దేశమంతటా వైభవంగా జరిగే తొమ్మిదిరోజుల వేడుకలను దేవీనవరాత్రులనీ, శరదృతువులో వస్తాయి. కనుక శరన్నవరాత్రులనీ అంటారు. మన దగ్గర మరింత వైవిధ్యంగా ఉంటాయివి. అంటే ఒకవైపు అమ్మవారి ఆరాధనలు, మరోవైపు బతుకమ్మ సంబురాలు. దుర్గామాతది- మార్మికపథం. బతుకమ్మది- పూలరథం. లలితా సహస్రంలోని ‘ప్రాణదా’ అనే నామానికి బతుకునిచ్చేది, జీవం పోసేదని అర్థం. ‘బతుకు-బతకనివ్వు’ అనేది బతుకమ్మ సందేశం. పండుగలనేవి మనుషుల్ని కలపడం కోసమే! ‘భూసతికిం (భూదేవికి) దివంబునకు (స్వర్గలోకానికి) పొల్పు ఎసగంగ శరత్ సమాగమంబు ఆసకల ప్రమోదకరమై విలసిల్లె… శరదృతువు కలయిక ఎల్లెడలా ఆనందాన్ని నింపుతుంది’ అన్నాడు నన్నయ. దుర్గమ్మను ఆకాశలక్ష్మిగా, బతుకమ్మను భూదేవిగా భావన చేస్తే- శరత్ సమాగమం అంటే ఏంటో అర్థమవుతుంది. అపురూప సమైక్య జీవన సరాగ మాలిక గుండెల్లో వెన్నెల పూయిస్తుంది. ‘సర్వేజనాః సుఖినోభవన్తు’ అనే వైదిక ఆకాంక్షలోను, ‘అమ్మల అవ్వల చేయుచు కాయుచు, బిడ్డల తల్లుల చేయుచు సాకుచు బతకమ్మా! బ్రతుకు’ అనే కవి కాళోజీ కాంక్షలోను స్రవించేది ఒకే జీవధారగా గుర్తించాలంటే ఆ వెన్నెల వికాసం మనకో అవకాశం.
నేడు విజయదశమి! ‘అనిమిషారాతి (మహిషాసురుడు) విల్లెత్త- నగజ(దుర్గ) త్రుంచె, శూలమెత్తిన- ఖండించె నీలవేణి’ అంటూ కాశీఖండంలో శ్రీనాథుడు మహిషాసురమర్దిని పరాక్రమ వైభవాన్ని పలువిధాల వర్ణించాడు. ‘అభీల ఖడ్గ విద్యా కుశలత్వంబు మెరయ రాక్షసకోటి నరకి నరకి’న అమ్మ రాక్షస సంహారక్రీడా నైపుణ్యాన్ని మారనకవి చెప్పాడు. తొమ్మిది రోజులుగా దుర్గాదేవి దుష్టశిక్షణ పూర్తిచేసి విజయోత్సాహంతో వేడుక జరుపుకొనే పదోరోజు విజయదశమి అయ్యింది. నిజానికీ పురాణ గాథలన్నీ ప్రతీకాత్మకాలు. ‘నరకుడనువాడు ఎక్కడో నక్కి లేడు’ అన్నట్లుగా ఈ రక్కసి మూకలన్నీ మన మధ్యనే సంచరిస్తుంటాయి. దైవాన్ని అమ్మరూపంలో ఆరాధించే మన సమాజంలో ఆడబిడ్డలపై కామాంధుల రూపాల్లో హత్యాచారాలకు సైతం తెగబడే మూకలన్నీ రాక్షస సంతతికి చెందినవే. అంటే ఆ అసురుల ఆకారాలే తప్ప స్వభావాలు మారనేలేదు. స్త్రీలు దుర్గామాతలై వారి బారినుంచి, చెరనుంచి రక్షణ పొందగల రోజులు వస్తే- అది నిజమైన విజయదశమి!
తెలంగాణలో ఈ తొమ్మిది రోజులు అమావాస్య నుంచి నవమి వరకు బతుకమ్మ ఆడుతారు. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణునిపై గెలిచిన సందర్భమే కాక… పాండవులు అజ్ఞాత వాసం ముగిసిన తర్వాత జమ్మి చెట్టు మీద నుంచి తమ ఆయుధాలు తీసుకున్నరోజు కూడా! ఈ సందర్భంగా ‘రావణ వధ’, జమ్మి ఆకుల పూజ వంటివి చేయటం ఆచారం. జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసునితో తొమ్మిది రాత్రులు యుద్ధం చేసి అతనిని వధించి విజయాన్ని పొందినందుకు 10వ రోజు ప్రజలంతా సంతోషంతో పండగ జరుపుకొంటారు.
తెలంగాణలో పాలపిట్టను చూసిన తర్వాత జమ్మి చెట్టు వద్దకు పోయి పూజలు చేసి జమ్మి ఆకులు (బంగారం) పెద్ద వాళ్లకు ఇస్తూ వారి దీవెనలు తీసుకుంటారు. ఒకరినొకరు ‘అలాయ్ బలాయ్’ చేసుకుంటూ మురిసిపోతుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణలో దసరా ఒక మహోన్నతమైన పర్వదినం.
- కె. సత్యప్రసన్న