తెలుగు సాహిత్యంపైబాపూజీ ప్రభావం

……I want to show that what is useful can also be beautiful…
(ప్రయోజనకరమైనదంతా అందమైనదని చూపాలను కున్నాను )
(Harijan, April 7th, 1946)
… …Music means rhythm, order. Its effect is electrical. It immediately soothes……
(సంగీతమంటే లయ, క్రమపద్ధతి. సంగీత ఫలితం విద్యుదాత్మకం. అది తక్షణమే హాయినిస్తుంది.)
(Young India, September 8th 1920)

ఈ రెండు వ్యాఖ్యలను గాంధీజీ వేర్వేరు సందర్భాలలో, పాతికేళ్ళ తేడాతో తన పత్రికావ్యాసాలలో అంతర్భాగంగా ప్రకటించారు. మొదటిది స్వాతంత్య్రం రావడానికి కాస్త ముందు కాగా, రెండవది ఆయన దక్షిణాఫ్రికా నుంచి తిరిగి వచ్చిన ఐదేళ్ళకు ప్రారంభించిన ‘యంగ్‍ ఇండియా’ తొలి సంచికలో! కళ కోసమే అనే వాదనను పూర్తిగా తిరస్కరించే గాంధీజీ, ఆ కళ సమాజానికి దోహదపడాలనీ, అది ఎంతమాత్రమూ సమాజాన్ని దెబ్బ తీయకూడదని భావిస్తారు. అలాగే ఆ కళారూపం సత్యం ఆధారంగానే సాగాలని కూడా బలంగా విశ్వసిస్తారు. అది సాహిత్యమైనా, పత్రికా రచన అయినా, సంగీతమయినా, శిల్ప మయినా, సినిమా అయినా, సైన్సు అయినా, ఉద్యమమయినా, స్వాతంత్య్రం అయినా ప్రజోపయోగంగానే సాగాలని బలంగా విశ్వసిస్తారు. కనుకనే అదే సమయంలో ఉపయోగపడేదంతా మన జీవితంలో అందంగా అమరాలని కూడా విస్పష్టంగా చెబుతారు.
గాంధీజీ 1920కి భారతదేశంలో తిరుగులేని నాయకుడిగా పరిణమించారు. నిజానికి ఆయన 1915లో భారతదేశం తిరిగి వచ్చినా, ఓ సంవత్సరంపాటు గురువు గోపాలకృష్ణ గోఖలే సూచననుసరించి మూడవతరగతి రైలుబోగీలో భారతదేశం అంతటా పర్యటించారు. ఆ సమయంలో ఆయన దాదాపు ఎటువంటి ప్రసంగం చేయలేదు. ఈ పర్యటనలోనే గాంధీజీ 1915 మే 31, జూన్‍ 1 తేదీలలో ఓ పూట నెల్లూరులో ఉన్నారు. భారతీయ సమాజాన్ని అవగతం చేసుకోవాలని చేసిన ఈ పర్యటన తర్వాత ఆయన భారతదేశంలో తన తొలి ప్రసంగాన్ని 1916 ఫిబ్రవరి 4వ తేదీన బెనారస్‍ హిందూ విశ్వవిద్యాలయం వ్యవస్థాపక సందర్భంలో చివరి రోజున చేశారు.

అందులో చర్చించిన నాలుగు విషయాలలో రైతుల కష్టాలు, బ్రిటీష్‍ పాలకుల అరాచక పాలనతో పాటు దేశంలో పారిశుద్ధ్యం గురించి, ఇంకా మాతృభాషలో వ్యక్తీకరణ, విద్య గురించి ఉన్నాయి. నిజానికి ఈ నాలుగు విషయాలు నేటికీ మనకు అతి పెద్ద సమస్యలే. చంపారణ్య ప్రాంతంలో నీలిమందు పంటను పండించే రైతుల కష్టాలను తొలగించడానికి 1916లో బ్రిటీష్‍ పాలకుల నెదిరించి భారతదేశంలో తన తొలి విజయం నమోదు చేసుకున్నారు. తరువాత ఆయన తీర్చిన రెండో సమస్య అహమ్మదా బాదులో జౌళి కార్మికుల వేతనాల కష్టాలు. ఈ దేశపు నేలపైన తన కాళ్ళను పూర్తిగా ఉంచుకుని, సకల కోణాలలో దేశీయ దృష్టితో మన సమాజాన్ని గాంధీజీ పరిశీలించారు. దేశంలోని అన్ని మతాలనూ, అన్ని భాషలనూ, అన్ని సంస్కృతులనూ, అన్ని విశ్వాసాలనూ ఆకళింపు చేసుకుని, వర్తమానానికి, భవిష్యత్తుకు అవసరమైన మానవ ప్రవర్తనకు దోహదపడే అంశాలతో తనదైన పద్ధతిని రూపొందించుకుని తన జీవన విధానాన్ని సాగించారు. ‘‘నా జీవితమే సందేశం’’ అనే మాటను తన జీవిత చరమాంకంలో కలకత్తా దగ్గిర నౌకాలీలో ఉన్నప్పుడు బెంగాలీ భాషలో చెప్పారు. అదీ ఆయన శైలి!

1915లో గోపాలకృష్ణ గోఖలే కనుమూయగా 1920లో బాలగంగాధర తిలక్‍ అస్తమించారు. ఆ సమయంలో రౌలత్‍ చట్టాన్ని వ్యతిరేకిస్తూ సత్యాగ్రహం, అమృత్‍సర్‍లో జలియన్‍ వాలాబాగ్‍ దురంతం తొలుత జరిగిన కీలకమైన సంఘటనలు. 1920కి గాంధీజీ ఏకైక నాయకుడుగా దేశానికి నిర్దేశనం చేయడం మొదలైంది. ఆయన భారతీయ స్వాతంత్య్ర పోరాట జీవితంలో మూడు దశాబ్దాలలో మూడు మహోత్తరమైన ఉద్యమాలు సహాయ నిరాకరణోద్యమం (1921-22), దండి ఉప్పు సత్యాగ్రహం (1930-34), క్విట్‍ ఇండియా ఉద్యమం (1942-44) కీలకంగా కనబడతాయి. ఉప్పు సత్యాగ్రహానికి ముందు గాంధీజీ నాయకత్వంలో ఒక దశాబ్దంలో దేశవ్యాప్తంగా రకరకాల పోరాటాలు జరగడంతోపాటు దేశవ్యాప్తంగా ఎంతోమంది వ్యక్తులు ఆ ప్రాంతపు మహానాయకులుగా ఎదగడం ఎన్నో రకాల కార్యక్రమాలను సర్వతోముఖాభివృద్ధికి వారు దేశవ్యాప్తంగా చేపట్టడం ప్రారంభించారు.

1920 సెప్టెంబర్‍, అక్టోబర్‍ నెలలలో గాంధీజీ ‘నవజీవన్‍’, ‘యంగ్‍ ఇండియా’ పత్రికలను ప్రారంభించారు. మొదటిది గుజరాతీభాషలో కాగా, రెండవది ఇంగ్లీషులో! గాంధీజీ నిర్వహించిన మొత్తం విజయసాధనలో తొలి సగం ‘యంగ్‍ ఇండియా’ వంటి పత్రికలకు చెందితే, తరువాతి సగం ఆయన వ్యక్తిగత సౌశీల్యానికి, మూర్తిమత్వానికి చెందుతుంది. కొల్లాయి కట్టడం మొదలైంది 1921 సెప్టెంబర్‍ 22న. ఆయన మాట, ఆయన ఆకారం, చేపట్టే కార్యక్రమాలు అన్నింటితోనూ భారత ప్రజలు మమేకమయ్యారు. భాష, మతం, కులం, సంస్క•తి అనే పరిమితులు దాటి ఆయన వెంట నడిచారు. అతిసాధారణమైన వ్యక్తి ఆహారంలో కీలక అవసరమైన ఉప్పును అంశంగా తీసుకుని డెబ్బయి ఎనిమిది మంది వ్యక్తుల సమూహంగా 24 రోజులపాటు నడిచి 200 మైళ్ళ దూరంలో ఉన్న దండి ప్రాంతానికి ఉద్యమంగా ఆయుధాలు లేకుండా చేరి, శాసనోల్లంఘన చేసి తెల్లపాలకులను లొంగదీశారు. 61 సంవత్సరాల వృద్ధుడు రవి అస్తమించని సామ్రాజ్యానికి, ఎటువంటి ఆయుధాలు లేకుండా శాంతియుతం గానే వణుకు తెప్పించడంతో గాంధీజీ ప్రపంచ నాయకుడయ్యారు. లండను నుంచి వెలువడే ‘టైమ్‍’ పత్రిక ఆయనను ‘మాన్‍ ఆఫ్‍ ద ఇయర్‍’ గా ఎంపిక చేసింది 1930లోనే అని కూడా గమనించాలి!
భారతీయ సాహిత్యంపై అందులో తెలుగు సాహిత్యంపై గాంధీజీ ప్రభావం గురించి చర్చించుకుంటున్నామనే పెద్ద విషయాన్ని ద•ష్టిలో వుంచుకునే ఈ మొత్తం విశ్లేషణ సాగుతోందని గమనించాలి. గాంధీజీ దక్షిణాఫ్రికా వెళ్లిన మూడవ రోజుకే అవమానం పాలయిన సందర్భంతో మొదలై, క్రమంగా నాయకుడిగా ఎదిగారు. దక్షిణాఫ్రికా విజయం గురించి, తరువాతి కాలంలో దక్షిణాఫ్రికాలో తిరుగులేని నాయకుడైన నెల్సన్‍ మండేలా చెప్పిన ఓ విషయాన్ని మననం చేసుకోవాలి. ‘‘మీరు గాంధీని మాకు ఇచ్చారు. మేము మహాత్ముణ్ణి మీకు తిరిగి ఇచ్చాం’’ అని తన భారతదేశపు మిత్రుడితో మాట్లాడుతున్న సమయంలో నెల్సన్‍ మండేలా వ్యాఖ్యానించారు.

డా. నాగసూరి వేణుగోపాల్‍
ఎ : 9440732392

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *