గాంధీజీ 18 ఏళ్ళ వయస్సులో ఇంగ్లాండుకు వెళ్ళారు. దాంతో అంతవరకు పత్రికలు చదవని ఆయనకు కొత్త ప్రపంచం తెలియవచ్చింది. లండనులో 21 సంవత్సరాల వయస్సులో గాంధీజీ శాకాహారం గురించి తన తొలి రచనను వ్యాసంగా ప్రచురించారు. భారతీయ విద్యార్థులకోసం ‘లండన్ గైడ్’ అనే చిన్న పుస్తకాన్ని, తర్వాత దక్షిణాఫ్రికాలోని భారతీయుల స్థితిగతులు, వారి చరిత్ర గురించి ‘యాన్ అప్పీల్ టు ఎవ్రి బ్రిటన్’, ‘ఇండియన్ ఫ్రాంచైజ్’ అనే కరపత్రాలు వెలువరించారు. తరువాతి కాలంలో ‘ఎ గైడ్ టు హెల్త్’, ‘గ్రీన్ ఫామ్ ప్లెట్’ వంటి వ్యాసాలు వెలువరించారు. ముప్పైదేళ్ళ వయస్సులో ‘ఇండియన్ ఒపీనియన్’ పత్రికను దక్షిణాఫ్రికాలో మొదలుపెట్టి దానికి సంబంధించి చాలా పనులు తనే నిర్వహించేవారు. ‘హింద్ స్వరాజ్’ అనే గుజరాతీ పుస్తకం 1909లో వెలువడిన ఆయన తొలి రచన. 1920లో ‘యంగ్ ఇండియా’, ‘నవజీవన్’ ప్రారంభించిన గాంధీజీ 1933లో తన 64 ఏళ్ళ వయస్సులో ‘హరిజన్’ పత్రికను తెలుగుతోపాటు ఇంగ్లీషు, హిందీ, ఉర్దూ, తమిళం, మరాఠీ, గుజరాతీ, కన్నడ, బెంగాలీ, ఒడియా భాషలలో విజయవంతంగా నడిపారు. ఆయన రోజుకు సాధారణ రాతలో 50 పేజీలు దాకా సగటున రాసేవారు. ఆయన జీవితకాలంలో ఒక లక్ష దాకా ఉత్తరాలు రాశారని అంచనా!
ఆయన ప్రధానంగా ఇంగ్లీషు, గుజరాతీ, హిందీ భాషలలో రచనలు చేసిన వ్యక్తి. ఆయన జీవితకాలంలో రాసిన పుస్తకాలు, పత్రికా వ్యాసాలు, కరపత్రాలు, ఉత్తరాలు అన్నీ కలిపి వంద సంపుటాలు అంటే సుమారు, 50 వేల పేజీలు ‘ది కంప్లీట్ వర్కస్ ఆఫ్ మహాత్మా గాంధీ’గా మనకు అందుబాటులో ఉన్నాయి. ఈయన ఎంత విస్తృతంగా, ఎంత వేగంగా రాసేవారో, తరువాతి కాలంలో మొత్తం ప్రపంచం ఆయన గురించి అంత తీవ్రంగా, లోతుగా ఆలోచన చేస్తోంది, విమర్శిస్తోంది, చర్చిస్తోంది! ఒక అంచనా ప్రకారం మొత్తం ప్రపంచంలో అన్ని భాషల్లో కలిపి ఎక్కువ రచనలు బైబిలు సంబంధించి ఉండగా, రెండవ స్థానాన్ని గాంధీజీ సాహిత్యం ఆక్రమిస్తోంది. ఆయుధాల కన్నా అహింసతో కూడిన పోరాటానికి అవకాశాలు 11 రెట్లు ఎక్కువ. గత శతాబ్ది కాలంలో జరిగిన పోరాటాలలో సాయుధమైనవి 27 శాతం విజయం సాధిస్తే, అహింసా మార్గంలో సాగిన పోరాటాలలో 51 శాతం విజయం సాధించాయి.
నిజానికి గాంధీజీ కెమిస్ట్రీ మీద ఆసక్తి కలిగి ఉన్నా, ల్యాబ్ సరిగా లేకపోవడంతో ఫిజిక్స్ అంశాలను చదువుకోవల్సి వచ్చింది. అలాగే వైద్యశాస్త్రంలో డిగ్రీ గడించి జీవితంలో స్థిరపడాలనుకుంటే, కుటుంబ సభ్యుల సలహామేరకు బారిస్టరు అయిన వ్యక్తి కూడా ఆయనే! ఆ వృత్తిలో తరువాతి దశలో బాగా రాణించినా, మంచి రాబడి అందుబాటులోకి వచ్చినా ఆ వృత్తి మానవాళికి దోహదపడదని తిరస్కరించడమే కాక, తన ప్రజలందరినీ కోర్టులోకి వెళ్లకుండా సామరస్యంతో చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించు కోమని చెప్పిన సాహసి కూడా ఆయనే. భారత స్వాతంత్య్రోద్యమంలో సైతం ఆయన కేవలం సహాయ నిరాకరణ, దండి, క్విట్ ఇండియా ఉద్యమాల్లోనే కీలకంగా కనబడతారు. మిగతా కాలాన్ని పారిశుధ్యం గురించి అవగాహన పెంచడం, వ్యవసాయ పరిజ్ఞానవ్యాప్తి, విజ్ఞాన పరిశోధనను గ్రామాలలోకి తీసుకెళ్ళడం. మద్యపానం అలవాటును నిర్మూలించేందుకు పాటుబడడం, నయాతాలిమ్ పేరున విద్యాప్రణాళికను భారతదేశానికి రూపొందించడం, గ్రామ పునర్మిర్మాణం, సమాజ నిర్మాణం వంటి బృహత్తర కార్యక్రమాలను ఆయన ఎడతెరిపి లేకుండా చేపట్టడానికి వినియోగించారు. ఒకవైపు స్వాతంత్య్రోద్యమంతో సాగుతూనే కుటుంబపరమైన అవరోధాలు, ముఖ్యంగా తన పెద్ద కొడుకు, రెండో కొడుకు ఘనకార్యాల కారణంగా సతమతమయ్యేవారని కూడా మనం కూడా గుర్తుపెట్టుకోవాలి.
డి.జి. టెందూల్కర్ రచించిన ఎనిమిది సంపుటాల ‘మహాత్మా’ రచన రాతప్రతిని 1948లో అనుబంధో పాధ్యాయ కూలంకషంగా చదవడం తటస్థించింది. ఆ కారణంగానే గాంధీజీ బట్టలు కుట్టడం, ఉతకడం, క్షవరం చెయ్యడం, చెప్పులు కుట్టడం, నూలు వడకడం, వంట చెయ్యడం, పాములు పట్టడం, బోధించడం, రోగులకు సహకరించడం, గ్రంథ రచన, వ్యాస రచన ఇలా 26 రకాల శ్రమజీవన సౌందర్యంలో నైపుణ్యం సాధించారని పరిశీలించి 1954లో ‘బహురూపి గాంధీ’ అనే రచనగా అనుబంధోపాధ్యాయ సృజించారు.
ఈ పుస్తకానికి జవహర్ లాల్ నెహ్రూ తన ముందు మాటను 1964 మార్చి పదవతేదీన రాస్తూ గాంధీజీ వివిధ రకాల నైపుణ్య సాధన గురించి ఇలా వ్యాఖ్యానించారు- ‘‘ఆయన అనేక అంశాలపై శ్రద్ధ చూపిన పద్ధతి ఎంతో ఆసక్తి గొలిపే విషయం. ఆయనది పైపైన ఆసక్తి కాదు. ఒకసారి ఒక అంశంపై ఆసక్తి చూపడం మొదలుపెడితే దాన్ని ఎంతో లోతుగా అధ్యయనం చేసేవారు. జీవితంలో చిన్న చిన్న అంశాలు అని మనం భావించేవాటిపై ఆయన చూపిన అపరిమితమైన శ్రద్ధే వారి మానవతా వాదంలో విశిష్టత కావచ్చు. అది ఆయన వ్యక్తిత్వానికి మూలం.’’ ఈ స్థాయిలో ద•ష్టి, సాధన ఉన్న గాంధీజీ వంటి ‘యూనివర్సల్ కమ్యూనికేటర్’కి రచనా, పత్రికా రచన అనేవి జీవితకాలపు సాధనాలు. ఆయన జీవితాంతం రచయితగా, పత్రికా రచయితగా సాగారు.

గాంధీజీ దక్షిణాఫ్రికా నుంచి సాధించిన విజయమే మనదేశపు ప్రముఖులను ఆకర్షించింది. గాంధీజీ కథలు, నవలలు, నాటకాలు రాయలేదు. కానీ వాటినెప్పుడూ ఆయన తక్కువ చేయలేదు. తను ఫిక్షన్ రచయిత కాకపోయినా కాల్పనిక రచయితలను చాలా రకాల స్థాయిలలో ప్రేరేపించారు. గుజరాతీ, మరాఠీ భాషా ప్రాంతాలు, హిందీ, బెంగాలీ ప్రాంతాలు, తెలుగు, తమిళ, మళయాళ కన్నడ, ఒరియా ప్రాంతాలు ఏ మాత్రం గాంధీజీ ప్రభావానికి మినహాయింపు కాదు. ఆయన జీవితాన్ని, ఆయన జీవన విధానాన్ని, స్వాతంత్య్ర పోరాటాన్ని వివరించి, విశ్లేషించే రచనలు చేసిన వారు ఒకవైపు, ఆయన ప్రభావంతో ఎదిగి వచ్చి ప్రజోపయోగ దృష్టితో రచనలు, కళారూపాలు సృజించిన మహనీయులు మరోవైపు చాలామందే ఉన్నారు.
అదే సమయంలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి ప్రతిభావంతుణ్ణి గాంధీజీ కలిశారు, స్నేహాన్ని కొనసాగించారు. రవీంద్రనాథ్ ఠాగోర్ వంటి రచయితలను అన్ని ప్రాంతాల నుంచి ఆయన మిత్రులుగా కలిగి ఉన్నారు. ప్రఫుల్లచంద్ర రే, జగదీశ్ చంద్రబోస్ వంటి శాస్త్రవేత్తలను ఆయన ఆరాధించారు. నందలాల్ బోస్ వంటి కళాకారులు, పన్నాలాల్ ఘోష్, ఎమ్. ఎస్. సుబ్బలక్ష్మి వంటి సంగీత విద్వాంసులు ఆయనకు మిత్రులే. ఆయన స్ప•శించని రంగం లేదు, దృష్టి పెట్టని విషయం లేదు. అయితే ఏ అంశం అయినా ప్రజోప యోగంగా ఉండటమే కాదు, అది అందంగా కూడా అమరాలని వాంఛిస్తారు. అదే సమయంలో ఆ కళారూపం వాస్తవానికి దగ్గరగా, సత్యంతో పూర్తి సమన్వయం కలిగి ఉండాలని ఆశిస్తారు.
1946 ఏప్రిల్ ఏడవ తేదీ ‘హరిజన్’ పత్రిక సంచికలో ఇలా అంటారు – ` Why canµt you see the beauty of color in vegetables? And then there is beauty in speckless sky. But now, you want colors of the rainbow which a mare optical illusion. We have been thought to believe that what is beautiful need not be useful and what is useful cannot be beautiful. I want to show that what is beautiful can also be beautiful అని అనగలిగే ధీశక్తి, ప్రణాళికాత్మకమైన ప్రతిభ ఒక్క గాంధీజీకే సొంతం!
గాఢమైన చదువరి, చక్కని అనువాదకుడు, నేర్పుగల సంపాదకుడు
1929లో ఇరువురు భారతీయ వ్యక్తులు వేరు వేరు పనుల మీద గాంధీజీని వచ్చి సబర్మతీ ఆశ్రమంలో కలిశారు. వారిలో ఒకరు తరువాతి కాలంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పంజాబ్ ప్రాంతపు ఆంగ్ల రచయిత ముల్క్రాజ్ ఆనంద్ కాగా; మరొకరు వ్యవసాయం, రైతు, ప్రకృతి వనరులు, వస్తువినియోగం, దుబారా వంటి విషయాలకు సంబంధించి గాంధీజీ ఆలోచనలను సిద్ధాంతాలుగా రూపకల్పన చేసిన దక్షిణభారత దేశపు మధురై ప్రాంతానికి చెందిన దళిత క్రైస్తవ మేధావి జె.సి. కుమారప్ప! ముల్క్రాజ్ ఆనంద్ తన నవలను చర్చించి తిరగ రాయాలని జె.సి. కుమారప్ప తన సిద్ధాంత గ్రంథానికి ముందుమాట రాయించుకోవాలని గాంధీజీని ఒకే సంవత్సరం వేర్వేరుగా కలిశారు.
