జాతీయోద్యమ విలువలను కాపాడుకుందాం!

దక్కన్‍ల్యాండ్‍ పాఠకులకు, శ్రేయోభిలాషులకు, స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ స్వాతంత్య్ర సాధనకు 1885 నుంచి 1947 వరకు జాతీయోద్యమం నడిచింది. విదేశీపాలనను వ్యతిరేకించే ఉద్యమం జాతీయ ఉద్యమం. సుదీర్ఘ ఉద్యమంలో అనేక భిన్నాభిప్రాయాలు, భిన్న ఆలోచనలు, భిన్న ఆచరణలు ఉంటాయి. అయితే వీటన్నిటి లక్ష్యం ఆంగ్లేయులను తరిమికొట్టి బానిస సంకెళ్ల నుండి మన దేశానికి విముక్తి సాధించడమే. ఈ విశాల భారతంలో అనేక మతాలు, జాతులు, కులాలు, భాషలు, ప్రత్యేక సంస్క•తులు, ఆచారాలు, నమ్మకాలు, జీవన విధానాలు ఉండటం సహజమే. దీన్ని అవకాశంగా తీసుకొని ఆంగ్లేయులు విభజించి పాలించు విధానాన్ని అవలంభించారు. ప్రజల ఐక్యతకు భంగం కలిగించారు.
దేశం బానిసత్వం నుంచి బయటపడి స్వాతంత్య్రం పొందటం ఎంత ముఖ్యమో దేశంలో ప్రజలకు సానుకూల సామాజిక పరిస్థితులను అందించడం అంతే ముఖ్యం.

జాతీయ ఉద్యమం ఒక రాజకీయ ఉద్యమం. స్వాతంత్య్రం కోసం పోరాడుతూనే సామాజిక భద్రతకు కూడా కృషి చేసింది. దేశ ప్రజల సేవకోసం సర్వీస్‍ ఆఫ్‍ ఇండియన్‍ సొసైటీని గోఖలే స్థాపించాడు. నిర్బంధ ప్రాథమిక విద్యను ప్రతిపాదించాడు. సురేంద్రనాథ్‍ బెనర్జీ జాతీయ నిధిని ఏర్పాటు చేసాడు. వందేమాతరం ఉద్యమ నేపథ్యంలో ఠాగూర్‍ శాంతినికేతన్‍ స్థాపించాడు. ప్రజల మధ్య ఐక్యత కోసం రక్షాబంధన్‍ వంటి కార్యక్రమాలను చేపట్టారు. జాతీయోద్యమంలో విదేశీవస్తు బహిష్కరణ, స్వదేశీ వస్తూత్పత్తి, ఖద్దరు ఉద్యమం కీలకమైనవి. స్వావలంబన కోసం వర్తమాన సందర్భంలో ఆచరించవలసిన జాతీయోద్యమ లక్ష్యాలు ఇవి.

జాతీయోద్యమానికి ముందుగానూ, సమాంతరంగానూ సామాజిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక సంస్థలు ఏర్పడ్డాయి. సత్యశోధక్‍ సమాజ్‍, బ్రహ్మసమాజం, ఆర్యసమాజం, రామకృష్ణ మిషన్‍, దివ్యజ్ఞాన సమాజం ముఖ్యమైనవి.
ఇవన్నీ భారత దేశంలో సామాజిక మార్పుల్ని కోరుకున్నాయి. నైతిక విలువలను పాదుకొల్పాయి. సతీ సహగమనం వంటి దురాచారాన్ని రద్దు చేయించగలిగాయి. సాంఘిక పునరుజ్జీవనోద్యమాలకు బాటలు వేసాయి.

జ్యోతిరావు పూలే 1873లో స్థాపించిన సత్యశోధక సమాజ్‍ అంటరాని తనానికి, ఆధిపత్యానికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరిచింది. సావిత్రిబాయిఫూలే మొదటిసారిగా మహిళలకు పాఠశాలలు ఏర్పాటు చేసి విద్యబోధించిన తొలి మహిళా ఉపాధ్యాయురాలు. ఫూలే భావజాలం ఇవాళ నడుస్తున్న సామాజిక ఉద్యమాలకు దిక్సూచిగా ఉంది.
ఇన్ని మహా సంస్థలు, సామాజిక ఉద్యమకారులు చేసిన కృషిని మనం కొనసాగించవలసి వుంది. వారు ప్రతిపాదించిన విలువల స్థాపనకు కృషి చేయాల్సి వుంది. అసమానతలు లేని, వివక్షలులేని, పేదరికంలేని స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వెల్లివిరిసే ఆధునిక సమాజాన్ని నిర్మించుకోవలసి వుంది.
అప్పుడే జాతీయోద్యమ లక్ష్యాలను సాధించగలం.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *