ముందు మాటలు చదవగానే మళ్ళీ ఆ పుస్తకాన్ని చదవాల్సిన అవసరం లేకుండా పోతుంది. అందుకు కారణం ఆ కధల్లో, ఆ నవల్లో ఏముందో అన్నీ వివరంగా ముందు మాటల్లో చెబుతారు. అంతే కాదు ఆ రచయిత తనకి ఎలా పరిచయం, ఎలా ఎదిగాడు అన్న విషయాలని సోదాహరణంగా వివరిస్తారు. అది సరైంది కాదని నేను అనను గాని దాని వల్ల ఆ రచనకి జరగాల్సిన న్యాయం జరగదని నా అభిప్రాయం. నా అభిప్రాయంతో మీరు ఏకీభవించాల్సిన అవసరం లేదు.
ఈ మధ్య రెండు ముందు మాటలని చదివాను. అందులో ఇలాంటి ఉపోద్ఘాతాలు లేవు. అవి పేజీలకు పేజీలు లేవు. ఒక పేజీ మాత్రమే వున్నాయి. ఆ మాటలు చదివితే ఆ రచనల ఆవిష్కారం జరుగుతుంది. ఆ కధలని చదవాలన్న కాంక్ష పెరుగుతుంది. ఆ రచయిత ఆవిష్కారం కూడా జరుగుతుంది. ఆ రెండు ముందు మాటలు నేను రాసిన కధల పుస్తకాలవే కావడం విశేషం. ఆ రెండు పుస్తకాలు ఒకే రోజున చేతికి రావడం మరో విశేషం. మొదటిది ‘నేనూ – నా నల్లకోటు’ కధల పుస్తకం, రెండవది మా వేములవాడ కధలు-2.
మొదటి పుస్తకంలో ‘నేను’ అన్నప్పటికి అది నా చుట్టూ తిరగదు. ‘నల్లకోటు’ చుట్టూ తిరుగుతుంది. కోర్టులు ఎలా పని చేస్తున్నాయి. కీర్తి కాంక్ష ఎలా వుంటుంది. రోజూ మీడియాలో కనిపించాలన్న కోరిక ఎలా వెర్రి తలలు వేస్తుందో, ‘స్టేట్’ వాళ్ళని ఎట్లా అస్వతంత్రులని చేస్తుందో అన్న విషయాలు కథల రూపంలో వుంటాయి. పోలీసులు మనుషులని ఎట్లా నిర్వీర్యం చేయగలరో కూడా ఈ కధల్లో కన్పిస్తుంది. ఈ అన్నీ వివరించకుండా మొత్తం కధల ఆత్మని ఆవిష్కరింప చేయడం ఈ ముందు మాటలోని ప్రత్యేకత. ఈ ముందు మాట రాసింది సుప్రీం కోర్టు పూర్వ న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్.
ఈ కథల గురించి ఆయన ఇలా అంటారు- ‘‘బలంగా కేంద్రీకృతమైన ఏ వ్యవస్థా తీక్షణమైన స్వతంత్ర భావాలున్న వ్యక్తులను సహించాడు అన్నాడో విజ్ఞాని’’అని ప్రముఖ రచయిత బస్వీస్ సింగర్‌ని కోట్ చేస్తూ ఇలా చెబుతారు.

‘‘ఈ విషయం తెలిసి చాలా మంది ‘అంతా దివ్యంగా ఉంది’ అని చెబుతారు. కానీ వారిలో ఎక్కువ భాగం, నాలుగు గోడల మధ్య వ్యవస్థలను గురించి గొప్ప విశ్లేషణ చేస్తారు. విమర్శిస్తారు. అయితే ఆ అభిప్రాయాలను బహిరంగంగా చెప్పరు. భయాలు.. ఆశలు.’’
న్యాయమూర్తులు రెండు రకాలు. మొదటివారు అధికారులు, రెండవవారు సామాజిక బాధ్యతను మరిచిపోని సేవకులు. రాజేంద్ర రెండవ రకమని ఆయన చెబుతారు. అలాంటి వ్యక్తులకి తన ముందుకు వచ్చిన కేసుల్లోని న్యాయ సంబంధమైన అంశాలే కాక, ఆయా కేసుల్లోని పాత్రధారులు వారి స్వభావాలు వ్యవహారం కోర్టు కెక్కడానికి దారితీసిన సామాజిక రాజకీయ ఆర్ధిక పరిస్థితులు విశ్లేషణ కూడా సాధారణ మవుతుంది. దానితో పాటూ వ్యవస్థలోని లోటుపాట్లు దగ్గరగా చూసే అవకాశం కలుగుతుంది. ఇక్కడతో వూరుకోకుండా ఇంకా ఇలా అంటారు.
‘న్యాయవ్యవస్థలోని లోపాలను సున్నితంగా ఎత్తి చూపిన ఈ కధలు సమాజాన్ని ఆలోచింప చేస్తాయని ఆశ. విమర్శ లేనిదే పురోగతి లేదు. విమర్శను సహించలేని వ్యవస్థలు విధ్వంసానికి పునాదులు. విమర్శని సహృదయంతో స్వీకరించి వ్యవస్థను మెరుగు పరుచుకోవడమా? లేక జరగబోయే, జరుగుతున్న విధ్వంసాన్ని మౌనంగా చూస్తూ చివరకు ఏమి మిగల లేదని ఏడవడమా? మన ఇష్టం. రాజేంద్ర తన కర్తవ్యాన్ని నిర్వహించాడు.’ఇది ఆయన రాసిన ముందు మాట. ఈ ముందు మాటని, ఈ కధలని ఎంత మంది జీర్ణించుకుంటారో చూడాల్సిందే.!
ఈ నల్లకోటు కథల్లో కొన్ని కధలని రచయిత చెబుతాడు. కొన్ని కథలని గాడిదలు చెబుతాయి. కాకి చెబుతుంది. గద్ద చెబుతుంది. ఫ్లెక్షీ చెబుతుంది. కాగితం కథ చెబుతూ న్యాయమూర్తిని ప్రశ్నిస్తుంది. బేతాళుడు తల వెయ్యి ముక్కలు అవుతుందని బెదిరిస్తూ కథ చెబుతాడు.
నేను రాసిన రెండవ కధల పుస్తకం ‘మా వేములవాడ కధలు -2’. వేములవాడ నేపధ్యంలో ప్రధమ పురుష లో చెప్పిన కధలు. ఇవి నా చుట్టూనే తిరిగినప్పటికి అందరి చుట్టూ తిరుగుతాయి. అందరినీ తమలోకి తమను చూసుకునేలా చేస్తాయి. హృదయాలని కదిలిస్తాయి. తమ వూరివైపు పంపిస్తాయి. తమ బాల్యాన్ని గుర్తు చేస్తాయి. ఇది రెండవ సీరీస్. మొదటి సీరీస్ మూడు ముద్రణలు పొందింది. అది ఎమెస్కోనే ప్రచురించింది. రెండవది కూడా ఎమెస్కో నే ప్రచురించింది. దీనికి ముందు మాట రాసింది ఎమెస్కో సంపాదకులు దుర్గంపూడి చంద్ర శేఖర్ రెడ్డి. ఆయన తన ముందు మాటలో ఇలా అంటారు. రాజేందర్ గారిది చాలా ఆకర్షణీయమైన శైలి. ఆపకుండా చదివిస్తుంది. ఈ కధలన్నీ వేములవాడ చుట్టూనే తిరిగినా నాకు మా వూరూ, మీకు మీ వూరూ జ్ఞాపకం రావడం తధ్యం. అలాగే మన చిన్ననాటి స్నేహితులు బంధువులు కూడా. వేములవాడకే ప్రత్యేకమైన కొన్ని, జింబో గారి జీవితానికే ప్రత్యేకమైన సంఘటనలు కొన్ని వుండవచ్చు. కానీ వాటిని కూడా మనకు అన్వయం చేయడంలోనే జింబో గారి రచనా సామర్ధ్యం వుంది.
ఈ కధలు మనల్ని ఆకట్టుకోవడానికి కారణం దాని సరళత్వం. అలవోకగా చెప్పినట్లు ఉంటుంది. ప్రత్యేక ప్రయత్నం ఉన్నట్లనిపించదు. నిజానికి అట్లా రాయడమే కష్టం.
ఇంత క్లుప్తంగా వేములవాడ కథలని వివరించడం మరింత కష్టం. ఆ పనిని చంద్రశేఖర రెడ్డి గారు చేశారు. వేములవాడ కధలు పేరుకే మా వేములవాడ కధలు. అవి మా వేములవాడ కధలు, మీ కథలే కాదు మా వూరి కథలు, మా కథలు అన్నవాళ్లు ఎందరో. వేములవాడను చూసి వచ్చామని చెప్పేవాళ్ళు మరెందరో.
రెండు కధల సంపుటాలు ఒక జీవితానికి మరో జీవితానికి విభిన్నమైనవి. అవి రెండూ నేను రాశానని ఒకింత సంతోషం, మరి కొంత గర్వం.
నేనూ, నా నల్లకోటు రాయడానికి ధైర్యం కావాలి. చదవడానికి అవసరం లేదు. వేములవాడ కధలు చదవడానికి మంచి హృదయం కావాలి. ఈ నాలుగు మాటలు నేను కాకుండా ఇంకా ఎవరైనా చెప్పితే బాగుండేదని అనే వాళ్ళు వుంటారు. నేను చెప్తే తప్పేమిటి..?
ఈ ముందు మాటలు రాసిన ఇద్దరికీ, చదవబోతున్న మీ అందరికీ నమస్కారం.
-మంగారి రాజేందర్ (జింబో)
ఎ : 9440483001
