సిద్దిపేట జిల్లాలోని ఒక మండల కేంద్రం రాయపోల్. పూర్వం రావిప్రోలుగా శాసనాల్లో పేర్కొనబడిన ఈ గ్రామం ఒక ప్రాచీననగరం, ఒకప్పటి అగ్రహారం కూడా. కల్యాణి చాళుక్యుల సామంతుల రాజధాని నగరం. ఈ గ్రామంలో కళ్యాణీ చాళుక్యులకాలంనాటి 4 శాసనాలు దొరికాయి. అందులో కళ్యాణీ
చాళుక్యు సామ్రాజ్య పాలకులు త్రైలోక్యమల్లుని కాలానివి రెండు, భువనైక మల్లదేవర కాలానివి రెండు శాసనాలు ఉన్నాయి. ఈ గ్రామం ఒకప్పుడు చిన్న రాజధానిగా వుండేదని, రాయపోలు ప్రభువుగా విష్ణయరాజు వుండేవాడని దొరికిన శాసనాల వల్ల తెలుస్తున్నది.
గ్రామంలో ఎక్కడ చూసినా పూర్వనగరపు చారిత్రక శిధిలాలు కనిపిస్తాయి. దేవతల శిల్పాలు విడిగా లభిస్తున్నాయి.

గణపతి దేవాలయం:
గ్రామంలో నూతనంగా కట్టిన ఒక చిన్న దేవాలయం ఉంది. ఈ గుడిలో దాదాపు 6 అడుగుల పైనున్న గణపతి విగ్రహం ఉంది. చేటచెవులు, దండ రెట్టలకు సర్పాలు ఉన్నాయి. కాళ్ళకు కడియాలు ఉన్నాయి.
ఉదరం మీద నాగబంధంతో కనిపిస్తున్న ఈ వినాయకుడు తొలితరం చాళుక్యశైలి శిల్పం. ఈ ఆలయం ముందు ఒక పెద్ద రాతి స్తంభం ఉంది. దానిపైన ఒక శాసనం చెక్కబడి ఉంది. ఇది కళ్యాణీ
చాళుక్య చక్రవర్తి ఆహవమల్ల 1వ సోమేశ్వరుని ఏలుబడి కాలంలో క్రీ.శ.1048లో వేయబడింది. ఈ శాసనంలో పేర్కొన్న వివరాల ప్రకారం ‘రావిప్రోలు’గా పిలువబడిన ఈ గ్రామంలో గావుండ హువిన కొడుకు జువ్విరడ్డి గణపతి ప్రతిష్ట, చేసి హనుమంతునికి గుడి నిర్మాణం, అగ్రహార విద్యార్థులకు బసది కల్పన చేయించాడని వుంది. ఆ శాసనంలో జువ్విరెడ్డి ప్రతిష్ఠ చేశాడని చెప్పే గణపతి విగ్రహం ఇదే అని శాసన ఆధారంగా చెప్పవచ్చు.
పార్థివేశ్వరాలయం:
ఈ గ్రామంలోని దేవుని చెరువుకట్టపై ఉన్న పార్థివేశ్వరుని గుడిని పరిశీలించినపుడు అది పూర్వం ఒక జైన దేవాలయం అని తెలుస్తుంది. గుడి బయట జైన నిశీధి, పాదాలు మాత్రమే మిగిలి ఉన్న పార్శ్వనాథుని విగ్రహశకలం, కుడిపక్కన చామరధారిణితో కనిపిస్తుంది. దేవాలయ బయటి ద్వారశాఖ(శేరె)లకు రెండువైపుల కలశాలు చెక్కి వున్నాయి. ప్రవేశ ద్వారానికి కలిపికట్టిన గోడలో ఉన్న రెండు స్థంబాలలో కుడివైపు స్తంభం మీద శిశువు తలమీద చేయిపెట్టి నిల్చున్న తల్లి శిల్పం (జైనయక్షిణి అంబిక), మధ్యలో హంసలు, పైన చతుర్భుజ గణపతి విగ్రహం, ఎడమవైపు స్తంభం మీద కింద కుడిచేతిలో చామరం, ఎడమచేతిలో ఫలంతో జైన యక్షిణి, మధ్యలో హంసల డిజైన్, పైన పైచేతులలో పాశం, అంకుశం, కిందిచేతులలో అక్షమాల, పుస్తకాలను ధరించిన సరస్వతి శిల్పాలున్నాయి. గుడి ముందరి మంటప స్తంభాలు రాష్ట్రకూట శైలిలో వున్నాయి. కొత్తగుడి ప్రవేశానికి పక్కన రెండు ఎర్లీ కాకతీయ స్తంభాలున్నాయి. ప్రస్తుతం ఉన్న దేవాలయం తిరిగి కట్టబడినట్లు తెలుస్తోంది. పార్శ్వనాథ దేవాలయంలో లింగ ప్రతిష్టచేయబడ్డది. జైనశిల్పాలను ఎక్కడో పడేసినట్లున్నది. గర్భగుడి ద్వారశాఖల మీద లకులీశ మతానుగుణంగా శైవద్వారపాలకులు, పరిచారకులు, స్తంభికలు, ఏనుగులపైన సింహాలపంక్తి, వజ్ర స్తగితమైన ద్వారబంధాలు, పైన పతంగం(ఉత్తరాశి) మీద మంగళఫలకం లేదా లలాటబింబంగా గజలక్ష్మి చెక్కబడ్డాయి. గర్భగుడిలో వర్తులాకారం, అంచులున్న చాళుక్యశైలి పానవట్టం, దానిలో శివలింగం ప్రతిష్ట చేయబడి ఉంది. అక్కడే ఒక మూల బ్రహ్మ, విష్ణు, రుద్రభాగాలతో రెండడుగులు మించివున్న సమలింగం అగుపిస్తున్నది. మరొకపక్క 10వ శతాబ్దపు గణపతి శిల్పముంది. దేవాలయం ముందర రాష్ట్రకూటశైలిలో చెక్కిన 8స్తంభాల మంటపం వుంది. పక్కన చాళుక్యశైలి నంది గంటలపట్టెడలతో అలంకరించబడివుంది. దేవాలయం ఎదురుగా ఉన్న ధ్వజస్తంభం చాళుక్యశైలిదే.

విడి శిల్పాలు:
గుడి బయట చాలా విగ్రహాలూ ఉన్నాయి. అక్కడ ఉన్న విడి విగ్రహాలలో కార్తికేయుని మిథునశిల్పం ఉంది. మూడు పద్మపత్రాల వలయాల మధ్య చెక్కిన జైనపాదాల రాతిబిల్ల ఒకటి ఉంది. సప్తమాతృకల ఫలకాలు రెండున్నాయి. అందులో ఒకటి రెండు ముక్కలుగా కనిపిస్తున్నది. వీటి మీద రాష్ట్రకూటుల కాలంనాటి శైలిలో చెక్కిన 7గురు మాతృదేవతలున్నారు. మరొక శిల్పఫలకం మీద గణపతిసహిత అష్టమాతృకలున్నారు. నాలుగైదు నాగశిలలు వరుసగా నిలిపివున్నాయి. భైరవుని శిల్పం కూడా విడివిగ్రహాలలో ఒకటి. మల్లన్నగా కొలుచుకునే ఆసనస్థిత మైలారుదేవుని శిల్పం అందంగా చెక్కబడ్డది. కాకతీయానంతర శైలి శిల్పం ఇది. దాని పక్కన చిన్న అర్చమూర్తి ద్విభుజి అయిన చాముండ విగ్రహం వుంది. చాళుక్యశైలి లింగపీఠం, శివలింగం, ద్విభుజి చాముండ శిల్పమొకటి, చేతులు, కాళ్ళు విరిగిన సూర్యుని శిల్పం, కేశవమూర్తులుగా కనిపించే రెండు ద్వారపాలకుల శిల్పాలున్నాయి. ఈ విగ్రహాలను చూస్తుంటే అక్కడెక్కడో వైష్ణవాలయం కూడా వుండి వుండాలనిపిస్తున్నది. శివాలయం నుండి చెరువు కట్ట మీదుగానే కొంచెం ముందుకు వెళ్తే చతుర్భుజుడైన చాళుక్య శైలి భైరవుడు త్రిశూలం, ఢమరుకం, కత్తి, రక్తపాత్రతో ఉన్నాడు. అక్కడే మరొక అమ్మదేవత శిల్పం చతుర్భుజాలతో మట్టిలో కూరుకొని కనిపిస్తుంది.
రాయపోలులో లభించినవి 4శాసనాలు. ఇవి కళ్యాణీచాళుక్యుల ఏలుబడికాలానికి చెందినవి. రాయపోలు ఒకప్పటి అగ్రహారమని శాసనాలవల్ల వెల్లడౌతున్నది.

ఒకటవ శాసనం:
రాయపోల్ లోని గణేశునిగుడి ధ్వజస్తంభం మీదున్న శాసనం క్రీ.శ.1048 ఏప్రిల్ 21న వేయబడ్డది. ఈ శాసనం రావిప్రోలు అగ్రహారం గావుండ హువిన కొడుకు జువ్విరెడ్డి గణపతి ప్రతిష్ట, హనుమంతుని గుడి నిర్మాణం, బసతి(సత్రం) కట్టించాడని తెలియజేస్తున్నది.
రెండవ శాసనం:
రాయపోల్ లోని మైసమ్మ గుడి దగ్గర వున్న స్తంభ శాసనం 1వ సోమేశ్వరుడు, త్రైలోక్యమల్ల పాలనాకాలం క్రీ.శ.1061లో జైనధర్మానికి చెందిన మూలసంఘం, సరస్వతి గణం జైనగురువు కనకనంది సిద్ధాంతదేవర, అసగబుకవైర శిష్యుడు దండుబకనిళ రుక్షకేశుని ప్రస్తావించింది.
ఒకప్పుడు రాయపోలులో జైనమతానికి సంబంధించిన బసది వుండేదని చెప్పడానికి ఈ శాసనమొక ఆధారం. అట్లే జైనపాదాలు, జైనయక్షిణి శిల్పాలు కూడా రుజువులే.

మూడవ శాసనం:
రాయపోలులోని శివాలయం ముందరున్నది 3వ శాసనం. పశ్చిమచాళుక్య చక్రవర్తి భువనైకమల్లదేవ కంపిలి నెలవీడు నుంచి పాలిస్తున్న కాలంలో క్రీ.శ.1073 ఏప్రిల్ 22వ తేదీన వేయబడిన ఈ శాసనం రావిపోల ప్రభువు విష్ణయరాజు పార్థివదేవకు నిత్యపూజలకు, సాధువులకు ఆహారానికి పాండనచెరువు, భాగీనది తీరం, తోట, ఆకు చెరువు, తంగళ్ళకుట్టి వంటి చోట్ల 108 మర్తురుల భూదానం చేసినాడని, ఈ భూమిని యమ, నియమ, స్వాధ్యాయ, ధ్యాన, ధారణ, మౌనానుష్టాన, జప, సమాధి సంపన్నుడైన పూజారి లకులాగమ సమయ సముద్ధరణుడైన పూండియ నకరేశ్వర ఆరాధకుడు లోకాభరణ పండితునికి అప్పగించాడని వివరిస్తున్నది.

నాలుగవ శాసనం:
మరొక చివరి క్రీ.శ.1074నాటి శాసనం భువనైకమల్లదేవ కళ్యాణీ నెలవీడులో వున్నపుడు రావిప్రోలు ప్రభువు విష్ణయరాజు పాండవ తటాకం, పూలతోటల కొరకు 290 గద్యాణాల ధనం, 50 మర్తురుల భూమిని దానం చేసినట్లు తెలియజేస్తున్నది. ఈ శాసనంలో పేర్కొన్న పాండవతటాకం ఇప్పటి గ్రామంలోని చెరువునానుకొని అక్కడక్కడ కనిపిస్తున్న మట్టి దిబ్బలు 5 చోట్ల ఉన్నాయి. వీటిని స్థానికులు పాండవుల గెరెలి(కెఱియ=చెరువు) దిబ్బలు అని పిలుస్తారు. ఈ మట్టి దిబ్బలు ఒకప్పటి రావిప్రోలుకోట శిధిలాలు కావొచ్చు. చెరువులో నీళ్ళు తగ్గినప్పుడు ఆ దిబ్బలని పరిశీలించవలసిన అవసరం ఉంది.
వీరగల్లులు:
ఈ గ్రామంలో మూడు వీరగల్లు శిల్పాలు ఉన్నాయి. వాటిలో విరిగిన శిల్పాలు రెండు ఉన్నాయి. ఇక్కడ ఉన్న అన్ని శిల్పాలు ఆత్మహుతి శిల్పాలె. విరిగిన రెండు శిల్పాలు కాక అక్కడే ఉన్న మరొక వీరగల్లు విగ్రహం ప్రత్యేకమైనది. రాష్ట్రకూటుల కాలానికి చెందినది ఈ శిల్పం ఆత్మాహుతి వీరగల్లు. రెండంతస్తులున్న ఈ వీరగల్లులోని మొదటి అంతస్తులో ఒక వీరుడు కూర్చుని ఉన్నాడు. ఆయన పట్టుకున్న పరికరమేదో రంగులు వేయడం వల్ల సరిగా కనిపించడం లేదు. వీరుని నడినెత్తిన కొప్పు ఉంది. వంచిన వెదురుగడకు వీరుని తల తెగి స్పష్టంగా కనిపిస్తుంది. ఇటువంటి విగ్రహాన్ని ‘గడతల’ వీరగల్లు అంటారు. రెండవ అంతస్తులో ఆత్మాహుతి చేసుకున్న వీరున్ని దేవలోకానికి తీసుకొని పోతున్న ఇద్దరు చామరధారిణులైన అమరాంగనలు కనిపిస్తున్నారు శైవభక్తులు ఆత్మబలి దానాలను ధర్మకార్యంగా, శివుని సన్నిధికి చేర్చే తక్షణమార్గంగా ఎంచుకున్నారు.
- శ్రీరామోజు హరగోపాల్,
ఎ : 99494 98698