గండికోటను చూడాలనుకోవడమే గొప్ప విశేషం. ఎందుకంటే ప్రపంచ స్థాయిలో అరుదైన ప్రదేశంగా గండికోట రెండవ స్థానంలో నిలుస్తుంది. దేశంలో ఇలాంటి గొప్ప పర్యాటక ప్రదేశం మరొకటి లేదు. 1000 సంవత్సరాల క్రితం నిర్మించిన కోట, వేల సంవత్సరాల క్రితం కొండను చీల్చుకుంటూ ప్రవహించిన పెన్నానది ప్రవాహం ఇంకెక్కడా లేని అరుదైన విశేషాలు. అసలు ఇలాంటి అద్భుతమైన పర్యాటక ప్రదేశం ఒకటుందనీ చాలా మందికి తెలియదు. తెలిస్తే మాత్రం చూడకుండా ఉండలేరు. చూస్తే ఎంతో ఆనందిస్తారు.
ప్రధాన ప్రవేశద్వారం దాటి లోపలికి వెళ్ళగానే మనకు బలమైన కోటగడోలు కనిపిస్తాయి. ఈ కోటను కట్టేందుకు ఎంత పెద్ద పెద్ద బలమైన రాళ్లు వాడారంటే ఒక్కొక్క రాయి 1000 కిలోల బరువు పైగానే ఉంటుంది. అరుదైన రాయిని అంత పైకి ఎలా చేర్చారో ఊహించలేము.
చరిత్ర ఇది
గండికోట మహా దుర్గం జమ్మలమడుగు పట్టణానికి 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. (కడప నుండి లేదా పొద్దుటూరు నుండి జమ్మలమడుగు వెళ్లి అక్కడ నుండి) గండికోట వెళ్ళవచ్చు. శాసనాలు, కైఫియత్‍లు, ఇతర చారిత్ర ఆధారాల ద్వారా తెలిసిన సమాచారం ఈ కోటను క్రీస్తు శకం 1123 జనవరి 9న కళ్యాణి చాళుక్య ప్రభువు త్రైలోక్య మల్లునికి సామంతుడైన కాక రాజు పేరుగల చిద్ధనచోళ మహారాజు నిర్మించారు. కోటకు పడమర ఉత్తర దిశల్లో సహజ కందకంలా పెన్నా నది ప్రవహిస్తున్నది. ఎర్రమల కొండల మధ్య ఇది గండికోటను చుట్టేసినట్లు కనిపిస్తుంది. కాకతీయ చక్రవర్తి ప్రతాప రుద్రుని సేనాపతి పట్టణ సాంహిణినాయకుడు ఈ ప్రాంతపు రాజు కాయస్థ అంబదేవుడు కొంతకాలం గండికోటను పాలించాడు. తరువాత క్రీస్తు శకం 1308 నుంచి 1314 వరకు సోమయలెంక అనంతరం 1319 వరకు కాకతీయ పాలనలోనూ ఉండింది. తర్వాత గండికోట చరిత్ర మరుగున పడింది. అనంతరం విజయనగర రాజుల పాలనలోకి వచ్చింది. మొదటి బుక్క రాయలు ఆయన కుమారుడు ప్రౌడదేవరాయలు పాలించారు. ఆ పరంపరలోనే ఈ కోట పెమ్మసాని వంశీకులకు లభించింది. వారు 300 సంవత్సరాలకు పైగా ఈ కోటను పాలించారు. తర్వాత గోల్కొండ నవాబు కులీకుతుబ్‍షా సైన్యాధికారి మీర్ జుమ్లా 1652 ఆగస్టు 255న నాటి గండికోట పాలకుడు పెమ్మసాని చిన్న తిమ్మానాయుడు నుంచి కోటను స్వాధీనం చేసుకున్నారు. మీర్ జుమ్లా తర్వాత గోల్కొండ సామంతులైన కడప నవాబులు పకీర్ ఖాన్ మహమ్మద్ ఖాన్ అనంతరం ఆసఫ్ జహీల ప్రతినిధి కవిదుల్లా ఖాన్ మోచామియా, ఆయన సతీమణి మదీనా బీబీ ఈ కోటను పాలించారు. ఆ వంశీకుల పాలనలోనే ఈ కోట టిప్పు సుల్తాన్‍కు దక్కింది. 1791లో ఇది ఆంగ్లేయుల పాలనలోనికి వచ్చింది. కోట ప్రాధాన్యత పోయింది. ప్రస్తుతం ఈ కోట కేంద్రపురావస్తు శాఖ ఆధీనంలో ఉంది.

కోటలోనికి పోతే..
ఎత్తైనకోట ప్రధాన ద్వారం. దాని తర్వాత కొంచెం ముందు మరో ద్వారం ఉంటుంది. తలుపులు ఎంతో పెద్దవి! వీటిని తెరిచి, మూయడం మన వల్ల అయ్యే పని కాదు. అప్పట్లో ఈ తలుపులు మూసి తెరవడానికి ఏనుగులను వాడే వారట. శత్రువుల ఏనుగులు వచ్చి తలుపులను ఢీకొనకుండా తలుపులకు సూది మోనలా ఉన్న ఇనుప గుబ్బలను ఏర్పాటు చేశారు. తలుపులు తీయకుండా లోపలికి బయటికి వెళ్లేందుకు పక్కనే చిన్న ద్వారా కూడా ఉంది. ఇలాంటి తలుపులు కడప జిల్లాలో ఇంకెక్కడ కనిపించవు. కొంచెం ముందుకెళ్తే తలుపులు లేని ద్వారం ఉంటుంది. పక్కనున్న రాళ్ళ మీద నుంచి కోట గోడలపైకి వెళ్ళవచ్చు. ఈ గోడలపై లోపల బయటి వైపున సైనికులు పహారా కాయటానికి వీలుగా నడక దారి ఉంది. అసలు కోటలోనికి ప్రధాన గోడల్లో ఎద్దుల బండ్లు కూడా వెళ్లేందుకు దారి ఉంది. ప్రస్తుతం ఆ దారులన్నీ మూసివేయబడ్డాయి.

ఎత్తుగా కనిపించే వాచ్ టవర్!
నవాబులు 16వ శతాబ్దంలో దీన్ని నిర్మించారు. శత్రువుల రాకపోకలను దానిపైకి ఎక్కి దూరం నుంచి చూసే సౌకర్యం కోసం దీన్ని నిర్మించారు. 400 సంవత్సరాలు అయినా ఇది చెక్కుచెదరలేదు. టవర్ అరుగుపై కూర్చుని, నిల్చుని పర్యాటకులు ఫోటోలు తీసుకుంటారు. యుద్ధంలో వాడే మర ఫిరంగి ఉంది. కోటలో జరిగిన యుద్ధంలో దీన్ని ఉపయోగించారు. ఇప్పుడు అది పని చేయడంలేదు. ఇనుప తీగల కంచె లోపల భారీగా ఓ భవనం ఉంది. అది జైలు, అప్పట్లో దొంగలు, యుద్ధ ఖైదీలను ఈ జైలులోనే వేసేవారు. ఇందులో రెండు మూడు రకాల గదలున్నాయి. చేసిన తప్పును బట్టి ఆయా గదుల్లో బందించేవారు. లోపల అంతా చీకటి. గదుల్లోకి వెళ్లే దారి తికమకగా ఉంటుంది. వెనక కిటికీలో నుంచి చూస్తే పంట పొలాలు, దూరంగా మాధవరాయ స్వామి ఆలయ రాజగోపురం కనిపిస్తుంది. ఇక్కడ చాలా సినిమా షూటింగులు జరుగుతుంటాయి.
పాతకాలపు నాటి వీధులు, పెద్ద గుంతలు, వాటిలో నీరు, నేల బావుల్లా ఉన్నాయి. వీటిని కోటలోనికి నీటి అవసరం కోసం రాజులు తొవ్వించినటువంటివే. ఆ తరువాత వీటి నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల పాడైపోయాయి. ఇటు అటు కుడివైపు కొండ రాళ్లు. ఎదురుగా మాధవరాయ స్వామి ఆలయం రాజగోపురం శత్రువుల దాడిలో కొద్ది భాగం ధ్వంసం అయింది. గోపురం కింద ద్వారం నుండి లోపలికి వెళ్తే ఇరువైపులలా, లోనా బయట వచ్చే వారికి స్వాగతం చెబుతున్న అద్భుతమైన యువతుల నృత్య భంగిమలను పరిశీలించవచ్చు. వారు ధరించిన, వస్త్రాలు, నగలు, 1000 ఏళ్ల క్రితం నాటి సాంస్కృతి సాంప్రదాయాలను ఈ శిల్పాలలో చూడవచ్చు. గోపురం లోపల రెండు వైపులా అద్భుతమైన శిల్ప సంపద ఉంది.

నేరుగా ఆలయంలోనికి వెళ్తే ఇనుప స్వభావం కల పెద్ద పెద్ద రాతిబండలు స్తంభాలతో ఉన్న ఈ ఆలయం ఎంతటి ఎండలోనైనా చల్లగా ఉన్నట్లు హాయిగా సేద తీరుస్తుంది. ఆలయమంతా ఇలాగే ఉంటుంది. మొదటిది పెద్ద హాలులా కనిపిస్తుంది. ఈ ఆలయ నిర్మాణం జిల్లాలోని ఒంటిమిట్ట సౌమ్యనాథ స్వామి ఆలయం ఆలయాన్ని తదితరాలను గుర్తుకు తెస్తాయి. ఈ విశాలమైన హాలులో రంగమండపం అన్ని రకాల కళాప్రదర్శనలు జరిగేవి. ఆనాడు ఇదే ప్రధాన వేదికగా ఉండేది వివాదాలు వాటి విచారణలు కూడా ఇక్కడే జరిగేవి. స్తంభాలు వాటి నిర్మాణ పద్ధతి అద్భుతంగా వుంటుంది. లోనికి వచ్చేటప్పుడు ఎడమవైపు స్తంభంపై గల ఓ శిల్పాన్ని గమనిస్తే ఒకవైపు నుండి ఎద్దుగాను మరోవైపు నుండి ఏనుగులా కనిపిస్తుంది. వీటి రెండింటికి శరీరాలు వేరుగా ఉన్నాయి. తల మాత్రం ఒకటే ఏనుగు తలను మూసి చూస్తే ఎద్దులా ఎద్దు తలను మూసి చూస్తే ఏనుగులా కనిపిస్తుంది. చాలా తమాషాగా ఉంటుంది. మనం కాగితంపై కూడా గీయలేని ఇలాంటి చమత్కార శిల్పాన్ని వెయ్యి సంవత్సరాల శిల్పులు శిల్పంలా చెక్కారంటే వారి క్రియేటివిటీ, నైపుణ్యాలు ఎంత గొప్పగా ఉండేవో అర్థం చేసుకోవచ్చు. ఈ శిల్పం నమూనా గుడి బయట దారిలో మలిచి వుంటుంది. ఈ శిల్పానికి సంబంధించి నమూనా, కోటలోని కత్తుల కోనేరు గట్టుపై కూడా ఉంది. గుడి అంతరాళం. గర్భగుడి.. దేవుడి ప్రతిమలుండేవి. ఇప్పుడు ఏ ప్రతిమలూ లేవు. అంతా ఎవరో తవ్వేసినట్లుంది.
1652 ఆగస్టు 25న గండికోటను మీర్‍జుమ్లా స్వాధీనం చేసుకున్నాడు. శత్రు సైనికులు ఇంకాసేపటికి ఆలయంలోనికి వస్తారని తెలిసినా కొందరు వీరులు పెద్దల సూచనలతో గర్భాలయం వెనుక గల కొన్ని రాళ్లను తొలగించి దేవతామూర్తుల విగ్రహాలను జాగ్రత్తగా బయటకు తరలించారు. ఆలయం వెనుక ద్వారా నుంచి పెన్నా నది లోయ, ఆ నది ద్వారా మైదుకూరు ప్రాంతానికి చేర్పించి బావిలో దాచారు. వందేళ్ల తర్వాత స్థానికులు గుర్తించి వాటిని వెలికి తీసి మైదుకూరులో వాటికి ఆలయం నిర్మించారు. వాటిని మనం నేటికీ అక్కడ చూడవచ్చు.
ఆలయం వెనుకల మూడు వైపులా వసారా గదులు నేటికీ పటిష్టంగా ఉన్నాయి. ప్రాకారంలోపల పాకశాల, అంటే వంటశాల అలంకార శాల, వెనుక కళ్యాణమండపం, ఉత్తరాన ఆళ్వార్ల మండపాలున్నాయి. చుట్టూ మూడువైపులా మొత్తం 56 స్తంభాల వసారా ఉంది. అన్ని స్తంభాలతో బాటు పై కప్పులో కూడా శిల్పాలను చూడవచ్చు. స్తంభాల వరుస భలేగా కనిపిస్తుంది.

మాధవరాయస్వామి ఆలయం చూసిన తర్వాత ఉత్తరం వైపు వెళ్తే అక్కడ అందమైన జుమ్మా మసీదు ఉంది. దాన్ని ఎదురుగా కత్తుల కోనేరు ఉంది. విశాలమైన కట్టడమే జుమ్మా మసీదు. వెలుపల 32 లోపల 64 గదులు వసారాలు ఉన్నాయి. వెలుపల గదిలో గుర్రాలను ఉంచేవారు. లోపల సైనికులు, సామంత రాజులు సభ చేసేవారు. రాజపీఠం స్థానంలో అందమైన మసీదు నిర్మించారు. ఎత్తైన అరుగపై ఉజూఖానా కూడా ఉంది. ఉత్తరం వైపు మీసదు పైకి మెట్లు ఉన్నాయి. ఎదురుగా నిలుచుని మసీదును చూస్తే హైదరాబాద్ చార్మినార్ గుర్తొస్తుంది. దీని ఎదురుగా విశాలమైన కోనేరు ఉంది. చాలా పెద్ద కోనేరు. ఒకప్పుడు ఇందులోని నీటిని గండికోటలోని వారంతా వాడేవారు. యుద్ధం తర్వాత సైనికులు ఇందులో కత్తులను కడిగేవారట. అందుకే దీన్ని కత్తుల కోనేరు అంటారు.
మరో వైపు పెద్దభవనం ధాన్యాగారం. గండికోటలోని ప్రజలందరికీ రెండు సంవత్సరాలకు సరిపోయినంత ధాన్యాన్ని ఇందులో నిలువ ఉంచేవారట. విశాలమైన హాలుతో పాటు 12 స్తంభాలతో దీన్ని పాలించిన రాజుల్లో ఒకరైన మీర్‍జుమ్లా 16వ శతాబ్దంలో నిర్మించారు. ఎదురుగా వరుసలు కట్టి ఉన్న ధాన్యం బస్తాలను సులభంగా తీసుకోవటానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం ఏర్పాటు చేసుకున్నారు. రెండేళ్లపాటు ధాన్యం పాడవకుండా అవసరమైన వాతావరణ ఉండేలా దీన్ని నిర్మించడం విశేషం. దీని పైకి వెళ్ళటానికి ఉత్తరం వైపు నుండి మెట్లు ఉన్నాయి. పై నుంచి చూస్తే జుమ్మమసీదు కోటలోని మరిన్ని ప్రాంతాలు కనిపిస్తాయి.

రఘునాథస్వామి ఆలయం. దీన్ని రంగనాథ స్వామి ఆలయం అని కూడా అంటారు. దీన్ని పూర్తిగా రాయల వంశీకుల వాస్తు శిల్ప శైలిలో నిర్మించారు. ఆలయం అన్ని వైపులా అపురూపమైన శిల్ప సంపద ఉంది. ప్రధానం ద్వారం దాటగానే కాస్త ఎత్తైన పీఠంపై నిర్మించిన దృశ్యం కనిపిస్తుంది. లోపల వైష్ణవ సాంప్రదాయం ప్రకారం నిర్మించారు. రంగమంటపం, ముఖ మ ండపం, యాగశాల, అంతరాళం, గర్భాలయం ఉన్నాయి. రంగమంటపం ప్రతిస్తంభంలో గొప్ప శిల్పాలున్నాయి. స్తంభంపై గల శిల్పాల ద్వారా నాటి సాంప్రదాయాలనూ, మహిళల ఆభరణాలు, అలంకరణలు తెలుసుకోవచ్చు.
పురాణ కథనాలు శిల్పాలు గల స్థంభాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయంలో కూడా మూలమూర్తి శిల్పం లేదు. యుద్ధ సమయములో సైనికులు దాన్ని దాచారు. ఆ తరువాత అంటే ప్రస్తుతం ఆ విగ్రహం మైలవరం మ్యూజియంలో ఉంది. ఆలయం పీఠం అడుగుచుట్టూ కూడా మంచి శిల్పాలు ఉన్నాయి. యుద్ధ శిల్పాలు, వాటి పక్కన ప్రజల సంస్కృతీ సాంప్రదాయాలను తెలిపే శిల్పాలు ఉన్నాయి. యోగా చేస్తున్న వ్యక్తి శిల్పం ఉంది. అంటే అప్పట్లోనే యోగాకు అంత ప్రాధాన్యత ఉన్నట్లు అర్థమవుతుంది.
ప్రధానంగా ఆలయ ఉత్తర ప్రాకారం నుంచి పడమర వరకు గోడపై దశావతారాల రేఖాచిత్రాలు ఎంత బాగున్నాయో. మరో వైపు 1545లో నంద్యాల తిమ్మరాయ దేవ మహారాజు వేసిన దాన శాసనాలు 1557 నాటి నంద్యాల చిన్న అహోబలేశ్వర మహారాజు వేసిన దాన శాసనాలు చూడవచ్చు. గుడి బయటకు వస్తే పెద్ద పెద్ద రాళ్లు కనపడతాయి. పెన్నా లోయ, పెన్నా నది ఇక్కడ ఈ కొండను ఢీ కొట్టి గండి కొట్టి రెండుగా చీల్చుకొని ప్రవహిస్తూ ఉంది. అందుకే ఈ కోటకు గండికోట అనే పేరు వచ్చింది. అలా ఆ నదిని చూడడం నిజంగా గొప్ప అనుభూతినిస్తుంది. ప్రపంచంలో ఇలాంటి ప్రదేశం అమెరికాలోని గ్రాండ్ కేయిన్ మినహా మరొకచోట లేదు. ప్రపంచంలోనే ఇలాంటి అద్భుతమైన సౌందర్యమైన లోయ ఇదే రెండవది, మనదేశంలోనే ఇలాంటిది ఒక్కటే ఉంది. అందుకే ఈ ప్రాంతంలోనే మన పర్యాటక రంగానికి ప్రపంచస్థాయిలో గొప్ప పేరు వచ్చింది.
త్వరలోనే అధికారులు ఇంటాక్ సంస్థ పర్యాటక ప్రియుల ప్రయత్నాలు ఫలిస్తే యునెస్కో గుర్తింపు కూడా లభిస్తుంది. ఇటు నుంచి అవతల వైపు ఒడ్డుకు త్వరలో రోప్‍వే వేసేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఉదయం (సూర్యోదయం), సాయంత్రం (సూర్యాస్తమయం) వేళ ఎంతో మనోహరంగా ఉంటుంది. కోటలో 101 బురుజులు ఉండేవట. కోట మొత్తం విస్తీర్ణం ఎనిమిది మైళ్ళు
ఉంది. అందుకే దక్షిణ భారతదేశంలోని నాలుగు అతిపెద్ద కోటల్లో గండికోట కూడా ఒకటి.
- పంతుల పవన్ కుమార్,
ఇంటాక్ లైఫ్ మెంబర్ సభ్యుడు,
కడప