(గత సంచిక తరువాయి)
ఒక కొడుకు కూడా పుట్టాడు. పైకి రోజులు సంతోషంగానే గడుస్తున్నాయి. జీవితం ‘‘మకాన్ సే దుకాన్, దుకాన్ సే మకాన్’’ అన్నట్లు తయారయ్యింది. భౌతిక జీవితం బాగానే ఉన్నా అంతరంగిక ఆత్మకు సంబంధించిన జీవితంలో పెద్ద డొల్లతనం ఏర్పడింది. ఏదో ఒక చెప్పరాని వెలితి. నలభై సంవత్సరాల వయస్సులో ఆకస్మికంగా, ఆక్సిడెంటల్‌గా నాకు తెలియని, నాకు కాని జీవితంలోకి, నాది కాని ప్రపంచంలోకి వచ్చి పడినట్లయ్యింది. అసలు నేనేంది? ఎక్కడ్నించి ఎక్కడికి ప్రయాణించి ఇక్కడికి వచ్చాను? అసలు నా అస్తిత్వం, నా చైతన్యం ఏమిటి అని నాలో లోపల ఒక సంఘర్షణ మొదలయ్యింది. కారల్ మార్క్సు చెప్పిన ‘‘ఏలియనేషన్’’ మానసిక వైమనస్యత అంటే ఇదే కాబోలని వేదన, నిరంతర మథనం ప్రారంభ మయ్యింది. అసలు మనిషి తన నలభై సంవత్సరాల నడి వయస్సులో తన సహజసిద్ధ అస్తిత్వాన్ని, చైతన్యాన్ని వదులుకొని మెయిన్స్టీమ్ జనజీవన స్రవంతిలో కలవగలడా? అనేది ఒక ముఖ్యప్రశ్నగా మారి ‘‘ముల్లులా’’ నా ఆత్మను తూట్లు తూట్లుగా పొడవసాగింది.
‘‘జంతువులా సంతృప్తిగా బ్రతికే బదులు, మనిషిలా అసంతృప్తితో బ్రతకటం మేలు’’ అన్న జె.ఎస్. మిల్ కొటేషన్ తరచుగా జ్ఞాపకం వచ్చేది. నా తోటి ఉద్యోగ మిత్రులు చాలామంది ప్రతిరోజు ‘‘పంచరంగుల పిచ్చినోట్లను’’ రెండు చేతులా సంపాదిస్తూ ప్రతి సాయంత్రం ‘‘మెహఫిల్’’లో కూచుని హోమ జ్వాలల భగభుగలలో తేలిపోతుండేవారూ. వారి సావాస దోషంతో నేనూ కూచునేవాడిని. వారందరూ షేర్ మార్కెట్ల గురించి, భూముల దంధాల గురించి మాట్లాడుతుంటుంటే అదంతా నాకు గ్రీక్ అండ్ లాటిన్ భాషలా తోచేది. ‘‘పైసా హీ పరమాత్మాహై’’ అనే మనుషుల సాంగత్యం నాకు చికాకు కల్గించేది. తాగుతున్నపుడు కూడా నాకు పత్తి రైతుల, చేనేత కార్మికుల ఆత్మహత్యలు, ఇరాక్ యుద్దమూ, ప్రపంచీకరణ జ్ఞాపకం వచ్చి నాలో తెలియని అసహనం, నాపైన నాకే కోపమూ, అసహ్యమూ కలిగేవి. కనపడే యుద్ధం అవతలి ప్రపంచంలో జరుగుతుంటే కనపడని యుద్దం నాలో నిరంతరం జరుగుతుండేది. ‘‘మనసున్న మనిషికి సుఖము లేదంతే’’ అని ఆత్రేయ అన్నట్లు తయారయ్యింది నా జీవితం.
అట్లాంటి సంక్షోభ దినాలలో నాకు ‘‘నెల నెలా వెన్నెల’’ అనే సాహితీ సంస్థతో పరిచయం జరిగింది. ప్రతి నెలా ఒక ఆదివారం సాయంత్రం ఆ సమావేశాలు జరుగుతూ ఉండేవి. దానిని క్రమం తప్పకుండా శ్రీ సి.వి. కృష్ణారావుగారు నిర్వహించేవారు. యువ కవులు, సీనియర్ కవులు ఆ వారంలో రాసిన తాజా తాజా కవితలు చదివి వినిపించేవారు. సాహిత్యాభిమానులు వచ్చేవారు. సాహిత్యంపై చర్చలు జరిగేవి. నెమ్మది నెమ్మదిగా నాలోని సాహిత్య జీవి మళ్లీ పునర్జన్మించసాగాడు. నగరంలో జరుగుతున్న సాహిత్య సభలకు, పుస్తకావిష్కరణలకు హాజరు కావటం ప్రారంభించాను. దానితో కొంచెం చిత్తశాంతి మరికొంత హృదయశాంతి లభించింది. నా జీవితం సాహిత్యంతో మొదలై సమసమాజ ఉద్యమాల్లోకి వెళ్లి మళ్లీ నా జన్మ స్థానమైన సాహిత్యానికి వచ్చింది. రకరకాల ఇంగ్లీష్, తెలుగు పుస్తకాలు దండిగా కొని మెండుగా చదివాను. నా కంటూ ఒక స్వంత గ్రంధాలయం దిన దిన ప్రవర్థమానంగా కొనసాగింది. మనిషి మళ్లీ కొంచెం కుదుటపడ్డాడు.
జేబులు నిండుగా ఉండటం వలన ‘‘హ్యాపి ఎస్కేప్’’ కోసం కుటుంబ సమేతంగా కొన్ని, ఎక్కువకెక్కువగా మరికొన్ని ఒంటరి యాత్రలు చేసాను. నా స్వభావం సహజంగానే ఒంటరి సంచారాలను ఇష్టపడుతుంది. ఒంటరి యాత్రల లక్ష్యం మనలోకి మనం ప్రయాణించటం ఆత్మావలోకనానికి అది చక్కని అవకాశం. చరిత్ర, ప్రకృతి అభిమానినైన నేను రాష్ట్రంలోని, దేశంలోని అనేక ప్రాంతాలు విస్త•తంగా సందర్శించాను. గతంలో రాహుల్ సాంకృత్యాయన్, సంజీవ్‌దేవ్‌ల వల్ల అమితంగా ప్రభావితుడినైన నేను ఇప్పుడు స్వేచ్చ, అవకాశాలు లభించినందున ‘‘ఘుమక్కడ్’’ సంచారతత్వాన్ని అలవరచుకున్నాను.
ఉన్న జీవితంతో సమాధానపడటం రాజీ పడటం మొదలయ్యింది. నా లోపలి వెలితిని పూడ్చటానికి సాహిత్యాన్ని, అధ్యయనాన్ని, రచనను ఆలంబనగా చేసుకున్నాను. ముందు వచన కవితలు రాసాను. కొన్ని పత్రికలలో అచ్చయిన్నాయి. తర్వాత నాకు అలవాటైన వ్యాస రచన సాగించాను. కవి మిత్రుడు వేణు సంకోజు పట్టు పట్టటంతో మొదటిది, చివరిదీ ఐన కవిత్వ పుస్తకం ‘‘ముసాఫిర్’’ (యాత్రికుడు) వచ్చింది. దానికి జతగా నేను రాసిన వ్యక్తి చిత్రాలు (pen portraits)కూడా వచ్చింది. నాకు బాగా తెలిసి, నన్ను ప్రభావితం చేసిన ప్రముఖుల గురించి అందులో చిత్రించాను.
1995-96 నుండి తెలంగాణా జనసభ వారు ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర సాధన కోసం తెలంగాణా అంతటా సభలు జరపటం మొదలు పెట్టారు. 1969 ఉద్యమంలో నేనూ పాల్గొన్నాను. కావున మళ్లీ నాలోపలి పాత ఉద్యమకారుడు మేల్కొన్నాడు. ‘‘తిట్టేనోరు-తిరిగే కాలు’’ ఊరికే ఉండదు కదా! అనతికాలంలోనే తెలంగాణా ఉద్యోగులందరూ కల్సి కేవలం రాష్ట్ర సాధనే లక్ష్యంగా ‘‘తెలంగాణా ఉద్యోగుల సంఘం’’ను స్థాపించారు. అందులో నేను కీలక పాత్ర పోషించి రాష్ట్ర సంఘానికి ఉపాధ్యక్షుడిగా ఎన్నికైనాను. ఇక ఆ సంఘం విస్తరణకై తెలంగాణాలోని అన్ని జిల్లాలు పర్యటించాను. గతంలో నేను సంపాదించిన నా నిర్మాణ శక్తి యుక్తులన్నీ ఆ సంఘానికి ఉపయోగ పడినాయి. ప్రతి సంవత్సరం ఆ సంఘం తరపున వార్షిక డైరీలు తీసుకరావటంలో, దాని రూపకల్పనలో నా మేధోశక్తి ఎక్కువగా ఉపయోగపడింది.
2001లో ‘‘తెలంగాణా రచయితల వేదిక’’ ఆవిర్భవించింది. అందులో కూడా చురుకుగా నా వంతు పాత్ర పోషించాను. ‘‘చరిత్ర నైనా చదువుతుండాలి లేదా చరిత్ర నిర్మాణంలోనైనా పాల్గొనాలి’’ అనే బాలగోపాల్ మాటలు నాకు నిత్యస్మరణీయాలు.
2001లో టి.ఆర్.యస్. రాజకీయ పార్టీగా అవతరించిన తర్వాత ప్రత్యేక రాష్ట్ర
ఉద్యమం ఊపందుకున్నది. నా వంతు కర్తవ్యంగా ఒక ప్రత్యేకమైన, విశిష్టమైన పని ఎవరూ చేయనిది చేయాలనిపించింది. చాలా రోజులు ఆలోచించి ‘‘ప్రత్యేక తెలంగాణా ఉద్యమాల చరిత్ర’’ రాయాలని నిర్ణయించు కున్నాను. అందులో భాగంగానే 1969లో నడిచిన రక్త సిక్త ఉద్యమాన్ని ప్రముఖంగా వివరించాలని కూడా నిర్ణయించుకున్నాను. దీనికోసం చరిత్ర ‘‘తవ్వకం పని’’ చేయాలి. ఎట్లా మరి? తప్పదు కావున ఉద్యోగానికి నెల రోజులు లాంగ్‌లీవ్ పెట్టాను. నా దగ్గరున్నవే కాక ఇంకా మరి కొన్ని చరిత్ర పుస్తకాలు సేకరించుకున్నాను. ముల్కీ ఉద్యమం జన్మించింది బహమని సుల్తాన్ల కాలం ‘‘బీదర్’’లో, అప్పటి నుండి 1969 ప్రత్యేక తెలంగాణా ఉద్యమం వరకూ నడిచిన చరిత్రను గ్రంధస్తం చేయాలని ప్రణాళిక వేసుకున్నాను. 1969లో వీధులలో రక్తం సాకబోసిన 9 నెలల చరిత్రను రోజు వారి రికార్డు చేయాలని కూడా నిర్ణయించు కున్నాను. దీని కోసం అప్పటి దినపత్రికల అధ్యయనం తప్పని సరి. చిక్కడపల్లి నగర కేంద్ర గ్రంధాలయంలో ఆనాటి ‘‘ఆంధ్రభూమి’’ దినపత్రికలు లేవు.

అఫ్జల్‌గంజ్ స్టేట్ సెంట్రల్ లైబ్రరీలో ఉన్నాయి. అక్కడికి వెళ్లి సంబంధిత అధికారులను కలిసాను. 30 సం।।ల క్రిందటి పేపర్లు దొరకవు సార్ అని ఒక్క ముక్కలో తేల్చిపారేసారు. ‘‘డూండేతో ఖుదా భీ మిల్తాహై’’ అనగా దేవులాడితే దేవుడైనా దొరుకుతాడని నా పంతం. చివరికి ఒక వృద్ద అటెండర్‌ను పట్టుకున్నాను. పేరు ‘‘ఓబైదుల్లా’’ మై ఖోషీష్ కరూంగా సాబ్ అని ఒక నేల మాళిగలోకి తీసుకపోయాడు. దుమ్ము ధూళిలో, ముక్కులకు దస్తీలు ••ట్టుకుని వెతకగా, వెతకగా దొరికాయి. అపురూపంగా వాటిని పైకి తీసుకొచ్చి ముందు నెలల వారీగా ఆ తర్వాత దినాల ప్రకారం సర్దుకున్నాను.
ఇంట్లో ఇదీ సంగతి అని చెప్పేసాను. మా ఆఫీసులో ఎవరూ ఒక రోజు సెలవుపెట్టరు. ఎందుకో చెప్పను. అదొక చిదంబర రహస్యం. చెబితే బాగుండదు. తెలంగాణా ఉద్యమ సందర్భంలో నేను ఉన్న లీవులన్నీ వాడుకుని నలుగురు నన్ను చూసి ‘‘నవ్వుకునేలా’’ చేసాను.
ప్రతిరోజూ ఆఫీసుకు వెళ్లినట్లే టిఫిన్ డబ్బా కట్టుకుని లైబ్రరీకి వెళ్లేవాన్ని. సాయంత్రం ఐదు వరకూ నోట్సులు రాసుకునే పని మధ్యాహ్నం ఇవతలికి వచ్చి సర్కారీ నల్లా వద్ద కాల్జేతులు కడుక్కుని, చెట్టుక్రిందనో, అరుగు మీది నీడలనో కూచుని అన్నం తిని మళ్లీ పనిలోకి ఎక్కేవాడిని.
అట్లా నెలరోజులు మేధో శ్రమ పడినందున ‘‘ప్రత్యేక తెలంగాణా ఉద్యమ చరిత్ర’’ పుస్తకం 2002లో వచ్చింది. నా స్వంత డబ్బులతో. ఉద్యమానికి ఆ పుస్తకం ‘‘బైబిల్’’ లా పనిచేసి ఆరేడు ముద్రణలకు నోచుకుంది. ముందు ‘‘శోభాగాంధీ’’ పేరుతో ఆ తర్వాత అన్ని ప్రచురణలు నా పేరుతో.
నా దృష్టిలో రచన అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. మన ఆత్మను చీల్చుకుని నిజాయితీగా ఇవతలికి రావాలి. అగ్నిపునీత సీత లాగా! అనేక జిల్లాలలో ఆ పుస్తకం ఆవిష్కరణలు జరుపుకుంది. ఆ తర్వాత ‘‘వేయిన్నొక శేష ప్రశ్నలు’’ అనే వ్యాస సంపుటి అదే సంవత్సరంలో తీసుక వచ్చాను.
ఉద్యమ వ్యతిరేకులు అనేక ప్రశ్నలు శరపరంపరగా సంధిస్తున్నపుడు ‘‘కనువిప్పు’’ జవాబులు నా ఈ వ్యాస సంపుటి తీసుకొచ్చాను. ఈ పుస్తకం తెలంగాణాకు కొత్త కోణాలతో ఒక సైద్దాంతిక పునాదిని ఏర్పరచింది. ఇది కూడా అనేక ముద్రణలు పొందింది.
ఆ తర్వాత 2004లో ‘సలాం హైద్రాబాద్’’ నవల రాసాను. ఇది నా డ్రీమ్ ప్రాజెక్టు. అనేక సం।।ల కల కృషి ఫలితమే ఈ నవల. హైద్రాబాద్ నగర గొప్పతనాన్ని, ఆకాశానికి ఎత్తిన నవల ఇది. కుష్వంత్‌సింగ్ రాసిన ‘‘డిల్లీ’’ నవల, అబ్దుల్ హలీమ్ షరర్ రాసిన ‘‘పాచీన లక్నో’’ దీనికి ప్రేరణ. ఈ నవల మూడు నెలల కాలంలో రెండవ ముద్రణకు నోచుకుంది. చాలా ప్రాంతాలలో సభలు, ఆవిష్కరణలు జరిగాయి. చారిత్రిక నవలా కారుడిగా గుర్తింపు వచ్చింది. దీని రెండవభాగం ‘‘కల్లోల కలల కాలం’’ పేరుతో 2022లో వచ్చింది. దీని కథాకాలం 1970-1989. మూడవ భాగం ఇంకా రాయాలి.
(తరువాయి వచ్చే సంచికలో)
-పరవస్తు లోకేశ్వర్
ఎ: 91606 80847