దాశరథి రంగాచార్య మోదుగుపూలు నవలలో ప్రజా జీవితం పోరాటం

నవలా సాహిత్యంలో దాశరధి రంగాచార్యులు సుప్రసిద్ధులు. ఈయన రచించిన నవలల్లో తెలంగాణ జీవన విధానం, గ్రామీణ జీవన చిత్రణ, రజాకర్ల దుశ్చర్య, హైదరాబాద్‍ రాష్ట్ర పరిస్థితులు, జమిందారి వ్యవస్థ, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కరణాలు పట్వారిల పెద్దరికం, అనాటి ప్రభుత్వ అధికారుల వద్ద ప్రజల వెట్టిచాకిరి, భూ సమస్య పోరాటం, ప్రజల్లో చైతన్యం మొదలగు అంశాలు వివరించబడ్డాయి. రంగాచార్య చిల్లర దేవుళ్ళు, మోదుగు పూలు, జనపదం, మాయా జలతారు, రానున్నది ఏది నిజం, పావని, మానవత, శరతల్పం, అమృతంగమయ్య నవలలను రచించాడు. వచన రచనకు దాశరధి రంగాచార్య ప్రసిద్ధి. అందులో నవలా రచనకు ఆయనకు అందవేసిన చేయి అని చెప్పవచ్చు. మోదుగు పూలు నవలలోని ప్రజా జీవన పోరాటాన్ని పరిశీలిద్దాం.
దాశరథి రంగాచార్య గార్లలో నడిపిన ఉద్యమం ఇతివృత్తంగా ‘‘మోదుగుపూలు’’ నవలను రచించాడు. ‘‘ప్రగతి’’లో ‘‘మోదుగు పూలు’’ ధారావాహికగా వచ్చింది. 1971లోనే విశాలాంధ్ర ప్రచురణాలయం వారు పుస్తకంగా ముద్రించారు. మోదుగుపూలు 1984లో రేడియోలో నాటకంగా ప్రసారం అయింది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ‘‘మోదుగపూలు’’పై పి.ఎస్‍. ప్రకాశ్‍ పరిశోధన చేసి ఎం.ఫిల్‍ డిగ్రీ పొందారు.
‘‘మోదుగుపూలు’’లో 1938 నుంచి 1948 వరకు, అంటే హైదరాబాద్‍ సంస్థానంపై పోలీస్‍ చర్య జరిగే దాక తెలంగాణా ప్రజా జీవితం, ప్రజా పోరాటానికి ప్రజలు సిద్ధమైన తీరు చిత్రించబడింది. రంగాచార్య ‘‘మోదుగుపూలు’’లో ఒక జాగీర్ను కథా వస్తువుగా తీసుకున్నారు. దీని పరిధి విస్తృతం. కొన్ని గ్రామాలు ఏకమై చైతన్యంతో తిరుగుబాటు చేయడం ఇక్కడ కనిపిస్తుంది. జాగీర్దార్‍ ఎక్కడో పట్నంలో ఉంటాడు. అతడికి పరిపాలన, ప్రజల క్షేమం పట్టదు. పాలన అంతా తాసిల్దార్‍ చేతిలో ఉంటుంది. అతనే జాగీర్కు ‘‘సర్వతంత్ర స్వతంత్రుడైన’’ ప్రభువు. అక్కడ ఒక శాసనమంటూ ఏమీ ఉండదు. ‘‘దండించడమే’’ శాసనం.

జాగీర్లో పేపర్‍ చదవడం నిషేధం. అలాంటి జాగీర్లోకి పట్నంలో చదువుకున్న రఘు పేపర్తో దిగుతాడు. జాగీర్లోకి పేపర్‍ తెచ్చినందుకు అమీన్చేత చెంప దెబ్బతింటారు. రఘు. అమీన్పై పగ తీర్చుకుంటానంటాడు. రఘు మామ వీరయ్య అప్పుడు రఘు, ‘‘వ్యక్తిని అని ఏమి ప్రయోజనం, వ్యవస్థ అటువంటింది’’ దాన్ని మార్చాలంటాడు. ‘‘తాసిల్దార్‍ గుడ్ల గూబ. ప్రజల అజ్ఞానం చీకటి. ఈ చీకటి ఉన్నంత సేపే తాసిల్దార్‍ ఆటలు సాగుతాయి. అజ్ఞానం అనే చీకటి పోయి విజ్ఞానం అనే వెలుగు వస్తే తాసిల్దార్‍ గుడ్డివాడై పోతాడు’’ (పే. 32) అంటాడు రఘు.
ఇక్కడ ప్రజా చైతన్యానికి రఘు నాయకుడిగా ఉండడానికి మామ వీరయ్య మాటలు స్ఫూర్తినిస్తాయి. ఈ మాటలను రఘు తన ఉద్యమానికి పునాదులు వేసుకుంటాడు. ప్రజలకు ‘‘ప్రపంచ జ్ఞానం’’ కలిగించాలనుకుంటాడు. ఆ ఉద్యమానికి రఘు మేనమామ వీరయ్య, ఆయన కూతురు జానకి, అదే జాగీర్కు చెందిన నగేశ్‍ సహకరిస్తారు. నగేశ్‍ హింసావాది. రఘు అహింసావాది. శాంతమూర్తి.
రఘు మంగలివాళ్లచేత సమ్మె చేయించి, వారి భూమి తిరిగి వచ్చేలా చేస్తాడు. రఘు ‘‘పోరాటానికి మంగలి రావడు పూర్తి సహకారాన్ని అందిస్తాడు. తాను చదువు నేర్చుకుని, తమ వారికి చెబుతాడు. వడ్డెర పీరయ్య, పీరమ్మ మృతితో వడ్డెర్లలో చైతన్యం రగిలిస్తారు. రఘు, జానకి, నగేశ్లు. అప్పటిదాక తిరుగుబోతుగా ఉన్న పీరయ్య కొడుకు. భీముడు రఘు ఉద్యమంలో చేరతాడు. వెట్టి చాకిరి నిర్మూలన: తాసిల్దార్‍ బంగ్లాకు వెట్టికి రాళ్లు కొట్టమని, కూలీ ఇవ్వాలని అడుగుతారు. విజయం సాధిస్తారు. నవలలో మరో ప్రధాన విషయం కోయలు. నాగరికతకు దూరంగా అడవుల్లో ఉండే కోయలు తాసిల్దార్‍కి ఎట్టి చేయాల్సిందే. అలాంటి వారిలో రఘు చైతన్యం నింపుతాడు.

వార్తాపత్రిక చదవడం నిషిద్ధమైన జాగిరిలో వార్తాపత్రిక తెచ్చి ప్రజల చేత చదివిస్తాడు రఘు. ప్రజల సహకారంతో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసి నాయకులను పిలిపించి సభలు నిర్వహించి రాత్రి పాఠశాలలు నిర్వహించి ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాడు.
మోదుగు పువ్వులు నవలలో నిజాం సంస్థానంలోని జాగిర్ల పుట్టుపూర్వోత్తరాలను రచయిత వివరించాడు. అలాగే వారి పరిపాలన విధానాన్ని వివరించాడు. వాటితో పాటు జాగిర్దారుల జలసాలు, తాసిల్దార్ల అరాచకాలు వివరించాడు.
తాసిల్దార్‍, గిర్దావర్‍, అమీన్‍, సాహుకారులు నాటి సమాజంలో ప్రజలను ఎలా పీడించారో వివరంగా చిత్రించారీ నవలలో రచయిత. ప్రజలు భూమి శిస్తు కాకుండా వందల రకాల పన్నులు చెల్లించాల్సి వచ్చేంది. ఆ సుంకంతోపాటు ఊరంతా వెట్టి చేయాల్సి వచ్చేది. జాగీర్దార్‍ వేట కోసం వచ్చినప్పుడు ప్రజల నుంచి వేట సుంకం వసూలు చేస్తారు. సుంకం ఇవ్వడమే కాకుండా, వెట్టి చేయాల్సిందే. ‘‘జాగీర్దార్‍ దిగకముందే ఏర్పాట్లు సాగాయి. గౌండ్లు తాటాకు కొట్టారు. కోయలు వాసాలు కొట్టి తెచ్చారు. బండ్లు ఎట్టికి కట్టారు రైతులు. వ్యాపారస్తులు బిర్యానీకి, పొలావుకు అయిన సామాగ్రి ఉచితంగా ఇవ్వాలి. గొల్లవారు గొర్రెలు ఇవ్వాలి. మంగళ్లు మసాలాలు నూరాలి. చాకళ్లు మేనాలు మోయాలి. ఊరంతా వెట్టి చేయాలి. అధికారుల తప్ప అధికారులకు అది పండుగ’’. పుట 39

సాహుకారుల దోపిడి, పీడన, అరాచకత్వం ఎలా ఉంటుందో ఈ నవలలో చిత్రీకరించబడింది. నిజాం రాజ్యంలో సాహుకార్ల దోపిడీని వెంకయ్య పాత్ర చిత్రీకరిస్తుంది. వెంకయ్య జాగీరికే పెద్ద సాహుకారు. ‘‘అందరి గింజలతో అతని గరిసెలు నిండుతాయి. అందరి కుండలూ అతని గింజలతోనే
ఉడుకుతాయి’’ (పే.45) మంగలిరావడి తండ్రికి నూరు రూపాయాలు అప్పుగా ఇచ్చి ఉంటాడు. ఆ బాకీ కిందికి మంగలిపని, వైద్యమూ, బాజా ఉచితంగా చేయాలి. ఈ విధానాన్ని మంగలి వాడు ఎదిరిస్తాడు. అతనికి పొలం ఉంది కాబట్టే తన మాట వినడంలేదు అనుకుంటాడు. భూమి కాజేయాలనుకంటాడు. అమీన్‍ మంగలి రావడిని హింసించి, బాకీ కిందకి భూమి ఇచ్చేందుకు ఒప్పిస్తాడు.
వేట సందర్భంలోనే పులికి బదులు కోయవాడిని కొట్టమంటుంది బేగం. జాగీర్దార్‍ తుపాకీతో కోయవాడిని కొడతాడు. ఆ కోయవాడు విలవిల్లాడి చనిపోతాడు. అతను ఎవరీకీ పట్టడు. అందరూ జాగీర్దార్‍ గురిని మెచ్చుకుంటారు. ఇలాంటి ఉదంతాలు నాటి ఫ్యూడల్‍ భూస్వామ్య వ్యవస్థకు చిహ్నాలు. అమాయక ప్రజలలో వచ్చిన మార్పును, తిరుగుబాటును మనం ఈ నవలలో గమనించవచ్చు.

  1. మోదుగుపూలు – దాశరధి రంగాచార్యం

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *