తృణకాంత మణి అంబర్‍

అంబర్‍ ఎంతో విశిష్టతకలిగిన రత్నం. ఇది చెట్టుజిగురు కాలక్రమంలో గట్టిపడి, శిలాజీకరణం చెందటంవల్ల ఏర్పడుతుంది. అందువల్ల ఇది ఖనిజం కాదు. Mineraloid మాత్రమే. రత్నంగా, శిలాజంగా, ఆయుర్వేద ఔషధంగా దీనికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. భూవిజ్ఞానశాస్త్రపరమైన పరిశోధనలకు అనువైన గతాన్ని తనలో భద్రపరచుకున్న విలువైన సాధనం.

దీని భౌతిక లక్షణాలను పరిశీలిస్తే మృదువైన, పెళుసుగా ఉండే గాజువంటి పారదర్శక పదార్థం. తేనెవన్నె పసుపురంగులో ఉంటుంది. తక్కువ కాఠిన్యం (2.5-3) కలిగిన రత్నం అవటంతో ఆభరణాలలో పొదగటానికి సులువుగా ఉంటుంది.
ఈ జిగురు గట్టిపడకముందు అందులో చిక్కుకున్న కీటకాలు, ఇతర జీవులుకూడా ఈ జిగురుతో పాటు కాలక్రమంలో శిలాజాలుగా మారుతాయి.

అంబర్‍ అనేపేరు అరబిక్‍ పదం anbar నుండి వచ్చింది. ఈ పదం నిజానికి వేరొక వస్తువును సూచించేది. అంబర్‍గ్రిస్‍ అనేది స్పెర్మ్ వేల్స్ ద్వారా స్రవించే ఒక మైనపుపదార్థం, దీనిని పరిమళద్రవ్యాలలో ఉపయోగించడం కోసం చాలా విలువైనదిగా పరిగణించే వారు.
తరువాతి కాలంలో అంబర్‍, అంబర్‍గ్రిస్‍ రెండూ విలువైనవిగానూ, తరచూ సముద్రతీరాలలో కనుక ఈ పేరు శిలాజ వృక్షపు బంకకు కూడా వర్తించింది. అంబర్‍గ్రిస్‍ వాడకం తగ్గుముఖం పట్టడంతో, యాంబర్‍ అనే పేరు ప్రధానంగా శిలాజ వృక్షపు జిగురుకు మాత్రమే పరిమితమైంది.

అంబర్‍ ఇతర సాంకేతికపదాలు :
సుచ్చినిట్‍ (Succinite): బాల్టిక్‍ యాంబర్‍ను ప్రత్యేకంగా సూచిస్తుంది, ఇందులో అధికస్థాయిలో సక్సినిక్‍ ఆమ్లం ఉంటుంది.
రెటినైట్‍ (Retinite): సక్సినిక్‍ ఆమ్లం లేని శిలాజ జిగురు.
కోపాల్‍ (Copal): ఇది నిజమైన యాంబర్‍ కంటే చాలా తక్కువ వయస్సుగల, పూర్తిగా శిలాజంగా మారకముందు ఉన్న జిగురు. దీని వయస్సు సాధారణంగా ఒక మిలియన్‍ సంవత్సరాల కంటే తక్కువగా ఉంటుంది. కోపాల్‍ను తరచుగా అగరబత్తుల తయారీకోసం సేకరిస్తారు.
ఎలక్ట్రాన్‍ (Elektron): యాంబర్‍కు ప్రాచీన గ్రీకుపేరు. రాపిడికి గురైనప్పుడు స్టాటిక్‍ విద్యుత్‍ను ఉత్పత్తి చేసే దాని సామర్థ్యం ఆధారంగా ఈ పేరు వచ్చింది.
బెర్న్స్టీన్‍ (Bernstein): యాంబర్‍కు జర్మన్‍ పదం. దీని అర్థం ‘‘మండేరాయి’’. త•ణస్పటికం అని కూడా దీనిని అంటారు.

సంస్కృతంలో ‘తృణ’ అంటే గడ్డి, ‘కాంత’ అంటే ఆకర్షించేది అని అర్థం. ఈ మణికి గడ్డి లేదా చిన్న వస్తువులను ఆకర్షించే లక్షణం ఉండడం వల్ల అంబర్‍కు ‘తృణకాంతమణి’ అనే పేరు వచ్చింది.
ఆయుర్వేద గ్రంథాలలో తృణకాంత మణిని ‘ఉపరత్న’ వర్గంలో చేర్చారు. ఇది గుండెకు బలాన్నిచ్చే (హృద్య), ఇంద్రియాలను ప్రశాంతపరిచే (ఇంద్రియ ప్రసాదన), రక్తస్రావాన్ని అరికట్టే (రక్తస్తంభక) గుణాలను కలిగి ఉంటుంది. ముఖ్యంగా, రక్తస్రావానికి సంబంధించిన వ్యాధులలో (రక్త అతిసార, రక్తార్ష), అధిక రక్తస్రావం అయ్యే రుతుస్రావ సమస్యలలో (అత్యర్తవ) దీనిని ఔషధంగా ఉపయోగిస్తారు.
బౌద్ధ సాహిత్యంలో:
క్రీ.శ. 2వ శతాబ్దానికి చెందిన బౌద్ధ గ్రంథం మహాప్రజ్ఞాపార మితశాస్త్రంలో తృణమణి గురించి ప్రస్తావన ఉంది. ఇందులో బౌద్ధుడి మహిమవల్ల ఈ రత్నం ద్వారా విశ్వాన్ని మార్చగల సామర్థ్యం గురించి ప్రస్తావించారు.

రసశాస్త్రంలో:
ఆయుర్వేదంలోని రసశాస్త్ర విభాగంలో తృణకాంత మణిని శుద్ధిచేసి (శోధన) ‘తృణకాంతమణి పిష్టి’ అనే ఔషధం తయారు చేస్తారు.
రసశాస్త్ర గ్రంథాల ప్రకారం:
‘‘తృణగ్రహీతి తస్య చ యతః తృణం ఆకర్షతి’’ అని పేర్కొనబడింది.
తృణకాంత మణిని పట్టువస్త్రంతో రుద్దినప్పుడు చిన్న గడ్డిపోచలు, కాగితపుముక్కలు వంటివాటిని ఆకర్షిస్తుంది.
సంస్కృత గ్రంథాలలో దీనికి తృణకాంత, తృణగ్రాహి, వంటి పర్యాయపదాలు ఉన్నాయి. కహరుబా కూడా గడ్డిని ఆకర్షించేది అనే అర్థంకల పర్షియన్‍ పదం.

అంబర్‍ శిలాజాలు:
రాళ్లలో దొరికే సాధారణ శిలాజాలతో పోలిస్తే, అంబర్‍లో లభించే శిలాజాలకు కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. అవి చాలా అరుదైన ప్రాచీనకాలంనాటి జీవాలను చెక్కుచెదరకుండా వాటి మృదువైన కణజాలం, రంగు ఇతర సహజ లక్షణాలను పదిలంగా భద్రపరుస్తాయి.
సాధారణ శిలాజాల్లో, కేవలం ఎముకలు లేదా గట్టి భాగాలు మాత్రమే రాయిగా మారతాయి. కానీ అంబర్‍లో కీటకాల రెక్కలు, కేశాలు లేదా ఈకలులాంటి సున్నితమైన భాగాలు కూడా చక్కగా భద్రపరచబడతాయి.
వివరాల సంరక్షణ:
అంబర్‍, పురాతన జీవుల సూక్ష్మ వివరాలను వాటి రంగుతో సహా సంరక్షిస్తుంది. దీని వల్ల పరిశోధకులకు ఇవి చాలా
ఉపయోగపడుతాయి. అంబర్‍ శిలాజాలు కొన్నిసార్లు ఒక క్షణకాలపు జీవనదృశ్యాలను (Snapshots) శాశ్వతం చేస్తాయి. ఉదాహరణకు, ఒక సాలెపురుగు తన గూడు అల్లుతుండగా, లేదా ఒక కీటకం ఒక పువ్వుపై వాలుతుండగా శిలాజంగా మారి ,ఉండవచ్చు. ఈ రకమైన ఆనవాళ్లు శిలాజాల రికార్డుల్లో చాలా అరుదుగా లభిస్తాయి.

చెట్లజిగురులో చిక్కుకునే అవకాశం ఎక్కువగా ఉన్న చిన్నజీవులు అంబర్‍లో కనిపిస్తాయి. వీటిలో కీటకాలు, సాలె పురుగులు, పురుగులు, పుట్టగొడుగులు మరియు అప్పుడప్పుడు బల్లి, చిన్నపక్షిఈకలు వంటివి కూడా ఉంటాయి.
జురాసిక్‍ పార్క్:
అంబర్‍లో నిక్షేపితమైన జీవి, దానిచుట్టూ ఉన్న ఆక్సిజన్‍ రహిత వాతావరణం కారణంగా కుళ్ళిపోకుండా నిరోధించ బడుతుంది. అయినప్పటికీ, జురాసిక్‍ పార్క్ సినిమాలో చూపించినట్లుగా, అంబర్‍ శిలాజాలలో భద్రపరచబడిన డిఎన్‍ఏ కాలక్రమేణా క్షీణించిపోతుంది. కాబట్టి ఆ జీవులను క్లోనింగ్‍ చేయడం అసాధ్యం. అంబర్‍లో కొన్ని అరుదైన, ప్రత్యేకమైన శిలాజాలు లభించాయి.
ప్రత్యేకమైన శిలాజాలు:
సుమారు 99 మిలియన్ల సంవత్సరాలనాటి ఈకలతో కూడిన డైనోసార్‍ తోక ఒకటి మయన్మార్‍లో దొరికిన అంబర్‍లో కనుగొనబడింది. దీనివల్ల చాలా డైనోసార్లకు పక్షివలె ఈకలు ఉండేవని తెలిసింది. 99 మిలియన్ల సంవత్సరాల రెక్కలున్న ఒక పక్షిశిలాజం చాలా అద్భుతమైన వివరాలతో అంబర్‍లో లభించింది.
అంబర్‍లో దొరికిన అత్యంత అరుదైన జీవులలో చేపపిల్ల, అమ్మోనైట్లు ఉన్నాయి. ఇవి సముద్రపు జీవులు కాబట్టి, సముద్రానికి దగ్గరగా ఉన్న అడవిలో చెట్టుజిగురు వాటిపై పడి ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
100 మిలియన్ల సంవత్సరాల క్రితం ఒక సాలీడు కందిరీగపై దాడి చేస్తూ, రెండూ జిగురులో చిక్కుకుపోయాయి. ఈ శిలాజం సహజచరిత్రలోని ఒక నిర్దిష్టక్షణాన్ని అద్భుతంగా భద్రపరిచింది.

దాదాపు 35 మిలియన్ల సంవత్సరాల పురాతనమైన ఒక మాంసాహారమొక్క ఆకులు అంబర్‍లో కనుగొనబడ్డాయి. 20 మిలియన్ల సంవత్సరాల క్రితం, ఒక పేనులో ప్లేగువ్యాధికి సంబంధించిన ప్రాచీన బ్యాక్టీరియా లభించింది. డొమినికన్‍ అంబర్‍లో సుమారు 15-20 మిలియన్ల సంవత్సరాలనాటి అంతరించిపోయిన జాతికి చెందిన ఒక గెక్కోశిలాజం లభించింది. 100 మిలియన్ల సంవత్సరాల క్రితం, ఒక కీటకం తన గుడ్లను సంరక్షిస్తున్న ద•శ్యం అంబర్‍లో లభించింది.
అంబర్‍ లభ్యత:
బాల్టిక్‍ ప్రాంతం:

ప్రపంచంలో లభించే అంబర్‍లో 90% వరకు ఈ ప్రాంతం నుండి వస్తుంది. రష్యా (కాలినింగ్‍గ్రాడ్‍), పోలాండ్‍, లిథువేనియా, లాట్వియా మరియు ఎస్టోనియాలో దొరుకుతుంది.
ఇది సుమారు 44-54 మిలియన్‍ సంవత్సరాలనాటిది, ఇందులో సుసినిక్‍ ఆమ్లం ఉంటుంది కాబట్టి సుసినిటైట్‍ అని అంటారు. దీనిలో అనేక రంగులు ఉంటాయి. పోలాండ్‍లోని గ్డాన్సక్, ‘‘అంబర్‍ క్యాపిటల్‍ ఆఫ్‍ ది వరల్డ్’’గా ప్రసిద్ధి చెందింది.
డొమినికన్‍ రిపబ్లిక్‍:
ఇక్కడ లభించే అంబర్‍ దాని అసాధారణ స్పష్టత మరియు అరుదైన నీలిరంగుకు ప్రసిద్ధి చెందింది. ఇది సుమారు 15-20 మిలియన్‍ సంవత్సరాల నాటిది. ఇందులో కీటకాల, ఇతరజీవుల శిలాజాలు ఉంటాయి.
మయన్మార్‍ (బర్మా):
ఇక్కడి అంబర్‍ను ‘‘బర్‍మైట్‍’’ అని అంటారు.
భారత దేశం:
గుజరాత్‍ రాష్ట్రంలో లిగ్నైట్‍ గనుల్లో అంబర్‍ దొరికింది.

ఉపయోగాలు:
అంబర్‍ లోని జీవుల అవశేషాలు పరిశోధనకోసం ఉపయోగ పడుతాయి. నగలు అలంకార సామాగ్రిలో ఉపయోగిస్తారు. ఆయుర్వేద ఔషధంగా దీనికి ఉపయోగాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక ఉపయోగాలు కూడా ఉన్నాయి. అంబర్‍ను పరిమళ ద్రవ్యాల తయారీలో ఇంకా జ్వలనశీల పదార్థంగా ఉపయోగిస్తారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *