మన ప్రాచీన పండుగల్లో ఛట్ పూజ ఒకటి. భూమ్మీద తమకు మనుగడ కల్పిస్తున్న సూర్యభగవానుడికి క•తజ్ఞతలు చెప్పుకుంటూ, ఆయురారోగ్య, ఆనందాలను ప్రసాదించమని ప్రార్ధిస్తారు. సూర్య భగవానుడిని ఆరాధించడానికి అంకితం చేయబడిన గౌరవప్రదమైన పండుగ ఛత్ పూజ.
ఛట్ పూజ మనదేశంలో ప్రధానంగా బీహార్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలవారు జరుపుకునే పండుగ. ఛట్ పూజను నాలుగు రోజులు జరుపుకుంటారు. మొదటి రోజును నహాయ్ ఖాయ్, రెండోరోజును ఖర్నా, మూడవ రోజును పెహలా ఆర్ఘయ్, నాలుగవరోజును పార్నాగా పేర్కొంటారు. ఛట్ పూజ చేసేవారు అత్యంత నిష్ఠగా నహాయ్‍ఖాయ్ ఆచరిస్తారు. ఎక్కువగా మహిళలే ఈ వ్రతాన్ని ఆచరిస్తారు.
పూజా పద్దతి
ఈ పండగ సందర్భంగా ఇల్లంతా శుభ్రపరచుకుని, శుచిగా స్నానం చేస్తారు. వ్రతధారులే స్వయంగా పీలి మట్టితో పొయ్యి తయారుచేసి మామిడి కట్టెలను ఉపయోగించి అర్వాచావల్, శనగపప్పు, సొరకాయ లేదా అరటికాయ కూరతో తయారుచేసిన వంటకాన్ని ఆరగిస్తారు. వంటలో సాధారణంగా ఉప్పు వినియోగించరు. ఒకవేళ వాడినా సైంధవ లవణాన్ని మాత్రమే వాడుతారు. సొరకాయ ఈ రోజున వంటలో ప్రధానంగా వాడుతారు. కనుక నహాయ్ ఖాయ్ భోజనాన్ని కొందరు కద్దూబాత్‍గా పేర్కొంటారు. వ్రతధారులు రాత్రి ప్రసాదం తరువాత మరుసటి రోజు సాయంత్రం వరకు ఉపవాసముంటారు. ఈ రోజును ఖర్నాగా పేర్కొంటారు. సాయంత్రం ఖీర్, రొట్టెలను ప్రసాదంగా స్వీకరించి నిర్జల ఉపవాసాన్ని ప్రారంభిస్తారు. మూడవ రోజున అస్తమించే సూర్యున్ని పూజించి చాటలో ప్రసాదాన్ని సమర్పిస్తారు. నాలుగో రోజున ఉదయించే సూర్యునికి ఆర్ఘ్యప్రసాదాలు సమర్పించి వ్రత విసర్జన చేసి విందు భోజనం చేయడంతో వ్రతం పూర్తవుతుంది.
ఛట్పూజ, బతుకమ్మ సారూప్యత
ఛట్ పూజ కూడా తెలంగాణలో బతుకమ్మ, ఆంధప్రదేశ్ లో మకర సంక్రాంతి రోజు సూర్య దేవుని పూజ మాదిరిగానే ప్రకృతికి సన్నిహితమైనది. సకల సృష్టికి ఆధారమైన సూర్యభగవానున్ని ఈ పండుగ సందర్భంగా కొలుస్తారు. మోకాలి లోతు వరకు నీటిలో నిలబడి సూర్యదేవునికి ఆర్ఘ్యప్రసాదాలను సమర్పించడం ఈ పూజ ప్రత్యేకత. వెదురు గంప లేదా చాటలో పళ్లను ఉంచి అస్తమించే సూర్యునికి, ఉదయించే సూర్యునికి ప్రసాదంగా సమర్పిస్తారు. ఈ పూజలో ప్రధాన భాగం నదీతీరాన జరుగుతుంది. కాబట్టి ఈ పూజ నదుల శుద్ధీకరణలపై కూడా దృష్టిసారించేలా చేస్తుంది. పండుగ సమయంలో ప్రసాదంగా సమర్పించే బెల్లం, చెరకు, కొబ్బరి కాయలు, అరటిపళ్లు, పసుపు, అల్లం ఇత్యాది సామగ్రి ఆరోగ్యానికి కూడా మేలుచేస్తుందంటారు వైద్య నిపుణులు.
- దక్కన్‍న్యూస్, 9030 6262 88