లోకాయపల్లి సంస్థానం

పాలమూరు జిల్లా అనేక గొప్ప సంస్థానాలకు నిలయం. ఇందులో ప్రధానంగా ఆత్మకూరు, కొల్లాపూర్‍, గద్వాల, గోపాల్‍ పేట, జటప్రోలు, లోకాయపల్లె, వనపర్తి వంటి సంస్థానాలు తెలంగాణ సంస్థాన చరిత్రలో ప్రసిద్ధమైనవిగా గుర్తింపబడ్డాయి. తెలంగాణలోని ప్రాచీన సంస్థానాలలో లోకాయపల్లి సంస్థానం ఒకటి. ఇది క్రీస్తు శకం 16 శతాబ్దంలో పాలమూరు జిల్లాలో వర్ధిల్లిన సంస్థానం. తెలంగాణను పాలించిన పశ్చిమ చాళుక్యరాజ్యం అంతరిస్తున్న దశలో దేవగిరిని రాజధానిగా చేసుకొని మహారాష్ట్రులు, ద్వారసముద్రాన్ని రాజధానిగా చేసుకొని కన్నడిగులు, ఓరుగంటిని రాజధానిగా చేసుకొని ఆంధ్రులు స్వతంత్రులయ్యారు. ఒక విధంగా ఇవి ఆనాడు భాషాప్రయుక్త రాష్ట్రాలుగా చెప్పవచ్చు. దీనిలో మరాఠశాఖ మళ్ళీ రెండుగా చీలిపోయింది. రత్నగిరి రాజధానిగా సేవణవంశం, దేవగిరిని రాజధానిగా యాదవ వంశం దక్షిణ ప్రాంతాన్ని పరిపాలించాయి. వీరిది మధ్యయుగపు భారతదేశ రాజవంశం. ఈ వంశం తమ పరిపాలన అత్యున్నత స్థాయిలో ఉండగా ఉత్తరాన ఉన్న నర్మదానది నుండి దక్షిణాన ఉన్న తుంగభద్రానది మధ్యన ఉన్న పశ్చిమ దక్కన్‍ ప్రాంతాన్ని పరిపాలించారు. యాదవరాజ్యంలో వెలసిన సంస్థానమే లోకాయపల్లి అదే నారాయణపేట సంస్థానంగా పిలవబడ్డది. ఇది మగతల పరగణాలో ఉండేది. మగతలకు ‘మఖస్థలి’ అని సంస్కృత వ్యవహారం. ‘ముఖ’ అనగా యజ్ఞం, ‘స్థలి అనగా స్థలం. యజ్ఞాలను నిర్వహించే స్థలమని అర్థము. దీన్ని దేవగిరి యాదవ రామచంద్రుని సామంతుడు స్థాణుచమూపతి పాలించాడు.

ఈ మగతల పరగణాలో గురుమిటికెల (గురు మఠగల్‍), చండ్రకి (చంద్రక) కాన్కుర్తి (కర్ణకుటీర), కాన్గడ్డ, మద్దూరు, కోసిగి (కౌశికి) కోయలకొండ, కోటకొండ, ధన్వాడ, ఊటుకూరు, మక్తల్‍( మఖస్థలి), ఉజ్జలి (ఉజ్జయిని) గ్రామా లన్నిటిలో కలిపి 365 అగ్నిహోత్రాల కుటుంబాలుండేవి. ఈ అగ్నిహోత్రులతో పాటు ఇంకా నిత్యకర్మానుష్టా పరులైన స్మార్తులు, ఔదుంబర వ్రతస్తులైన వానప్రస్థులు, జైనులు, లోకాయతులు తమకొరకు ఆ పరగణాలో వేర్వేరు పల్లెలు కట్టుకొని నివసించారు. వానిలో లోకాయతులు కట్టుకున్న పల్లెనే లోకాయపల్లె పేర ఒక సంస్థానానికి రాజధానియై క్రీస్తుశకం 16 వ శతాబ్ది నుండి క్రీ.శ.1844 ప్రాంతం వరకు ఒక వెలుగు వెలిగింది.
క్రీ.శ.1689లో లోకాయపల్లెను పాలించిన వెంకట నారాయణ యాదవ్‍ తమకు దేవగిరి మగతల పరగణాలు ఉన్నట్లు తన దానపత్రంలో తెలిపిండు.


స్వస్తి శ్రీమత్‍ శాలివాహన శకే 1161 వ్యవహారిక చంద్రమానేనా శుక్లనామ సంవత్సర మార్గశిర శుద్ధ పంచమి సోమవారం వేదశాస్త్ర సంపన్న యాజమాన్య రాజా శ్రీ వశిష్ట గోత్రోత్పన్న ఆయాచిత విఠ్ఠలభట్టువారి పుత్రుడు భైరవ బట్టు వారి పుత్రులు త్రయంబక సోమయాజి విఠ్ఠలభట్టు కల్వర్గ వాస్తవ్యులకు వెంకటనారాయణ ఫడ్నవీస్‍ వమా మాలే దిల్షాదాబాద్‍ (ఊట్కూ రు) తాటికొండ, దౌల్తాబాద్‍ దేశుముఖ్‍ నాడగౌడ్‍ పరగణే తాటికొండ బాదేపల్లి బూర్గుల పెరగనణే వెనిజాల్‍ వగైరా మా నుంచి వ్రాయించి ఇచ్చిన భూదాన పత్రం. మీ పౌత్ర పరంపరగా అనుభవం చేస్తూ మా సంస్థానహిత చింతన కోరుతూ ఉండవలెను. మాకు మా సంస్థానమునకు హితచింతన చేస్తూ ఉండవలెను. (ఇది మోడీ లిపిలో దానపత్రం. దీని జిరాక్స్ ప్రతి శ్రీ ధనుంజయ దీక్షితుల దగ్గరుండగా దీన్ని బట్టల వ్యాపారస్తుడైన తుకారావు సంతపూర్‍ గారు మిక్కిలి శ్రమపడి చదివి పెట్టినారు).

ఈయన దానపత్రాలన్నీ ఆనాటి మోడిలిపిలోనే ఉన్నవి. లోకాయపల్లె సంస్థాన పాలకుడైన మొదటి వెంకటనారాయణ రావు ‘పళ్ళ’లోని త్రియంబకభట్టు, విఠలభట్టు సోదరులకు నిరంతరం యజ్ఞయాగాదుల నిర్వహణకు కొంత భూమిని దానం చేశాడు. మొదటి వెంకటనారాయణ రావు గారి కాలంలో ఈ సంస్థానంలో దిల్షాదాబాద్‍ (ఊటుకూరు), తాటికొండ, దౌలతబాద్‍ (దేవగిరి), బాదేపల్లి, బూరుగుల మరియు వెనిజాల పరగణాలు ఉండేవి. ఇది తూర్పున తాటికొండ, దక్షిణంగా కలువకుర్తి, పడమట కాకులహారం (గురిమెటికెల దగ్గర), ఉత్తరంగా శాలిబండ (హైదరాబాద్‍) వరకు వ్యాపించి ఉండేవి. ఈ పరగణాల విషయాలను పరిశీలించి చారిత్రక అంశాలను గమనిస్తే క్రీ.శ. 1295లో దేవగిరిని యాదవ ప్రభువు రామచంద్రదేవుడు పాలించాడని తెలుస్తుంది. అతని దండనాయకుడై స్థాణుచమూపతి మగతలలో వేయించిన శాసనం ఆధారంగా రామచంద్రదేవుని వంశం ఈ విధంగా చెప్పబడింది.
‘‘నా భే నారాయణ న్యాభూ ద్వి ధాతాతత్త నార్మనః
తదన్వ యేస ముధ్బుతం-స్తితం యదకులంభువి’’
ఈ రామచంద్ర దేవునిది యాదవ వంశమని పై ఆధారంతో మనకు తెలుస్తుంది. అంతేకాక ఈ వెంకటనారాయణ తనది యాదవ వంశమని చెప్పుకున్నారు. ఆనాడు రామచంద్రదేవునికి ఉన్న పరగణాలే వెంకటనారాయణ గారికి చెల్లడం వల్ల (దానపత్రం ఆధారంగా), ఈ లోకాయపల్లె ప్రభువంశం ఆ రామచంద్ర దేవుని శాఖయే అని చెప్పవచ్చు. అయితే ఈ శాఖ ఎప్పుడు ఏ కారణం చేత దేవగిరిని విడిచి పాలమూరు జిల్లాలోని లోకాయపల్లెకు వచ్చిందో ఇక్కడికి వచ్చిన మూలపురుషుడు ఎవరో తెలియదు. యాదవ రామచంద్రదేవుడు తనను బ్రాహ్మణుడని చెప్పుకోలేదు. అయినా బ్రహ్మనుండి పుట్టిన వంశమే కనుక అతడు క్షత్రియత్వం అవలంబించిన బ్రాహ్మణుడు. లోకాయపల్లె వారు కూడా తాము బ్రాహ్మణులమని కానీ క్షత్రియులమని కానీ చెప్పుకున్నట్లు లేదు. వారు యాదవులయిన ఫడ్నవీస్‍ వంశస్థులమని మాత్రమే చెప్పుకున్నారు.

లోకాయపల్లె ప్రభువులు కాకతీయుల వలె నూతన గ్రామ నిర్మాణాలు చేపట్టారు. ప్రస్తుతం ఉన్న రుక్కమ్మపేట గ్రామ నిర్మాణం కూడా లోకాయపల్లె దొరలదే. తిమ్మాజిరావు తన పేరు మీద తిమ్మాజీపేట గ్రామాన్ని నిర్మించాడు. ఈ సంస్థాన ప్రభువులు వివిధ గ్రామాలలో స్వయం ఉపాధి కింద చేతివృత్తుల కళాకారులను ప్రోత్సహించారు. వారికి చేనేత మగ్గాలు ఇప్పించి జీవనోపాధి కల్పించారు. ఈ ప్రాంతం నుండి ఇతర ప్రాంతాలకు ప్రధానంగా నూలు, అద్దకపు పట్టు వస్త్రాలు ఎగుమతి చేసేవారు. లోకాయపల్లి ప్రభువుల నాణెములు ఔరంగాబాద్‍ మొదలైన దేశీయ ప్రాంతంలోనే కాకుండా విదేశీ ప్రాంతాలలో కూడా లభించాయి. ఈ సంస్థాన పాలకులలో ఒకరైన తిమ్మాజీ కొడుకు రుక్మాజీరావు జడ్చర్లలో వెంకటేశ్వర ఆలయాన్ని కట్టించాడు. ప్రస్తుతం తిమ్మాజీపేట మండలంలోని అప్పాజీపల్లె ఈ దొరలు కట్టించింది. లోకాయ పల్లె ప్రభువైన కామాజీరావు గూడూరు గ్రామాన్ని బ్రాహ్మణులకు అగ్రహారంగా దానమిచ్చాడు. దానిని కామాజీపురం లేక కామల్జీపురం అని పిలుస్తున్నారు. తిమ్మాజీరావు మనుమడు కామాజీరావు కొడుకు అయిన శ్యాంరావు గారి భార్య రుక్కమ్మ. వీరికి సంతానం కలగనందున శ్యామ్రావు గారు కావేరమ్మను రెండవ భార్యగా చేసుకున్నాడు. వీరి భార్యల పేరు మీద రెండు గ్రామాల నిర్మాణం జరిగింది. అవి రుక్కమ్మపేట, కావేరమ్మపేట. రుక్కమ్మపేట అమ్మపల్లెగా మారి పాతపాలమూరులో కలిసి పోయింది. కావేరమ్మపేట కౌరం పేటగా మారి జడ్చర్లలో కలిసింది. వీరి భార్యలు కూడా పరమ ధార్మికులు. రుక్కమ్మ త్రవ్వించిన పెద్ద బావి మానాజీ పేటలో ఉంది. కావేరమ్మ వేయించిన చెరువు నేరెళ్లపల్లిలో ఉన్నది. ఈ సంస్థానంలో ప్రభువులే కాక దివాన్లు కూడా జిల్లాలోని చాలా ప్రాంతాలలో నూతన గ్రామ నిర్మాణాలు, దేవాలయ నిర్మాణాలు చేసి మన సంస్కృతిని సాంప్రదాయాన్ని కాపాడారు. లోకాయపల్లె దొరల కింద బోయినపల్లి కరణాలు పెద్ద అధికారులుగా ఉండేవారు. తాడూరు, పాలమూరు, పోలేపల్లి గ్రామాల్లో వేదపండితులు ఎక్కువమంది ఉండేవారు. పోలేపల్లి వారు వేదములను పిల్లన గ్రోవిపై పలికించినారు. క్రీ.శ.1785లో భాస్కర రాయలు అనే పండితుడు లలిత సహస్రానికి భాష్యం రాశాడు.

లోకాయపల్లి లక్ష్మమ్మ దొరసాని ఈ రాజవంశంలో చివరిది. ఈమె మహిమలను ధార్మిక వర్తనను ఔదార్యాన్ని పరిపాలనను భక్తిని గురించి ప్రజలు అనేక కథలు చెప్పుకుంటారు. ఈమె దగ్గర బోయినపల్లె కరణాలు దివాన్జీలుగా ఉన్నారు. ఈమె నారాయణపేట దగ్గర ఎక్లాస్పూర్‍ లోనూ పాలమూరులో ఉన్న కోటతిరుమలదేవుని గుట్టపైన వెంకటేశ్వర ఆలయాలు ప్రతిష్టించింది. ఈమె స్థాపించిన ఆలయాలు నిరాడంబరంగా ఉండేవి. తర్వాత కొత్త మరమ్మత్తులతో వెలుగొందుతున్నవి.
తమ సంస్కృతిని కాపాడుతూ సాహిత్యాన్ని లలిత కళలను ప్రోత్సహించారు రాణి లక్ష్మమ్మ. ఆమె సంస్థానంలో దివాంజీ అయిన శేషజీరావు కల్వకుర్తి తాలూకాలోని వాడాల గ్రామంలో హనుమద్‍ దేవాలయం కట్టించాడు. ఇతడు తోలుబొమ్మలాటలు నాటకాలను ప్రోత్సహించాడు. కళాకారులను పోషించి నాటక రంగాన్ని ప్రోత్సహించి ప్రజాచైతన్యాన్ని కలిగించాడు. లోకాయపల్లి పతనానంతరం వాడాలలో స్థిరపడినా కళారంగాన్ని విస్మరించలేదు. జిల్లాలో కళాకారులకు నిలయంగా వాడాలా పేరు ప్రతిష్టలు పొందినది.

రాణి లక్ష్మమ్మ చివరిదశలో సంతానం లేక నాగర్‍ కర్నూల్‍ నుండి పిప్పిళ్ల వంశానికి చెందిన మాధవరావు అనే ఆయన్ని దత్తత తీసుకుందాం అనుకున్నారు. కానీ అప్పటికే దత్తు చట్టం వచ్చేసింది. కాబట్టి నైజాం సర్కార్‍ వీరి దత్తును అంగీకరించలేదు. రాణి లక్ష్మమ్మ నిజాం ప్రభువులకు కప్పం చెల్లించలేదని, ఝాన్సీ లక్ష్మీబాయికి ఆనాడు యుద్ధంలో పరోక్షం సహాయం అందించిందని ఉస్మాన్‍ అలీ ఖాన్‍ వనపర్తి సంస్థాన పాలకుడైన రాజరామేశ్వరరావుని యుద్ధానికి పంపగా అతడు లోకాయపల్లె కోటను ముట్టడించి జయించాడు. ఆత్మాభిమానంతో ఈమె ఆత్మార్పణ చేసుకున్నది. తరువాత లోకాయపల్లె కోట పతనమయింది. కోటలోని ప్రజలు ఊరికి ఉత్తరంగా ఒక గ్రామం ఏర్పాటు చేసుకొని జీవించారు. అదే ఇప్పుడు ఎక్లాస్పురం అయ్యింది. ఈ గ్రామ ప్రజలు రాణి లక్ష్మమ్మ దేవాలయాన్ని నిర్మించి నిత్యం పూజలు నిర్వహిస్తున్నారు.
ఈ సంస్థానానికి మూలపురుషుడు ఎవరో తెలియడం లేదు. ఈ వంశీయులు శాసనాలేవి వేయించలేదు. వీరి చరిత్రకు ఆధారాలు వీరిచ్చిన దాన పత్రాలే ఉన్నవి. ఇవి కూడా ఎక్కువగా అందుబాటులో లేవు. లోకాయపల్లె సంస్థాన ప్రభువుల పరిపాలన అనేక దండయాత్రల వలన అస్తవ్యస్తంగా సాగినందువలన ఈ సంస్థాన పాలకుల చరిత్ర సమగ్రంగా తెలియడం లేదు. పాలమూరు జిల్లా సంస్థానాల్లో ప్రసిద్ది గాంచిన ఈ లోకాయపల్లి గురించి తగిన పరిశోధన జరిగి అనేక విషయాలు బయటకు రావలసిన అవసరం ఎంతైనా వుంది. దానికోసం విశ్వవిద్యా లయాలు సాహిత్య సంస్థలు సమిష్టిగా కృషి చేయాలి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *