ప్రత్యేక రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధి: దేవాదాయ & అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‍ రెడ్డి

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, సీఎంగా కేసీఆర్‍ బాధ్యతలు చేపట్టిన తరువాత, ముఖ్యమంత్రే స్వయంగా భక్తిపరుడు కాబట్టి దేవాలయాల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‍ రెడ్డి తెలిపారు. ఏ కార్యక్రమం మొదలు పెట్టినా భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి మొదలు పెడతారన్నారు. సమైక్య రాష్ట్రంలో దేవాదాయ శాఖ అంటే కొన్ని పేర్లు మాత్రమే వినబడేవి. తిరుపతి కలిగియు దైవం వెంకటేశ్వర్లస్వామి, విజయవాడ కనకదుర్గ, సింహాచలం అప్పన్న, అన్నవరం సత్యనారాయణ ఇలా కొన్ని పేర్లు మాత్రమే భక్తుల నోట వినిపించేవి. ప్రత్యేక రాష్ట్రం స్వపరిపాలన వచ్చిన తరువాత దేవాలయాల ప్రతిష్ఠ బాగా పెరిగిందన్నారు. యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దేవాలయాన్ని తిరుమల దేవాలయంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‍ రాతి కట్టడాలతో పెద్దఎత్తున నిర్మిస్తున్నారన్నారు. త్వరలోనే నిర్మాణం పూర్తి అయ్యి భక్తులు దర్శనం చేసుకుని అక్కడే వుండడానికి అన్ని సదుపాయాలు కల్పించి, సౌకర్యంగా వుండేలా అందుబాటులోకి రానున్నదని తెలిపారు. తెలంగాణాలో రాష్ట్రంలో 12,434 దేవాలయాలు ఉన్నాయి. 5,625 మంది ఉద్యోగస్తులు దేవాదాయ శాఖలో పనిచేస్తున్నారు.


తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పుష్కరాలను ఎంతో ఘనంగా నిర్వహించాం. గతంలో గోదావరి పుష్కరాలు అంటే రాజమండ్రి, కృష్ణా పుష్కరాలు అంటే విజయవాడ మాత్రమే అనుకునేవారు. ముఖ్యమంత్రి కేసీఆర్‍ అధికారులు, ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసి గోదావరి పుష్కరాలను అద్భుతంగా నిర్వహించడం జరిగిందన్నారు. అదే విధంగా కృష్ణా పుష్కరాలకు మహబూబ్‍నగర్‍, నల్లగొండ జిల్లాల్లో రవాణా సౌకర్యాలు, దేవాలయాల అభివృద్ధి, భక్తులకు పుష్కర ఘాట్‍లు ఏర్పాట్లు చేసి దాదాపు మూడు, నాల్గు కోట్ల మంది భక్తులు పుష్కర స్నానాలు చేసే విధంగా చర్యలు తీసుకున్నారు. అదే విధంగా సమ్మక్క సారలమ్మ జాతరకు రూ. 150 కోట్లతో రోడ్లు నిర్మాణం చేసి, సింగిల్‍ లైన్‍ ఉన్న రోడ్డును డబల్‍ లైన్‍ నిర్మించి భక్తులకు సౌకర్యవంతమైన రవాణా ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. బోనాల పండుగను రాష్ట్ర పండుగగా ముఖ్యమంత్రి కేసీఆర్‍ ప్రకటించి పెద్ద ఎత్తున నిధులు అందజేయడంతో దేవాలయాల అలంకరణ, ఉత్సవాల నిర్వహణ అద్భుతంగా నిర్వహిస్తున్నారు.


కామన్‍ గుడ్‍ ఫండ్‍ ఆధ్వర్యంలో సమైఖ్య రాష్ట్రంలో దేవాలయాలు నిర్మాణం చేయాలంటే 33 శాతం డిపాజిట్‍ కట్టాల్సి వుండేది. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తరువాత 20 శాతంకు తగ్గించారు. దీంతో కొత్త 1911 దేవాలయాలకు అనుమతి కోసం అప్లై చేశారు. దీనికి రూ. 287 కోట్ల అంచనా వ్యయం వుంది. 1427 దేవాలయాల్లో పునర్‍ నిర్మాణ పనులు చేశాం. గతంలో వీకర్‍ సెక్షన్‍ కాలనీలో దేవాలయం నిర్మించాలంటే రూ. 3 లక్షలు వుండేది. ఆ వ్యయాన్ని ఇప్పుడు రూ. 10 లక్షల రూపాయలకు పెంచాము. 486 దేవాలయాలు మంజూరు చేయడం కూడా జరిగింది. యాదగిరి గుట్టతో పాటు భద్రాచలం, బాసర, వేములవాడ, ధర్మపురి వంటి దేవాలయాల అభివృద్ధికి కూడా నిధులు మంజూరు చేయడం జరిగింది.


అర్చకులకు కూడా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇవ్వాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు 2,773 మంది అర్చకులకు ప్రతి నెలా వేతనాలు అందజేస్తున్నాం. ధూపదీప నైవేద్యానికి గతంలో రూ. 4వేలు వుంటే దాన్ని ఇప్పుడు రూ. 6వేలకు పెంచాము. 3,645 మంది అర్చకులకు ధూపదీప నైవేద్యం కింద అందజేయడం జరుగుతుంది. ఇలా పూజా కార్యక్రమాలు నిర్వహించడానికి దాదాపు 8 వేల మంది పూజారులకు వేతనాలు అందజేయడం జరుగుతుంది. ఐటీ మంత్రి కేటీఆర్‍ సూచనలతో 11 దేవాలయాలకు ఆన్‍లైన్‍ సేవలు అందజేయడం జరుగుతుంది.


దేవాలయ భూముల పరిరక్షణ:
దేవాదాయ భూముల పరిరక్షణకు కఠిన చర్యలు తీసు కుంటున్నామని, ఆలయ భూముల ఆక్రమణదారులను ఉపేక్షించేది లేదని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‍ రెడ్డి తెలిపారు. జంటనగరాల పరిధిలోని దేవాదాయ భూముల రక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. దేవాదాయ భూముల పరిరక్షణ, నిరుపయోగంగా ఉన్న ఆలయ భూములను గుర్తించి, వాటి ద్వారా ఆదాయం పొందే మార్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పారు.


దేవాదాయ శాఖకు సంబంధించిన ఆస్తుల లీజుల విషయంలో కఠినంగా వ్యవహరించనున్నామన్నారు. నామమాత్రపు ధరకు దేవాదాయ శాఖకు సంబంధించిన షాపులను లీజుకు తీసుకొని తిరిగి వాటిని అధిక అద్దెకు సబ్‍ లీజుకు ఇస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఆదేశించామన్నారు. లీజ్‍ నిబంధనలు మార్చి దేవాదాయ శాఖకు మరింత ఆదాయం వచ్చేలా చూడాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు. దశాబ్దాల క్రితం నాటి లీజ్‍ లతో పాటు అద్దెల విషయంలో కూడా పునఃసమీక్షించినట్లు చెప్పారు. ఆలయ భూముల ద్వారా వచ్చే ఆదాయం పెంచే మార్గాలపై దృష్టి సారించామన్నారు.


హైదరాబాద్‍ పరిధిలో రూ.55 కోట్ల వ్యయంతో 13 ప్రాంతాల్లో నిరుపయోగంగా ఉన్న దేవాదాయ భూముల్లో షాపింగ్‍ కాంప్లెక్స్లు, కళ్యాణ మండపాల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించాం. రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్‍ డ్రైవ్‍ ద్వారా 1300 ఎకరాల ఆలయ భూములను గుర్తించి వెనక్కి తీసుకున్నాం, 21 వేల ఎకరాల ఆలయ భూములకు రక్షణ సరిహద్దు బోర్డులు ఏర్పాటు చేశామని తెలిపారు. దీర్ఘ కాలంగా కోర్టుల్లో పెండింగ్‍లో ఉన్నదేవాదాయ శాఖ భూములపైన ఉన్న వివాదాలను పరిష్కరించేందుకు కోర్టుల్లో బలమైన వాదనలు వినిపించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. అవసరమైతే లీగల్‍ ఆఫీసర్లను కూడా నియమించుకుంటామన్నారు. పోలీసు శాఖ సమన్వయంతో స్పెషల్‍ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసి, భూ ఆక్రమదారులను ఖాళీ చేయించేట్లు కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు.


ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‍ రావు ఆలయ పూజారులు, ఉద్యోగుల సంక్షేమం కోసం అనేక దశలను అమలు చేశారు. ఆలయ యాజమాన్యంలోని భూములను రక్షించడానికి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ భూ రికార్డులన్నింటినీ ఆన్‍లైన్‍లో అప్‍లోడ్‍ చేస్తుంది. ఈ పట్టణం యొక్క ప్రధాన దేవత పేరిట పట్టాలు జారీ చేయబడతాయి.


ఇప్పటివరకు, వివిధ దేవాలయాల యాజమాన్యంలోని 14,277 ఎకరాలు ఖాళీగా ఉన్నట్లు గుర్తించామన్నారు. అటువంటి భూమి పట్టాలకు యాజమాన్య హక్కులను ప్రకటిస్తూ ప్రభుత్వం 856 సైన్‍ బోర్డులను ఏర్పాటు చేసింది. 21,339 ఎకరాల ఆలయ భూములకు పట్టదార్‍ పాస్‍బుక్‍లు జారీ చేశామని, త్వరలో మరో 59,898 ఎకరాల భూమి పట్టాలకు పాస్‍బుక్‍లు జారీ చేస్తామని మంత్రి తెలిపారు.


లాక్‍డౌన్‍ తర్వాత :
‘భగవంతుడికి – భక్తుడికి మధ్య ఇంత విరామం అసాధారణం. లాక్‍డౌన్‍ వల్ల ఎడబాటు తప్పలేదు. జాగ్రత్తలతో దైవదర్శనానికి కేంద్రం అనుమతించటంతో రాష్ట్రంలో కూడా అందుకు అవకాశం కల్పించాం. భక్తులు హడావుడి పడకుండా కరోనా నిబంధనలు పాటిస్తూ స్వామి దర్శనం చేసుకుంటే మంచిది. ఒకేసారి విరుచుకుపడకుండా భౌతిక దూరం పాటిస్తూ దర్శనం చేసుకోవాలి. నేరుగా ఆలయానికి రావాల్సిన అవసరం లేకుండా కోరిన రోజు, కోరుకున్న సేవను స్వామి, అమ్మవార్లకు నిర్వహించేలా ఆన్‍లైన్‍ సేవలను మరింతగా విస్తరించ బోతున్నాం’ అని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‍రెడ్డి తెలిపారు. లాక్‍డౌన్‍తో ఆగిపోయిన దర్శనాలు 78 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత మొదలయ్యాయి. భక్తులు స్వామిని దర్శించుకోవాలన్న ఆత్రుత ఉంటుంది. కానీ నిబంధనలు పాటిస్తూ దర్శనం చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. అనవసరంగా హడావుడి పడి తమతో పాటు తోటి వారిని ఇబ్బంది పెట్టొద్దన్నారు.


ఆదాయం కోల్పోవడంపై ఆలోచించలేదు:
లాక్‍డౌన్‍ వల్ల దేవాలయాలకు భక్తులు రాక దేవాదాయ శాఖకు దాదాపు రూ.200 కోట్ల ఆదాయం పోయింది. కానీ దీన్ని సీరియస్‍గా తీసుకోవట్లేదు. తప్పని పరిస్థితిలో ఆలయాలకు భక్తుల రాకను నిలిపేయాల్సి వచ్చింది. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని తు.చ. తప్పకుండా పాటించాం. ఆదాయం కంటే భక్తులకు స్వామి దర్శనాలు ప్రశాంతంగా కల్పిస్తూ ఆలయాల్లో భక్తి పూర్వక వాతావరణాన్ని పెంపొందించటమే మా కర్తవ్యం. ఇప్పుడు ఆలయాలు తెరుచుకున్నందున భక్తులకు ఇబ్బందులు, భయాందోళనలు లేని దర్శనాలు నిర్వహిస్తాం. అందుకే కేంద్రం విధించిన నిబంధనలతో పాటు మరికొన్నింటిని అదనంగా చేర్చి అమలు చేస్తున్నాం. దీనికి భక్తులంతా సహకరించాలి. ఇక ఆలయాలకు ఆదాయం తగ్గినా వాటి నిర్వహణకు ఇబ్బంది రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.


సిబ్బందికి ఏ ఇబ్బందీ లేదు :
మూసి ఉన్న సమయంలో ఆలయాలకు ఆదాయం లేకున్నా అర్చకులు, ఆలయాల సిబ్బంది జీతాలకు, ధూపదీప నైవేద్యం పథకం కింద పేద దేవాలయాలకు చెల్లింపులకు ఎక్కడా లోటు రానీయలేదు. 4 వేలకు పైగా పేద దేవాలయాలకు చెల్లిస్తున్న ధూపదీప నైవేద్యం సాయాన్ని కొనసాగించాం. 3,600 మందికిపైగా అర్చకులకు చెల్లించాల్సిన జీతాలను చెల్లించాం. లాక్‍డౌన్‍ నిబంధనలు కొనసాగినన్నాళ్లూ ఆలయాల్లో స్వామి కైంకర్యాలు యథావిధిగా జరిగాయి. అర్చకులు వాటిని పద్ధతి ప్రకారం నిర్వహించారు. ఇప్పుడు కూడా ప్రత్యేక వేడుకలను అలాగే నిర్వహిస్తారు.


భద్రాచలం ఎపికి అప్పగించడానికిప్రతిపాదన లేదు :
భద్రాచలంను ఆంధప్రదేశ్‍ రాష్ట్రానికి అప్పగించాలని తెలంగాణ రాష్ట్రంతో ఎలాంటి ప్రతిపాదన లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో అలాంటి ప్రతిపాదన ఏదీ పెండింగ్‍లో లేదని అన్నారు. అయితే, రెండు ప్రాంతాల అభివృద్ధికి ఎపి, తెలంగాణ ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి పనిచేస్తున్నారని, అంతకన్నా ఎక్కువ ఏమీ లేదన్నారు. ఖాళీ భవనాలను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించి నందుకు ఆంధప్రదేశ్‍ చేసిన సంజ్ఞను ఆయన ప్రశంసించారు. ‘‘ఇది రాష్ట్రంలో ఉన్న ఆరోగ్యకరమైన రాజకీయ వాతావరణాన్ని మాత్రమే చూపిస్తుంది’’ అని ఆయన అన్నారు.


పర్యాటక కేంద్రంగా నిర్మల్‍ :
నిర్మల్‍ పట్టణాన్ని ప్రధాన పర్యాటక కేంద్రంగా మారుస్తామని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అన్నారు. చారిత్రాత్మక శ్యామ్‍ గర్హ్ కోటను సందర్శించి లైటింగ్‍ పనులను ప్రారంభించారు. కోట యొక్క వివిధ ప్రదేశాలను అభివృద్ధి చేస్తామని, ఈ ప్రదేశానికి సమీపంలో ఉన్న ఒక ట్యాంక్‍లో వాకింగ్‍ ట్రాక్‍, క్యాంటీన్‍ మరియు బోటింగ్‍ సదుపాయాన్ని కల్పించనున్నట్లు చెప్పారు. జిల్లాకు హరితా హోటల్‍ను కేటాయించామని, త్వరలో ఓల్డ్ ఐబి భవనం సమీపంలో దీనిని నిర్మిస్తామని తెలిపారు.

కట్టా ప్రభాకర్‍,
8106721111

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *