తెలంగాణ జానపద కళలు అస్థిత్వపు మూలాలు – మనుగడ

తెలంగాణా సంస్కృతిలో జానపద కళలు అంతర్భాగం. విభిన్న పక్రియలతో అనాదిగా తమకు సంక్రమించిన సాహిత్యం, ప్రదర్శనా నైపుణ్యంతో సమాజంలో మనుగడ సాగిస్తున్నవి. వైవిధ్యమైన ఈ మట్టి కళలు తెలంగాణ సాంస్కృతిక వైభవానికి, చరిత్రకు ప్రతీకగా నిలుస్తున్నవి. జానపద కళలు ఆశ్రిత, ఆశ్రితేతర కళారూపాలుగా విభజింపబడ్డాయి. నేటి ఆధునిక కాలంలో కూడా తమ మూల సంస్కృతిని పరిరక్షించుకుంటూ మార్పులకనుగుణంగా తమ అస్తిత్వాన్ని, ఉనికిని కాపాడుకుంటున్నాయి. ఆశ్రిత కళారూపాలు కేవలం ఒక ప్రత్యేక కులాన్ని మాత్రమే ఆశ్రయించి, కళా ప్రదర్శనల ద్వారా ప్రతిఫలం పొందడం ఆచారంగా వస్తుంది. కులపురాణాన్ని గాని, గోత్రాలను గాని లేదా ఇంద్రజాల విద్యల్ని గాని ప్రదర్శిస్తూ వంశపారంపర్యంగా సంక్రమించిన హక్కులు కలిగి ఉండటం ఆశ్రిత కులాల ప్రత్యేకత.ఆశ్రితేతర కళారూపాలు ఏ ఒక ప్రత్యేక కులాన్ని ఆశ్రయించకుండా అన్ని కులాలను ఆశ్రయించి కళా ప్రదర్శనల ద్వారా జీవన భృతిని పొందుతాయి.


తెలంగాణ గడ్డ మీద ఆశ్రిత, ఆశ్రితేతర కళల్లో ఆశ్రిత కళలే ఎక్కువగా మనుగడ సాగింస్తుండడం విశేషం. ఇంద్రజాలం, కథాగానం, నాటకం మొదలైన పక్రియల్లో కూడా తెలంగాణా ప్రాంత కళారూపాలదే పై చేయిగా చెప్పవచ్చు. ఆశ్రిత కళారూపాలను పోషించే ఆ యా పోషక కులాలకు ఒక్కటికి మించి ఎక్కువ ఆశ్రిత కళారూపాలు ఉండటాన్ని పరిశీలిస్తే ఈ ప్రాంతంలోని కులాలు ఆయా కళారూపాలకు ఎంతటి ప్రాధాన్యమిస్తున్నాయో అర్ధం చేసుకోవచ్చు. ఇందుకు ఉదాహరణగా చూస్తే మాదిగ కులానికి డక్కలి, చిందు, బైండ్ల, నులకచందయ్యలు, మాష్టి, ఆసాది మొదలైన కళారూపాలు నాటకం, కథాగానం, ఇంద్రజాలం వంటి పక్రియలతో ప్రదర్శనలిస్తూ తమ సాంస్కృతిక వైభవాన్ని చాటుతున్నవి.


మాల కులానికి గుర్రపు, మాష్టి, పంబాల, మిత్తిలి మొదలైన కళారూపాలు ఆశ్రిత కళారూపాలుగా నియమింపబడి తరతరాలుగా మాల కులస్థుల సాంస్కృతిక ధారను పరిరక్షిస్తున్నాయి.మాదిగ, మాల ఈ రెండు కులాలు మాత్రమే ఎక్కువగా కళారూపాలను పోషించే సామాజిక, ఆర్థికస్థితిని కలిగి ఉన్నాయి. దీంతో వారికి ఆయా కళారూపాల పట్ల ఉన్న గౌరవం, ఆదరణ ఎంతటిదో అర్ధం చేసుకోవచ్చు. అంతే కాకుండా ఆ యా కళాకారుల ఆవిర్భావ చరిత్రను పరిశీలిస్తే తాము కూడా పోషక కులంలోనే పుట్టి కొన్ని అనివార్య కారణాల చేత వేరుబడి అదే కులానికి ఆశ్రితులుగా నియమించ బడినట్లు వారి కుల పురాణాల ద్వారా అవగతమవుతుంది. పోషక కులాలకు, ఆశ్రిత కులాలకు మధ్య ప్రదర్శనకు చెందిన కట్టడి లేదా మిరాశి హక్కులు మాత్రమే కలిగి ఉంటాయి. అయినప్పటికి వీరిరువురి మధ్య కంచం పొత్తు ఉంటుంది. కాని వియ్యం పొత్తు మాత్రం ఉండదు. ఇప్పటికీ ఈ సంస్కృతిని పాటిస్తున్నందునే ఆశ్రిత కళలు మనుగడ సాగిస్తున్నవని అర్ధం చేసుకోవచ్చు. ఇక బి.సి కులాలకు కూడా ఆశ్రిత కళారూపాల వ్యవస్థ ఉన్నది. ఇందులో యాదవులకు మందహెచ్చులు, గొల్ల భాగవతులు, ఒగ్గు, కొమ్ము, గోత్రాల, గొల్లసుద్దులు, బైకాని, పొడపొత్రపు, తెరచీరలు మొదలైన కళారూపాలు తమ ప్రదర్శనా కళలతో పొషక కుల వైభవాన్ని, సంస్కృతిని చాటి చెపుతూ నేటికీ సమాజంలో గౌరవప్రదంగా ప్రజ్వరిల్లుతున్నాయి. మిగతా బిసి కులాలతో పోలిస్తే ఎక్కువ ఆశ్రిత కళారూపాలను పోషించే కులం యాదవులే కావడం విశేషం. అయితే యాదవులకు ఆశ్రితులైన కొమ్ము కళాకారులు రిజర్వేషన్‍ పరంగా ఎస్‍.సి జాబితాలో ఉన్నప్పటికి వంశ పారంపర్యంగా సంక్రమించిన కట్టడిని అటు కళాకారులు ఇటు యాదవులు విస్మరించకుండా కొనసాగిస్తున్నారంటే ఇప్పటికీ కులాలు మధ్య ఉన్న సఖ్యత, సయోద్య, అవగాహనలే కారణం.


మిగతా బిసి కులాలైన పద్మశాలి, నాయీబ్రాహ్మణ, విశ్వబ్రాహ్మణ, కాపు, ముదిరాజ్‍, గౌడ, మేదరి, రజకలు, ఆరె, గొల్ల కుర్మ మొదలైన వారికి కూడా ఆశ్రిత కళారూపాల వ్యవస్థ నిర్మితమై ఉన్నది. ఈ కులాలు ఒకటి లేదా రెండు ఆశ్రిత కళారూపాలు కలిగి తమదైన శైలిలో కళాకారులను అక్కున జేర్చుకుంటూ పోషిస్తూ ఉన్నాయి. తెలంగాణలోని ఆశ్రిత కళాకారుల్లో పటం ఆధారంగా కథాగానం చేసే కళారూపాలు చాలా అరుదైనవి, ప్రత్యేకమైనవి. ఇందులో కూనపులి, ఏనూటి, గౌడజెట్టి, డక్కలి, గుర్రపు, అద్దపు, కొమ్ము, తెరచీరలు, మందహెచ్చులు, మాసయ్యలు, కాకిపడిగెలు, కొర్రాజులు, పూజరి, పెక్కర్లు తదితర కళారూపాలు ఉన్నాయి. ఈ పటం కళారూపాలు నకాశి కళాకారులతో తాము ప్రదర్శించే కులపురాణ కథాంశాలను పటం మీద చిత్రించుకొని కథాగానం చేస్తాయి. అయితే ఈ పటం కథల్లో కుమ్మరి కులాన్ని ఆశ్రయించి గుండబ్రహ్మయ్య పురాణం చెప్పే పెక్కర్లు తెలంగాణాలో కనిపించక పోయినప్పటికి (ఆంధ్రలోని తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నప్పటికి) వీరి మూలాలు మాత్రం తెలంగాణాలోనే ఉన్నట్లు తెలుస్తున్నది. అంతేకాకుండా పెక్కర్ల కళాకారులకు తెలంగాణాలోనే ఎక్కువగా హక్కు గ్రామాలుండటం కూడా ఈ వాదనకు బలం చేకూరుతుంది. ఇప్పటికి వీరు ప్రదర్శన నిమిత్తం ఈ ప్రాంతంలో సంచరిస్తూ కుమ్మరి కులాన్ని ఆశ్రయిస్తూ పురాణం చెపుతున్నట్లు పలు ఆధారాలున్నాయి.


పటం కథ కళారూపాలు మనుగడ కోసం తమ ప్రదర్శనా రీతిలో పలు మార్పులు చేసుకుంటూ వస్తున్నాయి. మొదటగా ఈ కళారూపాల్లో కొందరు కళాకారులు పురాణ కాలక్షేపం మాదిరిగా ప్రదర్శనలు ఇచ్చేవారు. తర్వాత కాలంలో ప్రేక్షకున్ని ఆకర్శించటం కోసం పటాన్ని ఆధారం చేసుకొని పటంపై ఉన్న బొమ్మలను చూపూతూ ప్రదర్శనలివ్వడం చేస్తున్నారు. ప్రస్తుతం పటాన్ని ఆధారం చేసుకొని పురాణం చెబుతున్నప్పటికీ ప్రేక్షకులు ప్రదర్శన పట్ల మరింతగా ఆకర్శితులు కాకపోవడంతో పటం ముందు కథాగమనానికి వీలుగా వేషాలు దర్శిస్తూ ప్రదర్శనను రక్తి కట్టిస్తున్నారు. ఈ రకంగా పటం కథలు పరిణామం చెందినా తమ మూల సంస్కృతిని నిలుపుకుంటూ పోషక కులాల మౌఖిక సాహిత్యాన్ని పరిరక్షిస్తూ వస్తున్నాయి. ఆశ్రిత కళారూపాల్లో ఒకటైన మందహెచ్చులు యాదవులను ఆశ్రయించి కాటమరాజు కథను ఒకరు పటం కథారూపంలో, మరి కొందరు బొమ్మల రూపంలో చూపుతూ ఇంకొందరు కథాగాన పక్రియ రూపంలో కాటమరాజు కథను ప్రదర్శిస్తున్నారు. కథాంశం ఒకటే అయినప్పటికి విభిన్న పక్రియల ద్వారా కళాకారులు ప్రదర్శనలు ఇవ్వడం అనేది తెలంగాణా జానపద కళల ఔచిత్యంగా పేర్కొనవచ్చు.


పటం కథల్లో కూనపులి, ఏనూటి, అద్దపు, మాసయ్యలు మొదలైన కళారూపాలు పోషక కులాల ఆదరణ తగ్గి నేడు అవసాన దశలో ఉన్నాయి. కూనపులి కళాకారుడు తెలంగాణా వ్యాప్తంగా ఒక్కడే మిగిలి ఉండటం దురదృష్టకరం. అలాగే పటం కళాకారుల్లో మాసయ్యలు, అద్దపు, తెర చీరలు, గౌడజెట్టీ, కాకిపడిగెల వారిని ప్రభుత్వాలు గుర్తించలేదు. కాని ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఆయా ఆయా కళాకారులను ప్రత్యేకంగా గుర్తించి ఉత్తర్వులు తీసుకరావడం గొప్ప విషయం. గతంలో వీరు తమను పోషించే కులం పేరు మీదనే కులం సర్టిఫికెట్‍ పొందుతూ జీవిస్తున్నారు. ఉదాహరణకు మాసయ్యలు రజకుల కులంగా గుర్తింపబడి కులధృవీకరణ పత్రాలు స్వీకరిస్తున్నారు. ప్రత్యేక తెలంగాణా ఏర్పడ్డ తర్వాత చాలా మంది కళాకారులను వెనుకబడిన తరగతుల జాబితాలో చేర్చి ప్రోత్సాహించడం అభినందనీయం.


ఇంద్రజాల విద్యలు ప్రదర్శించే ఆశ్రితకళారూపాలు కూడా తెలంగాణ జానపదకళల్లో ప్రత్యేకమైనవే. ఇందులో పద్మశాలి కులాన్ని సాధనాశూరులు, మాదిగ కులాన్ని మాష్టి, గొల్ల కుర్మలను, బీరన్నలు, బ్రాహ్మణులను విప్రవినోదులు ఆశ్రయించి పలు రకాలు ఇంద్రజాల విద్యలు ప్రదర్శిస్తారు. నేటి ఆధునిక సమాజంలో కూడా వీరు తమ కళను పోషించుకుంటూ ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు, ఆనందోత్సవాలకు గురిచేయడం గొప్ప విషయం. ఇందులో బ్రాహ్మణులను ఆశ్రయించి విద్యలను ప్రదర్శించే విప్రవినోదులు కాలగర్భంలో కలిసి పోయారు. మిగతా కళారూపాలు కూడా పోషక కులాల దగ్గర ఆదరణ లేక అంతరించిపోయే దశలోనే ఉన్నవి. ఆయా కళారూపాల ప్రదర్శనా నైపుణ్యాన్ని గుర్తించి ఆయా కళాకారులకు బహుళప్రాచుర్యాన్ని కల్పించాల్సిన బాధ్యత సమాజం మీద ఉంది. తద్వారా వారి సంస్కృతి పరిరక్షణతో పాటు ఆ కళారూపం సమాజంలో నిలువడానికి ఆస్కారం ఉంది.
ఆశ్రిత కళారూపాల్లో ఒకప్పుడు గొప్పగా వెలుగొంది పోషక కులం ఆదరణ పొంది కనుమరుగైన కళల్లో పనస, బండారి భక్తులు, ఆదికొడుకులు, నులకచందయ్యలు, గంజికూటి, మాష్టి మొదలైన కళలను పేర్కొనవచ్చు. నేడు ప్రాచుర్యం లేక కనీసం సమాజంలో ఏ కులం కిందికి వస్తారో కూడా తెలియని పరిస్థితి ఈ కళాకారులది. గుర్తింపు లేని సమూహంగా జీవనం సాగిస్తూ తమ మూల సంస్కృతిని ప్రతిబింబించే విధంగా తమకు వంశానుగతంగా సంక్రమించిన రాగిశాసనాలను, తాళపత్ర ప్రతులను చూపుతూ తమ ఉనికిని నిలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా కొన్ని కళారూపాలకు చెందిన కళాకారులు, జనాభాపరంగా అతికొద్ది మంది ఉండటంతో పోషక కులం పేరునే తమ కులంగా చెప్పుకుంటూ పెళ్లి సంబంధాలు కుదుర్చుకుంటూ మనుగడ సాగిస్తున్నారు. ఈ రకంగా చేయడానికి కారణం వారి వారి కళా సంస్కృతి అంతరించి పోవడమే. ఆశ్రిత, పోషక కులాల మధ్య ఉన్న కంచం పొత్తు కాస్తా మంచం పొత్తుగా మారుతున్న వైనాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు.


ఇప్పటికీ చిందు, ఒగ్గు, కాకిపడిగెల, పంబాల, దుబ్బుల, మందహెచ్చు, బీరన్నలు మొదలైన కళలకు సంబంధించి ఆయా పోషక కులాలు ఆర్థికంగా ఉండి ఆదరణ చూపెడుతుండటంతో సంబంధిత కళారూపాలు సజీవంగా ఉన్నాయి. ఇందులో ఒగ్గు, భీరన్నలు పంబాల, దుబ్బుల కళారూపాలు అనుష్టాన కళారూపాలు కావడంతో మరింత ఆదరణ కనిపిస్తుంది.మిగతా కళల కంటే గొప్ప స్థితిలో విశ్వబ్రాహ్మణులను ఆశ్రయించి విశ్వకర్మ పురాణాన్ని కథాగానం చేసే రుంజ కళాకారులను తెలంగాణాలో వేళ్ళ మీద లెక్క గట్టవచ్చు. ఒకపుడు రెండు మూడు రోజులు కథాగానం చేసే కళాకారులు నేడు అర్ధగంట, గంట ప్రదర్శించే స్థాయికే పరిమిత మయ్యారు. దీనికి గల కారణాలు అనేకం అయినప్పటికీ వారు ఆ స్థితికి రావడానికి గల కారణాలను అన్వేషించాల్సిన అవసరం ఉంది. అలాగే రెడ్డి, కాపు, మేదరి, బ్రాహ్మణ, వైశ్య, కమ్మ మొదలైన కులాలకు చెందిన పిచ్చుకకుంట్ల, గోత్రాలోళ్లు, విప్రవినోదులు, వీరభద్రీయులు (వీరముష్టి) మొదలైన ఆశ్రిత కళలు కూడా అంతరించి పోయాయి. పిచ్చుకకుంట్ల వారు తెలంగాణాలో మనుగడలో లేకున్నా రాయలసీమ ప్రాంతంలో గౌరవమైన స్థితిలో ఉండి తమ కళారూపాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు.


ఇక తెలంగాణా ప్రాంతంలో మనుగడలో ఉన్న మరికొన్ని ఆశ్రితేతర జానపద కళల్లో కాటిపాపలు, చెక్కబొమ్మలాట, గంగిరెద్దులాట, తోలుబొమ్మలాట, పగటివేషాలు మొదలైనవి ఉన్నాయి. ఈ కళారూపాలకు వంశపారంపర్యంగా సంక్రమించిన కట్టడి గ్రామాలున్నాయి. ఇందులో చెక్కబొమ్మలాట, తోలుబొమ్మలాట అతిప్రాచీనమైన జానపద కళలు అయినప్పటికీ ఆయా బృందాలు తెలంగాణాలో ఒకటి లేదా రెండు బృందాలు మాత్రమే ప్రదర్శించే స్థాయిలో ఉన్నాయంటే వాటి స్థితి ఏ రకంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.


తెలంగాణాలోని ఆశ్రిత కళారూపాల మనుగడను పరిశీలిస్తే రాయలసీమ, ఆంధప్రాంతాల కంటే భిన్నంగా ఉంటుంది. రాయలసీమ, ఆంధ్రాలో జరిగే తిరునాళ్లు, దేవతా ఊరేగింపులు, ఉత్సవాలు మొదలైన కార్యక్రమాల్లో పాల్గొనే కళారూపాలే ఎక్కువగా కనిపిస్తాయి. ఆయా కళాకారులకు ఒక ప్రత్యేకమైన కులం అంటూ ఉండకుండా అన్ని కులాలు, వర్గాల వారి భాగస్వామ్యంతో ఒక బృందంగా ఏర్పడి కళను ప్రదర్శిస్తూ జీవనోపాధి పొందుతున్నారు. ఉదాహరణకు కోలాటం, బుట్టబొమ్మలు, కీలుగుర్రాలు, గరిడీ, సెలంబులు, పిల్లాంగట్లు, చెక్కభజన, కోలల భజన మొదలైన కళాబృందాలను చెప్పవచ్చు. అలాగే వీధినాటక కళాకారులను పరిశీలిస్తే అన్ని కులాలకు చెందన వారు బృందంగా ఏర్పడి ప్రదర్శించటం కనిపిస్తుంది. ఆయా కళారూపాలకు వంశపారంగా సంక్రమించిన హక్కు పత్రాలు, రాగిశాసనాలు, మౌఖిక సాహిత్యం కనిపించదు. కేవలం పంబ, గురవయ్యలు, కొమ్ము, ఉరుముల కళారూపాలకు మాత్రమే ఇవి కనిపిస్తాయి.


తెలంగాణాలో మనుగడలో ఉన్న జానపద కళలు ఒక నియమిత ఆచారంతో ఒక ప్రత్యేకమైన ప్రదర్శనా నైపుణ్యం కలిగి విభిన్న పక్రియలతో ఈ ప్రాంతం అస్థిత్వపు మూలాలకు సాంస్కృతిక వైభవానికి ప్రతీకలుగా నిలుస్తున్నాయి. వీటిలో కొన్ని అంతరించి పోగా, మరి కొన్ని అంతరించి పోయే దశకు చేరుకున్నాయి. సంస్కృతికి ఆనవాళ్లుగా చెప్పుకునే రాగిశాసనాలు, తాళపత్ర ప్రతులు, పటాలను కొందరు కళా కారులు విధిలేని పరిస్థితిలో అమ్ము కుంటూ జీవితాలను గడుపుతున్నారు. ఒక కళారూపం అంతరించిపోవడంతో, ఆ సమూహం తమ సామాజిక అస్థిత్వాన్ని కోల్పోయి సమాజంలో గుర్తింపు లేకుండా పోతున్నది. కళలు అంతరించటంతో వారి మౌఖిక సాహిత్యం కూడా కాలగర్భంలో కలిసి పోతున్నది. ప్రస్తుతం తెలంగాణా జానపద కళలు ఎక్కువగా వృద్దుల చేతుల్లోనే కొనసాగుతున్నవి. ఇందులో కేవలం అనుష్టాన కళారూపాలు తప్ప, మిగతా కళలన్నీ అదే రీతిలో ఉన్నవి. దీన్ని క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేసి ఆయా కళారూపాలకు జవజీవాలు కల్పించవలసిన ఆవశ్యకత ఉంది.


తెలంగాణా ప్రాంతానికే పరిమితమై అనాదిగా జానపద సమూహాన్ని అలరిస్తూ, ఆనందపరుస్తూ, విజ్ఞానాన్ని పంచుతూ వస్తున్న జానపద కళలు ఈ గడ్డ మీద మరి కొన్ని కాలాలపాటు మనుగడ సాధించాలంటే వారికి సమాజంలో గౌరవమైన స్థానాన్ని కల్పించి వారికి పూర్వవైభవాన్ని అందించాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఈ కళల్ని జీవించాటానికి అవకాశం ఏర్పడు తుంది. ఆ దిశగా జానపద కళలు మనుగడ సాధించాలంటే కోసం వారి కళానైపుణ్యాన్ని గుర్తించి బహుళ ప్రాచుర్యం కల్పించటం, అంటేగాక వారి సామాజిక ఆర్థిక స్థితిగతుల్ని మెరుగుపరచడం ద్వారా ఆయా కళారూపాల్ని, కళాకారుల కళామయ జీవితాన్ని విభిన్న కోణాల్లో అధ్యయనం చేయడానికి అవకాశం కలుగుతుంది. తద్వారా భవిష్యత్‍కు మార్గ దర్శకత్వం ఏర్పడుతుంది. ఈ దశలో ప్రభుత్వాలు, విశ్వవిద్యాలయాలు, పోషక కులాలు, కుల సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు నిలుస్తాయని ఆశిద్దాం.


-డా. గడ్డం వెంకన్న
ఎ : 9441305070

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *