍ పురుషులలో మూడింట ఒక వంతు మంది తమ ఆస్తులను భారతీయ మహిళలకు వదిలివేశారని రచయిత చెప్తాడు. ‘ఆ కాలంలో ఒక విధంగా భారతదేశంలో ఆంగ్లేయులందరూ పరిపాలనలో పట్టుకోసం తమను తాము కొంతమేరకు భారతీయుంచుకున్నారు అని విలియం డాల్రింపుల్‍ నొక్కి చెప్పాడు. ఈ నవలను 2004లో పెంగ్విన్‍ ఇండియావారు ప్రచురించారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *