‘‘స్వంత కథ’’

(గత సంచిక తరువాయి)
మా తాత ముత్తాతల వారసుడినైన నాకు సహజంగానే సంచారకాంక్ష అబ్బింది. చాలా చిన్నప్పుడే నన్ను ‘‘రోడ్లు’’ ఆకర్షించాయి. అవి ప్రాణమున్న ప్రాణుల్లాగే కనబడేవి. ఈ పొడవైన, అందమైన ‘‘సడక్‍’’లు ఎంత దూరం ఇట్లా వెళ్లుతాయన్న జిజ్ఞాస నాకు కలిగేది. అట్లా అకారణంగా ఏ పనిలేకున్నా సడక్‍ల మీద గాలి గాలిగా తిరిగే అలవాటు మొదలయ్యింది. మా అమ్మ చేతిలో చింత బరిగె పట్టుకుని నన్ను వెదుకుతూ బయలుదేరేది. కవి అజంతా అన్నట్లు రోడ్లకు నా నమస్కారం అప్పుడే మొదలయ్యింది. నా తిరుగుడు రోగం గమనించి వీడికి ఏదో ‘‘గాలి సోకిందని’’ మా అమ్మ అనుమానించింది. నరనరాల్లో పారే రక్తమే గాక నేను చదివిన సాహిత్యం కూడా నన్ను ‘సంచారి’ని చేసింది.
నా పదహారు సంవత్సరాల వయసులో నాకు మా గుణవర్దక సంస్థ గ్రంధాలయంలో తెన్నేటి సూరి రాసిన ‘‘చెంఘీజ్‍ ఖాన్‍’’ నవల దొరికింది. ఆ నవల నన్ను అతలాకుతలం చేసినా ఊహలు దేశ సరిహద్దులు దాటి మంగోలియాలోని గోబీ ఎడారులలో సంచరించాయి. టెమూజిన్‍ నా అభిమాన హీరో అయినాడు. ఏదో ఒక రోజు గోబీ ఎడారులలో సంచరించాలన్న నా కల రిటైర్‍మెంటు తర్వాత 62 సం।।ల వయస్సులో నిజం చేసుకున్నాను. ఆ అనుభవాలనే ‘‘సిల్కు రూట్‍లో సాహస యాత్ర’’ పుస్తకంగా రాసాను.

నా పద్దెనిమిది సంవత్సరాలప్పుడు 1969లో ప్రత్యేక తెలంగాణా ఉద్యమం నడిచింది. అప్పుడు నేను సిటీ కాలేజీలో పి.యు.సి విద్యార్థిని. దాదాపు యాడాదిపాటు చదువులు బందు. తెలంగాణాలో రక్తం వీధులలో పారి 370 మందిని పొట్టన పెట్టుకుంది. అప్పుడు మా గుణవర్ధక సంస్థ గ్రంధాలయం నన్ను అమ్మలా ఆదరించి అక్కున చేర్చుకుంది. అద్భుతమైన తెలుగు సాహిత్యం, రష్యన్‍, చైనీస్‍, అనువాద గ్రంధాలు, చరిత్ర పుస్తకాలు, వామపక్ష సిద్దాంత సాహిత్యం నన్ను ప్రభావితం చేయటమే గాక మార్క్సు, ఎంగెల్స్, లెనిన్‍, మావోలతో పాటు రాహుల్‍ సాంకృత్యాయన్‍, సంజీవ్‍దేవ్‍లు, జవహర్‍లాల్‍ నెహ్రులతో నా దోస్తానా శురువయ్యింది.
అట్లా నాకు ఇద్దరు అమ్మలు. కని, పెంచి అన్నం పెట్టిన అమ్మ ఒకరైతే, పుస్తకాలను, సాహిత్యలోకాన్ని, ప్రపంచాన్ని పరిచయం చేసి ఆకాశమార్గాన విహరింపచేస్తూ కలలు కనటం అలవాటు చేసిన మరో అమ్మ కాని అమ్మ మా గుణవర్ధక సంస్థ గ్రంధాలయం. 1969 తెలంగాణా ఉద్యమ కాలంలో సంవత్సర కాలం చదువులు అటకెక్కినందున నా కేరాఫ్‍ అడ్రస్‍ గ్రంధాలయమే అయ్యింది. గ్రంధాలయమే నా విద్యాలయం అయ్యింది. కవిత్వం తప్ప సాహిత్యంలోని అన్ని ప్రకియలు నా అధ్యయనంలోకి వచ్చాయి. నా అదృష్టమో దురదృష్టమో తెలియదు కాని కవిత్వం నన్ను కమ్ముకోలేదు, కావలించుకోలేదు.
రెండు పదుల వయస్సు నిండక ముందే కొంతమంది ‘‘ప్రభావశీల వ్యక్తులు’’ నా జీవితంలోకి ప్రవేశించారు. అందులో మొదటివారు కథా రచయిత శ్రీపతిగారు. ఆయన అసలు పేరు పుల్లట చలపతిరావు. స్వస్థలం కళింగాంధ్ర. కాని వృత్తి రీత్యా సోషల్‍సైన్స్ టీచర్‍గా పాతనగరంలో పనిచేసేవారు. ఆయన శ్రీకాకుళంలో నడుస్తున్న నక్సలైటు ఉద్యమ సానుభూతి పరుడు. ఆయన ముందు నాకు నవీన్‍ రాసిన ‘‘అంపశయ్య’’ నవల, ఆ తర్వాత శీలావీర్రాజు రాసిన ‘‘మైనా’’ నవల ఇచ్చాడు. ఆ రెండు నవలలు నన్ను మంత్రించి మాయ చేసాయి. ఆయన ఒక శుభముహుర్తంలో నన్ను ఉద్యమంలో పనిచేస్తున్న ఒక రహస్య విప్లవ కారుడికి పరిచయం చేసాడు. అతను నాకు ‘‘హోం వర్క్’’ ఇవ్వటం మొదలు పెట్టాడు. పార్టీ రహస్య డాక్యుమెంట్లను, సర్క్యూలర్లను తెల్లపేపర్ల మధ్య కార్బన్‍ పేపర్లు పెట్టి ‘‘కాపీలు’’ రాసేపని. అవన్నీ ఇంటి వాళ్ల దృష్టిలో పడి ఒకటే ‘‘లబోదిబలు’’. అప్పుడు ఎన్‍కౌంటర్లు తీవ్రంగా నడుస్తున్న కాలం. ‘‘కుఫియాల’’ (ఇంటలిజెన్సు) దృష్టిలో పడితే నిన్ను జైలులో పెడతారని, తను చేస్తున్న ‘‘సర్కారీ నౌకరీ’’ ఊడుతుందని మా బాపు గోల. ఇక మా అమ్మనైతే బి.పి. పెరిగి క్రింద పడినంత పనిచేసింది. ఆఖరికి చీరె కొంగుతో దూలానికి ఉరి పెట్టుకుంటానని లేదా ఇంట్లో వున్న బావిలో దూకి చస్తానని ‘‘వార్నింగులు, బెదిరింపులు’’ శురూ చేసింది. విప్లవ పైత్యం తలకెక్కిన నేను ఆ బెదిరింపులను బేఖాతరు చేసాను.

చైనా విప్లవంలోని ‘‘లాంగ్‍మార్చ్’’ ప్రేరణతో నేనూ ఇంకా కొంత మంది మిత్రులం కలిసి ఎర్ర ఇంకుపెన్నుతో రాసిన లిఖిత మాస పత్రిక కొంత కాలం నడిపాం. దాని పేరు లాంగ్‍మార్చ్. మా విప్లవ ‘‘కుతి’’ తీరక రెండవ సంచికపై సుత్తె కొడవలి బొమ్మ కూడా వేసాం. పైత్యం ఇంకా బాగా ముదిరి నీశాచరులమై పాతనగరం వీధులలోని గోడలపై ‘‘విప్లవం వర్థిల్లాలి, మావో జిందాబాద్‍’’ లాంటి నినాదాలు రాసి ‘‘మేము సైతం’’ అన్నట్లు కుప్పిగంతులు వేసాం. ఆ మరునాడు నుండి పోలీసులు పట్టుకుంటారన్న భయంతో వరుసగా కొన్ని రాత్రులు ఇండ్లల్ల పండుకోలేదు. ఇండ్లు కూడా సోదా చేస్తారన్న అనుమానంతో విప్లవ సాహిత్యాన్ని ఒక రేకు ట్రంకు పెట్టెలో వేసి దానికి తాళం కూడా బిగించి ఒక రైల్వే మజ్దూర్‍ ఇంట్లో దాచిపెట్టాం. ‘అతని కంటె ఘనుడు అచంట మల్లన’’ అన్నట్లు అతను తన పెరట్ల ఒక పెద్ద గొయ్యి తీసి ఆ రేకు ట్రంకు పెట్టెను అందులో శాశ్వతంగా భూస్థాపితం చేసాడు.
శ్రీపతి ద్వారా మాకు పరిచయమైన ‘‘రహస్యోద్యమ విప్లవకారుడు’’ నా దూకుడును చైతన్యాన్ని గమనించి ‘‘దళం’’లో పని చేయటానికి రహస్య జీవితానికి రమ్మని వత్తిడి చేసాడు. నాకు ధైర్యం చాలక ఒప్పుకోలేదు. ఒక దినం నాకు ఆ విప్లవ కారుడి ద్వారా రహస్య సమాచారం అందింది. ఈ రోజు రాత్రి ఎనిమిది గంటలకు ఫలానా ఇంటికి రావాలని అక్కడికి రహస్య జీవితంలో ఉన్న ఇద్దరు అగ్ర నాయకులు వస్తున్నారని. ఆ మాట వినగానే నా నరనరాల్లో వికసించిన విద్యుత్తేజం వెయ్యి ఓల్టుల వేగంతో ప్రసరించింది. నేను మరో కామ్రేడ్‍ కల్సి ఆ సంకేత స్థలానికి వెళ్లాం. ఆ నాయకులిద్దరూ నడివయసు దాటేసి వెండి వెంట్రుకలతో, పసిడి హృదయంతో ఉన్నారు. బచ్చాగాండ్లయిన మమ్మల్ని చిన్న చూపు చూడక, సమ వయస్కులుగానే భావించి అర్థరాత్రి దాకా విప్లవ రాజకీయాలు బోధించారు. ఆ మరునాడు ‘‘ఆ చీకటి దొరలు’’ సూర్యుడి కన్నా ముందే నిద్ర లేచి ముసి ముసి చీకట్లలో మాయమైనారు. అప్పటికి వారి పేర్లు కూడా మాకు తెలియవు. అడిగి తెలుసుకోవటం విప్లవ క్రమశిక్షణ కాదు కావున మేం మౌనంగానే మిగిలిపోయాం. రెండు దశాబ్దాల తర్వాత వారిద్దరూ కామ్రేడ్‍ కొండపల్లి సీతారామయ్య, కామ్రేడ్‍ జ్ఞాననంద సత్యమూర్తి అని తెలిసి కండ్లు చెమ్మగిల్లాయి. దీనిని ఉర్దూలో ‘‘జ్రి-ఎ- బుజుర్గాన్‍’’ అంటారు.
‘‘జానే వాలే కబీ వాపస్‍ నహీఁ ఆతే లేకిన్‍ జానేవాలోఁ కి యాద్‍ ఆతీహై’’
హైద్రాబాద్‍ నగరంలో పనిచేస్తున్న ఏడుగురు దళ సభ్యులను అరెస్టు చేసినట్లు ఆంధ్రభూమి దినపత్రికలో ఒక వార్త వచ్చింది. అందులో మా మిత్రుడు కూడా ఉన్నాడు. దానితో నా విప్లవ జీవితానికి తాత్కాలికంగా బ్రేకులు పడ్డాయి. దాంతో మనిషి మళ్లీ గ్రంధాలయం ఒడిలోకి చేరి పుస్తకాల పుటల నీడలలో సేదతీరాడు.
ప్రత్యేక తెలంగాణా ఉద్యమం ఆగినంక ఇటు పి.యు.సి పరీక్షలు పాస్‍ కావటమే గాక అటు ఇంగ్లీష్‍ టైప్‍ రైటింగ్‍ హైయ్యర్‍ కూడా పూర్తి చేసేసరికి ఒక ప్రభుత్వ కార్యాలయంలో టైపిస్టుగా ఉద్యోగం వచ్చింది. ఏ మాత్రం జాగు చేయక ఒక సాయం కళాశాలలో బి.ఏ.లో చేరటం కూడా జరిగింది. నెలకు నాలుగు వందల జీతం సంపాదిస్తున్నా మనసు మాత్రం సంజకెంజాయ కేతనం చుట్టూ తిరగటం మానలేదు. పుస్తకం హస్త భూషణం అన్నట్లు ఎల్లప్పుడూ చేతిలో ఏదో ఒక పుస్తకం. బస్సులో ప్రయాణిస్తున్నా పుస్తక పఠనమే. ఆఖరికి సీన్మా లైన్‍ క్యూలో నిలుచుని కూడా ‘‘ఇసుకలో తలదూర్చిన నిప్పుకోడిలా పుస్తకంలో తల దూర్చి’’ సరస్వతి ఉపాసననే!
మళ్లీ త్వరలోనే లీగల్‍గా పనిచేస్తున్న ఒక ఎర్రజెండా పార్టీ నన్ను ‘‘క్యాచ్‍’’ చేసింది. పుట్టుకతో పుట్టిన బుద్ది పుడకల దాకా కొనసాగుతుంది కదా!
ఉద్యోగం, చదువు, పెద్ద కొడుకుగా ఇంటి బాధ్యతలు నిర్వహిస్తూనే పార్టీ అప్పగించిన పనులు చేస్తూ పార్టీ పత్రికకు సామాజిక, ఆర్థిక, రాజకీయ సమస్యలపై వ్యాసాలు రాస్తున్నాను. అప్పటికే రిటైర్‍మెంటు అయిన మా బాపుకు కాన్సర్‍ వచ్చి అది ఫైనల్‍ స్టేజ్‍ అని తెల్సింది. ఆయన చివరి కోరిక నా పెండ్లి చూడాలని. నా కిష్టమైన మేనరికం పిల్ల సిద్ధంగానే ఉంది. అయినా నేను ఖరాఖండిగా ఇప్పటంతల చేసుకోను అని చెప్పాను. ముందు చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి పార్టీకి పూర్తికాలం కార్యకర్తగా పనిచేయాలని నా ఆశయం. ఆయన అసంతృప్తితోనే చనిపోయాడు.
నెహ్రు గారి ‘డిస్కవరి ఆఫ్‍ ఇండియా’ పుస్తకంలో ఒక మాట ఉంది. ‘‘భారత దేశపు పేద ప్రజలు వడ్డీలకు అప్పులు తెచ్చి పెండ్లిళ్లు, చావులు ఘనంగా చేసి ఇంకా దరిద్రంలో కూరుకపోతుంటారు’’ అని. ఆ వాక్యం నన్ను కదిలించింది. పెళ్లంటూ చేసుకుంటే పార్టీ పద్దతులలో దండలు మార్చుకుని, అట్టహాసాలు, ఆర్భాటాలు లేకుండా చేసుకోవాలని అప్పుడే నిర్ణయించుకున్నాను.

‘మతం మానవజాతి పాలిట మత్తుమందు’ అన్న కారల్‍మార్కస్ కొటేషన్‍ కూడా నన్ను ప్రభావితం చేసింది. ఆచరించని సిద్ధాంతాల మనుషులంటే నాకు అసహ్యం. మా బాపు చనిపోయిన సందర్భంగా వైదికమతం బ్రాహణ పద్దతులలో కాకుండా సింపుల్‍గా అంత్యక్రియలు చేయటం, కేశఖండన చేయించుకోక పోవటం దినవారాలు పాటించనందుకు దగ్గరి బంధువర్గం నుండి నిరసనలను, బహ్కిరణలను ఎదుర్కోవాల్సివచ్చింది.
వామపక్ష రాజకీయాల వెల్లువలో కొట్టుకపోతున్నపుడు సందట్లో సడేమియా లాగా 1975లో ప్రపంచ తెలుగు మహాసభలు హైద్రాబాద్‍లో జరిగాయి. ఆ సంరంభం నాకొక పెద్ద ఆటవిడుపుగా తోచింది. ఉద్యోగానికి, రాజకీయ కార్యక్రమాలకు సెలవుపెట్టి వారంరోజులూ ఆ ఆనందంలో మునిగి తేలాను. సురభి వారి మాయాబజార్‍ నాటకం రాత్రి నుండి తెల్లారే దాకా చూడటం గొప్ప అనుభవం. అట్లనే ఎ.ఆర్‍. కృష్ణ దర్శకత్వంలో ‘మాలపల్లి’ నాటకం. తక్కెళ్ల జగ్గడి కోర్టు-బోను సీను స్టేట్‍మెంట్‍ నా విప్లవ తత్వాన్ని మరింత కరుడు గట్టేటట్టు చేసింది. కూచిపూడి, యక్షగానాలు భామాకలాపాలు కలల దారిలో కొత్త ద్వారాలు తెరిచాయి. నా అభిమాన రచయిత సంజీవ్‍దేవ్‍ను అప్పుడే కలుసుకున్నాను. అప్పటికే ఆయన స్వీయ చరిత్ర ‘‘తెగిన జ్ఞాపకాలు’’ నన్ను మానసికంగా అతలాకుతలం చేసింది. ‘జీవితం సగం కల, సగం కళ’ అని ఆటోగ్రాఫ్‍ ఇచ్చారు. అది చాలా కాలం భద్రపరచుకున్నాను.
అట్లా ఆ ప్రపంచ తెలుగు మహాసభలు సాహిత్య, సాంస్కృతిక పరంగా నన్ను ఉత్తేజితుణ్ణి చేసాయి. అదే నెలలో హైద్రాబాద్‍ పాతనగరంలో ఒక వారం రోజుల పాటు విద్యార్థి యువజనుల కోసం ‘‘రాజకీయ తరగతులు’’ నడిపాం. ఆ కార్యక్రమంలో సగంలో ఉండగానే రేడియో ఆకాశవాణి మధ్యాహ్నం వార్తలలో ఒక వార్త బాంబులా విస్పోటనం చెంది యావత్‍ దేశాన్ని కుదిపివేసింది. ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ ‘‘రాయ్‍బరేలీ ఎన్నిక చెల్లనేరదని, అధికార దుర్వినియోగం ఆ ఎన్నికలలో జరపబడిందని’’ ఆ తీర్పు సారాంశం. ఆమెను వ్యతిరేకించే వారందరికీ ఆ వార్త అమిత సంతోషాన్ని కల్గించింది. అప్పటికే ఉత్తర భారత దేశమంతా జయప్రకాశ్‍ నారాయణ్‍ నడుపుతున్న సంపూర్ణ విప్లవంతో ఊగిపోతుంది.

వామపక్షీయులమైన మేమందరం దేశం విప్లవపథంలో పయనిస్తుందని చంకలు గుద్దుకున్నాం! కాని కాకిపిల్లకు ఉండేలు దెబ్బ తెలియదన్నట్లు ఇందిరమ్మ 1975 జూన్‍ 25 అర్థరాత్రి అత్యవసర పరిస్థితి విధించి ప్రతిపక్ష పార్టీల నాయకులను, కార్యకర్తలను, పౌరహక్కుల సంఘం నాయకులను, మేధావులను, కలాలను, గళాలను కటకటాల వెనక్కి నెట్టి దేశాన్ని జైలుగా మార్చింది. ఎదురుకాల్పులు, చిత్రహింసలు నిత్యకృత్యంగా మారినాయి. తప్పించుకున్న వారందరూ రహస్య జీవితానికి వెళ్లిపోయారు. వడివడిగా కదులుతున్న రాజకీయ రథచక్రాలు. దేశం నివురు కప్పిన నిప్పులా ఉంది. వికసించిన విద్యుత్తేజం మా నరనరాల్లో ప్రసరించింది. మా పాతనగరాన్ని అగ్రనాయకులందరూ తల దాచుకునే ‘‘రహస్యడెన్‍’’గా మార్చివేసాం. మా ఇంట్లో ఎవరో ఒకరు నాయకుడు ఆశ్రయం తీసుకునేవారు. చరిత్ర నిర్మాణంలో మేమూ సమిధల మౌతున్నాం అని గర్వంగా ఉప్పొంగిపోయేవాళ్లం. నేను చేస్తున్న ఉద్యోగానికి మంగళం పాడి పూర్తికాలపు కార్యకర్తగా పనిచేయాలని మనసా, వాచా, కర్మణా విప్లవానికి అంకితం కావాలని ఎదిరి చూస్తున్నాను. పార్టీ నాయకులేమో ఇది సరైన సమయం కాదని ఆపుతున్నారు.
9 సెప్టెంబరు 1976న మావో ఇక లేరని విషాద వార్త వచ్చింది. చైనా పై అరుణతార రాలిపోయిందని బాధపడి రెండో రోజు విద్యార్థి యువజనులం కలిసి సికింద్రాబాద్‍ బూర్గు మహదేవ్‍ హాలులో సంతాప సభ జరిపాం. అందులో నేనొక వక్తను. ఒకవారం లోపలే ఒక సిబీఐ అధికారి విచారణ నిమిత్తమై నేను పనిచేస్తున్న ఆఫీసుకు వచ్చి తన ఐడి కార్డు చూపించి ‘‘జాగ్రత్తగా ఉండు ముషీరాబాద్‍ జైల్‍ఖానాల చిప్ప కూడు తినాలని, ఉద్యోగం పోగొట్టుకోవాలని సరదా ఉంటే రాజకీయాలలో పాల్గొను. లేదా నోర్మూసుకుని రాతలు, కూతలు, తిరుగుళ్లు మానుకుని బుద్దిగా ఉండు’’. అసలే ఎమర్జెన్సీ రోజులు. నీ మీద ఒక ఫైలు కూడా ఓపెన్‍ చేసాం. ‘‘యూ ఆర్‍ అండర్‍ వాచ్‍’’ అని వార్నింగులు ఇచ్చాడు. నేను అదరక, బెదరక మౌనంగా ఉన్నాను. వైద్యుడు కోరుకున్నదీ, రోగి కోరుకున్నదీ ఒకటే అయిందన్నట్లు ‘‘అరెస్టు అయ్యి ఉద్యోగం పోతే’’ పీడా వదులుతుందని మనసు లోపల అనుకున్నాను.

పార్టీ పత్రికకు మారు పేర్లతో ఆర్థిక, రాజకీయ వ్యాసాలు రాయటం ప్రారంభించాను. నా రచనా వ్యాసంగం అట్లా మొదలయ్యింది. టైమ్‍, న్యూస్‍వీక్‍, లాంటి అమెరికన్‍ పత్రికలలోని వ్యాసాలను సరదాగా అనువదించి తోటి మిత్రులకు ఇచ్చేవాడిని. ఆ రోజులలో నేను సాహిత్య పరమైన రచనలు చేస్తానని కలలో కూడా అనుకోలేదు.
‘‘చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవా’’ అన్నట్లు 1977 మార్చి సార్వత్రిక ఎన్నికలలో ఇందిరమ్మ కాంగ్రేసు చిత్తుచిత్తుగా ఒడిపోయింది. అత్యవసర పరిస్థితిని ఓడించి ప్రజాస్వామ్య పునరుద్దరణకు నా వంతు కృషి చేసానన్న తృప్తి నాకు మిగిలిపోయింది. ఏడు సం।।లుగా చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి పార్టీ తరపున బీహెచ్‍ఇఎల్‍, పటాన్‍చెరు, హైద్రాబాద్‍ సెంట్రల్‍ యూనివర్సిటీ పరిసర ప్రాంతాల కార్మిక రంగంలో పనిచేయసాగాను. ప్రజలలో పనిచేసిన ఆ అనుభవాలు చాలా ముఖ్యమైనవి. ఇప్పుడు హైటెక్‍ సిటీ, ఫైనాన్సియల్‍ డిస్ట్రిక్‍ అని పిలవబడుతున్న ప్రాంతాలన్నీ ఆ రోజులలో చిన్న చిన్న పల్లెలతో కూడుకున్న అటవీ ప్రాంతాలు.
ఒక సంవత్సరం తర్వాత నాకు పార్టీ నాయకుల, కార్యకర్తల నిజస్వరూపం కొంచెం కొంచెం బోధ పడసాగింది. ఆశ్రిత పక్షపాతం, కులతత్వం, ప్రాంతీయ తత్వాలను చూసి ‘‘కలలు కల్లలు అయినందున’’ విరక్తి వచ్చింది. తీవ్ర మానసిక వేదనకు గురయ్యాను. తీవ్రంగా కొన్ని నెలలు జబ్బు పడి ఆసుపత్రిలో ఉన్నాను.
ఆ ఆవేదనను మరవడానికి ఉదయం చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ సాయంత్రం కళాశాలలో ఎం.ఏ. రాజనీతి శాస్త్రంలో చేరాను. మనసును చదువుపై మళ్లించి కొత్త జీవితం ప్రారంభించాను. పూలదండల పెళ్లి, అట్టహాసాలు, ఖర్చులు లేకుండా చాయ్‍ బిస్కట్లతో చేసుకున్నాను. ఎం.ఏ. డిగ్రీ కూడా చేతికి వచ్చింది. జీవితం ఎన్ని మలుపులు, మజిలీలు తిరుగుతున్నా, వ్యక్తిగత జీవితంలో ఎన్ని ఒడిదొడుకులున్నా ఇంగ్లీషు, తెలుగు సాహిత్యాలను, సామాజిక శాస్త్రాల అధ్యయనాన్ని మాత్రం వదులుకోలేదు. అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ నేను నిరంతర విద్యార్థినే. అక్షరాల, బాటలో, అక్షరాల నీడలో సేదతీరటం నా సహజ సిద్ధ స్వభావం.

బ్రతుకు తెరువుకోసం మళ్లీ ఉద్యోగం చేయక తప్పలేదు. ఒక ప్రైవేటు కాలేజీలో రాజనీతి శాస్త్ర ఉపన్యాసకుడిగా చేరాను. రెండు సంవత్సరాల తర్వాత నా ముక్కుసూటి మనస్తత్వం వల్ల మేనేజ్‍ మెంటుతో గొడవలు జరిగి ఆ ఉద్యోగం కూడా ఊడిపోయింది. మనిషి మళ్లీ రోడ్డున పడ్డాడు.
మళ్లీ ఆకలి రాజ్యం రోజులు మొదలయి నాయి. అప్పులు చేసి పప్పు కూడు తినటం మొదలయ్యింది. ‘‘శ్రమ నిష్పలమై జన్మ నిష్ఠురమై’’ అన్నట్లు బ్రతుకు నలుగురిలో నవ్వుల పాలయ్యింది. మళ్లీ ఇటుక మీద ఇటుక పేర్చి జీవితాన్ని నిర్మించుకోవాలి. అప్పుడు ఎర్నెస్ట్ హెమింగ్వే సూక్తి నాకు కొత్త ఉత్సాహాన్ని, బలాన్ని ఇచ్చింది. ‘‘మనిషిని నాశనం చేయొచ్చు, కాని ఒడించలేం’’ ఒక వంక పోటీ పరీక్షలకు ప్రిపేర్‍ అవుతూనే లైబ్రరీలో కూచుని విపరీతంగా తెలుగు, ఇంగ్లీష్‍ పుస్తకాలు చదివాను. అవన్నీ నా దృష్టిలో ఆణిముత్యాలే. సంక్షోభ సమయాల్లోనే మనిషి తనను తాను పునర్‍నిర్మించుకుంటాడు. ‘‘జీవన్‍ నయా మిలేగా అంతిమ్‍ చితామే జల్‍కే’’ కష్టాల కొలిమి నుండి మనిషి కాలి, కాలి ‘‘అగ్ని పునీత సీత లాగా’’ ఇవతలికి రావాలి గతానికి ఒక పెద్ద ఇనుప తెరవేసి నూతన మానవుడుగా రూపొందాలి.
అప్పటికి నా వయస్సు 35 దాటింది. ఒక కూతురు కూడా పుట్టింది. అప్పుడు మొదటిసారి పబ్లిక్‍ సర్వీస్‍ కమీషన్‍ పరీక్షలు రాసి మెరిట్‍లో సహాయ వాణిజ్య పన్నుల అధికారిగా ఉద్యోగం సంపాదించాను. నియామకం కూడా హైద్రాబాద్‍ నగరంలోనే జరిగింది. నా అదృష్టం కొద్దీ గతంలో నేనభవించిన జైలు జీవితం, నా వామపక్ష రాజకీయాల జీవితం ప్రభుత్వ ఉద్యోగానికి ఏమీ అడ్డురాలేదు. మంచి జీతం, మంచి ఉద్యోగం.
(తరువాయి వచ్చే సంచికలో)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *