బహు ముఖ ప్రపంచానికి
సత్యం చెప్పడం ఒక సాహసమే!
బల్ల గుద్ది మాట్లాడే వాని అంతరంగం
ఒక్క కవికే స్పష్టంగా తెలుస్తుంది!
ప్లాస్టిక్ నవ్వుల వెనక దాగిన విషాదాన్ని
పసి గట్టడానికి అక్షరాలే సాధనాలు!
ఈ లోకంలో ఎవరికీ తీరిక లేదు
విశుద్ధ ప్రపంచాన్ని కలగనటానికి కవికి తప్ప!
ఆత్మలు చంపుకున్న వాళ్ళ మధ్య
కవి ఒక్కడే అక్షరంతో జత కట్టి అరుస్తాడు!
యుద్ధం చేయాల్సిన వాళ్ళంతా తెల్ల జెండాలెత్తుతుంటే
కవి ఆత్మ ఘోష భూనభోంతరాలను ఏకం చేస్తుంది!
మానవ వికాసానికి తోడ్పడాల్సిన రాజకీయాలు
రాచరికపు ముసుగులు ధరిస్తే కవిది ఒంటరి యుద్ధం!
సత్యం చెప్పడానికి నిలబడ్డ మనిషి
అనుయాయులను వెతుక్కోవలసిన పనిలేదు!
సందర్భాలు కలసి వచ్చినపుడు
అక్షరాలే మనిషికి ఆసరాగా నిలుస్తాయి!
ప్రాణాలు తీస్తామన్నా భూమి గుండ్రమన్న వాడే
ఆధునిక కవికి ఆచరణీయ ఆదర్శం!
మనం మొహమాటానికి త్యాగరాజులమైతే
జీవితాంతం చేయాల్సింది చెక్క భజనే!!
- కోట్ల వెంకటేశ్వర రెడ్డి
ఎ : 9440233261
