(గత సంచిక తరువాయి)
(జరిగిన కథ: ముంబై నుండి వచ్చిన రాజా రామ్మోహన్ రాయ్‌కి వారికి కేటాయించిన గది చూపించి విశ్రాంతి తీసుకొమ్మంటుంది అవ్వ. తెల్లవారి వ్యాయామం చేసుకుందామని బయటికి వచ్చిన రవి అక్కడ బోర్డు నిండా ఉన్న వాక్యాలను చూసి ఆశ్చర్యపోయి.. ఎవరు రాసారు అని ఆలోచనలో పడిపోతాడు.)
ఇంతలో అవ్వ మరియు రాజా రామ్మోహన్ రాయ్ ఇద్దరు ఒకేసారి అక్కడికి చేరుకున్నారు.
‘‘గుడ్ మార్నింగ్’’ అన్న పలకరింపు విని రవి రామ్మోహన్ గారి వైపు తిరిగాడు.
‘‘మీరు!?’’ అంటూ ఆగిపోయాడు రవి.
‘‘నేను బాంబే నుండి నిన్న ఇక్కడికి వచ్చాను. నా పేరు రాజా రామ్మోహన్ రాయ్’’ అంటూ పరిచయం చేసుకున్నారు.
‘‘నమస్తే!’’ అన్నాడు రవి.
తదేకంగా బోర్డు వైపే చూస్తున్న రవి వైపు చూస్తూ ‘‘అవి నేనే రాసానండి’’ అన్నారు రామ్మోహన్ గారు.
అప్పుడే బోర్డు వైపు చూస్తున్న అవ్వ.. ఆ మాటలకు ఆశ్చర్యంగా చూసింది. వెంటనే ఇలా అంది.. ‘‘రాయకూడదని కాదు కానీ, ఇన్ని మంచి వాక్యాలు ఒకేసారి రాసారు. అన్నింటికీ అర్ధం ‘‘లోకంలో మంచితనానికి మానవత్వానికి మించిన అలవాటు మరొకటి ఉండదు’’ అన్నట్టుగా ఉంది. చూస్తుంటే ఏదో అనుభవ పూర్వకంగా రాసినట్టు అనిపిస్తోంది. విషయం ఏమిటో వివరంగా తెలుసుకోవచ్చా!’’ మ•దువుగా అడిగింది అవ్వ.

‘‘నాకూ మిమ్మల్ని చూస్తుంటే నా అనుభవాలన్ని మీతో పంచుకోవాలని ఉంది. మీరు కూడా కూర్చోండి’’ రవి వైపు తిరుగుతూ అన్నారు రామ్మోహన్ గారు.
‘‘మా సొంత ఊరు ఇక్కడే అయినా బిజనెస్ పనుల మీద ముంబై వెళ్లి అక్కడ బిజినెస్ బాగా డెవలప్ అవ్వడంతో కుటుంబంతో సహా అక్కడే స్థిరపడిపోయాను. ఎంత సంపాదించినా.. గొప్పలకు పోకుండా ఆపదలో ఉన్న వారికి, అవసరమైన వారికి ఎలాంటి సహాయం కావాలన్నా నాకు చేతనైన సాయం చేసే వాడిని. నాకు తగినట్టే నా భార్యా పిల్లలు కూడా నేను చేసే ప్రతి పనిలో తోడు ఉండేవారు. ఒకసారి నా కుటుంబం అంతా సెలవుల్లో వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లారు. నేను ఒంటరిగా ఉన్నప్పుడు నేను సాయం చేసిన వాళ్ళందరి ఫోన్ నెంబర్లు నా దగ్గర ఉంచుకొని.. నాకు వీలైనప్పుడు వాళ్ళ క్షేమ సమాచారాలు తెలుసుకునే వాడిని. అప్పుడే ఒక సంఘటన జరిగింది. అది జరిగే రెండు రోజుల ముందటి వరకు కూడా వాళ్లందరితో ఫోన్ మాట్లాడాను. ఆ తర్వాత అనుకోకుండా ఒక సాయంత్రం హఠాత్తుగా భూకంపం రావడం.. అదే సమయంలో మా బిల్డింగ్‌లోని మరో అంతస్తులో అగ్ని ప్రమాదం సంభవించి మంటలు చెలరేగి అంతటా వ్యాపించడం మొదలైంది. ఎంతో ధైర్యంగా ఉండే నాలో కూడా భయం కలిగింది. బయటికి రావాలన్నా ఎటు నుండి మంటలు వ్యాపిస్తున్నాయో తెలియటం లేదు. భూకంపం తీవ్రత కూడా పూర్తిగా తగ్గలేదు. నేను నా దగ్గర ఉన్న ఫోన్ నెంబర్లు అన్నింటికి కాల్ చేయటం మొదలు పెట్టాను. నాకు షాక్ కలిగించిన విషయం ఏమిటంటే.. ఒక్కరు కూడా నా ఫోన్‌కు సరిగ్గా స్పందించలేదు. ఒకరు ఎత్తకపోవడం.. ఒకరు కాల్ కట్ చేయడం.. మెసేజ్ పెట్టినా చూడకపోవడం.. చూసినా రిప్లై ఇవ్వకపోవడం.. ఇవన్నీ చూసి నాకు గుండెపోటు వచ్చినంత పనైంది. ఫోన్ పక్కకు పెట్టి దిగులుగా కూర్చున్న సమయంలోనే సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యే విషయం జరిగింది. ‘‘సార్ సార్’’ అంటూ ఒకవైపు ‘‘అంకుల్’’ అంటూ మరోవైపు చుట్టూ అందరూ నన్నే పిలుస్తున్నారు. ఒకరు కిటికి ఊచలు పగులగొట్టి నన్ను అందులో నుండి బయటికి తీసుకొచ్చారు.
బయటికి వచ్చి చూస్తే తమ పోర్షన్ వైపు కూడా మంటలు వ్యాపిస్తున్నాయి. ఫైర్ ఇంజన్లో ముందుగా ఇటువైపే మంటలార్పుతున్నారు. పక్కనే అంబులెన్స్.. మరొక పక్కన నా సాయం పొందిన వారంతా కార్ డోర్స్ తీసి నిలబడ్డారు. నన్ను చూడగానే.. ‘‘మీకేం కాలేదు కదా!’’ అని పరిగెత్తుకుంటూ వచ్చారు. వాళ్ళందరినీ చూడగానే నాకు ఉద్వేగంతో కళ్ళలో నీళ్లు తిరిగాయి. నేను బయటికి క్షేమంగా రాగానే వారంతా మిగతా వారికి కూడా సాయం చేయడం మొదలుపెట్టారు. అందులో కొందరు ‘‘సారీ మాస్టారూ.. మేము సహాయ సిబ్బందికి ఫోన్లు చేస్తుండటంతో మీ ఫోన్‌కి రిప్లై ఇవ్వలేకపోయాం’’.. అంటుంటే అప్పుడు అర్థమైంది నాకు అసలు విషయం. మరో విషయం కూడా అర్థమైంది నాకు.. ‘‘మనం మంచి చేస్తే భగవంతుడు ఏ రూపంలో నైనా మనల్ని కాపాడుతాడు’’ అని. అది అందరూ గ్రహించాలనే ఏదో ఒక విధంగా అవకాశం వచ్చినప్పుడల్లా ఇలా తెలియచేస్తుంటాను.’’ వివరంగా తెలియజేసారు రామ్మోహన్ గారు. ‘‘అంతేకాకుండా ఇది జరిగిన సమయంలోనే నేను ప్రాణాలతో బయటపడితే మా అమ్మ పూజించే కొమ్మాల లక్ష్మి నరసింహ స్వామిని దర్శించుకుంటానని మొక్కుకున్నాను. మా అమ్మకు ఈ దేవుడంటే చాలా ఇష్టం. ఆలయ తోరణానికి విరాళం ఇవ్వడం వల్ల అక్కడ శిలాఫలకం మీద ‘‘యశోద’’ అని మా అమ్మ పేరు కూడా రాసి ఉంటుంది’’ అన్నారు రామ్మోహన్ రాయ్.
‘‘చాలా సంతోషం బాబూ… నిదానంగా అక్కడికి వెళ్లి దర్శించుకోండి’’ అంది అవ్వ.
ఆ తర్వాత అందరూ ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్లారు.
(మిగతా కథ వచ్చే సంచికలో)
మాదారపు వాణిశ్రీ
ఫోన్ : 9247286668
బొమ్మలు: కైరం బాబు
