చేనేతలకు జాతీయ గౌరవం..!పుట్టపాక గ్రామం గజం నర్మద ఎంపిక

చేనేత ఎంత అద్భుతమైన కళో, చేనేత వస్త్రాలను మార్కెటింగ్‍ చేయడం కూడా అంతే అద్భుత కళ. ఆ కళలో ఆరితేరిన గజం నర్మద ఎంతోమందికి స్ఫూర్తిని ఇస్తోంది.
భారత ప్రభుత్వం, చేనేత, జౌళీ మంత్రిత్వ శాఖ వివిధ విభాగాలలో ఇచ్చే జాతీయ పురస్కారాలలో మార్కెటింగ్‍ విభాగంలో ఇచ్చే పురస్కారానికి నర్మద ఎంపికైంది. నిరాశావాదులకు నలుదిక్కులా నిరాశ మాత్రమే కనిపిస్తుంది. ఆశావాదులకు అనేక దారులు కనిపిస్తాయి. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్‍ నారాయణపురం మండలం పుట్టపాక గ్రామానికి చెందిన గజం నర్మద ఆశావాది.

చేనేత కళ మసక బారుతున్నట్లు అనిపించినప్పుడు, ‘చేనేత రంగం కాలం చెల్లిన రంగం’ అనే మాటలు వినిపిస్తున్నప్పుడు నర్మద ఎప్పుడూ నిరాశపడిపోలేదు. ‘బంగారు పళ్లేనికి అయినా గోడ చేర్పు కావాలి’ అనే మాటను ఎన్నో సార్లు విని ఉన్నది నర్మద. చేనేత అనేది బంగారంలాంటి కళ. ఆ కళకు ‘మార్కెటింగ్‍ నైపుణ్యం’ అనే గోడ చేర్పును తీసుకువచ్చి విజయం సాధించింది.

‘గజం నర్మద హైండ్లూమ్‍’ పేరుతో హైదరాబాద్‍లో చేనేత వస్త్రాల వ్యాపారం ప్రారంభించింది నర్మద. 2013లో రూ.10 లక్షల వ్యయంతో ప్రారంభించిన ఫర్మ్ ఇప్పుడు రూ. 8 కోట్ల టర్నోవర్‍కు చేరింది.
జనగామ జిల్లాలలోని సుమారు మూడు వందల మంది చేనేత కళాకారుల నుంచి చేనేత పట్టు ఇక్కత్‍ చీరెలు కొనుగోలు చేస్తుంది. రకరకాల అప్‍డేట్‍ డిజైన్లతో అందంగా తయారైన చీరెలను ఆన్‍లైన్‍ లో ఆర్డర్‍లు తీసుకుంటుంది. హైదరాబాద్‍, ఢిల్లీ, కోల్‍కత్తా, బెంగళూరు, ముంబై… దేశంలోని ప్రధాన నగరాల్లో ఇక్కత్‍ చీరెలను విక్రయిస్తుంది.

చేనేత మార్కెటింగ్‍లో ఈ ఏడాది నాకు అవార్డు రావడం సంతోషంగా ఉంది. కనుమరుగు అవుతున్న చేనేత వ•త్తికి ఈ జాతీయ పురస్కారం ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మా గ్రామానికి చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీతలు గజం గోవర్ధన్‍, గజం అంజయ్యలు నాకు ఆదర్శం.
ప్రఖ్యాత డిజైనర్‍ గౌరంగ్‍ నాకు స్ఫూర్తి. లేటెస్ట్ డిజైన్‍లు రూపొందించి విక్రయించడం వల్ల ఇక్కత్‍ చీరెలకు మరింత ఆదరణ లభిస్తోంది. జాతీయ అవార్డు రావడం నాకే కాదు చేనేత రంగంలో పనిచేస్తున్న మహిళలకు ఉత్సాహాన్ని, స్ఫూర్తిని ఇస్తుంది అని భావిస్తున్నా అని చెప్పారు గజం నర్మద.

‘అలాగే’ అనుకొని పాత దారిలోనే నడిచేవాళ్లు కొందరు. ‘ఇలా కూడా’ అని కొత్తదారిలో నడిచి విజయం సాధించేవాళ్లు కొందరు. రెండో కోవకు చెందిన పవన్‍ రసాయన రంగులు లేని చేనేత చీర గురించి కల కన్నాడు. చేనేత కళకు కొత్త కళ తీసుకువచ్చాడు.
సహజ సిద్ధమైన రంగులతో, తేలియా రుమాల్‍ డిజైన్‍తో డబుల్‍ ఇక్కత్‍ పట్టు చీరెను తయారు చేసిన యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్‍ నారాయణపురం మండలం పుట్టపాకకు చెందిన గూడ పవన్‍ యువ చేనేత విభాగంలో ఇచ్చే జాతీయ పురస్కారానికి ఎంపికయ్యారు.

బంతి పూలు, దానిమ్మ పండ్లు, పుదీన, కొత్తిమీర, బెల్లం, ఉల్లిగడ్డ పొట్టు, ఆకులు, చెట్ల బెరడు… ఇలా ప్రక•తి నుంచి సేకరించిన పదార్థాలతో సహజరంగులు తయారు చేశాడు. ఈ రంగులను మల్బరీ పట్టుదారానికి అద్ది తేలియా రుమాల్‍ డిజైన్‍తో పట్టుచీరను తయారుచేశాడు. సహజ పదార్థాలను ఎండబెట్టడం, ఉడకబెట్టడం, రంగులు అద్దడం, చీరెకు డిజైన్‍లు చేసే పక్రియకు ఆరు నెలలు పట్టింది.
6.25 మీటర్‍ల పొడవు, 46 ఇంచుల వెడల్పుతో తయారుచేసిన ఈ చీరెలో తేలియా రుమాల్‍కు సంబంధించిన పదహారు ఆకృతులు ఉన్నాయి. బంతిపూలు, రథం, త్రీడీ డిజైన్‍… ఇలా రకరకాల డిజైన్‍లు చీర పొడవునా ఉంటాయి. రకరకాల ఆకృతులతో చీర అందంగా కనిపిస్తుంది. సాధారణ పట్టు చీరెలా ముడతలు పడకుండా మృదువైన పట్టును ఈ చీరె కోసం వాడారు.
రంగు వెలవని చీర ఒక్కటి రూ.75 వేలు ఖరీదు చేస్తుంది. గత సంవత్సరం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‍లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఎదురుగా మగ్గంపై ఈ చీరె నేసి ప్రశంసలు అందుకున్నాడు. బీటెక్‍ మధ్యలోనే వదిలేసి తండ్రి శ్రీను దగ్గర చేనేతలో శిక్షణ పొందాడు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *