గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధిచెంది భారతదేశానికే తలమానికంగా నిలిచిన ప్రముఖ చారిత్రక పర్యాటక కేంద్రం గండికోట ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసే కృషిలో ఇంటాక్ అగ్రభాగాన నిలుస్తోంది. తొలి నుంచి గండికోటకు యునెస్కో గుర్తింపు తీసుకురావాలనే సంకల్పంతో అనేక పర్యాయాలు అటు అధికారులు, ఇటు పాలకుల దృష్టికి వినతుల రూపంలో తీసుకెళ్తూనే ఉంది. కొద్ది నెలల క్రితం వైయస్సార్ కడప జిల్లా మైదుకూరు పర్యటనకు వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు గండికోట అభివృద్ధిపై ఇంటాక్ కడప చాప్టర్ కన్వీనర్, గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్ లయన్ కె. చిన్నపరెడ్డి వినతిపత్రం సమర్పించారు. దీనిపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు.

గండికోటలో పర్యాటక అభివృద్ధిలో భాగంగా అక్కడ మెరుగైన హోటళ్లు, రిసార్ట్ల నిర్మాణంపై ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో ఇటీవల గండికోటలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఇంటాక్ కన్వీనర్ కె.చిన్నపరెడ్డి హాజరై రూ.100 కోట్ల వ్యయంతో చేపట్టబోయే అభివృద్ధి పనులకు సంబంధించి ఎంఓయూ కుదుర్చుకోవడం కీలక పరిణామం. ఈ ప్రయత్నం కార్యరూపం దాలిస్తే గండికోటలో సుందర గ్రామీణ వాతావరణంలో పర్యాటక హోటళ్లు అభివృద్ధి చెందే అవకాశం ఉంది.
ఎంతో చారిత్రక ప్రాధాన్యత కలిగిన గండికోట విశేషాలను ప్రతి ఒక్కరికి చేరువ చేయాలనే సంకల్పంతో ‘మన గండికోట’ పేరుతో ఇంటాక్ ఆధ్వర్యంలో బుక్‍లెట్‍ను ప్రచురించి పదివేల ప్రతులను పర్యాటకులకు, విద్యార్థులకు, వివిధ వర్గాల వారికి ఉచితంగా పంపిణీ చేయడం విశేషం.
ఏటా పర్యాటక దినోత్సవం సందర్భంగా గండికోటలో ప్రభుత్వ భాగస్వామ్యంతో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలలో ఇంటాక్ పాలుపంచుకుంటోంది.


పర్యాటక ప్రాంతంగా గండికోటను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ఏర్పాటైన గండికోట అభివృద్ధి కమిటీలో ఇంటాక్ కన్వీనర్‍కు సైతం స్థానం కల్పించడం గండికోట అభివృద్ధి పట్ల ఇంటాక్ కనబరుస్తున్న ప్రత్యేక శ్రద్ధకు నిదర్శనం.
ఇంటాక్ కడప చాప్టర్ ఆధ్వర్యంలో ప్రతినెల వెలువడుతున్న ‘మన చరిత’ మాసపత్రిక ద్వారా గండికోట ఘన కీర్తిని ఎలుగెత్తి చాటుతూనే ఉంది.
పురావస్తు శాఖ ఆధ్వర్యంలో గండికోట అభివృద్ధి కోసం జరిగే అనేక కార్యక్రమాల్లో ఇంటాక్ భాగస్వామ్యం పంచుకుంటోంది. హెరిటేజ్ వాక్ నిర్వహణతో పాటు యోగా దినోత్సవాన్ని సైతం గండికోటలోని మాధవరాయ స్వామి ఆలయ ప్రాంగణంలో నిర్వహించడం విశేషం.
గండికోటను ప్రపంచంలోనే ఒక అద్భుతమైన పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ (సాస్కీ) పథకం కింద విడుదల చేసిన రూ. 80 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టారు. ఈ పనుల నిర్వహణలో అవసరమైన తగు సూచనలు, సలహాలు ఇవ్వడంలో ఇంటాక్ తన వంతు పాత్ర పోషిస్తోంది.

గండికోట చరిత్రను విద్యార్థులకు తెలియజెప్పాలనే లక్ష్యంతో పర్యాటక పర్యటనలు సైతం ఇంటాక్ ఆధ్వర్యంలో నిర్వహిస్తోంది.
గండికోటను పర్యాటకపరంగా అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తూ గండికోట చరిత్రలో ఇంటాక్ సైతం తనకంటూ ఓ అధ్యాయాన్ని లిఖించు కుంటోంది.
కాగా గండికోట తో పాటు తొలి తెలుగు శాసనం వెలుగు చూసిన వైయస్సార్ కడప జిల్లాలోని కలమల్లను సైతం పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలనే దృఢ సంకల్పంతో ఇంటాక్ ముందుకు సాగుతోంది.
- కంభం చిన్నపరెడ్డి
కడప – ఇంటాక్ కన్వీనర్
ఎ : 988556664