చేనేతకు జవసత్వాలు అద్దడమెలా?ఆగస్టు 7 జాతీయ చేనేత దినోత్సవం

భారతీయత అంటే మనకు గుర్తుకువచ్చే సాంస్కృతిక కళలలో చేనేత ముఖ్యమైనది. కంటికింపైన రంగురంగుల వస్త్రాలు, చీరలు, వాటిని నేసే నైపుణ్యం మన వారసత్వం, దేశానికి గర్వకారణం. చేనేత నిత్య సుందరం. నిత్య నూతనం. సంప్రదాయమే కాక, మారుతున్న అభిరుచులకి, జాతీయ అంతర్జాతీయ మార్కెట్‍ అవసరాలకి అనుగుణంగా తమ కళను, నైపుణ్యాన్ని మార్చుకుంటూ వస్తున్నారు చేనేత కళాకారులు.
కేందప్రభుత్వం చేనేత పరిశ్రమకి చేయూతనందిస్తూ 7 ఆగస్ట్ 2015 తేదిని ‘జాతీయ చేనేత దినోత్సవం’ గా ప్రకటించింది. అప్పటినుంచి ప్రతి సంవత్సరం దీనిని మనం జరుపుకుంటున్నాము. 7 ఆగస్ట్ చారిత్రాత్మకమైన రోజు, 1905లో ఆ రోజు కలకత్తాలో స్వదేశీ ఉద్యమం ప్రారంభమైంది. విదేశీ వస్తు బహిష్కరణ చేస్తూ, చేనేత మొదలైన దేశీయ ఉత్పత్తులను తిరిగి పునరుద్ధరించి, ప్రజలు భారతీయ జాతీయతను పెంపొందించుకోవాలని స్వదేశీ ఉద్యమ ముఖ్య ఉద్దేశం.

దేశంలో తొలిసారిగా 1942లో చేనేత గణాంకాలు చేపట్టారు. నాడు ఆ మగ్గాల సంఖ్య సుమారు 2,00,000. టెక్స్టైల్స్ ఎంక్వయిరీ కమిటీ సర్వే ప్రకారం, 1953లో అవి 22.21 లక్షలకు చేరాయి. ఆ కాలంలో ఇతర వృత్తులు, ఉద్యోగాలను విడిచిపెట్టి చేనేతను చేపట్టినవారున్నారు. 2019-20 హ్యాండ్‍లూమ్‍ సెన్సెస్‍ ప్రకారం, దేశంలో 28.20 లక్షల చేనేత మగ్గాలున్నాయి. వాటిలో 25.30 లక్షల వరకు గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నట్లు లెక్కగట్టారు. మొదట్లో చేనేత మగ్గాలు నిలువుగా ఉండేవి. కాలక్రమంలో వాటిని అడ్డంగా ఏర్పాటు చేయడం మొదలుపెట్టారు. ఈ విధానంలో వస్త్ర ఉత్పత్తికి చాలా సమయం పట్టేది. 1733లో ఇంగ్లాండ్‍కు చెందిన జాన్‍ కే, ఫ్లై షటిల్‍ను కనిపెట్టిన తరవాత మగ్గం ద్వారా వస్త్రోత్పత్తి అనేక రెట్లు పెరిగింది. దీన్ని విప్లవాత్మకమైన మార్పుగా చెప్పుకోవచ్చు.
భారతీయ చేనేతకు వేల సంవత్సరాల చరిత్ర ఉంది, ప్రపంచంలో అతి కొద్ది దేశాలకు మాత్రమే ఈ ఘనత ఉంది. పురాతన కాలంనుంచి భారతీయ చేనేత వస్త్రాలు ప్రపంచమంతా ఎగుమతులు చేయబడేవి.

రెండువేల సంవత్సరాల క్రితం ‘హంస’ డిజైన్లతో ఉన్న భారతీయ వస్త్రాలు ఈజిప్టు కైరో నగరంలో లభ్యమయాయి. అగ్గిపెట్టెలో పట్టే మస్లిన్‍ చీరలను నేసిన ఘనచరిత్ర ఉన్న దేశం మనది. తరతరాలుగా చేనేత కుటుంబాలలో వారసత్వ కళగా ఇది కొనసాగుతోంది. కుటుంబ సభ్యులంతా కలిసి మగ్గాల మీద బట్ట నేస్తుండడం మనకు కనిపిస్తుంది. ప్రముఖ చేనేత కేంద్రాలలోని గ్రామాలలో, మొత్తం గ్రామప్రజలంతా నేతపనిలో నిమగ్నమై
ఉంటారు.
భారత దేశంలో దాదాపు 150 చేనేత కేంద్రాలు ఉన్నాయని అంచనా. ఆంధ్రా, ఒడిస్సాల నుంచి నూలు ఇకత్‍ మరియు జామ్దని, బనారస్‍ పట్టు, జరీలు, కంచి /తమిళనాడు పట్టు, గుజరాత్‍ రాజస్థాన్‍ టై & డై, సూరత్‍ టాంచౌ, పంజాబ్‍ పుల్కారి, బెంగాల్‍ ఢకై, బాలుచరి సిల్క్, అస్సాం మూగా సిల్క్, మహేశ్వరీ జరీ, పటోల డిజైన్‍, చందేరి సిల్క్, పైథాని సిల్క్, కోటా పేపర్‍ సిల్క్, మధ్యప్రదేశ్‍/ ఆంధప్రదేశ్‍/ ఉత్తరప్రదేశ్‍/ ఒడిస్సా/ బెంగాల్‍ టసర్‍ సిల్క్, ఖాదీ సిల్క్, మైసూరు సిల్క్, కాశ్మీర్‍ సిల్క్, ఎరి ముడి సిల్క్, కాశ్మీర్‍ పష్మినా మరియు శాహ్తూష్‍ పల్చని ఉన్ని, ఈశాన్య రాష్ట్రాల గిరిజనజాతుల రకరకాల చిహ్నాల రంగుల వస్త్రాలు, బీహార్‍ మధుబని, మహారాష్ట్ర వర్లి డిజైన్లు, ఇంకా ఎన్నెన్నో వివిధ వర్ణాల సమ్మేళనమే భారతీయ చేనేత.
భారతీయ చేనేత మన అమూల్య వారసత్వ సంపద.
ఉపాధి విషయంలో వ్యవసాయం తరువాత చేనేతది రెండవ స్థానం, కుటీర పరిశ్రమల కింద కోట్లాది మందికి ఉపాధి కల్పిస్తున్నది చేనేత పరిశ్రమ. ప్రత్యక్షంగా, పరోక్షంగా 70లక్షల మందికి పైగా ఈ పరిశ్రమ ఉపాధి కల్పిస్తోంది, వీరు మగ్గాల మీద నేసిన వస్త్రాలు, దేశం మొత్తం వస్త్రాల ఉత్పత్తిలో 20% పైగా ఉంటాయి. ప్రపంచ చేనేత వస్త్రాలలో 90% పైగా భారతదేశంలో నేయబడతాయి. నూలు, కాటన్‍, సిల్క్, పట్టు, ఇతర సహజంగా ఉపలబ్ధమయ్యే నార, పీచులతో అద్భుతమైన వస్త్రాలు తయారు చేస్తారు మన చేనేత కళాకారులు.
ప్రత్యేక శిక్షణ లేనప్పటికీ, ఒక తరం నుంచి మరో తరానికి చేనేత నైపుణ్యాలు అందుతూ వచ్చాయి. ఇటీవల ఈ ఒరవడి మారుతోంది. మెరుగైన ఆదాయం కోసం చేనేత కుటుంబాల్లోని పిల్లలు ఇతర వృత్తులు, ఉద్యోగాలవైపు మళ్లుతున్నారు. చేనేత
ఉత్పత్తుల మార్కెటింగ్‍లో వ్యాపారులతో పాటు ప్రాథమిక చేనేత సహకార సంఘాలు, ఆప్కో, కోఆప్టెక్స్ వంటి రాష్ట్రస్థాయి సహకార సంఘాలు, హ్యాండ్‍లూమ్‍ హౌస్‍ వంటి కేంద్రస్థాయి సహకార సంఘాలు ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి. ప్రభుత్వాలు తమ వంతుగా చేనేత ప్రదర్శనలను నిర్వహిస్తున్నాయి. అంతర్జాతీయ విపణిలో చేనేత ఉత్పత్తులను మార్కెట్‍ చేయడానికి కేంద్రం వివిధ సంస్థల ద్వారా ప్రోత్సహిస్తోంది. హ్యాండ్‍లూమ్‍ ఎక్స్పోర్ట్ ప్రమోషన్‍ కౌన్సిల్‍ వివిధ దేశాల్లో చేనేత వస్త్రాల అమ్మకాలకు సంబంధించి పలు చర్యలు తీసుకుంటోంది.
బ్లాక్‍-ప్రింట్స్ చేనేతలో ఆంధప్రదేశ్‍ ప్రఖ్యాతి ఘనమైనది. స్థానికంగా ఉండే చెట్లు, పువ్వుల నుంచి రంగుల సారం, బంకమన్ను నదులలోని ఇసుకనుంచి రసాయనాలు తయారు చేస్తారు. మన తెలుగు రాష్ట్రాల్లోనే 15కి మించి చేనేత కేంద్రాలు ఉన్నాయి. వాటిల్లోనూ వివిధ రకాలు ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో కొన్ని చేనేత పట్టు/సిల్క్ కేంద్రాలు:

కలంకారీ చేనేతలో రెండు రకాలు- మచిలీపట్నం, పెడనలలో బ్లాక్‍ ప్రింట్స్, శ్రీకాళహస్తిలో హ్యాండ్‍ ప్రింట్స్ – చేత్తో గీసే డిజైన్లు. కాళహస్తి పుణ్యక్షేత్రం కారణంగా ఆదినుంచీ ఇక్కడ దేవతా మూర్తులు- శివుడు, పార్వతి, వినాయకుడు, లక్ష్మి మొదలైనవి, అక్కడి స్థల పురాణాలతో వస్త్ర చిత్రీకరణ ఉంటుంది. ఎంతోమంది కాళహస్తి చేనేత కళాకారులు వారి హ్యాండ్‍ ప్రింట్స్ కళానైపుణ్యతకి జాతీయ అవార్డులు గెలుచుకున్నారు.
ఉప్పాడ జామ్దాని జరీ చీరలు ఎంతో ప్రఖ్యాతి పొందాయి.
వేంకటగిరి జరీ, నారాయణపేట, గద్వాల- కాటన్‍, పట్టు, మంగళగిరి-కాటన్‍, రెండు వైపులా అంచులు, మాధవరం జరీ, ధర్మవరం కాటన్‍/పట్టు. గుంటూరు, ఎమ్మిగనూర్‍, పొందూరు ఖద్దర్‍. ఇవి మన రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రఖ్యాతి చెందిన చేనేత కేంద్రాలు

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *