వివిధ రాష్ట్రాల కమిషన్‍లకు టీఎస్‍పీఎస్సీ ఆదర్శం


ఐదేళ్ల క్రితం ఏర్పడిన కొత్త టీఎస్‍పీఎస్సీ ప్రస్థానం నేడు దేశంలో పలు కమిషన్లు టీఎస్‍పీఎస్సీని అనుసరించే స్థాయికి ఎదిగింది. కమిషన్‍ అనుసరిస్తున్న సాంకేతిక విధానాలను తెలుసుకునేందుకు దేశంలోని 13 రాష్ట్రాల పబ్లిక్‍ సర్వీస్‍ కమిషన్లు టీఎస్‍పీఎస్సీని సంప్రదించడం, 9 రాష్ట్రాల కమిషన్లు సహాయ, సహకారాలు తీసుకోవడం మన పబ్లిక్‍ సర్వీస్‍ కమిషన్‍ విధానాలను గుజరాత్‍ యథాతథంగా అనుసరించడం మన ఆదర్శ నిర్మాణ దృక్ఫథానికి, నిబద్ధతకీ విలువైన గుర్తింపు. అది మనకు గర్వకారణం కూడా.


తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిన అనంతరం తెలంగాణ నిరుద్యోగుల ఆకాంక్షల ప్రతీకగా 2014 డిసెంబర్‍ 18న తెలంగాణ పబ్లిక్‍ సర్వీస్‍ కమిషన్‍ ఏర్పడింది. కమిషన్‍ చైర్మన్‍గా ప్రొఫెసర్‍ ఘంటా చక్రపాణి నియమితులయ్యారు. కొత్త రాష్ట్రం, కొత్త కమిషన్‍ కావడంతో ప్రారంభంలో ఎన్నో సవాళ్లు, సమస్యలు ఎదురైనా వాటిని అధిగమించింది. తెలంగాణపై పూర్తి అవగాహన ఉన్న వ్యక్తులు, వివిధ రంగాల్లో నిపుణులైన వారిని ఈ కమిటీలో సభ్యులుగా నియమించి పలు కీలక విధాన నిర్ణయాల్లో సంస్కరణలకు బీజం వేసింది. సిలబస్‍ మార్పు కోసం ప్రొఫెసర్లు, మేధావులతో కమిటీ వేసి శ్రీకారం చుట్టింది. సమూలంగా సంస్కరణలు తీసుకొచ్చి, సాంకేతిక సమస్యలకు చెక్‍ పెట్టింది.


కమిషన్‍ ఏర్పడిన తర్వాత 101 రిక్రూట్‍మెంట్‍లకు నోటిఫికేషన్లు ఇచ్చి 36 వేల ఉద్యోగాలకు ప్రకటనలు వెలువడ్డాయి. ఇందులో 30 వేలకుపైగా ఉద్యోగాల భర్తీ పూర్తి అయ్యింది. కమిషన్‍ ద్వారా ఇన్ని వేలకుపైగా ఉద్యోగాల భర్తీ జరిగినా ఒక్క అవినీతి ఆరోపణ రాకుండా ఇంటర్వ్యూల్లో కొత్త విధానం అనుసరించింది.ఉమ్మడి రాష్ట్రంలో 10-15 ఏళ్లలో జరిగిన భర్తీ కంటే టీఎస్‍పీఎస్సీ ద్వారా ఐదేళ్లలో ఎన్నో రెట్ల పోస్టులను భర్తీ చేసి రికార్డు సృష్టించింది. వీఆర్‍వో పోస్టులకు 11 లక్షలమంది దరఖాస్తు చేసుకున్నా, కమిషన్‍లో తక్కువ సిబ్బంది ఉన్నా నిర్ణీత సమయంలో ఎలాంటి విమర్శలకు తావులేకుండా పరీక్షలు నిర్వహించింది. కంప్యూటర్‍ ద్వారా బోర్డుల ఎంపిక చేసి ఇతర కమిషన్లకు మార్గదర్శిగా నిలిచింది. ఒక్క గ్రూప్‍-2 ఉద్యోగాలలో 1032 మందిని తెలంగాణలోని అన్ని మండలాల నుండి, అన్ని వర్గాల నుండి ఎంపిక చేసి కమిషన్‍ నిబద్ధతను చాటుకుంది.


29వ రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణలో టీఎస్‍పీఎస్‍సి మరియు తెలంగాణ ప్రభుత్వ పనితీరును గమనించి ఆలిండియా స్థాయి కాన్ఫరెన్స్ను హైదరాబాద్‍లో నిర్వహించడం పెద్ద అచీవ్‍మెంట్‍ అని చెప్పాలి. ఈ కాన్ఫరెన్స్లో నేషనల్‍ సర్వీస్‍ కమిషన్‍కు ప్రొ.ఘంటా చక్రపాణి గారిని చైర్మన్‍గా ఎంపికవ్వడం యావత్‍ తెలంగాణ ప్రజానీకం హర్షించింది.


ముఖ్యంగా సాంకేతిక పరిజ్ఞానంతోపాటు విధానాల ఆచరణలో నిబద్ధత ఉంటే ఎలాంటి విజయాలైనా సాధిస్తామనడానికి టీఎస్‍పీఎస్సీ ఒక ఉదాహరణ. దేశంలో మొదటిసారిగా ఆన్‍లైన్‍ సిస్టమ్‍ను ప్రారంభించింది టీఎస్‍పీఎస్సీ కమిషనే కావడం గమనార్హం. ఇంటర్వ్యూ రహితంగా జరిగే కింది స్థాయి నియామకాల్లో అభ్యర్థులు కమిషన్‍ కార్యాలయం గడప తొక్కకుండానే ఉద్యోగం పొందేలా సంస్కరణలు తీసుకొచ్చింది. గ్రూప్‍-1, గ్రూప్‍-2 తరహా ఉద్యోగాల ఇంటర్వ్యూల్లో పలు మార్పులు చేసింది. గతానికి భిన్నంగా గ్రూప్స్ ఉద్యోగాలే కాకుండా కార్పొరేషన్లు, బోర్డులు, సొసైటీల రిక్రూట్‍మెంట్లను నిర్వహించింది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్‍, ప్రొఫెసర్లు, మెడికల్‍ కాలేజీ అధ్యాపకులు వంటివి రిక్రూట్‍ చేసి డిపార్ట్మెంట్‍కు సంబంధించిన 65 టెస్టులకు సంబంధించిన 150 రకాల పరీక్షలను కూడా నిర్వహించి కొత్త చరిత్రకు నాంది పలికింది.


ఆధునిక సాంకేతికత సాధనంగా పలు కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన టీఎస్‍పీఎస్సీ సామాజిక న్యాయానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ విద్యార్థుల, వివిధ సామాజికవర్గాల వారి నమ్మకాన్ని సంపాదించుకుంటున్న టీఎస్‍పీఎస్సీకి హృదయ పూర్వక అభినందనలు.


మణికొండ వేదకుమార్‍
ఎడిటర్

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *