చెక్క బొమ్మలాట లేదా కోయ్య బొమ్మలాట తెలంగాణలో పుట్టిన అరుదైన, ప్రాచీనమైన తీగల బొమ్మల కళారూపం. ఇది కేవలం వినోదం మాత్రమే కాకుండా ఒక ఆచార విధానం కూడా. సుమారు 400-500 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ సంప్రదాయం గ్రామ చౌరస్తాలలో, దేవాలయ ప్రాంగణాలలో వెలుగొందేది. రంగులు వేసిన చెక్క బొమ్మలు సంగీతం, కథనం, ప్రతీకాత్మక కదలికలతో పురాణాలు, సామాజిక వ్యంగ్యం, పూర్వీకుల స్మృతులను ప్రదర్శించేవి.
అమ్మాపురం గ్రామంలోని బొమ్మలోలు కుటుంబాలు తోలు బొమ్మలాట, యక్షగానం-వీధి భాగవతం పక్కన ఈ కళను తరతరాలుగా కాపాడుతూ వచ్చాయి. ఒకప్పుడు ఈ మూడు కళారూపాలూ సమానంగా ప్రాచుర్యం పొందినా, కాలక్రమేణా తోలు బొమ్మలాట మరుగునపడింది, యక్షగానం మాత్రం నేటికీ కొనసాగుతోంది. చెక్క బొమ్మలాట మాత్రం అస్తిత్వం కోల్పోతున్న అంచున నిలిచింది. తెలంగాణ అంతటా విస్తరించిన బేఢ బుడిగ జంగం సమాజం కూడా చెక్క బొమ్మలాట ద్వారా మౌఖిక కథా సంప్రదాయాన్ని నిలబెడుతోంది.
ఈ కళారూపానికి ప్రత్యేకత కలిగించే అంశం చెక్క బొమ్మల పరిమాణం. నాలుగు-ఐదు అడుగుల ఎత్తు, 10-15 కిలోల బరువున్న భారీ కలప బొమ్మలు ఇతర ప్రాంతీయ శైలులకు భిన్నమైన ప్రత్యేక వారసత్వాన్ని సూచిస్తున్నాయి. ఒక్కొక్క బొమ్మను కదిలించడం కోసం అపారమైన శక్తి, క్రమశిక్షణ అవసరం.
ఈ వారసత్వాన్ని తన భుజాలపై మోసిన వ్యక్తి మోతే జగన్నాథం. జనగామ జిల్లా నేరేమెట్ట సమీపంలోని అమ్మాపురం గ్రామానికి చెందిన ఆయన చెక్క బొమ్మలాటలో ఐదవ తరం సూత్రధారి. ఆయన కేవలం కళాకారుడు మాత్రమే కాదు, ఒక నడిచే గ్రంథాలయంలా, ఒక యుగాన్నంతా తన గళంలో మోసుకొచ్చినవారు.

తెలుగు విశ్వవిద్యాలయం ఫోక్ ఆర్టిస్ట్ అవార్డు గ్రహీత అయిన జగన్నాథం, ఐదు అడుగుల ఎత్తు, 15 కిలోల బరువున్న బొమ్మలను దేశవ్యాప్తంగా ప్రదర్శించారు. ఆయన బొమ్మలకు దేవతలు, ఋషులు, వీరులు జీవం పొందేవారు. ఆయన ప్రతిభ చెక్క బొమ్మలాటకే పరిమితం కాలేదు. యక్షగానం-వీధి భాగవతం లోనూ తన ముద్ర వేశారు. శాస్త్రీయ రాగాలు, కావ్య సంభాషణలు, భక్తి నృత్యాలను మేళవించి ఆధునిక ప్రేక్షకులను అలరించారు.
జగన్నాథం బృందంలో 10-12 మంది కళాకారులు ఉండేవారు. వారిలో ఎక్కువ మంది 75 ఏళ్లకు పైబడినవారే. ఇద్దరు మహిళలు కూడా తమ ప్రాణం పెట్టి ఈ కళను కొనసాగించారు. ప్రతి ఒక్కరూ గాయకులు, వక్తలు, సంగీతకారులు, బొమ్మల ఆటగాళ్లు. ఒకేసారి బొమ్మలను కదిలిస్తూ, పద్యాలు పాడుతూ, సంగీత లయను పాటిస్తూ ప్రదర్శనలు ఇవ్వడం వారి ప్రత్యేకత.
మొత్తం 16 నాటకాలను 12-16 చెక్క బొమ్మలతో ఆడేవారు. సంభాషణలు, పాటలు అన్నీ మౌఖిక శిక్షణ ద్వారా బృంద సభ్యులకు నేర్పేవారు. జగన్నాథం గళం మైక్ లేకుండా వందలాది మంది ప్రేక్షకులను ఆకట్టుకునేది.
జగన్నాథం కళాకారుడిగా మాత్రమే కాకుండా గురువుగా, దూరదృష్టి కలిగిన సంస్కృతి పోషకుడిగా కూడా గుర్తింపు పొందారు. ఢిల్లీలోని నేషనల్ మిషన్ ఆఫ్ మాన్యుస్క్రిప్టస్ కింద వర్క్షాప్‍లు నిర్వహించారు. విద్యార్థులకు, పరిశోధకులకు సంప్రదాయ కథన శైలిని బోధించారు. గోల్కొండ కోట నేపథ్యంపై ప్రత్యేక ప్రదర్శనలు ఇచ్చి పూర్వ వైభవాన్ని ఆధునిక సమాజానికి అనుసంధానం చేశారు.
2024 డిసెంబర్ 24న 75 ఏళ్ల వయసులో హృదయ సంబంధిత సమస్యలతో జగన్నాథం కన్నుమూశారు. ఆయన మరణం కేవలం ఒక కళాకారుడి ప్రస్థానం ముగిసినట్టే కాదు, చెక్క బొమ్మలాట భవిష్యత్తుకు మలుపు కూడా. కరోనా మహమ్మారి తరువాత అమ్మాపురం బృందంలోని 5-6 మంది మూల కళాకారులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు జగన్నాథం లేకుండా ఈ కళ అంతరించిపోతున్న అంచున నిలిచింది.
చెక్క బొమ్మలాటను కాపాడడం అంటే కేవలం ఒక సంప్రదాయాన్ని నిలబెట్టడం కాదు, తిరిగి స్వాధీనం చేసుకోవడం. ఇది కొత్త తరం చేతుల్లోనే ఉంది. వారు ముందుకు వచ్చి దీన్ని వారసత్వంగా స్వీకరించకపోతే తీగలు శాశ్వతంగా మౌనమైపోతాయి.
అయితే జగన్నాథం చేతుల్లో నాట్యమాడిన ప్రతి తీగలోనూ, ఆయన పాడిన ప్రతి పద్యంలోనూ ఆ సంప్రదాయ ఆత్మ ఇంకా మెదులుతూనే ఉంది. ఆయన కేవలం సంప్రదాయ రక్షకుడు మాత్రమే కాదు, ఆ సంప్రదాయానికి హ•దయం, శ్వాస, ప్రతిధ్వని.
- కట్టా ప్రభాకర్, ఎ : 8106721111