పాకీ వృత్తిలో ఉన్న వ్యక్తి ఒక రోజు దిన చర్యను నవలా వస్తువుగా తీసుకుని ముల్క్రాజ్ ఆనంద్ తన ‘ది అన్ టచ్‍బుల్’ నవలను రచించారు. అప్పటికే ఆయన గాంధీజీ నిర్వహించే ‘యంగ్ ఇండియా’ పత్రికలో అస్పృశ్యుల గురించి, దళిత జాతుల గురించి కొన్ని వ్యాసాలు చదివి ఉన్నారు. లండన్ నుంచి బొంబాయి వచ్చి నేరుగా మరుసటి రోజునే గాంధీజీని కలిశారు. తన తొలి పరిచయం రోజున జరిగిన సంభాషణను సర్వేపల్లి రాధాకృష్ణ పండితుడు గాంధీ శతజయంతికి సంపాదకత్వం వహించి, వెలువరించిన సంకలనంలో ఒక వ్యాసంగా ముల్క్ రాజ్ ఆనంద్ రాశారు. (ఈ సంకలనంలోని ఈ వ్యాసంతోపాటు మరో ముప్పయి మూడు వ్యాసాలను పొత్తూరు పుల్లయ్య అనువదిస్తే అన్నపూర్ణ పబ్లిషర్స్ 1970లో ‘గాంధీ మహాత్ముడు నూరేళ్ళు’ అనే గ్రంథంగా ప్రచురించారు.)
గాంధీజీతో లోతుగా చర్చించిన తరువాత ముల్క్రాజ్ ఆనంద్ ‘ది అన్ టచ్ బుల్’ నవలను ముందుమాట కోసం అందజేశారు. నవలను పూర్తిగా చదివిన తరువాత దాదాపు మూడోవంతు నిడివి తగ్గించమని, ఆ వివరాలను వివరిస్తూ సూచనలు చేయడంతోపాటు ముందుమాటను కూడా గాంధీజీ రాశారు. పూర్తయిన తర్వాత ప్రచురణ ఆలస్యం అవుతుంటే, గాంధీజీ ఒక పబ్లిషర్‍కి చెప్పి పుస్తకం త్వరగా వచ్చేలా చూశారు. తరువాత అది అంతర్జాతీయ ఖ్యాతిని పొందడం అనంతర కాలపు చరిత్ర. భారతీయాంగ్ల రచనా ప్రపంచంలో ముల్క్రాజ్ ఆనంద్, రాజారావు, ఆర్.కె. నారాయణ్‍లను రచయితల త్రయంగా పరిగణిస్తారు. ముల్క్రాజ్ ఆనంద్ ‘ది అన్ టచ్‍బుల్’ (1934), రాజారావు ‘కాంతాపుర’ నవల (1938), ఆర్. కె. నారాయణ్ ‘వెయిటింగ్ ఫర్ ది మహాత్మా’ (1955) నవలలు గాంధీజీ జీవన, సిద్ధాంతాలను వస్తువుగా చేసుకుని రూపుదిద్దుకున్నవే. వీరి ప్రభావం భారతీయాంగ్ల రచయితలపై, భారతీయ భాషా రచయితలపై ఎంతగానో ఉంది!
కుమారప్ప 1931లో స్వాతంత్య్రసమరయోధుడిగా జైలు శిక్ష కూడా అనుభవించారు. రెండవ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కోసం 1931 ఆగస్టు నెలలో గాంధీజీ, మహదేవ్ దేశాయి లండను వెళ్ళిన సమయంలో ‘ఎంగ్ ఇండియా’ పత్రిక ఎడిటర్‍గా బాధ్యతలు కూడా కుమారప్ప స్వీకరించారు. అందులో చేసిన రచనల కారణమై రెండున్నర సంవత్సరాల కారాగార శిక్ష కూడా బహుమతిగా అందుకున్నారు. పర్యావరణం, గ్రామీణాభివృద్ధి సంబంధించి గాంధీజీ ప్రతిపాదించిన పునర్నిర్మాణ ప్రణాళికకు శ్రమ చేసిందంతా కుమారప్పగారే. దాదాపు ఏకకాలంలో ఇద్దరు విభిన్న నేపథ్యాలు గల రచయితలను గాంధీజీ ఎలా ప్రభావితం చేశారో పరిశీలించాం. గుజరాతీ, హిందీ, మరాఠీ, ఉర్దూ, బెంగాలీ, మళయాళం, కన్నడ, తెలుగు ఇత్యాది భాషలలో గాంధీజీ ప్రభావం విశేషంగా కనబడుతుంది.

రచయితగా గాంధీజీ విధానాన్ని ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాలి. తన రచనలలో ఒక్క మాటను కూడా గాఢంగా యోచించకుండా ప్రయోగించలేదని, ఒకర్ని మెప్పించాలని కానీ, బుద్ధిపూర్వకంగా కానీ, అతిశయోక్తిగా కానీ ఏమీ రాయలేదని, రచన తనకు సంయమనాన్ని అలవరిచిందని తన ఆత్మకథలో గాంధీజీ ప్రకటించారు. గాంధీజీ మంచి రచయితే కాకుండా, గాఢమైన చదువరి, నేర్పుగల సంపాదకుడు, చక్కని అనువాదకుడు. తన రచనలను తానే ఆంగ్లంలోకి అనువదించుకున్న సందర్భాలు ఉన్నాయి. అలాగే టాల్ స్టాయి, జాన్ రస్కిన్ వంటి వారి రచనలను అనువాదం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. వాస్తవికమైన విషయాలను చెబుతూనే ఆయనకు అలంకారికమైన శైలి కూడా సాధ్యమయింది.
‘టు ది హంగ్రీ, గాడ్ షుడ్ అప్పియర్ ఇన్ షేప్ ఆఫ్ బ్రెడ్ (అన్నార్తునికి దైవం ఆహారరూపంలోనే దర్శనమియ్యాలి)’ అని అనగల సాహసి గాంధీజీ. మలబారు ప్రాంతంలో ఒక బహిరంగ సభలో కౌముది అనే బాలిక తన ఆభరణాలను కానుకగా ఇచ్చినపుడు ఆటోగ్రాఫ్ అడిగితే గాంధీజీ ‘‘నీవు త్యజించిన ఆభరణాలకంటే నీ త్యాగబుద్ధి ప్రశస్తమైన ఆభరణం’’ అని రాసి సంతకం చేశారు. తమ మతంలో చేర్చుకోవాలని వీధులలో ప్రచారం చేసేవారిని తానామోదించలేదని అంటూ ‘‘గులాబీ పువ్వు సుగంధాన్ని మాత్రమే ప్రసరింప చెయ్యాలి. దానికి ప్రచారం అవసరం లేదు. ఆ పువ్వుకు సుగంధమే దాని ప్రవచనం’’ అని కూడా గాంధీజీ వ్యాఖ్యానించారు.
1939 డిసెంబరు 23వ తేదీ సంచిక ‘హరిజన్’ పత్రికలో గాంధీజీ ఇలా రాశారు ‘‘నేను వాడిన cavil అనే క్రియకు తప్పు లెన్నుతూ విమర్శించడమనే’ అర్థమున్నదని, అది ఆ సందర్భానికి పొసగదని ఈ పాఠకుడు సూచించారు. ఇంగ్లీషు మాటలను నేను చాలా జాగ్రత్తగానే ఉపయోగిస్తాను. అయినా ఎంత శ్రద్ధ వహించినా ఆ విదేశీ భాష నాకు పూర్తిగా స్వాధీనం కాకపోవడం వల్ల ఇటువంటి తప్పులు వస్తూ వుంటాయి. ఆ మాటకు నిఘంటువులో ఉన్న అర్థం ఇంతకు ముందు నాకు తెలియదు. ఆ మాటను ఎక్కడో చదవడమో, వినడమో సంభవించి ‘అభ్యంతరం చెప్పడం’ అని దాని అర్థమని అనుకున్నాను. అప్రయత్నంగా నేను ఆ మాటను తప్పుగా ప్రయోగించినందుకు పాఠకునికి క్షమాపణ తెలిపాను.
- డా. నాగసూరి వేణుగోపాల్
ఎ : 9440732392