(గత సంచిక తరువాయి)
(జరిగిన కథ: విడిదిలో బసచేసి అవ్వతో కూడా స్నేహంగా ఉన్న ఒక ఉన్నతమైన కుటుంబంతో అవ్వ కూడా బాగా కలిసిపోతుంది. వారు మాతృభాషకు ఇచ్చే ప్రాముఖ్యతకు ముఖ్య కారణం చిన్నతనంలో చదివిన ‘‘భారతీయం’’ అనే కథ అని, అది చదవమని అవ్వకు ఆ కథ తెచ్చిస్తారు.)
కథ చదివిన అవ్వకు అచ్చ తెలుగు సాంప్రదాయాలతో కూడిన మరో లోకంలోకి వెళ్లి వచ్చినట్టు అనిపించింది. ‘‘పరవాలేదు ఈ కాలంలో ఇలాంటి వారు కొందరైనా ఉంటే మన భాషకు, మన పద్ధతులకు ఢోకా ఉండదు’’. అనుకుంటూ ‘‘రోజూ నా దగ్గరికి ఆడుకోవటానికి ఓసారి, లేదంటే అప్పుడప్పుడు కథలు వినటానికి, ముచ్చట్లు పెట్టటానికి పిల్లలు వస్తుంటారు కదా! సందర్భం వచ్చినప్పుడు వాళ్లకి కూడా ఈ కథ చెప్పాలి’’ అని నిర్ణయించుకుంది.
వాళ్లు ఉన్న నాలుగు రోజులు తన స్వంత కుటుంబంతో కలిసి ఉన్నట్టుగా అనిపించింది. అవ్వా! వెళ్లి వస్తాం అని చెబుతుంటే ఎప్పుడూ లేనిది కొంచెం బాధగా, చిన్నబోయినట్టుగా కూడా అనిపించింది. అందుకే వాళ్లతో.. ‘‘అప్పుడప్పుడు ఈ అవ్వ కోసమైనా ఇక్కడికి వచ్చి పోండి బాబు…’’ అంది అవ్వ. ‘‘తప్పకుండా అవ్వా!’’ అంటూ వాళ్లు బయటకు వెళ్ళినప్పుడు అవ్వ కోసం తెచ్చిన చీర ఇచ్చి నమస్కరించి వెళ్లిపోయారు.
× × ×
తెల్లవారింది. ఆరోజు ఆదివారం కావడంతో రోజూ సాయంత్రం అవ్వ దగ్గరికి వచ్చే పిల్లలంతా ఉదయం 11 గంటల వరకే వచ్చారు. ‘‘వీళ్లు ఇప్పుడు రావటమే మంచిదయ్యింది. నాకు కూడా మనసు చిన్నబోకుండా కాస్త ఉత్సాహంగా ఉంటుంది’’ అనుకుంది అవ్వ. కానీ, పిల్లల ముఖాలు చూడగానే ఆశ్చర్యపోయింది. అందరి ముఖాల్లోనూ కొంచెం కోపం, కొంచెం బాధ కనబడుతున్నాయి. ‘‘ఎప్పుడూ లేనిది ఇలా ఉన్నారేమిటి?’’ అనుకుంటూ అదే విషయం పిల్లల్ని అడిగింది.
‘‘అవ్వా! మేం ఎప్పుడైనా అల్లరి చేసామా! అమ్మా నాన్న చెప్పిన మాట వినలేదా! మమ్మల్ని ఏరోజైనా వాళ్లు కోప్పడ్డారా! ఇప్పుడు ఒకేసారి కోప్పడటమే కాదు.. కొట్టారు కూడా’’ ఏడుపు గొంతుతో అందరూ ఒకే విధంగా చెప్పారు.
పిల్లల్ని చూస్తుంటే అవ్వకి కూడా బాధనిపించింది. ‘‘అసలు ఏమయిందర్రా… అసలు విషయం చెప్పండి’’ అడిగింది అవ్వ.
కానీ పిల్లలేమీ మాట్లాడలేదు. వాళ్లని ఎలా దారికి తెచ్చుకోవాలో అవ్వకి బాగా తెలుసు. అందుకే వాళ్లని సముదాయిస్తూనే ‘‘ఏంటో ఈ అమ్మానాన్నలు అనవసరంగా పిల్లల్ని కోప్పడుతుంటారు… ఉండండి వాళ్లను మిమ్మల్ని ఎందుకు కొట్టారో గట్టిగా అడుగుతాను’’ అనటంతో… పిల్లలందరికీ అవ్వ తమవైపే ఉందని అనిపించి ధైర్యంగా జరిగింది చెప్పటం మొదలుపెట్టారు.
‘‘అది కాదు అవ్వా! అమ్మ పనిలో ఉన్నప్పుడు దుకాణం నుండి మాతోటే సరుకులు తెప్పిస్తారు కదా!’’ ‘‘ఈసారి కూడా మేమందరం వెళ్లి అలాగే సరుకులు తెచ్చాము. కానీ ఈసారి ఇచ్చిన డబ్బులు కంటే సరుకులు తక్కువ వచ్చాయట… ఎందుకలా తెచ్చారు? మిగతా డబ్బులు ఏం చేసారని’’ కోపడ్డారు. ‘‘మేమేమీ చేయలేదంటే.. అబద్దం ఆడుతున్నారని, మీరు మా చాటుకు ఏమన్నా కొనుక్కున్నారా?’’ అంటూ కొట్టారు. ‘‘నిజంగా వాటిని మేం ఏమీ చేయలేదు. మొత్తం డబ్బులతో సరుకులే కొన్నాం’’ అంటూ పిల్లలంతా బాధగా చెప్పేసరికి అవ్వ కాసేపు ఆలోచించింది. ‘‘ఇందులో ఏదో తిరకాసు ఉంది’’ అనుకుంది. పిల్లల్ని కాస్త బుజ్జగించి ముందుగా అందరికీ పలహారం పెట్టింది.
‘‘అందరూ నాతో బయలుదేరండి… మనం ఒక చోటుకి వెళ్దాం’’ అంటూ ముందుకు నడిచింది.
అవ్వకు వీళ్లు ఎప్పుడూ సరుకులు తెచ్చే దుకాణం తెలుసు కాబట్టి సరాసరి అక్కడికే తీసుకెళ్లింది. కాస్త దూరంలో ఉండగానే.. దుకాణంలో జరుగుతున్న గొడవను చూసి అక్కడే ఆగిపోయారు.
అక్కడ దుకాణం యజమాని, అతని కొడుకు, ఒక పోలీసు, సరుకులు కొనుక్కోవటానికి వచ్చినతను ఉన్నారు. ఒకరికొకరు గొడవ పడుతున్నారు. అవ్వ పిల్లల్ని అక్కడే ఉండమని.. తాను దుకాణం దగ్గరికి వెళ్ళింది.
‘‘ఏమిటీ… ఏమయ్యింది?’’ ఆరాతీసింది అవ్వ.
‘‘అవ్వా! నువ్వైనా చెప్పు.. నేను ఎప్పుడైనా మా దుకాణంలో మోసం చేసానా? నేను ఇప్పుడే ఊరి నుండి వచ్చాను. రాగానే ఈసారి రావలసిన సరుకుల కంటే బాగా తక్కువ వచ్చాయని గొడవ చేస్తున్నాడు ఇతను.’’ ‘‘అలా ఎందుకు వస్తాయి?’’ అని నేను వాదిస్తే.. ఇటు నుండి వెళుతున్న పోలీసును కూడా పిలిచాడు.’’ అని వాపోయాడు యజమాని. వీళ్లందరి మధ్యలో భయపడుతూ నిల్చున్న యజమాని కొడుకుని గమనించింది అవ్వ.
‘‘ఈ బాబు నీ కొడుకే కదూ’’ అడిగింది అవ్వ.
‘‘అవును… నేను ఊరు నుండి వచ్చేదాకా వీడే చూసుకున్నాడు దుకాణంను’’ అన్నాడు యజమాని.
(మిగతా కథ వచ్చే సంచికలో)
- మాదారపు వాణిశ్రీ
ఫోన్ : 9247286668
బొమ్మలు: కైరం బాబు