
ఈ నెలలో వివిధ అంశాలపై అంతర్జాతీయ దినోత్సవాలను జరుపుకుంటున్నాం. ఈ దినోత్సవాలు ఆయా అంశాలపై ప్రజలలో అవగాహన పెంచి, స్ఫూర్తిని కలిగిస్తాయి. ప్రతి సంవత్సరం ఒక కొత్త థీమ్‌తో జరుపుకోవడం ద్వారా ఆ అంశాలపై విస్తృతమైన, బహుముఖ కోణాల్లో నూతనమైన అవగాహన కలుగుతుంది. కొత్త ఒరవడితో పురోగతికి తోడ్పడుతుంది.
సెప్టెంబర్ 8న అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. 1967 నుండి యునెస్కో ప్రతి సంవత్సరం నిర్వహిస్తుంది. ఏ దేశంలోనైనా ఆ దేశపు అక్షరాస్యత ఆ దేశపు సామాజిక, ఆర్థికాభివృద్ధికి కీలకం. ఏ భాషలోనైనా చదవడం, రాయడం చేయగలిగినవారు అక్షరాశ్యులుగా గుర్తించబడతారు. అక్షరాస్యత ఆ ప్రాంతపు లేదా ఆ దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి ఎంత కీలకమో ఆ ప్రాంతపు లేదా ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ఆ ప్రాంతపు అక్షరాస్యత పెరుగుదలకు అంతే కీలకమైనది. ఇవి పరస్పర ఆధారితాలు.
ప్రపంచ దేశాలతో పోలిస్తే అక్షరాస్యతలో మనదేశం చాలా వెనుకబడి వుంది. ప్రపంచ జనాభాలో 34 శాతం నిరక్షరాస్యులు మన దేశంలోనే వున్నారు. మనదేశపు సగటు అక్షరాస్యత రేటు 78 శాతం మాత్రమే. కేరళ, ఉత్తరాఖాండ్, మిజోరామ్, త్రిపుర, ఢిల్లీ వంటివి ప్రగతిని సాధిస్తుండగా బీహార్, ఆంధప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్ మొదలైనవి సగటు అక్షరాస్యతకు దూరంగా ఉన్నాయి.
అక్షరాస్యత అనేది వ్యక్తులు తమ లక్ష్యాలను సాధించడానికి వారి జ్ఞానం, సామర్థ్యం, నైపుణ్యం అభివృద్ధి చేసుకోవడానికి, సామాజిక స్థితిగతులను అర్థం చేసుకోవడానికి, వాటిలో మార్పులు తేవడానికి అవసరమైన చైతన్యాన్నిస్తాయి. మనుషుల మధ్య ఉన్నతమైన మానవీయ సంబంధాలను ప్రోది చేయడానికి, వివిధ సమూహాల మధ్య ఐక్యతను సాధించడానికి, ప్రకృతికి మనిషికి గల అంతస్సంబంధాలను అర్థం చేయించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయడానికి, సాంస్కృతాభివృద్ధికీ అక్షరాస్యత దోహదం చేస్తుంది. మహిళా సాధికారతను పెంచుతుంది. అక్షరాస్యత రేటు పెరగడానికి ముఖ్య ఆటంకం పేదరికం, సామాజిక అసమానలు, వివక్షలు, సమాన అవకాశాలు లేకపోవడం, విద్యకు ఉపాధికి మధ్య అంతరాలు, పేదరికం వల్ల ప్రతి ఏడాది డ్రాపవుట్ పెరుగుతున్నారు. ఈ సామాజిక, ఆర్థిక ఆటంకాలు తొలగినప్పుడే సంపూర్ణ అక్షరాస్యత సాధ్యమవుతుంది.
విద్య మానవ సహజమైన ప్రాథమిక హక్కు. ప్రజలందరికీ ఎలాంటి వివక్షలూ లేకుండా విద్య అందించడం వ్యవస్థ బాధ్యత. సమగ్ర ప్రణాళిక, నిబద్ధత కలిగిన కార్యాచరణ అమలు చేయాలి. పిల్లలు చదువు మానేయకుండా నిరోధించడానికి ఎనిమిదో తరగతి వరకు నో ఫెయిల్ విధానం అమలు చేయాలి. వారంలో అన్ని రోజులూ ఆరోగ్యకరమైన, సంతృప్తికరమైన మెనూతో అన్ని పాఠశాలల్లో మధ్యాహ్నభోజనం ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ పాఠశాలలో ట్యూషన్ ఫీజు ఉండకూడదు. ప్రైవేట్ స్కూల్సులో ఫీజుల విధానంపై పర్యవేక్షణ ఉండాలి. బాల కార్మిక వ్యవస్థను అడ్డుకోవాలి. పిల్లల తల్లిదండ్రులు ఆదాయవనరులు పెరిగే అవకాశాలు కల్పించబడాలి. సంపూర్ణ అక్షరాస్యత సాధానా కృషిలో భాగస్వాములవుదాం.
(మణికొండ వేదకుమార్)
ఎడిటర్