ఆంగ్లో, ఫ్రెంచి శైలి డాక్‍ ఘర్‍అయిటిపాముల చరిత్ర

నల్లగొండ జిల్లా కట్టంగూర్‍ మండలంలోని గ్రామం అయిటిపాముల. 65నం. జాతీయ రహదారి మీద కనిపించే ఈ వూరి చరిత్రను చూడడానికి రమ్మని జర్నలిస్టు, నమస్తే తెలంగాణా దినపత్రిక కార్యాలయంలో పనిచేసే విక్రమ్‍ నన్ను అయిటిపాములకు తీసుకుని వెళ్ళాడు. పజ్జూరు నుంచి మా బృందసభ్యుడు రాగి మురళి వచ్చి మాతో కలిసాడు. ఈ గ్రామసందర్శనంలో మాతోపాటు అయిటిపాముల గ్రామస్తులు ఎంపిటీసి పబ్బు వేంకటేశ్వర్లు, లక్ష్మారెడ్డి, రిటైర్డ్ టీచర్‍, ఇటికాల సురేందర్‍, పసునూరి పృథ్వీరాజ్‍, కొప్పు సైదులు పాలుపంచుకున్నారు.
అయిటిపాముల వంటి పేరున్న గ్రామాలు చాలానే వున్నాయి. అయిటిపాముల, ఇనుపాముల, తాటిపాముల, ఎనుపాముల, కారుపాముల పేర్లున్న గ్రామాలున్నాయి. నకిరేకల్లులో పూర్వం కరోడ్గిరి వుండేది. ఇపుడాభవనం కాంప్లెక్స్ గా మార్చబడ్డది. నిజాంరాజ్యంలోనికి ప్రవేశించేవారు (ముఖ్యంగా బ్రిటిష్‍ వారు) తమ నాణేలను నిజాం నాణేలుగా ఇక్కడ మార్చుకునేవారు. దానిని ఆధారం చేసుకుని కొందరు ఇనుపాములను ‘in’ farmలగా, అయిటిపాములను’ou’farmలగా చెప్పిన వారి క్రియేటివిటీ గొప్పదే. ఈ గ్రామాల పేర్లు పూర్వమే శాసనాలలో చెప్పబడ్డాయి కనుక ఈ వివరణ తప్పు.


అయిటిపాముల గ్రామంలో పాత దేవాలయాల స్థానంలో కొత్తగుళ్ళు కడుతున్నారు. పాతగుడుల శిల్పాలు కొన్ని బయటపెట్టి వున్నాయి. దేవాలయాలు గోడలు, ఇతరాలు నేలలో పరిచినట్లున్నారు. పాతదేవాలయాల శిల్పాలలో కళ్యాణీ చాళుక్యుల శైలిలో వున్న ఆదిత్యుడు, 5పడగల నాగదేవతాశిల్పం, చతుర్భుజుడు, వెనక చేతులలో చక్రం, శంఖాలు, ముందు చేతులలో అక్షమాల, కమండలాలు ధరించి, మూడుతలలతో కనిపించిన ఈ విగ్రహం బ్రహ్మదేవునిది. బ్రహ్మదేవుని శిల్పాలు మనకు 9 నుంచి 12వ శతాబ్దాలలో అక్కడక్కడ కనిపిస్తాయి. ఈ శిల్పం శైలి కందూరుచోడుల శిల్పాలతో పోలివుంది. కనిపించిన రెండు పానవట్టాలలో ఒకటి రెండంచుల చిన్నపానవట్టం, రెండవది 5అంచుల పెద్దపానవట్టం ఇవి కూడా చాళుక్యులశైలివే. రెండువినాయకశిల్పాలున్నాయి. ఒకటి పెద్దది మోదకభక్షకుడు, అర్థచంద్రాకార కిరీటం, పరశువు, అంకుశం, విరిగిన దంతం, నాగ ఉదర బంధాలతో రాష్ట్రకూటశైలి అనిపిస్తున్నది. మరొక వినాయకవిగ్రహం అలంకృత కిరీటం, చెవులు కూడా తీర్చిదిద్దబడ్డాయి, ద్విభుజుడు, నాగోదర బంధం లేదు.పరశువు, అంకుశాలు లేవు. కుడిచేత విరిగిన దంతం, ఎడమచేయి విరిగి వుంది. ఇది జైనమా అని సందేహం.

రాష్ట్రకూటశైలిలో చెక్కిన అష్టభుజి మహిషాసురమర్దిని. కుడివైపు చేతులలో చక్రం, బాకు, ఖడ్గం, త్రిశూలాలు, ఎడమవైపు చేతులలో శంఖం, శూలం, డాలు, మహిషుని కొమ్ములున్నాయి. కుడివైపు సింహం, ఎడమవైపు మహిషరూపంలో మహిషాసురుడు చెక్కబడ్డారు. కరండమకుటం, పెద్దకుండలాలు, కంఠహారం, కుచబంధంతో కటివస్త్రం, కడియాలు ధరించివుంది. బ్రహ్మ విగ్రహంలో వున్నట్టు శంఖ, చక్రాలుండడం వల్ల ఈ శిల్పం బ్రహ్మశిల్పం కాలానికి చెందినదవుతుంది. శివాలయ ద్వారపాలకుడిగా ఎక్కడా భైరవరూపం కనిపించదు. తలమీద ఏకఛత్రంతో (ఛత్రం జైనశిల్పలక్షణం), జటలు, చెవులకు పెద్దకుండలాలు, కంఠహారాలు, భుజకేయూరాలు, ఉదరబంధం, కటిహారాలు, కపాలజంధ్యం, నాగాభరణుడు, చతుర్భుజుడైన ఈ భైరవుడు ఢమరుకం, త్రిశూలం, ఖడ్గం, రక్తపాత్ర, ఖండిత శిరస్సులతో రూపంలో వీరభద్రుని వేషధారణ, ఎత్తుమడిమల పావుకోల్లు ధరించివున్నాడు. నగ్నమైన కటిభాగం, జానువులపై నాగబంధం, కుడివైపున నగ్నంగా కూర్చునివున్న లజ్జాగౌరిని పోలిన స్త్రీమూర్తి, ఎడమవైపు తలపై రుద్రాక్షమాలచుట్టి, దండకడియాలు, చేతికి, కాళ్ళకు కడియాలు, ఎడమవైపునుంచి పట్టీతో వేలాడిన డోలుతో పురుషమూర్తి వున్నారు. ఇంతవరకు ఎక్కడా కనిపించని ఈ విగ్రహం శైవకాలాముఖులదై వుంటుంది. గుడికి దక్షిణంగా నిలబెట్టివున్న ధ్వజస్తంభం. నలుపలకల ఈ స్తంభంమీద ఎన్నో శిల్పాలు నాలుగుదిక్కుల చెక్కివున్నాయి. తూర్పు దిక్కున షణ్ముఖుడు, పైన సూర్యచంద్రులు, పైన గజలక్ష్మి, పైన హనుమంతుడు, పైన కచ్ఛపం, లగుడధారి, పైన నంది వున్నాయి. దక్షిణం దిక్కున శృంగారభంగిమ, పైన శిల్పాలు చెదిరి పోయాయి. ఉత్తరంవైపున ద్విభుజుడైన దండం ధరించిన ద్వారపాలకుడున్నాడు.


గ్రామంలో పాటిమీద, ఆర్జాలబాయి దగ్గర విరిగిన నంది, తలలేని చాముండి, పొట్టభాగం కనిపిస్తున్న వినాయకుడు, పోతరాజుగా పిలుస్తున్న రాయి, నేలలో కూరుకున్న మరొక విగ్రహం కనిపించాయి. దానిని పైకి లేపి చూస్తే చతుర్భుజియైన దేవతకు వెనక కుడిచేతిలో పాశం, ముందు ఎడమచేతిలో పుస్తకం వున్నాయి ముఖం దెబ్బతిన్నది. ఏడురాళ్ళ కమ్మలు, కంఠహారాలు, భుజభూషణాలు, పద్మంపై పద్మాసనంలో కూర్చుని వుంది అర్థనగ్నదేవత. ఈ దేవత సరస్వతి. 13వ శతాబ్దశిల్పశైలిలో వుంది.

గ్రామంలో కుతుబ్షాహీలనాటి మసీదుంది. మసీదు గేటుమీద ఇంగ్లీష్‍ అక్షరాలలో ‘మస్జిద్‍-ఎ-సరాయె మిరాయెం’ అనివుంది. ఈ మసీదు ఎకరం కంటే పెద్దస్థలంలో విస్తరించి, దీర్ఘ చతురస్రాకారంలో వుంది. ఈ మసీదుకు రెండు మీనార్లున్నాయి. కనుక ఇది షియాల ప్రార్థనాస్థలం. మసీదు ప్రాంగణంలో రెండువైపుల పదికన్నా ఎక్కువ గదులున్నాయి. పూర్వం ఈ గ్రామానికి వచ్చిన ముస్లింలు గుర్రాలను కట్టేసుకోవడానికి, తాత్కాలికంగా వుండి పోవడానికి సత్రంవలె వుండేది. రాళ్ళతో కట్టిన గోడలతో చిన్నచేదబావి వుంది. ద్వారంలో రెండువైపుల కూర్చొనే అరుగులు, కోటద్వారాల వద్ద వుండే విధంగా వున్నాయి.
పరడ గ్రామంలో కళ్యాణీ చాళుక్యచక్రవర్తి జగదేకమల్లుని కాలంలో, క్రీ.శ. 1143లో ఉదయనచోడుడు శాసనం వేయించాడు. ఈ శాసనంలో ఉదయనచోడుడు కరణం బమ్మదేవునికి కందూరు 1100లోని బోదిలేడు 70 నెమ్మాని ప్రభుత్వాన్ని అష్టభోగస్వామ్యంగా కరణబ్రహ్మదేవునికి దానమిచ్చాడు. కరణం బమ్మదేవుడు అందునుంచి తండ్రిపేరన మల్లసముద్రం తవ్వించాడు. భూమిని దానమిచ్చాడు. మల్లికార్జున దేవునికి, కేశవదేవరకు అంగరంగ భోగాలకు దానాలు చేసాడు. 20మంది బ్రాహ్మణులకు తగునన్ని దానాలు యిచ్చాడు.


ప్రస్తుతం అయిటిపాములలోవున్న బమ్మదేవర చెరువు ఈయన పేరుమీద ఎవరైనా తవ్వించి వుండవచ్చు నేమో. పరడలో మల్లికార్జునుని గుడి, నకిరేకల్లులో నకరేశ్వరాలయం, ఇనుపాములలో శివాలయం, ఒల్లాలలో కేశవదేవరాలయం, చందుపట్లలో శైవ,వైష్ణవ దేవాలయాలున్నాయి. వీటి మధ్యన వున్న అయిటిపాములలో 18వ శతాబ్దపు చిన్న శాసనశకలం దొరికింది. ఆ శాసనంలో ‘వికృతి సంవత్సర ఫాల్గుణ శుద్ధ… శనివారం నాడు విడము డాల ఆ…’ అని వుంది. లిపిని బట్టి 18వ శతాబ్దం నాటిదని నిర్ణయించారు. (నల్గొండ జిల్లా శాసనసంపుటి-1,పేజి నం.365, శాసనం సం.162) కందూరుచోడుల పాలనాకాలంనాటి శాసనకాలం దొరికివుంటే అయిటిపాముల చరిత్రలో ఒక పేజీ పెరిగివుండేది.
ఊరి బయట బండమీద సహజంగా ఏర్పడ్డ రాతిగుంటలు రెండు కలిసి ఎడమపాదం గుర్తు అనిపించేచోట ప్రజలు పూజిస్తున్న ఆనవాళ్ళున్నాయి.ఎదురుగా నీటిజల పుట్టిన చోట కుండం కొట్టినట్టున్నారు. అదొక తీర్థమైనది. బమ్మదేవర చెరువుకు తూర్పున పదులసంఖ్యలో పెదరాతియుగపు సమాధులున్నాయి. వాటిలో కొన్ని తవ్వినవి, లోపలినుంచి మూతరాయి తొలగించినవి, బంతిరాళ్ళతో రాతికుప్పల సమాధులున్నాయి. ఒకటి, రెండు వడిసెలరాళ్ళు ఈ ప్రదేశంలో దొరికాయి. చెరువులో మునిగి మరికొన్ని సమాధులున్నాయని గ్రామస్తులు చెప్పారు.
పురామానవుని జీవనసంస్కృతి ఆధారాలు, మధ్యయుగాల దేవాలయాలు, శిల్పాలు, మసీదు, స్థానికపాఠశాలలో ఆంగ్లో, ఫ్రెంచి శైలి డాక్‍ ఘర్‍ (రహదారిబంగ్లా) అయిటిపాముల చరిత్రను తెలంగాణా చరిత్రలో పదిలపరుస్తున్నాయి.
ఊరిబయట ఏనెగుట్టల్లో మోగేరాళ్ళున్నాయి. వీటిని Singing Rocks అంటారు. ఎక్కువమట్టుకు ఏనెగుట్టల్లోని రాళ్ళల్లో చేతితో తట్టినా, రాయితో కొట్టినా ఖన్‍ ఖనమంటు శబ్దాలొస్తాయి. ఆ రాళ్ళస్వభావం కారణంగా, అవి ఏర్పడినపుడు లోపల ఉన్న ఖాళీస్థలాలు, కొంత లోహఖనిజాలుండడం మూలంగా ధ్వనులు పుడతాయని పరిశోధకులు అభిప్రాయం. సైమాటిక్స్ అంటారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *