ఫోరమ్ ఫర్ ఎ బెటర్ హైదరాబాద్ (FBH) ఆధ్వర్యంలో, సెంటర్ ఫర్ డెక్కన్ స్టడీస్ (CDS) మరియు పలు పౌరసమాజ సంస్థల సహకారంతో, వార్షిక జ్ఞాపక-ఐక్యత సభ సెప్టెంబర్ 25న ఉస్మానియా జనరల్ హాస్పిటల్, అఫ్జల్‍గంజ్‍లోని చారిత్రక చింత చెట్టు కింద నిర్వహించబడింది. 1908లో మూసీ వరదల సమయంలో దాదాపు 150 మందికి ప్రాణాధారం అయిన ఈ చెట్టు, మానవతా సేవకు ప్రతీకగా, స్మృతులు-ఐక్యతకు చారిత్రక చిహ్నంగా చింతచెట్టు స్మరించబడింది.
కార్యక్రమంలో FBH అధ్యక్షుడు Er. వేదకుమార్ మణికొండ అధ్యక్షత వహించి ప్రసంగించారు. వేదకుమార్ మాట్లాడుతూ.. 2008లో ప్రారంభమైన ఈ జ్ఞాపక సభ ప్రతి సంవత్సరం నిరంతరంగా కొనసాగుతోందని గుర్తుచేశారు. గత ఇరువై సంవత్సరాలుగా FBH మూసీ నదిపై చేపట్టిన అధ్యయనాలు, ప్రభుత్వానికి అందజేసిన సూచనలు వివరించారు. హైదరాబాదు నగర ప్రణాళికలోని సవాళ్లను ఎదుర్కొనేందుకు ఏకీకృత మాస్టర్ ప్లాన్ అవసరమని, అలాగే మురుగు నీటి ప్రణాళిక అత్యవసరమని ప్రభుత్వాన్ని కోరారు. కవి సంఘమిత్ర చెట్టు ఔదార్యాన్ని, మూసీ విషాదాన్ని పాట రూపంలో ఆలపించారు. ప్రముఖ సినీ దర్శకురాలు అఫ్సాన్ మూసీ విపత్తు జ్ఞాపకాలను మళ్లీ ప్రజలలో మేల్కొల్పుతున్న FBH కృషిని కొనియాడారు. ప్రసిద్ధ సాహితీవేత్త అంబటి వెంకన్న నగర ప్రణాళికలో పౌరసమాజాన్ని కలుపుతూ వెళ్ళిన వేదకుమార్ మణికొండను కొనియాడి, హైదరాబాద్ వారసత్వాన్ని తన గీతాలాపన ద్వారా ఆలపించారు.
సామాజిక, మానవతా దృక్పథంతో బ్రదర్ వర్గీస్, పునరావసం లేకుండా మూసీ ప్రజల తరలింపును ఖండించారు. 1997లో నందనవనం ప్రాజెక్ట్లో జరిగిన లోపాలను విచారించారు. మానవ హక్కుల కార్యకర్త జీవన్‍కుమార్, పౌరసమాజం నిర్లక్ష్య పరిపాలనను ప్రశ్నించాలని, ప్రజలను నగరాభివృద్ధిలో భాగస్వాములుగా చూడాలని పిలుపునిచ్చారు. డా. జయకృష్ణ, ఉస్మానియా ఆసుపత్రి చీఫ్ రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్, ‘‘ఫోరమ్ ఫర్ ఎ బెటర్ హైదరాబాద్’’ కృషికి నిరంతర సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. భూగర్భ జల నిపుణుడు సుభాష్ రెడ్డి, నగరం నీటమునిగి పోవడంపై, వర్షపు నీటి సక్రమ నిర్వహణలో వైఫల్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. తన సిఫార్సులను FBH ద్వారా ప్రభుత్వానికి అందజేస్తానన్నారు. అనిల్ OSCIA ప్రతినిధి, విద్యార్థులను పర్యావరణహిత అలవాట్లు అలవరచు కోవాలని సూచించారు.
ప్రొ. అన్వర్‍ఖాన్, FBH గత 17 సంవత్సరాలుగా ఈ సభ పట్ల చూపుతున్న అంకితభావాన్ని గుర్తుచేసి, పర్యావరణ-సామాజిక కాలుష్యాలను ఎదుర్కోవడంలో సంఘీభావం అవసరమని వివరించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొ. జయశ్రీ, మతం-వర్గం తేడా లేకుండా ప్రాణాలను కాపాడిన చింత చెట్టు విశిష్టతను ప్రశంసించారు. సభ ఆరంభంలో పండిట్ పరాశర్ మూసీ వరదలకు అంకితమైన హృద్యమైన లావణి గానం చేశారు.
సభ ముగింపులో, 1908 మూసీ వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారిని స్మరిస్తూ, హైదరాబాద్ పర్యావరణ-సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడతామని ప్రతిజ్ఞ చేశారు.
FBH ఉపాధ్యక్షుడు ఎం.హెచ్.రావు సభకు స్వాగతం పలికారు. FBH ప్రధాన కార్యదర్శి శ్రీమతి శోభా సింగ్, సభకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డా. జి.రామేశ్వర్‍రావు (డైరెక్టర్, ESIC), బి.నారాయణ (రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్, హెరిటేజ్ తెలంగాణ), నర్సారెడ్డి (TRSMA), ఆకుల రవీందర్, శంకర్ (జై భీమ్), రామరాజ్, ఇలియాస్, శ్రీహరి, సయ్యద్ ఖలీద్, శ్రీలత, సయ్యద్ ఖైజర్ భాషా మరియు CHATRI, COVA, MSI, SRD, APSA, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
-ఖైజర్, ఎ : 9030 6262 88