దేశంలో విద్యా రంగం కొత్త దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటివరకు ఇంజనీరింగ్ విద్య ప్రత్యేకంగా బీటెక్, పాలిటెక్నిక్ కోర్సులకే పరిమితమై ఉండేది. కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానం ఈ పరిస్థితిని మార్చబోతోంది. ఇకపై సాధారణ డిగ్రీలోనే ఇంజనీరింగ్ అంశాలను చేర్చి విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానం అందించనున్నారు. దీని వల్ల డిగ్రీ పూర్తయ్యే సరికి విద్యార్థులు పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలతో సిద్ధమవుతారు.
ప్రస్తుతం ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ కోర్సులు చదివే విద్యార్థులు సుమారు 40 లక్షలమంది ఉన్నారని అంచనా. కానీ వారిలో చాలామంది పరిశ్రమల్లో ఉపాధి పొందడంలో ఇబ్బందులు పడుతున్నారు. కారణం టెక్నికల్ స్కిల్స్, ప్రాక్టికల్ అనుభవం లోపించడమే. ఈ లోటును అధిగమించడానికి డిగ్రీ కోర్సుల సిలబస్‌లో 20 శాతం వరకు సాంకేతిక విషయాలను చేర్చాలని నిర్ణయించారు. ఈ మార్పులు 2025–26 విద్యా సంవత్సరంలో అమల్లోకి వస్తాయి.
డిగ్రీ విద్యార్థులు ఇకపై రోబోటిక్స్, డేటా సైన్స్, మెకానికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్, మేనేజ్మెంట్ వంటి సబ్జెక్టులను కూడా నేర్చుకుంటారు. కేవలం తరగతి గదిలో మాత్రమే కాకుండా, ప్రాజెక్ట్ వర్క్, ఇంటర్న్‌షిప్, శిక్షణా కార్యక్రమాల ద్వారా ప్రత్యక్ష అనుభవం పొందుతారు. దీని వల్ల ఉద్యోగాలకు అర్హత సాధించడానికి ప్రత్యేకంగా కోర్సులు చేయాల్సిన అవసరం లేకుండా డిగ్రీలోనే తగిన జ్ఞానం, నైపుణ్యం సంపాదించవచ్చు.

ఇకపై డిగ్రీ విద్యార్థులు మాత్రమే కాకుండా ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ చదివే వారు కూడా డిగ్రీలో అడ్మిషన్ పొందే అవకాశం కలుగుతుంది. అంటే ఒకేసారి రెండు కోర్సులు పూర్తి చేసే అవకాశం ఉంటుంది. ఇది విద్యార్థులకు ద్విగుణ ప్రయోజనం కలిగిస్తుంది. డిగ్రీ విద్యార్థులకు ఇంజనీరింగ్ జ్ఞానం, ఇంజనీరింగ్ విద్యార్థులకు డిగ్రీ అర్హత ఒకేసారి లభిస్తుంది.
ఈ విధానం వల్ల విద్యార్థులకు లభించే లాభాలు అనేకం. పరిశ్రమల్లో తక్షణం పనిచేయగల నైపుణ్యాలు వస్తాయి. ఉద్యోగ అవకాశాలు విస్తరిస్తాయి. ఉదాహరణకు ఒక బీ.ఎస్సీ విద్యార్థి రోబోటిక్స్, డేటా సైన్స్ నేర్చుకుంటే, సాధారణంగా ఇంజనీరింగ్ చేసిన వారికే లభించే అవకాశాలను కూడా పొందగలడు. ఒక బీ.ఏ. విద్యార్థి డిజిటల్ టెక్నాలజీ లేదా మేనేజ్మెంట్లో శిక్షణ పొందితే, కార్పొరేట్ రంగంలో సులభంగా చేరగలడు.
రాష్ట్రాల వారీగా సిలబస్ రూపకల్పన జరుగుతోంది. టెక్నికల్ ఎడ్యుకేషన్ బోర్డు, ఉన్నత విద్యా మండలి కలిసి పరిశ్రమల అవసరాలు, భవిష్యత్ సాంకేతిక పరిణామాలను దృష్టిలో పెట్టుకొని కొత్త సిలబస్‌ను రూపొందిస్తున్నాయి. ఇకపై డిగ్రీ పూర్తిచేసిన విద్యార్థులు ఉద్యోగం కోసం అర్హత సాధించాలంటే వేరే శిక్షణ అవసరం ఉండకపోవచ్చు.
మొత్తం మీద ఈ మార్పులు విద్యార్థులకూ, పరిశ్రమలకూ లాభదాయకం. ఒకవైపు నిరుద్యోగిత సమస్య తగ్గుతుంది. మరోవైపు పరిశ్రమలకు కావలసిన నైపుణ్యం కలిగిన యువత అందుబాటులోకి వస్తారు. దేశ ఆర్థికాభివృద్ధికి ఈ మార్పులు తోడ్పడతాయి. విద్యార్థుల భవిష్యత్తు మరింత బలపడుతుంది.
నిపుణులు ఈ విధానాన్ని స్వాగతిస్తున్నారు. డిగ్రీ విద్యార్థులు సాధారణ విద్యతో పాటు టెక్నికల్ జ్ఞానం పొందడం ద్వారా ఒకేసారి రెండు కోర్సుల ప్రయోజనం పొందుతారు. భవిష్యత్తులో ఉపాధి అవకాశాలు విస్తరించడంతో పాటు దేశ నిర్మాణంలో యువత పాత్ర మరింత కీలకంగా మారుతుంది.
-కొత్వాల్. సచిన్, ఎ : 86866 6494