కోర్టు తీర్పుల్లో సాహిత్యం ఎంత అవసరమోఅంత అనవసరం కూడా

కోర్టు తీర్పుల్లో సాహిత్యం కన్పించడగమనేది ఓ ప్రత్యేకమైన విషయం. సాహిత్యంలో వున్న విషయాలు కోర్టు తీర్పులను ప్రభావితం చేయవు. కోర్టుల తీర్పులని శాసనమే ప్రభావితం చేస్తుంది. అలా చేయాలి కూడా. సాహిత్యాన్ని గానీ, సాహిత్యంలోని అంశాలను కోర్టు అప్పుడప్పుడు ఉపయోగించుకుంటున్నాయి. ఈ విషయం మీద విమర్శ వుంది. న్యాయమూర్తులు తమ సాహిత్య ప్రతిభను చూపించుకోవడానికి సాహిత్యాన్ని ఉపయోగించు కుంటున్నారని అంటున్నారు. తమ నిర్ణయాలను సమర్థించుకోవడానికి మాత్రమే సాహిత్యం ఉపయోగ పడుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. అలాంటప్పుడు సాహిత్యాన్ని తీర్పుల్లో ఉదహరిస్తే తప్పేమిటీ? తీర్పులను సులభతరం చేయడానికి ఇవి ఉపయోగ పడుతాయి. అలాంటి కేసును పరిశీలిద్దాం.

ప్రకాశ్‍ కదమ్‍, మరి ఇతరులు వర్సెస్‍ రాంప్రసాద్‍ విశ్వనాథ్‍గుప్త మరి ఇతరులు
ఈ కేసు సుప్రీంకోర్టు ముందుకు బెయిలు రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ వచ్చింది. ఈ కేసులో ముద్దాయి పోలీసు అధికారులు. పోలీసు అధికారులని ఉపయోగించుకొని హత్యను చేయించారు. ఇది ఆరోపణ. పోలీసుల ప్రకారం ఎన్‍కౌంటర్‍లో వాళ్ళు మరణించారు. అది నకిలీ ఎన్‍కౌంటర్‍ అని ఆరోపణ. కిడ్నాప్‍ చేసి నకిలీ ఎన్‍కౌంటర్‍ సృష్టించి చంపినారని ప్రధమ సమాచార నివేదకని పోలీసులు విడుదల చేశారు. సెషన్స్ కోర్టు నిందితులకు బెయిలు మంజూరు చేసింది. కానీ హైకోర్టు ఆ బెయిలును రద్దు చేసింది. ముద్దాయిలు హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేశారు. హైకోర్టు నిర్ణయాన్ని సమర్థిస్తూ సుప్రీంకోర్టు తన తీర్పుని ప్రకటించింది. కేసులోని తీవ్రతని గమనించి సుప్రీంకోర్టు ముద్దాయిలకు కఠిన శిక్షలు వుండాలని, ఇది వారి విద్యుక్త ధర్మం కాదని న్యాయమూర్తులు మార్కండేయ ఖట్జా అభిప్రాయపడినారు.
సమాజంలో హింస, రక్తపాతం జరగకుండా వుండాలంటే ఇలాంటి నేరాలకు కఠిన శిక్షలు వుండాలి. పోలీసుల చేతిలో చాలా అధికారం వుందని వారు ఇలాంటి నేరాలు చేయగలరని న్యాయమూర్తి ఖట్జా తన తీర్పులో అన్నారు.

తీర్పులోని సాహిత్యం విషయాల అవగాహనను పెంచాలి. అదేవిధంగా సమాజం మీద దాని ప్రభావాన్ని పెంచాలి. న్యాయమూర్తి కోణం నుంచి కూడా నైతిక రాజకీయ సిద్ధాంత నిర్మాణాన్ని అనుబంధంగా వుండాలి. అయితే ప్రకాశ్‍ కదమ్‍ కేసులో న్యాయమూర్తి మార్కండేయ ఖట్జా
ఉదహరించిన సాహిత్య విషయాలు కేసులోని సందర్భానికి తగినట్టుగా వాస్తవానికి అనుగుణంగా లేదు. అయినా కూడా పోలీసు అధికారుల చర్యలలోని తీవ్రతని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతుంది.
సీజర్‍ని అతని సన్నిహితులు కొట్టి చంపిన తరువాత మార్‍ ఆంటోని బాధతో వుంటాడు. భావోద్వేగానికి గురై నిరంకుశ హత్య వల్ల సమాజంలో హింస రక్తపాతం పెరుగుతందని అంటాడు. ఈ విషయాన్ని న్యాయమూర్తి తన తీర్పులో ఉదహరించాడు. కానీ కేసుని వాస్తవాలు పరిస్థితులు భిన్నంగా వున్నాయి. ఒక వ్యక్తి వున్న విభేదాల కారణంగా చంపివేయమని పోలీసులని మరొక వ్యక్తి ఆదేశిస్తాడు. కిరాయి హంతకుడి మాదిరిగా పోలీసులని ఉపయోగించుకుంటాడు. రోమన్‍ రిపబ్లికిజాన్ని దెబ్బతీస్తాడన్న భయంతో సెనేటర్లు సీజర్‍ని పొడిచి చంపుతారు. కదమ్‍ కేసులోని పరిస్థితులు వేరు. న్యాయమూర్తులకి సాహిత్యాభినివేశం వుండటం ఎంత ముఖ్యమో వాటిని తీర్పులలో సరైన రీతిలో ఉపయోగించుకోవడం అంతకన్నా ముఖ్యం. ఆ విధంగా చేయనప్పుడు తీర్పులలో సాహిత్యం ఎందుకు అన్న విమర్శలు వస్తూ వుంటాయి. తీర్పు లక్ష్మీ ఆ కేసులో వున్నటువంటి పౌర్వలు. వాళ్లు ముద్దాయులు కావొచ్చు, బాధితులు కావొచ్చు. న్యాయవాదులు, ప్రాసిక్యూటర్లు కూడా కావొచ్చు. వీళ్ళే కాకుండా తీర్పులోని రేషియోని ఉపయోగించుకోవాలనుకుంటున్న పార్టీలు న్యాయవాదులు కూడా కావొచ్చు. నకిలీ ఎన్‍కౌంటర్ల ప్రభావం సమాజంపై ఏ విధంగా వుంటుందో ప్రజలకు తెలియ చెప్పడం ఈ తీర్పులోని ఉద్దేశ్యం. అయితే ఈ ఉదహరణ వల్ల దానికి బలం చేకూరలేదు.
న్యాయపాలన దెబ్బతిన్నప్పుడు ఆటవిక చట్టం ఆధిక్యంలోకి వస్తుంది. చిన్నచేపలను పెద్ద చేపలు మింగేస్తాయి. ఇదే సమన్యాయం. మహాభారతంలో తన శిక్షాదండాన్ని రోజు ఉపయోగించక పోవడం వల్ల తన రాజ్యాన్ని రక్షించుకోలేక పోతాడు. ఈ ఉదాహరణ కూడా కేసులోని విషయాలకు అనుకూలంగా వున్నట్టు అన్పించదు. రోమన్‍ రిపబ్లిక్‍కి ముప్పుగా మారినందువల్ల సెనేటర్లు జూలియస్‍ సీజర్‍ని చంపడానికి నిర్ణయం తీసుకుంటారు. కేసులోని విషయాలు వేరు.

సాహిత్యంలో అస్పష్టత వుండవచ్చు. సందేహాలు వుండవచ్చు. కానీ తీర్పుల్లో స్పష్టత వుండాలి. సులభంగా అర్థం చేసుకునే విధంగా వుండాలి. సంక్లిష్టమైన భాషలో ఉదాహరణల వెనుక వుండడానికి వీల్లేదు. ప్రకాశ్‍ కదమ్‍ కేసులో ఉపయోగించిన భాష సరళమైనదే. కానీ జస్టిస్‍ ఖట్జా ఉదహరించిన విషయాలు కేసుకి సరిపోయే విధంగా లేవు. ఉదహరించిన విషయాలు కేసుని హైలైట్‍ చేసే విధంగా వుండాలి. ఈ కేసులో ఆ విధంగా అన్పించడం లేదు.
మరణించిన వ్యక్తి దుస్థితిని తన తీర్పులో న్యాయమూర్తి ఖట్జూ వివరిస్తాడు. నిందులైన పోలీసు అధికారుల క్రూరత్వంపై దృష్టిని పెడతాడు. ‘మన సమాజం భయంకరమైన లోయల్లోకి దిగజారింద’ని తీర్పు ప్రారంభంలో న్యాయమూర్తి రాస్తాడు. కేసులోని విషయాలని పరిచయం కావడానికన్నా ముందే ఆ తీర్పు చదివే వ్యక్తి మనస్సులోకి విషయం ప్రవేశిస్తుంది. కేసు విషయంలో పరిచయం అయిన తరువాత ఈ విషయాలు రాస్తే ఆ తీర్పు చదివే వ్యక్తి ఆ చనిపోయిన వ్యక్తికి అనుకూలంగా ఆలోచించే అవకాశం ఏర్పడుతుంది.
తీర్పులు సరళంగా వుండాలి. సంక్షిప్తంగా వుండాలి. మంచి తీర్పు లక్షణం అదే. ఈ తీర్పు సరళంగా వున్నప్పటికీ ఇందులో
ఉదహరించిన విషయాలు తీర్పులో ఆటంకంగా మారతాయి. ఆ విధంగా మారినప్పుడు తీర్పుల్లో సాహిత్యం ఎందుకు అన్న ప్రశ్నలు సహజంగానే వస్తాయి. తీర్పులోని అంశాలు బలంగా వున్నాయి. అయినప్పటికీ సాహిత్యాన్ని ఎక్కువగా వాడటం వల్ల అనవసరంగా పొడిగించినట్లు ఆ తీర్పు చదువురి భావిస్తాడు. సందర్భోచితంగా సాహిత్యాన్ని తమ తీర్పుల్లో ఉదహరించినప్పుడు ఆ తీర్పు చదువరి ఆనందిస్తాడు ప్రశంసిస్తాడూ. అలా లేనప్పుడు అవి ఆటంకంగా, పళ్ల కింద రాయి మాదిరిగా పరిణమిస్తాయి.
ఈ కేసులో ఉదహరించిన సాహిత్య విషయాలు కదమ్‍లోని తీర్పుని ప్రభావితం చేయలేదు. నిజానికి సాహిత్య విషయాలు తీర్పులను సుసంపన్నం చేస్తాయి. పాఠకుల మనస్సులని ప్రభావితం చేస్తాయి. ఆ సాహిత్యం పట్ల ఆకర్శితులవుతారు. సంక్లిష్టమైన మానవ స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడాలి.
ఇక, కేసులోని విషయానికి వస్తే ఒక వ్యక్తిని చంపడానికి పోలీసులని ఆశ్రయిస్తాడు మరో వ్యక్తి. పోలీసులు అతన్ని చంపి నకిలీ ఎన్‍కౌటర్‍గా చూపిస్తారు. ఈ విషయం బయటపడి వాళ్ల మీద హత్యా తదితర నేరాల క్రింద కేసులు నమోదువుతాయి. సెషన్స్ కోర్టు పోలీసు ముద్దాయిలకు బెయిలును మంజూరు చేస్తుంది. దాన్ని హైకోర్టు రద్దు చేస్తుంది. దాన్ని సవాలు చేస్తూ ముద్దాయి పోలీసులు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారు. సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పుని సమర్థిస్తూ ఇలా అంటుంది.

‘‘నిందితుడికి ఒకసారి బెయిలు మంజూరు చేసిన తరువాత బెయిల్‍ని దుర్వినియోగం చేస్తాడన్న అవకాశం వున్నప్పుడే బెయిలుని రద్దు చేయాలి. అయితే ఇది చాలా తీవ్రమైన కేసు. ప్రాథమికంగా చూసినప్పుడు కొంత మంది ప్రైవేట్‍ వ్యక్తులు తమ ప్రత్యర్థిని చంపడానికి పోలీసులని
ఉపయోగించుకున్నారు. పోలీసులు కాంట్రాక్ట్ క్లిర్లుగా మారినారు. ఇలాంటి కేసుల్లో సాక్షుల మనస్సులో అభద్రతాభావం ఏర్పడుతుంది. తమని చంపే అవకాశం వుందని కూడా భావించే అవకాశం వుంది. వారిని బెదిరించే అవకాశం కూడా వుంది.
ఈ అంశాలను త్రోసిపుచ్చలేం. నిందితులకి బెయిలు మంజూరు చేసేటప్పుడు సెషన్స్ జడ్జి ఈ విషయాలను విస్మరించారు. హైకోర్టు వీటిని పరిగణనలోకి తీసుకొని బెయిలుని రద్దు చేసింది. అది సమంజసం కూడా. అంతే కాకుండా ఇలాంటి నకిలీ ఎన్‍కౌంటర్‍ కేసులు రుజువైన సందర్భాలలో వారికి మరణ శిక్ష విధించాలి. ఇలాంటి నేరాలని అరుదైన వాటిలో అరుదైన కేసుగా పరిగణించాలని ‘‘సుప్రీంకోర్టు’’ తన ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఎన్‍కౌంటర్లు అంటే చట్టాన్ని కాపాడాల్సిన వ్యక్తులు చేసే క్రూరమైన హత్య అని సుప్రీంకోర్టు పేర్కొంటూ అప్పీళ్లను కొట్టి వేసింది.
తీర్పులలో సాహిత్యం ఎంత అవసరమో, కొన్ని సందర్భాలలో అంత అనవసరమని ఈ తీర్పు రుజువు చేసింది. తీర్పు చాలా గొప్పది. ఉదాహరణలు సరిపోలేదు. అదే బాధాకరమైన విషయం.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *