చరిత్రలో చందుపట్ల – విద్దేశ్వరాలయం

కళ్యాణీచాళుక్యులు కొలనుపాక(ఉప)రాజధానిగా క్రీ.శ.973 నుండి రెండవతైలపుని నుండి క్రీ.శ.1156 రెండవ జగదేకమల్లుని వరకు పరిపాలించారు. ఆ తర్వాత కూడా కళ్యాణీచాళుక్యులు కొంతకాలం పాలకులుగా వున్నప్పటికీ అది గణనీయం కాదు. కళ్యాణీచాళుక్య చక్రవర్తి త్రిభువనమల్లుడు(1076-1126) భువనగిరిపై గొప్పదుర్గాన్ని నిర్మింపజేసాడు. అతని తర్వాత కుమారసోమేశ్వరుడు లేదా భూలోకమల్లుడు(1126-1138), రెండవ జగదేకమల్లుడు (1138-1156) చక్రవర్తులైనారు.


భువనగిరిలో త్రిభువనమల్లుని కాలంలో మహాప్రధాన, దండనాయకులుగా తొలుత మల్లచమూపతి తర్వాత అతని సోదరుడు విద్ధమయ్య భువనగిరి దుర్గాధిపతులైనారు. విద్ధమయ్య లేదా విద్ధమరసరు భువనగిరికి సమీపంలోని చందుపట్ల గ్రామంలో విద్దేశ్వరస్వామిపేర శైవాలయాన్ని నిర్మించాడు. దేవాలయం వెనక కోనేరు తవ్వించి దానికి ‘విద్యాధర తీర్థమ’ని పేరుపెట్టాడు. (మొదటి చందుపట్ల) శాసనం (క్రీ.శ.1115 మార్చి 11) వేయించాడు. తర్వాత కాలంలో విద్దేశ్వరాలయ సేవలకు చేసిన భూదానం చేసినట్లు రెండవ చందుపట్లశాసనం(కాలం తెలియదు అది కూడా ఫాల్గుణ మాసం.. పండుగరోజున వేయబడ్డది) తెలియజేస్తున్నది. ఆ శాసనంలో కళ్యాణీచాళుక్యులు హారీతిపుత్రులని, మానవ్యస గోత్రులని, కౌశికీ వరప్రసాదంగా శ్వేతాతపత్రాది రాజ్య చిహ్నాలు పొందినవారని, సప్తమాతృకలచేత పరిరక్షింపబడువారని, కార్తికేయుని వరప్రసాదంగా మయూరపింఛం, కుంతధ్వజం పొందినవారని, భగవంతుడు నారాయణుని ప్రసాదంగా వరాహలాంఛనం కలిగినవారని తెలుపుతూ వారి వంశవృక్షం పేర్కొనబడ్డది. చాళుక్యులు తమను ‘హారీతిపుత్రుల’మని చెప్పుకున్నారు.


విద్ధేశ్వరాలయ శాసనంలోని కొంతభాగం:
‘‘5. …………………………………….. స్వస్తి సమస్త
6.భువన సంస్తూయమాన మానవ్యసగోత్రరు హారీ
7.తిపుత్రరుం కౌశికీవరప్రసాదలబ్ధ శ్వేతాతపత్రాది రా
8.జ్యచిహ్నరుం సప్తమాతృకా పరిరక్షితరుం, కార్తీకేయ
9.వరప్రసాదలబ్ధ మయూరపింఛ కుంతధ్వజరుం భ
10.గవంన్నారాయణ ప్రసాదాసాదితవర వరాహలాంఛనే’’

మానవ్యస గోత్రులు (ఇది బ్రాహ్మణ గోత్రం)గా చెప్పబడిన వీరు క్షత్రియ లక్షణాలున్న బ్రాహ్మణులు. వారు ద్వివర్ణులని జి.పి.భట్‍ (1988) తన గ్రంథంలో రాసారు. వడపర్తి శాసనం (క్రీ.శ.1156) లభించడంతో చాళుక్యులు హారీతిపుత్రులని పేర్కొన్న శాసనాలు యాదగిరి-భువనగిరి జిల్లాలో రెండు లభించినట్లైంది. అది కూడా విద్ధమరసరు వేయించిన శాసనమే కావడం విశేషం. చందుపట్ల, వడపర్తి-రెండు గ్రామాల మధ్య దూరం 20 కి.మీ.లలోపే ఉంది.
విద్ధేశ్వరాలయ శాసనంలో ఆ గుడికి చేసిన భూదాన వివరాలలో ఆలేటికంపణం(40)లోని మొగలిపాక, చంద్రపట్టణం, సోలవీరవెల్లి, పులిగి(ల్ల)డి, భువనగిరి, పొద్దటూరులలోని భూమిని దానమిచ్చినట్లు చెప్పబడ్డది.

‘విద్యాధర తీర్థమ’నే గుడి కోనేరు:
చతురస్రాకారంలో బోర్లించిన పిరమిడ్‍ వలె కనిపించే కోనేటికి రెండువైపుల మెట్లదారులున్నాయి. కోనేటి ప్రహారి గోడ మీద శాసనఫలకం వుంది.
ఆషాఢంలో జరిగే బోనాల పండుగపుడు పోచమ్మను (దుర్గను) ఆ విద్యాధర తీర్థమనే కోనేటికి తెచ్చి స్నానాలాడించి, వడిబియ్యాలు పోసి పండుగ మొదలుపెట్టే సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతున్నదని గ్రామస్తులు చెప్పారు.

ఇటీవల భువనగిరికి వాయవ్యంలో 6కి.మీ.ల దూరంలో వున్న వడపర్తిలో లభించిన కొత్తశాసనాన్ని (క్రీ.శ.1156) మా కొత్త తెలంగాణచరిత్రబ•ందం చదివి పరిష్కరించింది. ఆ శాసనంలో కూడా చాళుక్యులు హారీతిపుత్రులని రాయబడి వుంది. అందులోనూ చాళుక్యుల వంశవృక్షం ఇవ్వబడ్డది. వడపర్తిలో ప్రతిష్టించిన స్వయంభూ కందర్పేశ్వరాలయానికి విద్దమయ్య చేసిన భూదాన ప్రశస్తి ఈ శాసనంలో పేర్కొనబడ్డది.
త్రిభువనమల్లుని కాలంగా (కాదని, జగదేకమల్ల-2 కాలం నాటిదని వడపర్తి శాసనంవల్ల తేలుతున్నది) భావించిన రెండవ చందుపట్ల శాసనం (సంవత్సరం తెలియదు)లో చాళుక్యవంశీయుల వంశవృక్షం చెప్పబడ్డది. కొల్లిపాకనాడులోని భువనగిరి దుర్గాధిపతి మహాప్రధాన, దండనాయకుడు విద్ధమరసరు లేదా విద్ధమయ్య చందుపట్ల (చంద్రపట్టణం)లో విద్ధేశ్వరస్వామిని ప్రతిష్టించి, చేసిన భూదానాలు ప్రస్తావించబడ్డాయి. దాన శాసనాలు సాధారణమే కాని వడపర్తిశాసనం విద్ధమయ్యరసరున్న కాలాన్ని తెలియ జేస్తున్నది. అట్లే చరిత్ర గ్రంథాలలో చెప్పబడి నట్లు క్రీ.శ.1138- 1150కాక ఈ శాసనంవల్ల రెండవ జగదేకమల్లుని రాజ్యకాలం క్రీ.శ.1156 వరకు పెరిగింది. ఈ శాసనం భువనగిరి చరిత్రలో చాళుక్యుల పరిపాలనను గురించి చెప్పిన చివరి శాసనం.


రెండు చందుపట్లశాసనాలు, ఒక వడపర్తి శాసనాల వల్ల క్రీ.శ. 1115 నుండి 1156 వరకు త్రిభువనమల్లుడు, రెండవ జగదేకమల్లుల కాలంలో భువనగిరి దండనాయకుడిగా విద్ధమయ్య వున్నాడని తెలుస్తున్నది.

చందుపట్లలో విద్ధేశ్వరాలయానుకుని చందలారాణి కోసం నిర్మించిన భవనం ప్రహరిగోడలు భువనగిరి కోటగోడల ప్రాకారాన్ని తలపించేవిధంగా వున్నాయి. చందలారాణి భవనం కూలిపోయి వుంది. గోడలు మిగిలాయి.
చందలారాణి కళ్యాణీ చాళుక్య చక్రవర్తికి ప్రియమైన భార్య. చందలాదేవి పేరు మీద నిర్మించిన నగరమే చందుపట్ల అనే ‘చంద్రపట్టణం’. త్రిభువనమల్లునికి 11మంది రాణులు. వారిలొ చందలాదేవి విద్యావంతురాలని, ఆమె కావ్యరచన చేసినట్లు తెలుస్తున్నది. కాని, అవేవీ లభించలేదు. ఆమెకు ‘అభినవ సరస్వతి’ అనే బిరుదున్నది. త్రిభువనమల్లుని కీర్తిస్తూ కాశ్మీరపండితుడు బిల్హణుడు సంస్క•తంలో రాసిన ‘విక్రమాంకదేవచరితం’ ప్రసిద్ధ కావ్యం. బిల్హణుని చరిత్ర కావ్యంగా రచించబడ్డది. దాని పేరు బిల్హణీయం.
విద్ధేశ్వరాలయానికి చాలా పెద్ద దేవాలయ ప్రాంగణం అందులో ప్రధానాలయం, దానికి అనుబంధంగా ఉపాలయాలు చక్కగా నిర్మించారు. దేవాలయ ప్రవేశద్వారానికి లలాటబింబంగా, విద్ధేశ్వరాలయానికి లలాటబింబంగా గజలక్ష్మే చెక్కబడివుంది. గుడికి ఈశాన్యాన కలశాలున్న రెండు ద్వారబంధాలు, రాతిస్తంభాలు, ఇతర శిథిలాలు కోనేటిజాడలు మిగిలివున్నాయి. ఒక్క శిథిల దేవాలయంలో సూర్యుడు, నాగదేవతల విగ్రహాలు మిగిలివున్నాయి. దేవాలయం ప్రాంగణమంతా ముండ్లచెట్లతో నిండిపోయి వుంది.

ఈ గుడి నిర్మాణాన్ని పరిశీలించినపుడు విశాలమైన ప్రాంగణంలో నిర్మించబడిన దేవాలయం. ప్రాకార ద్వారం మీద గజలక్ష్మి లలాటబింబం. ప్రధానాలయం ముందర ముఖమంటపం వేరుగా కట్టబడివుంది. మంటపస్తంభాలన్నీ రాష్ట్రకూటశైలివే. అంటే కళ్యాణీచాళుక్యులకాలంలో శైవాలయంగా పరివర్తింప జేయక ముందే ఈ గుడి ఉన్నది.


ప్రధానాలయం 12 రాష్ట్రకూట స్తంభాలతో నిలిపివుంది. అంతరాళం లేదు. గర్భగుడికి రెండువైపుల మూలల్లో రెండు ఉపాలయాలున్నాయి. అర్థమంటపశైలి నిర్మాణం. కక్షాసనాలున్నాయి. వాటికి బయటవైపు చతుర్దళపుష్పాలతో అలంకరించబడ్డ చాళుక్యశైలి రాతి పిట్టగోడలున్నాయి. ఒక గుడి ద్వారశాఖలమీద ద్వారపాలకులవలె నిల్చున్న ఇద్దరు దండధారులున్నారు. మరొక ద్వారానికి రాష్ట్రకూటశైలి కలశాలున్నాయి. గర్భగుడులలో పానవట్టాలు లేవు. అధిష్టానపీఠాలు భూమిలో సగం మునిగిపోయివున్న మరొక గుడి వుంది. దాని ద్వారం మీద పద్మపత్రాలు తీర్చిదిద్దబడ్డాయి. విడిగా నిర్మించిన మరొక గుడి ద్వారం మీద కూడా కలశాలున్నాయి. పద్మపత్రాలున్న ద్వారబంధం. లలాటబింబంగా గజలక్ష్మి చెక్కబడివుంది.
గుడి ప్రాకారం బయట నిలబడివున్న ఎత్తైన రెండు ద్వారస్తంభాలు, వాటి మీద రాష్ట్రకూటశైలి కలశాలున్నాయి. దాని వెనక పడివున్న దేవాలయ శిథిలాలున్నాయి. అక్కడొక కొలను వుండేదని స్థానికులు చెప్పారు.

ఈ గుడుల ద్వారశాఖలమీద పద్మపత్రాలు, గజలక్ష్ములు, కలశాలు, ద్వారపాలకులు లేకపోవడం జైనబసదుల నిర్మాణాలతో పోలికలున్నాయి. ఈ గుడి విద్ధేశ్వరాలయం కాకముందు ఇక్కడ జైనబసదులుండేవనిపిస్తున్నది. వీటిలోని జైనధర్మ శిల్పాలను ఎక్కడున్నాయో అన్వేషించాలి.
చందుపట్ల వూర్లో ఇంకా రామాలయం, అమ్మదేవతల గుళ్ళు, నాగశిల్పాలు వున్నాయి. ఒక గుడిలో చతుర్భుజుడు, పరశువు, అంకుశం, ఉండ్రాయి, అభయముద్రలతో గణపతి కొలువై వున్నాడు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *