గాంధీ మహాత్ముడు బయలుదేరగా…

పత్రికలు అపుడపుడే ప్రాచుర్యంలోకి వస్తున్న రోజులవి! దక్షిణాఫ్రికా కూడా భారతదేశంలాగా బ్రిటీష్‍ పాలనలో చిక్కుబడి పోయింది. ఒక బడుగు నిరాయుధుడైన భారతీయుడు దక్షిణాఫ్రికా వలస భారతీయుల కష్టాలను కడతేర్చాడనే విషయాలు కథలు, గాథలుగా ఈ నేల వినిపించ నారంభించినాయి! పురాణ కథలతో పులకితమయ్యే ఈ సమాజం, వేర్వేరు భాషలు మాట్లాడినా సహజ స్పందనలలో మాత్రం ఒకేలా నినదిస్తుంది. ఆర్థికంగా అంతంత మాత్రంగా సాగే జీవితంలో, ఎటువంటి పోరాట సామగ్రి లేకుండా సాధించిన దక్షిణాఫ్రికా మహావిజయం గురించి తెలిసి ఆ నాయకుడిని ఆ మహావిష్ణువుగా భావన చేయడంలో ఎంత మాత్రం ఆశ్చర్యంలేదు!

1914 జూలై 18న గాంధీజీ దక్షిణాఫ్రికా విజయచరితను లిఖించడం పూర్తి చేసుకుని ఆ ప్రజలకు వీడ్కోలు పలికారు. అక్కడి నుండి నేరుగా లండన్‍ వెళ్ళి, చికిత్స పొందుతున్న తన గురువు గోపాలకృష్ణ గోఖలే (9 మార్చి 1866-19 ఫిబ్రవరి 1915) ను కలసి, అదే సంవత్సరం డిసెంబరు 19న అక్కడి నుండి మన దేశం వైపు పయన మయ్యారు. 1915 జనవరి 9న ఓడలో గాంధీజీ బొంబాయి చేరారు. అదే సం।। మే మాసంలో అహమ్మదాబాదు దగ్గర కొచ్రాబ్‍ సత్యాగ్రహ ఆశ్రమాన్ని ప్రారంభించారు. గోఖలే సలహాననుసరించి భారతదేశమంతటా రైలు మూడవ తరగతి బోగీలో సుమారు ఒక సంవత్సరంపాటు పర్యటించి, గాంధీజీ ఈ ప్రజలనూ, వారి తీరునూ అధ్యయనం చేశారు. అదే సమయంలో ఆయనను ఈ భారతీయ సమాజానికి పరిచయం చేసినట్టయ్యింది కూడా. భాష తెలియని చోట, అంచనాలు ఎక్కువయిన వేళ పురాణ సాదృశ్యమైన భావాలు విరివిగా రెక్కలు విప్పడం సహజమే! కనుక ఈ కారణంగా కూడా ఉత్తరాది కన్నా దక్షిణాదిలో గాంధీజీ ప్రభావం ఎక్కువని సూత్రీకరించినా మనం ఆశ్యర్య పడనక్కర లేదు! లేకపోతే భరత ఖండపు పశ్చిమతీరపు ఉత్తర కొస మనిషి శాంతీ, అహింసల మురళీనాదానికి, ఇటు దక్షిణతీరపు దక్షిణ కొస ప్రజల మనసులు ఎలా మేళవించి బృందగానం చేస్తాయి?

1915లో సబర్మతి ఆశ్రమంలో ఒక సంఘటన జరిగింది. నెల్లూరుకు దగ్గరలో ఉన్న పల్లిపాడు గ్రామ నివాసి, గోఖలే స్థాపించిన ‘సర్వెంట్స్ ఆఫ్‍ ఇండియా’ సభ్యులు అయిన చతుర్వేదుల వెంకట కృష్ణయ్య అతివాదులైన బాలగంగాధర తిలక్‍, ఆయన తెలుగు ప్రాంతపు అనుచరులు వెన్నెలకంటి రాఘవయ్య మొదలైనవారితో ప్రగాఢమైన అనుబంధం కలిగి ఉన్నారు. పోరాటశీలి పొణకా కనకమ్మ బ్రిటీషు పోలీసుల కన్నుగప్పి, తమ మందుగుండు సామగ్రి దాచుకోవడానికి 14 ఎకరాల భూమిని పల్లిపాడులో పినాకిని (పెన్నానది) ఒడ్డున కొన్నారు. కలకత్తాకు దగ్గర గంగానది ఒడ్డున ఉన్న మణిక్‍ టోలా గార్డెన్‍ సంగతులు అప్పట్లో సంచలనం రేపాయి. ఈ విషయమే పొనకా కనకమ్మను ప్రేరేపించాయని అంటారు. అయితే బ్రిటిష్‍ పోలీసుల దాడి బాగా పెరిగినపుడు, వెంకట కృష్ణయ్య ఈ తీవ్రవాద కలాపాలు తగ్గించి 1915లో పూనా వెళ్ళిపోయారు. అప్పుడు గోఖలే ‘సర్వెంట్స్ ఆఫ్‍ ఇండియా సొసైటీ’ సభ్యుడైన దిగుమర్తి హనుమంతరావును వెంకట కృష్ణయ్య అనుకోకుండా కలిశారు. పిమ్మట గాంధీజీ కార్యక్రమాల పట్ల ఆకర్షితులై సి.వి. కృష్ణయ్య సబర్మతీ ఆశ్రమంలో చేరారు. ఆ సమయంలో మళ్ళీ తనకు తెలిసిన ప్రకృతి వైద్య నిపుణులైన దిగుమర్తి హనుమంతరావును అక్కడ కలిశారు. దాంతో వారి మిత్రత్వం బలపడింది. ప్రఖ్యాత చిత్రకారుడు దామెర్ల రామారావు చెల్లెలు బుచ్చి కృష్ణవేణమ్మను అప్పటికే హనుమంతరావు వివాహం చేసుకుని ఉన్నారు. ఆమె కూడా సబర్మతి ఆశ్రమంలో ఉన్నారు.

మరొకవైపు నెల్లూరు ప్రాంతం పొట్లపూడి గ్రామానికి చెందిన పొణకా కనకమ్మ 1918లో మద్రాసులో రాజగోపాలా చారి ఇంట్లో గాంధీజీని కలిసి సత్య, అహింసల పట్ల గౌరవం పెంచుకున్నారు. ఆమె ప్రారంభించిన ‘సుజనరంజని’ సభ కార్యకలా పాలలో కట్టమంచి రామలింగారెడ్డి, రాయప్రోలు సుబ్బారావు, దీపాల పిచ్చయ్య శాస్త్రి, కొమర్రాజు లక్ష్మణరావు, వెన్నెలకంటి రాఘవయ్య, కాశీనాథుని నాగేశ్వరరావు, గాడిచర్ల హరిసర్వోత్తమ రావు వంటి వారు పాల్గొనేవారు. ఈ జాబితాలోని ప్రముఖుల జీవిత కృషిని ఒకసారి పరిశీలించి మననం చేసుకుంటే, ఆ కార్యక్రమాలు ఎంత ఉత్కృష్టమైనవో బోధపడ్తుంది. సి.వి. కృష్ణయ్య, పొణకా కనకమ్మ, దిగుమర్తి హనుమంతరావు, దామెర్ల బుచ్చి కృష్ణవేణమ్మగార్ల కలయిక తెలుగునాట కొత్త చైతన్యానికి సరికొత్త పునాది అయ్యింది.
దిగుమర్తి హనుమంతరావు, కృష్ణవేణమ్మ, చతుర్వేదుల వెంకట కృష్ణయ్య, పొణకా కనకమ్మ సహకారంతో సబర్మతి తర్వాత పినాకిని ఒడ్డున దేశంలో రెండవ గాంధీ ఆశ్రమాన్ని 1921 ఏప్రిల్‍ 7న మహాత్ముడు ప్రారంభించారు. అతివాద కార్యక్రమాల కోసం మొదలైన పల్లెపాడు ఆయుధ కురుక్షేత్రం; సత్యాగ్రహ, అహింసల ఆశ్రయ ఆశ్రమంగా మారింది. అదే ఇపుడు శతాబ్దపు చరిత్ర కలిగిన పల్లెపాడు ‘పినాకిని సత్యాగ్రహ ఆశ్రమం’గా పేరుగాంచింది. ఈ ఆశ్రమాన్ని ప్రారంభించడానికి గాంధీజీ కోరికను అనుసరించి అంటరానితనాన్ని నిష్ఠగా పాటించే పల్లిపాడు బ్రాహ్మణులు తమ వీధుల గుండా హరిజనులతో ఊరేగారు. తర్వాతనే ఆశ్రమాన్ని గాంధీజీ ప్రారంభించారు. కనుక పల్లిపాడు పినాకిని ఆశ్రమం కారణంగా నెల్లూరును తెలుగు ప్రాంతాలలో గాంధేయ తత్వానికి, ఆచరణకు ఒక ముఖద్వారంగా పరిగణించాలి.

1915లో తొలిసారి, 1919 మరియు 1920 సంవత్సరాలలో ఒక్కోసారి చొప్పున రైలు ప్రయాణం చేస్తూ మార్గమధ్యంగా తెలుగు ప్రాంతాలను సందర్శించారు. కాగా 1921లో రెండుసార్లు 1929, 1933, 1934, 1946 సంవత్సరాలలో ఒక్కోసారి పర్యటనల మీద వచ్చారు. పదిరోజులు, పద్నాలుగు రోజులు ఇలా పరిశీలిస్తే మొత్తం 90-100 రోజులు గాంధీజీ మూడు దశాబ్దాల కాలవ్యవధిలో తెలుగు ప్రాంతంలో నివసించారు. మరోవైపు 1885 తొలి కాంగ్రెస్‍ సమావేశానికి అనంతపురం జిల్లా గుత్తి కేశవ పిళ్లై కూడా హాజరయ్యారు. 1905లోనే బిపిన్‍ చంద్రపాల్‍ రాజమండ్రి పర్యటనకు వస్తే గాడిచర్ల హరిసర్వోత్తమరావు ఆయన ప్రసంగాన్ని అనువదించారు. కనుక గాంధీజీ 1915లో భారతదేశానికి తిరిగి రాకమునుపే ఇక్కడి ప్రజానీకం స్పందించడం ప్రారంభించింది.
1910లో ‘ఆంధ్రభారతి’ పత్రికలో భోగరాజు పట్టాభి సీతారామయ్య, ‘మోహన్‍ దాస్‍ కరంచంద్‍ గాంధీ’ పేరుతో ఆయన దక్షిణాఫ్రికా విజయాలనూ, పోరాట విధానాన్ని, నిర్మాణాత్మక వైఖరిని వివరించారు. 1914లో ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచికలో కాశీనాథుని నాగేశ్వరరావు ‘గాంధీగారి త్యాగము’ అనే వ్యాసం, రాయప్రోలు సుబ్బారావు రాసిన ‘భగవాన్‍ మోహన్‍ దాస్‍ కరుణాసాంద్ర గాంధీ’ పేరిట రాసిన వ్యాసం కనబడతాయి. ‘ఆంధ్రపత్రిక’ 1914లోనే బొంబాయి నుంచి మద్రాసుకు తరలి వచ్చింది. గరిమెళ్ళ సత్యగోదావరి శర్మ రాసిన ‘సత్యాగ్రహం’ తొలి కవితా ఖండిక కూడా ‘ఆంధ్రపత్రిక’ ఉగాది సంచికలోనే వెలువడింది. 1916లో వావిళ్ళ వారు ప్రచురించిన ‘మోహన్‍ దాస్‍ కరంచంద్‍ గాంధీ’ గ్రంథాన్ని ఎస్‍.వి. రంగాచార్యులు, అదే సంవత్సరం బొడ్డపాటి శేషగిరిరావు గాంధీజీ గురించి మరో జీవిత చరిత్రను రాశారు. మళ్ళీ 1920లో పి. నరసింహారావు, 1921లో మానికొండ సత్యనారాయణ శాస్త్రి, ఇంకా ఆత్మకూరు గోవిందాచార్యులు గాంధీజీ జీవిత చరిత్రలను రాశారు. కనుక వార్తాపత్రికల ద్వారా మాత్రమే కాక, నోటిమాటగా చేరిన సమాచారంతో గాంధీజీ ప్రభావం ఈ నేల మీద బాగా పడింది.
1920లో కలకత్తా నుంచి మద్రాసు వెళ్ళడం, మళ్ళీ బొంబాయి తిరిగి వెళ్ళడంతో మార్గమధ్యంలోనూ రైలు మారినపుడు కొందరు నాయకులు, ఎందరో ప్రజలు గాంధీజీని కలిసే వారు. 1921 మార్చి-ఏప్రిల్‍ మాసాలలో బెజవాడ కాంగ్రెస్‍ సభల కారణంగా దాదాపు రెండు వారాల పాటు మన తెలుగు తీరప్రాంతాలలో పర్యటించారు. మళ్ళీ 1921 సెప్టెంబరులో మరో రెండు వారాలపాటు బళ్ళారి, కడప, అనంతపురం, తిరుపతి ప్రాంతాలలో పర్యటించారు. 1925, 1927 సంవత్సరాలలో రెండుసార్లు రైలు ప్రయాణం చేస్తూ కొందరు ప్రజలను రైలుస్టేషన్లలో కలిశారు. తర్వాత 1929 ఏప్రిల్‍లో ఒక వారం పాటు హైదరాబాదు, విజయవాడలలో ఉన్నారు.

విదేశీ వస్త్ర బహిష్కరణ, సహాయ నిరాకరణ ఉద్యమాలు తారస్థాయిలో ఉండగా, 1922 ఫిబ్రవరి 4న చౌరీచోరాలో అల్లర్లు పెద్ద ఎత్తున జరిగి ఆ ప్రాంతం రక్తసిక్తమైంది. దాంతో హింసను ఎంత మాత్రమూ నచ్చని గాంధీజీ, అది మరింత ప్రజ్వరిల్లితే ఇంకా వినాశనమని తలంచి ఉద్యమాన్ని పూర్తిగా ఆపివేయడం చరిత్ర! ఈ చర్యలోని అంతఃసూత్రానికీ 1925 ఫిబ్రవరి 4న రాజమండ్రికి 25 కి.మీ. దూరంలో ఉండే సీతానగరంలో జరిగిన ‘గౌతమి సత్యాగ్రహ ఆశ్రమం’ ప్రారంభానికి సంబంధం ఉంది. అహింసాత్మకంగా మన జీవితాన్ని, ఉద్యమాన్ని ఎలా మలచు కోవాలనే రీతిని తెలియజెప్పడానికి ఈ గౌతమీ ‘సత్యాగ్రహాశ్రమం’ మొదలైంది.
అల్లూరి సీతారామరాజు సహాధ్యాయి మద్దూరి అన్నపూర్ణయ్య, బ్రహ్మ జోశ్యుల సుబ్రహ్మణ్యం, క్రొవ్విడి లింగరాజు, ధరణిప్రగడ శేషగిరిరావు, చందుపట్ల హనుమంతరావు, మానాప్రగడ వెంకట్రావు, రామచంద్రుని వెంకటప్ప మొదలైన వారితో చరిత్ర సృష్టింప చేసిన ఈ ఆశ్రమాన్ని బులుసు సాంబమూర్తి ప్రారంభించారు. ఈ ఆశ్రమం నుంచి అన్నపూర్ణయ్య ‘కాంగ్రెస్‍’ పత్రికను వెలువరించారు. అల్లూరి సీతారామరాజును బ్రిటీషు వారు చంపిన తీరును వివరిస్తూ ఈ పత్రిక 1927 జూలై 16న ప్రత్యేక సంచికను ప్రచురించింది. గాంధీజీ ఉద్యమం అన్ని రకాల ప్రజలను అంతర్భాగం చేస్తూ, వారి జీవనవిధానం మెరుగయ్యే కార్యక్రమాలతో కలసి సాగింది. కనుక అది ఏ ఒక వర్గానికో పరిమితం కాలేదు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *