‘‘స్వంత కథ’’

(గత సంచిక తరువాయి)
ఒక హైద్రాబాదీగా, భూమి పుత్రుడిగా హైద్రాబాద్‍ చరిత్రపై రచనలు చేయాలని నిర్ణయించుకున్నాను. ఫలితంగా 2006లో ‘‘షహర్‍నామా’’ (హైద్రాబాద్‍ వీధులు – గాథలు) పుస్తకం వచ్చింది. నగర వీధుల పేర్ల వెనుక చరిత్ర, బస్తీలు, అప్పటి మనుషుల గురించి ‘‘కథలు, కథలుగా’’ కథలల్లినాను. ఇది రెండు ముద్రణలకు నోచుకుంది. పుస్తకం కంటె ముందు వారం వారం సీరియల్‍గా 25 వారాల పాటు నమస్తే తెలంగాణా దినపత్రిక ఆదివారం సంచికలో ప్రచురించబడి పాఠకుల మన్ననలను పొందింది.
ఆ తర్వాత ‘‘హైద్రాబాద్‍ జన జీవితంలో ఉర్దూ సామెతలు’’ పుస్తకం వచ్చింది. ఒకప్పుడు చెలామణీలో ఉండి ఇప్పుడు మరచిపోయిన ఉర్దూ సామెతలను మళ్లీ గుర్తుచేసినట్లయ్యింది. లడ్డూల మధ్యన కిస్‍మిస్‍ల లాగా తెలుగుభాష మాట్లాడుతూనే మధ్యమధ్యన ఉర్దూ సామెతలను వాడటం తెలంగాణీయుల సంస్కృతి.

2007లో ‘‘ప్రపంచ పాదయాత్రికుడు’’ అనే వ్యక్తిచిత్రాల వ్యాసాలను పునరుద్దరించి, మరికొన్ని చేర్పులతో ముద్రించాను. కొన్ని స్వంత కథలు, మరికొన్ని అనువాద కథలు (ఇంగ్లీష్‍ నుండి) వివిధ పత్రికలలో వచ్చినవి అన్నీ కలిపి ‘‘ఒక హిజ్రా కథ’ అన్న పేరుతో అనువాద కథలని 2007లో ప్రచురించటం జరిగింది. అనువాద కథలన్నీ ఒరిజినల్‍ కథల్లాగ ఉన్నాయని పాఠకుల పశంసలను పొందాను.
2008లో ‘‘1857 హైద్రాబాదు తిరుగుబాటు గాథలను’’ ప్రచురించాను. ఇవన్నీ గత చరిత్ర నుండి తీసుకుని ‘‘సువర్ణానికి సుగంధంలా’’ నా కల్పనా శక్తిని జోడించాను. 1857 విప్లవం 150 సం।।లు పూర్తయిన సందర్భంగా కోఠీలోని ఆ అమరవీరుల స్థూపం వద్ద ఈ పుస్తకాన్ని ఆవిష్కరించి వారికే అంకితమివ్వటం ఒక మరుపురాని మధురఘట్టం.
2009 జూన్‍ 30న నేను ఎదిరి చూసిన నా పదవీ విరమణ తేదీ. ‘‘మనిషి స్వేచ్ఛగా జన్మించాడు కాని ప్రతిచోటా సంకెళ్లలో బంధింపబడి ఉన్నాడు’’ అన్న రూసో కొటేషన్‍ను నేను నమ్మినందున పదవీ విరమణ నాకు చాలా సంతోషకరమైన దినం. అంతకు 3 నెలల ముందే ఒక మిత్రుడితో కలిసి నా స్కూటర్‍పై 12 రోజులు చత్తీస్‍ఘడ్‍ దండకారణ్య పర్యటనకు వెళ్లాను. జన సంచారం లేని, సిమెంటు రహదారులు లేని అరణ్యాలలో ప్రకృతిని, గిరిజన ప్రదేశాలను చూసి రావాలని మా లక్ష్యం. ఖర్చుకు బెదరక బోలెడన్ని రంగుల ఫోటోలతో ‘‘చత్తీస్‍ఘడ్‍ స్కూటర్‍ యాత్ర’’ పుస్తకాన్ని 2009లో ప్రచురించాను. ఇది నా మొదటి యాత్రా సాహిత్య గ్రంథం. ఇది పాఠకులకు ఎంతగా నచ్చిందంటే ఐదు ముద్రణలు పొందింది. నాకు, యాత్రా రచయితగా పేరును సంపాదించి పెట్టింది.
2010-12 రెండు సంవత్సరాల కాలంలో ఒక వైపు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కోసం చురుకుగా పనిచేస్తునే ‘‘ఎవరిదీ హైద్రాబాదు?’’ తెలంగాణా వ్యాసాలు, 1948 పోలీస్‍ యాక్షన్‍ (నిజాంపై నిప్పులు కురిపించిన విప్లవ వీరులు) మొదలగు పుస్తకాలు ప్రచురించాను. ఒక సామాజిక శాస్త్ర అధ్యయన విద్యార్థిగా ప్రతి వ్యాసం కొత్త కోణాలతో రాసి ఉద్యమ ఔన్నత్యాన్ని పెంచాను.

ముందే చెప్పినట్లుగా నా పదహారు సంవత్సరాల వయస్సులో తెన్నేటి సూరి నవల ‘‘చంఘీజ్‍ఖాన్‍’’ చదివి ఎప్పుడో ఒకప్పుడు గోబీ ఎడారి సందర్శించాలని నిర్ణయించుకున్నాను. ఆ తర్వాత నేను చదివిన రష్యన్‍ సాహిత్యం, చైనీస్‍ సాహిత్యం, ముఖ్యంగా చెంఘీజ్‍ ఐత్‍ మాతోవ్‍ నవలలు నన్ను కలల ప్రపంచంలోకి నెట్టివేసాయి. తర్వాత్తర్వాత చరిత్ర, రాజకీయ పుస్తకాలు నాకు ‘‘సిల్కురూట్‍’’ను పరిచయం చేసాయి. సిల్కురూట్‍కు సంబంధించిన ఇంగ్లీష్‍ యాత్రాసాహిత్యం నా యాత్రా కాంక్షను పెంచి పోషించాయి.
2009లో పదవీ విరమణ తర్వాత సిల్కురూట్‍ యాత్రకు కాలు కదిపాను. టూరిస్టుగా కాదు ట్రావెలర్‍గా, అంటే సాధారణ యాత్రికుడిగా. మార్కోపోలో, షాహియాన్‍, హ్యుయాన్‍త్సంగ్‍, ఇబాన్‍బటూటా, రాహుల్‍ సాంకృత్యాయన్‍, సంజీవ్‍దేవ్‍లు నాకు ఆదర్శమూర్తులు. అప్పుడు నా వయస్సు 62 సం।।లు దేశం కాని దేశాలు. మూడు మధ్యాసియా దేశాలు, నాల్గవది చైనా. తాష్కెంటు నుండి బీజింగ్‍ వరకు ‘‘సిల్కురూట్‍’’ దారులలో నా ప్రయాణం. బాషలు పెద్ద అడ్డంకి. ఆ దేశాల వారికి ఇంగ్లీష్‍ రాదు. తిండి, గిండి మనది కాదు. బస విషయంలో ఎటువంటి ముందస్తు ప్లాను లేదు. ‘‘మంజిల్‍ కహాఁ కహాఁ రుఖ్‍నాహై, ఊపర్‍ వాలా జానే’’ పాటలాగే నా పరిస్థితి. పదవీ విరమణ వల్ల వచ్చిన మూడున్నర లక్షలు మూటకట్టుకుని, రెండు నెలల ప్రయాణానికి నడుం కట్టాను. నా అర్ధాంగి శోభ అనుమతి అడిగాను. ‘‘వెళ్లు నీ చిరకాల కలను నెరవేర్చుకో’’ అని ప్రోత్సహ మిచ్చింది. మా కొడుకు ఇంకా విద్యార్థిగానే ఉన్నాడు. నా నెత్తిమీది బాధ్యతలన్నీ ఆమె నెత్తిమీదికి నెట్టివేసి యాత్రకు సిద్దమయ్యాను. సంజీవ్‍దేవ్‍ మాట నాకు నిత్య స్మరణీయమైంది ‘‘సాహసం సమక్షంలో మృత్యువు ఒక లెక్కకాదు’’, మా పూర్వీకుల సంచార తత్వం, సంచార రక్తం, నా జ్ఞాన పిపాస నన్ను ముందుకు నడిపించాయి.
అపూర్వమైన నా అనుభవాల నన్నింటిని గ్రంధస్తం చేసాను. దాని పేరు ‘‘సిల్కురూట్‍లో సాహస యాత్ర’’. ఇంటికి తిరిగి వస్తానన్న నమ్మకం నాకు లేనపుడు, అక్కడ ఏదైనా జరిగితే ఇంటికి నా శవం కూడా వస్తదన్న నమ్మకం లేని పరిస్థితులలో, తెగించి బౌద్ధమత ప్రచారానికి మన దేశం నుండి చైనాకు వెళ్లిన బౌద్ధభిక్షువులలాగా నేను సంచారానికి వెళ్లటం సాహసం కాదా? ఆ పేరు పెట్టటం సమంజసం కాదా? విజ్ఞులైన పాఠకులే నిర్ణయించాలి. 2012లో ఆ పుస్తకం వెలుగులోకి వచ్చి వందలాది మంది అభిమానులను నాకు సంపాదించి పెట్టింది. వారి ప్రశంసలే నాకు అవార్డులు, రివార్డులుగా మారాయి. ఆ పుస్తకం అనేక పునర్ముద్రణలను పొందింది.

2014లో సతీసమేతంగా యూరపుదేశాల పర్యటన, ఆ తర్వాత ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‍ పర్యటనలు కూడా చేసాము. 2016లో మేమిద్దరం చేసిన నల్లమల, ఎర్రమల ప్రాంతాల పర్యటన విశేషాలతో యాత్రా గ్రంధాల రచన చేసాను. అవి కూడా పాఠకుల ప్రశంసలను పొందాయి.
‘‘దక్కన్‍ ల్యాండ్‍’’ మాసపత్రికలో నెలనెలా ‘‘చార్మినార్‍ కథలు’’ రాసాను. అవన్నీ అదే పేరుతో పుస్తకంగా 2023లో వచ్చింది. డెబ్భై సంవత్సరాల క్రిందటి పాత హైద్రాబాదును, అప్పటి మనుషులను, వారి జీవితాలను యాస భాషలను, ఆ ‘‘గంగాజమునా తెహజీబ్‍’’ను ఆ కథలలో చిత్రించాను. ఏది రాసినా నా ఆత్మ పాత హైద్రాబాద్‍ చుట్టే తిరుగుతుంది కావున ఒక భూమిపుత్రుడిగా ఎంతోకొంత పాత నగరం రుణం తీర్చుకున్నానని భావిస్తున్నాను.
ప్రస్తుతం అదే మాస పత్రికలో నెలనెలా ‘‘శాలిబండ కథలను’’ రాస్తున్నాను. రచన అంటే నన్ను నేను ఆవిష్కరించుకోవటమే కదా! నా ఆత్మకు ప్రతిబింబమే కదా!!
సమకాలీన కాలంలో ఇతర రచయితలు, కవులు చేయలేని మరో పని చేసి ‘‘అది’’ సాధ్యమే అని నిరూపించాను. నా పుస్తకాలను నేనే నా డబ్బులతో ప్రచురించి ఎక్కడ పుస్తక ప్రదర్శనలు, సభలు జరిగినా అక్కడికి వెళ్లి నేనే స్వయంగా నిలబడి అమ్మటం. ఈ పని వెనుక నాకు స్ఫూర్తినిచ్చింది గతంలో నడిచిన గ్రంథాలయోద్యమం. వట్టికోట ఆళ్వారుస్వామి నాకు ఆదర్శం. చాలా మంది కవి మిత్రులు చాలా కష్టపడి స్వంత ఖర్చులతో తమ కవిత్వ పుస్తకాలను అచ్చేసి కలిసిన ప్రతి వారికి ఉచితంగా ప్రసాదం లాగా పంచి పెట్టటం, ఉచితంగా పుచ్చుకున్న వారు వాటిని చదవక పోవటం నాకు బాగా తెలుసు. నిజమైన సాహిత్యాభిమానులు, పాఠకులు తప్పకుండా కొని చదువుతారని కూడా గమనించాను. వారే పుస్తకాలను గుర్తించి, గౌరవిస్తారు. నేనెప్పుడూ ‘‘ఏటికి ఎదురీదే రకం’’ కావున వరుసగా ఆరేడు సంవత్సరాలు ఎక్కడ సభలు జరిగినా, పుస్తక ప్రదర్శనలు జరిగినా ఒంటరిగానే వెళ్లి ‘‘దుకాణాలు’’ తెరిచాను. ఈ పనిని ముందు కొంత మంది రచయితలు, కవులు గౌరవమైన పని కాదని విడ్డూరంగా చూసినా, భావించినా తర్వాత కొంతమంది నా దారిని అనుసరించారు. అటువంటి వారిని నేను మనసారా ప్రోత్సహించాను. నా వరకు నాకు పుస్తకాల ప్రచురణపై నేను పెట్టిన పెట్టుబడీ రావటమే గాక ఇంకా కొన్ని రూకలు నా జేబులోకి అదనంగా వచ్చాయి, మళ్లీ కొత్త పుస్తకాలు వేసుకోవటానికి. ఇంతేగాక ప్రతి పుస్తక ప్రదర్శనలో నా అభిమానులు నన్ను కలుసుకుని నా రచనలను మెచ్చుకోవటంతో ‘‘కుంటివానికి ఏనుగు ఎక్కినంత సంతోషం’’ నాకు దక్కింది. ఆ రోజుల్లో ఆంధ్రజ్యోతి దినపత్రిక ‘‘వివిధ’’లో నా అనుభవాలను తెలుపుతూ వివరంగా ఒక వ్యాసం కూడా రాసాను. పుస్తకాల విక్రయ విషయంలో నేనొక ‘‘ట్రెండ్‍ సెట్టర్‍గా’’ మారినందున నన్ను చూసి మరికొంతమంది మిత్రులు నా పద్దతిని అనుసరించారు.

పుస్తకాలను అందరూ చదువుతారు కాని చదివిన అక్షరాల వెంబడి ప్రయాణించి ఆయా ప్రాంతాలను, విశేషాలను సందర్శించటం కొంతమంది మాత్రమే చేస్తారు. అక్షరాల వెంబడి ప్రయాణించే యాత్రికుడిని నేను. రాహుల్‍ సాంకృత్యాయన్‍కు ఏకలవ్య శిష్యుడిగా డార్జిలింగ్‍లోని ఆయన సమాధిని, చెంఘీజ్‍ ఐత్‍మాతోవ్‍ అభిమానిగా కిర్గీజ్‍స్థాన్‍ రాజధాని, బిష్కెక్‍లోని ఆయన సమాధిని, చైర్మన్‍ మావో అభిమానిగా బీజింగ్‍లోని ఆయన ముసోలియంను సురపురంలో మెడాన్‍ టేలర్‍ బంగళాన్ని, రాజా వెంకటప్ప నాయక్‍ కోటను, హిమాలయాలలో నివసించే యోగి స్వామీ సుందరానంద్‍ను, చత్తీస్‍ఘడ్‍లో కార్మిక నాయకుడు శంకర్‍ గుహ నియోగీ సమాధిని, దేశ చరిత్ర గతిని మార్చిన నక్సల్‍బరీ గ్రామన్ని సందర్శిచటం నా సంచార జిజ్ఞాసకు కొన్ని
ఉదాహరణలు. ‘‘జ్ఞాని లోకసంచారి’’ అన్న సూత్రాన్ని నమ్ముతాను. వేదాలలోని ‘‘చరైవేతి చరైవేతి’’ ఆదర్శాన్ని ఆచరిస్తాను.
డాక్టర్‍ మన్మోహన్‍సింగ్‍ను ‘‘ఆక్సిడెంటల్‍ ప్రైమ్‍ మినిస్టర్‍’’ అంటారు. నేను కూడా యాదృచ్చికంగా యాభై సంవత్సరాలకు పెన్ను పట్టి అనుకోకుండా నా జీవితంలోని ఖాళీలను పూరించుకోవటానికి రచయితను అయ్యాను.
ఉద్దేశపూర్వకంగా కాదు. ‘‘కాలం కత్తుల వంతెన’’ మీద ప్రయాణిస్తూంటే ఏవేవో తెలియని చోదకశక్తులు నాచే పెన్నును పట్టించాయి. అంతా యాదృచ్చికం. అసలు జీవితమే యాదృచ్చిక సంఘటనల సమాహారం కదా!
అవార్డులకు, రివార్డులకు, సన్మానాలకూ, సత్కారాలకు ఎదురు చూసింది ఎప్పుడూ లేదు. అయినా కాకతాళీయంగానే ‘‘సలాం హైద్రాబాద్‍’’ నవలకు తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం దాని రెండవ భాగమైన నవల ‘‘కల్లోల కలల కాలానికి’’ తెలంగాణా సారస్వత పరిషత్తు వారి పురస్కారం లభించింది.

యువ రచయితలకు ప్రత్యేకంగా చెప్పేదేమీలేదు. ఎక్కువగా చదివి తక్కువగా రాయాలి. మన జీవితాన్ని మనమే అనేక ప్రయోగాలకు గురిచేయాలి. Experiments with Truth అన్నమాట. ఒక్క జీవితంలో అనేక జీవితాల అనుభవాలను పొందాలి. ‘‘జన్మమెత్తితిరా అనుభవించితిరా’’ అన్నట్లు జీవించాలి. కష్టాల కొలిమిలో కాలి బూడిదై నూతన మానవుడిగా అగ్ని పునీత సీతలాగా కొత్త జన్మఎత్తి కలం పడితే ఆ రచన పుటం పెట్టిన బంగారంలా ధగధగలాడుతుంది. జీవితం ‘‘నిలువనీరులా’’ ఒకే చోట స్థిరంగా గుండ్రాయిలా, గుదిబండలా ఉండకుండా ఈ స్థావర జంగమాత్మక ప్రపంచంలో నిరంతరం సంచరిస్తూ ఉండాలి. ఈ అండపిండ బ్రహ్మండ విశ్వంలో ప్రతిదీ చలిస్తూనే ఉంది. సంచరిస్తూనే ఉంది. ప్రకృతిలోని గాలి, నీరు, నింగీ, నేలా, చెట్టూ, పుట్టా అన్నీ ‘‘గతితర్కం’’ సూత్రానుసారం పరిభ్రమిస్తునే ఉన్నాయి. మనిషి కూడా అంతే.
‘‘చల్‍ నా జీవన్‍ కీ కహానీ,
రుఖ్‍నా మౌత్‍ కీ నిశానీ’’
నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు తెలంగాణా సారస్వత పరిషత్తువారికి కృతజ్ఞతలు. వందనాలు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *