(గత సంచిక తరువాయి)
(జరిగిన కథ: స్కూల్ పిల్లలకు హోమ్ థియేటర్లో ‘‘స్వచ్ఛ భారత్’’కు సంబంధించిన సినిమా చూపిస్తుంది అవ్వ)
సినిమా మొత్తం అయిపోగానే పిల్లలకు విడిదిలో చేసిన తీయటి బిస్కట్లు కాగితం ప్లేట్లలో పంచి పెట్టింది. వాళ్ళందరూ ఏదో ఆలోచనలోపడటం గమనించింది అవ్వ.
బయటికి వచ్చాక అందరూ ఆ బిస్కెట్లు తిన్నారు. కొంత మంది పిల్లలు ఎప్పటిలా ఖాళీ పేపర్లు వరండాలో పడేయ బోయారు. కొంచెం పెద్ద పిల్లలు వాళ్లను ఆపారు. ‘‘ఈసినిమా చూశాక ఎందుకో అలా పడేయాలనిపించడం లేదురా… బద్దకంతో ఎక్కడ పడేస్తే ఏముంది? అనుకున్నాం.. కానీ, ఆరోగ్యం పాడవుతుందని తెలియదు కదా మనకు’’ అంటూ వరండాలో
ఉన్న చెత్తబుట్టలోనే అందరితో వేయించారు.
‘‘హమ్మయ్య… ఇలా పిల్లలే కాదు అందరూ ఒకరిని చూసి మరొకరయినా ఈ సందేశాన్ని తెలుసుకొని అంతటా పరిశుభ్రంగా ఉంచితే చాలు’’ అనుకుంది అవ్వ.
× × ×
తెల్లవారి స్కూల్ పిల్లలంతా వెళ్ళిపోయారు. వాళ్ళలో తీసుకొచ్చిన మార్పు చూసి వెళ్లే ముందు టీచర్లు అవ్వ దగ్గరికి వచ్చి ‘‘థాంక్స్ అవ్వా! అప్పుడప్పుడూ మా స్కూల్స్లో కూడా ఇలాంటి సందేశాత్మక చిత్రాలు ప్రదర్శించాలి. మనం మాటల్లో చెప్పిన దానికంటే ఇలా చూపిస్తే త్వరగా అర్థం చేసుకుంటారు పిల్లలు’’ అంటూ అవ్వకు నమస్కరించి వెళ్లిపోయారు.
వాళ్ల మాటలకు అవ్వ కూడా సంతోషించింది. లోపలికి వెళ్ళబోతుండగానే విడిది ముందు ఒక పెద్ద కారు ఆగింది.
కారులో నుండి దిగిన వారిని చూస్తుంటే ఒక గొప్పింటి వ్యక్తులుగా కనిపించారు. వారి ముఖంలో ఏదో సంతృప్తి… ప్రశాంతత కనిపిస్తున్నాయి. విడిదికి ఎవరు వచ్చినా ముందుగా వచ్చిన వారే అవ్వకు నమస్కరిస్తారు. కానీ వీరిని చూడగానే తనకు తెలియకుండానే మొదట అవ్వనే ‘‘నమస్కారం’’ అంటూ పలకరించింది.
అయ్యో… మీరు పెద్దవారు అలా నమస్కరించకూడదు. మీరు దీవించాలి’’ అంటూ తిరిగి నమస్కరించారు.
వాళ్ల ఉన్నత వ్యక్తిత్వాన్ని చూసి మురిసిపోయింది. ‘‘ఎక్కడి నుండి వచ్చారని’’ అడిగింది.
‘‘మేము భువనగిరి నుండి వస్తున్నాము. మేము ప్రతి సంవత్సరం ఒక నాలుగు రోజులు ఇలా ఎటైనా వెళ్లి రిలాక్స్ అవుతాము. ఈ ఆధునిక టెక్నాలజీతో కూడిన వాతావరణం నుండి ఇలాంటి ప్రకృతి సహజమైన వాతావరణంలోకి వస్తుంటాం.
నేను రిటైర్డ్ ప్రభుత్వాధికారిని. తను నా భార్య… వీళ్ళిద్దరూ మా కొడుకు కోడలు. నా చిన్నప్పుడు మా అమ్మానాన్నలు ఎటు వెళ్ళినా పూటకూళ్ళవ్వ ఇంటికి తీసుకెళ్లేవారు. మళ్లీ అలాంటివి ఏమైనా ఇప్పుడు ఉన్నాయా అని హనుమకొండలో ఉన్న మా ఫ్రెండ్ను అడిగితే మీ అడ్రస్ చెప్పారు. కానీ అప్పుడు పూటకూళ్ళవ్వ ఇల్లు అని రాసి ఉండేది. అదీ గాక చిన్న రూములతో ఒక గుడిసె లాగా ఉండేది. మీది మాత్రం పరిసరాలు సహజంగా ఉన్నా… వసతులు చూస్తుంటే ఆధునికంగా కనబడుతున్నాయి. ఇంత చిన్న ఊరిలో ఇది ఎలా సాధ్యమయ్యింది?’’ అంటూ అడిగాడు.
‘‘ముందు మీరు ఫ్రెష్ అయి రండి బాబూ.. అన్నీ తరువాత మాట్లాడుకుందాం’’ అంది అవ్వ.
‘‘పరవాలేదు మేము దారిలో హనుమకొండలోని ‘‘అశోక’’ హోటల్కి వెళ్లే వచ్చాము. అలసట కూడా తీరింది. మీరు మీ విడిది వివరాలు చెప్పండి’’ అన్నారు.

అవ్వ తన విషయాలు చెప్పసాగింది… ‘‘ముందు మాది కూడా చిన్న గుడిసె లాగానే ఉండేది బాబూ… వసతి మామూలుగా ఉన్నా ఆహారం రుచిగా శుభ్రంగా ఉంటుందని ఎక్కువ మంది రావడం మొదలైంది. అప్పుడు వాళ్ళకు తోచినంత డబ్బులే ఇవ్వమనేదాన్ని. మా గుడిసెలోపల చిన్నగా దేవుని గది కూడా ఉండేది. మేము రోజూ ఒక నైవేద్యం చేసి పెట్టే వాళ్ళం. దానిని ప్రసాదంగా అందరికీ పంచిపెట్టే వాళ్ళం. వచ్చిన వాళ్లలో కొంతమంది భక్తితో దేవుడి దగ్గర కొంత డబ్బు పెట్టి వెళ్లేవారు. దేవుడికి సమర్పించుకునే వాళ్లను నేను వద్దనలేకపోయాను. అందుకని పక్కన చిన్న డబ్బా హుండీ లాగా పెట్టాను. అయితే విడిదిలో ఉన్నందుకు ఇచ్చే డబ్బులు నేను వాడుకున్నా… హుండీలో వేసేవి ప్రజల సేవకే ఉపయోగించాలి అనుకున్నాను. అలా నా దగ్గరివి కొన్ని, హుండీలోవి కలిపితే అందరికీ కావాల్సిన వసతులతో ఇలా ఇది మెల్లమెల్లగా అభివృద్ధి చెందింది’’ వివరించింది అవ్వ.
ఇంతలోనే కొడుకు అడిగాడు.. ‘‘మరి దీనికి విడిది అని ఎందుకు పేరు పెట్టారు’’ అని.
‘‘పూటకూళ్ళవ్వ ఇల్లు’’ అంటే ఇప్పటి తరానికి నా ఇల్లే అని కూడా అనుకునే అవకాశం ఉందని… విడిది అంటే ఎవరైనా రావచ్చు కదా అని ఒక కారణం, కొంచెం కొత్తగా ఉంటుందని మరో కారణం… అందుకే అలా పెట్టాను’’ అంది అవ్వ.
‘‘ఇంతకీ నీ పేరేంటి అవ్వా’’ అడిగింది కోడలు.
‘‘రుద్రమ’’ అని చెప్పింది అవ్వ.
అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు ఆ పేరు విని.
అది గమనించి చిన్నప్పటి నుండి నేను ధైర్యంగా ఉండేదానినట. పుట్టినప్పుడు దేవుళ్ళ పేర్లు పెట్టినా… స్కూళ్లో వేసేటప్పుడు రుద్రమగా మార్చారట. మన ‘‘కాకతీయ సామ్రాజ్ఞి’’ అంత గొప్ప పేరు తెచ్చుకోవాలని అనేవారు. నాలో అంత పౌరుషం లేకపోయినా ప్రజల కోసం పాటుపడ్డ తన లాంటి మంచి గుణం ఉంటే చాలు అనుకునే దాన్ని నేను’’ అంటూ నవ్వింది అవ్వ.
‘‘నువ్వు ఎంతవరకు చదువు కున్నావు అవ్వా?’’ తండ్రి కొడుకులిద్దరూ ఒకేసారి అడిగారు.
‘‘ఆరవ తరగతి వరకు’’ అంది అవ్వ.
మరి అంత వరకే చదువుకున్నా… బాగా చదువుకున్న వ్యక్తిలా… ఇంత బాగా ఎలా మాట్లాడగలుగుతున్నావు?’’ ఆశ్చర్యంగా అడిగింది కోడలు.
‘‘ఇన్నేళ్ల నుండి విడిదికి అనేక రకాల వ్యక్తులు వస్తున్నారు కదమ్మా! అందరితో మాట్లాడి ఇలా అలవాటయిపోయింది’’ నవ్వుతూనే సమాధానం ఇచ్చింది అవ్వ.
‘‘సరే సరే నాలుగు రోజులు ఇక్కడే ఉంటారు అన్నారుగా! మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. భోజనాల సమయమైంది పదండి’’ అని అవ్వ అనగానే… అందరూ అక్కడి నుండి లేచారు.
(మిగతా కథ వచ్చే సంచికలో)
- మాదారపు వాణిశ్రీ
ఫోన్ : 9247286668
బొమ్మలు: కైరం బాబు