బాదామీ చాళుక్యుల కాలంలో, ఇప్పటి జోగులాంబ-గద్వాల జిల్లాలో, కృష్ణానది, తుంగభద్రానదితో కలిసే కూడలి సంగమేశ్వరంలో, దేవాలయ పునాదులకు సంబంధించి మనదేశంలోనే అరుదైన ఆధారాలు వెలుగుచూశాయి. అలంపూర్‍లోని నవబ్రహ్మేశ్వరాలయాల మాదిరిగనే సంగమేశ్వరాలయం, రేఖానాగర ప్రాసాదశైలిలో నిర్మించబడింది. గర్భాలయం, అర్ధమండపం, మహామండపం, అన్ని కట్టడభాగాలపైన అనేక దేవతామూర్తుల శిల్పాలు సా.శ.7-8 శతాబ్దాల నాటి బాదామీ చాళుక్య ఆలయ వాస్తుశిల్పానికి అద్దం పడుతున్నాయి.
నదికి ఆ వైపు నుంచి తెచ్చిన ఎర్రఇసుక రాతితో నిర్మించిన కూడలి సంగమేశ్వరాలయం, శ్రీశైల జలాశయ ముంపుకు గురైంది. అద్భుత శిల్పకళాఖండాలున్న ఈ ఆలయాన్ని భావితరాలకు అందించటానికి, కేంద్రపురావస్తుశాఖ, ఈ ఆలయాన్ని ఊడదీసి 18 కి.మీ. దూరంలో నున్న అలంపూర్‍కు తరలించి యధాతథంగా పునర్నిర్మించింది. ఇదొక అద్భుత చారిత్రక ఘట్టం.
15 మీ. ఎత్తుగల విమానం (కప్పు పైనున్న కట్టడం), ఇంకా ఆలయ అధిష్ఠానం, గోడలు, కప్పు రాళ్ల బరువు నంతటినీ తట్టుకొనేలా, భూమట్టం నుంచి కిందికి 10 మీటర్ల లోతు పునాది గుంటను తవ్వి, అడుగున సంప్రదాయ బద్ధంగా, పుట్టమట్టితో నింపి, దిమ్మెసకొట్టి, దానిపై రాళ్లు, పైన మళ్లీ పుట్టమట్టి, రాళ్లతో 7 మీటర్ల ఎత్తు వరకూ నింపారు.
భూమట్టం నుంచి కిందికి 10 మీ. పునాదులను ఏర్పాటు చేయటం మనదేశ ఆలయాల చరిత్రలో వెలువడిన తొలి ఆధారం. ఈ ఘట్టం తెలంగాణకే కాదు, మొత్తం తెలుగునేలకే గర్వకారణం. ఆలయ నిర్మాణ కౌశలంలో ఇదొక మైలురాయి. (డా. ఐ.కె. శర్మగారికి ధన్యవాదాలతో..)
-ఈమని శివనాగిరెడ్డి-స్థపతి,
9848598446