
సింగరేణిలో మహిళా రెస్క్యూ జట్టు తమ శక్తి సామర్థ్యాలను నిరూపించుకోవాలని, నైపుణ్యం, కృషి, అంకితభావంతో ఉత్తమ సేవలు అందించాలని సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ పిలుపునిచ్చారు. 136 ఏళ్ల సింగరేణి చరిత్రలో తొలిసారిగా రెస్క్యూలో శిక్షణ పొందిన మహిళా జట్టును ఆయన హైదరాబాద్ సింగరేణి భవన్లో జులై 5న అభినందించి, సర్టిఫికేట్లు ప్రదానం చేశారు.
సింగరేణిలో మొదటి మహిళా రెస్క్యూ జట్టును ఏర్పరచడం, ప్రత్యేక శిక్షణ ఇవ్వడం సంతోషకరంగా ఉందన్నారు. ప్రమాదాల సమయాల్లో, సేవా కార్యక్రమాల్లో మహిళా రెస్క్యూ జట్టు తన శక్తి సామర్థ్యాలు నిరూపించుకోవాలన్నారు. త్వరలో జాతీయస్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో జరిగే రెస్క్యూ పోటీలలో కూడా పాల్గొని సింగరేణికి మంచి పేరు తేవాలని తన శుభాకాంక్షలు తెలియ జేశారు.
సింగరేణి రెస్క్యూ బృందాలు ఇటీవల శ్రీశైలం ప్రమాద సమయంలోనూ, హైదరాబాద్ పాశమైలారం అగ్ని ప్రమాద దుర్ఘటనలో, తమిళనాడులో జరిగిన ప్రమాదంలోనూ తమ విశిష్ట సేవలను అందించి అందరి ప్రశంసలు అందుకున్నారన్నారు. రాష్ట్ర, కేంద్ర విపత్తు ప్రతి స్పందన బ•ందాలకు సింగరేణి రెస్క్యూ స్టేషన్లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు వెల్లడించారు.
సింగరేణి రెస్క్యూను బలోపేతం చేయడానికి అత్యాధునిక సహాయ పరికరాలను సమకూర్చినట్లు తెలిపారు. అదే సమయంలో రామగుండం-2 ఏరియాలో ఉన్న మైన్స్ రెస్క్యూ స్టేషన్ను రెస్క్యూ లో ప్రపంచ స్థాయి శిక్షణ కేంద్రంగా తీర్చిదిద్దబోతున్నట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా జీఎం (రెస్క్యూ) శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ సీఎండీ ఎన్.బలరామ్ ఆదేశంతోనే సింగరేణిలో తొలిసారిగా మహిళా జట్టుకు 13 మంది మహిళా అధికారులను ఎంపిక చేసి 14 రోజుల పాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చామని, అన్ని రకాల శిక్షణలలో మగవారికి ఏ మాత్రం తీసి పోకుండా మహిళా అధికారులు తమ శక్తి సామర్థ్యాలను చాటారని చెప్పారు. త్వరలోనే మరో రెస్క్యూ పోటీలకు మహిళా జట్టును కూడా తయారు చేయడం జరుగుతుందని తెలియజేశారు.
ఈ అభినందన కార్యక్రమంలో డైరెక్టర్ ప్రాజెక్టస్ అండ్ ప్లానింగ్ కె. వెంకటేశ్వర్లు, డైరెక్టర్ పా గౌతమ్ పొట్రు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూమెంట్ ఎస్.డి.ఎం సుభాని, హెచ్ఓడీ (మార్కెటింగ్) టి.శ్రీనివాస్ పాల్గొన్నారు. మహిళా రెస్క్యూ సిబ్బందికి శిక్షణ ఇచ్చిన రెస్క్యూ శిక్షకులు తిరుపతి, కిషన్ రావు, సందీప్, సాజిద్ అలీకు ఈ సందర్భంగా ప్రశంసా పత్రం అందజేశారు.
-చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్
ది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ప్రభుత్వ సంస్థ)
ప్రజా సంబంధాల విభాగం, హైదరాబాద్.