ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సంచలనం సృష్టిస్తున్న… క్రిప్టోకరెన్సీ..!!


‘‘రైలుబండిని నడిపేది పచ్చజెండాలే, బ్రతుకుబండిని నడిపేదీ పచ్చనోటేలే’’ అని డబ్బు యొక్క ప్రాధాన్యాన్ని గూర్చి తనదైన శైలిలో వర్ణిస్తాడో సినీకవి. నాగరికత ప్రారంభమైన తొలిరోజుల్లో తమ అవసరాలను వస్తుమార్పిడి పద్ధతి ద్వారా తీర్చుకున్న నాటి తొలి మానవుడు, తదనంతర కాలంలో వస్తుమార్పిడి పద్ధతికన్నా తమ వద్దనున్న వస్తువులు మరియు సేవల యొక్క క్రయ, విక్రయాలకు ఒక వినిమయద్రవ్యం ఉంటే బాగుంటుందన్న అభిప్రాయాన్ని కొచ్చాడు. అలా తరువాతి కాలంలో మారక ద్రవ్యం అన్నది చెలామణీలోకి వచ్చింది. ఇది మొదట్లో లోహాలు, మిశ్రమ లోహాలకు చెందిన నాణేల రూపంలో వాడుకలో ఉంది. గుప్తులు బంగారు నాణేలు ప్రవేశపెట్టగా, శాతవాహనులు ఫోటిన్‍ (టిన్‍-లెడ్‍ల మిశ్రమం) అన్న మిశ్రమ లోహ నాణేలను వాడుకలోకి తెచ్చిన విషయం మనందరికీ తెలిసిన విషయమే. అయితే తరువాత ఆధునిక యుగంలో కాగితపు కరెన్సీ, మరికొన్ని దేశాల్లో ప్లాస్టిక్‍ కరెన్సీ విరివిగా వాడుకలోకి వచ్చింది. BHIM – Bharat interface for money విధానంలో ఫోన్‍పే, గూగుల్‍పే, పేటీఎమ్‍ తదితర అప్లికేషన్ల ద్వారా నగదు వాడకాన్ని తగ్గిస్తూ డిజిటల్‍ విధానంలో లావాదేవీలు పెద్దమొత్తంలో జరుగుతున్నాయి. ప్రభుత్వాలు కూడా డిజిటల్‍ లావాదేవీలను ప్రోత్సహిస్తున్నాయి.


అయితే ప్రస్తుతం కరోనా మహమ్మారి సృష్టిస్తున్న విపత్కర పరిస్థితులను తట్టుకోవడానికి ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యల కారణంగా ఒకవైపు ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోతూ, మరోవైపు ద్రవ్యోల్బనం విపరీతంగా పెరుగుతూ కరెన్సీ విలువ దారుణంగా పడిపోతోంది. పెట్టుబడి సాధనాలుగా భావించే బంగారం, షేర్ల ధరలు కూడా ఒడిదుడుకులకు లోనవుతుండడంతో బిట్‍కాయిన్‍, ఎథీరియం వంటి క్రిప్టోకరెన్సీలలో పెట్టుబడి పెట్టడం భద్రమనే భావన ఇటీవల బలపడింది. దీంతో క్రిప్టో కరెన్సీ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.


క్రిప్టో కరెన్సీ అంటే?

క్రిప్టో అనగా నిగూఢమైన అని, కరెన్సీ అనగా ‘ధనము’ అని అర్థం. కాబట్టి క్రిప్టోకరెన్సీ అంటే నిగూఢ లేదా గుప్త ధనము అని చెప్పవచ్చు. ఈ క్రిప్టోకరెన్సీ డిజిటల్‍ రూపంలో ఉంటుంది. పూర్తిగా ప్రైవేటు కరెన్సీ. రూపాయలు, డాలర్లు ప్రభుత్వాల పూచీకత్తుపై విడుదలయ్యే సాధికార కరెన్సీలు. ఉదా।।కు మీవద్ద 100 రూ।।లు నోటు ఉంటే ఆ కరెన్సీ కాగితం విలువలకు సమానమైన వస్తుసేవలు కొనుక్కోవచ్చని రిజర్వ్ బ్యాంక్‍ భరోసా ఇస్తుంది. కానీ ప్రైవేటు ధనమైన క్రిప్టో ••రెన్సీకి అలాంటి సార్వభౌమ భరోసా లేదు. ప్రస్తుతం క్రెడిట్‍, డెబిట్‍కార్డులు, యూపీఐ, క్యూఆర్‍ కోడ్‍ల ద్వారా మరియు ఏటీఎం, చెక్కుల ద్వారా జరుగుతున్న లావాదేవీలు అన్నింటికి బ్యాంకు మధ్యవర్తిగా కేంద్రీకృత నియంత్రణను కలిగి ఉంటుంది. కానీ క్రిప్టో కరెన్సీ లావాదేవీలకు ఎవరూ మద్యవర్తిగా వ్యవహరించరు. దీని లావాదేవీలన్నీ వికేంద్రీకృత విధానంలో వుంటాయి. బ్యాంకులో మన ఖాతా నుండి మరొకరి ఖాతాకు డబ్బు పంపాలంటే కొద్ది సమయం నిరీక్షించాల్సి ఉంటుంది. క్రిప్టో కరెన్సీ రూపంలో జరిగే లావాదేవీలకు ఎలాంటి నిరీక్షణా అవసరంలేదు.


క్రిప్టోకరెన్సీని ప్రవేశపెట్టినది ఎవరు?
బిట్‍కాయిన్‍, ఎథీరియమ్‍, ఎక్స్ఆర్‍పీ, టెదర్‍, బిట్‍కాయిన్‍ క్యాష్‍, బిట్‍కాయిన్‍ ఎస్‍వీ, లైట్‍ కాయిన్‍ వంటి పేర్లతో నేడు ప్రపంచవ్యాప్తంగా సుమారు 6,223 క్రిప్టో కరెన్సీలు చెలామణీలో ఉన్నాయి. మొత్తం క్రిప్టో కరెన్సీ లావాదేవీలలో 95 శాతం కేవలం 10 అగశ్రేణి క్రిప్టోలలోనే జరుగుతుంది. వీటిలో బిట్‍ కాయిన్‍ దే అగ్రస్థానం. అయితే మొదట డేవిడ్‍ చోమ్‍ అనే అమెరికన్‍ కంప్యూటర్‍ సైంటిస్ట్ 1989లో డిజిక్యాష్‍ అన్న పేరుతో ఒక సంస్థను స్థాపించి, దీని ద్వారా ఈ క్యాష్‍ (e-cash) పేరుతో ఒక ఎలక్ట్రానిక్‍ క్యాష్‍ అప్లికేషన్‍ను రూపొందించాడు. ఈ-క్యాష్‍ ద్వారా 1995లో మొదటి సారిగా క్రిప్టోకరెన్సీని తయారుచేసి, ఖాతాదారుల వివరాలు అజ్ఞాతంగా ఉంచుతూ లావాదేవీలు నిర్వహించాడు. అయితే 1998లో డిజి క్యాష్‍ సంస్థ దివాళా తీయడంతో ఈ క్యాష్‍ సహకారంతో రూపొందించిన క్రిప్టోకరెన్సీ కథ కూడా ముగిసింది. ఇక ప్రస్తుతం క్రిప్టోకరెన్సీలలో అగ్రస్థానంలో నున్న బిట్‍కాయిన్‍ విషయానికొస్తే 1997వ సం।।లో ఆడమ్‍ బ్యాక్‍ అనే ఒక సాంకేతిక నిపుణుడు హ్యాష్‍ క్యాష్‍ (Hash Cash) అనే ఒక అల్గారిథిమ్‍ను గుర్తించాడు. అంతకు మునుపే SHA 256 అనే పేరుతో మరో అల్గారిథ•మ్‍ ఉండేది. ఈ రెండింటిని కలిపి సతోషినకమొటో అనే నిపుణుడు 2008లో ‘‘కన్షెన్సస్‍’’ అనే మరో అల్గారిథమ్‍ (కంప్యూటర్‍కు ఇచ్చే ఆదేశాల సముదాయం)ను రూపొందించాడు. దీని ఆధారంగానే బిట్‍కాయిన్‍ అనే క్రిప్టోకరెన్సీ చెలామణీలోకి వచ్చింది. (అయితే ఈ సతోషినకమొటోను ఇంత వరకు ఎవరూ చూడలేదు. అసలు సతోషినకమొటో ఒక వ్యక్తా, లేక కొందరు వ్యక్తుల బృందమా అనేదీ తెలియదు).


క్రిప్టోకరెన్సీ ఎలా పనిచేస్తుంది?
క్రిప్టోకరెన్సీ పనిచేయడం వెనుక ‘‘బ్లాక్‍ చైన్‍ టెక్నాలజీ’’ అనే ఒక విశిష్ట సాంకేతిక పరిజ్ఞానం ఉంది. దీని వల్లనే క్రిప్టోకరెన్సీకి ప్రపంచవ్యాప్తంగా ఎనలేని ప్రాచుర్యం లభించిందని చెప్పవచ్చు.
ఇక దీని పనితీరు విషయానికొస్తే మొదట బ్లాకులు అనబడే చిన్న చిన్న సమూహాలను రూపొందిస్తారు. వాటిలో మొదటి బ్లాకును ‘‘జెనిసిస్‍ బ్లాక్‍’’ అని పిలుస్తారు. ఈ విధానంలో ప్రతిబ్లాకు, తరువాత బ్లాకుతో ఒక గొలుసు కట్టు విధానంలో కలుపబడి ఉంటుంది. ప్రతి బ్లాకుకు ఒక విశిష్ఠ గుర్తింపు సంఖ్య ఉంటుంది. దానిని ‘‘హ్యాష్‍కోడ్‍’’ అంటారు. దీనిని మన చేతివేళ్ళకు ఉన్న వేలిముద్రలతో పోల్చవచ్చు. మన చేతి వేలి ముద్రలు ఒకరితో మరొకరివి సరిపోలనట్టుగానే, బ్లాక్‍ చైన్‍ విధానంలో కూడా ప్రతిబ్లాకుకు వేర్వేరు హ్యాష్‍లు ఉంటాయి. ఆ విధంగా ప్రతి బ్లాకులోనూ 1. సమాచారం 2. హ్యాష్‍కోడ్‍ 3. ముందు బ్లాకుకు సంబంధించిన హ్యాష్‍కోడ్‍ నిక్షిప్తమై ఉంటాయి. బ్లాక్‍చైన్‍ విధానంలో అనుసంధానం చేయబడిన కంప్యూటర్లను నోడ్‍లు అంటారు. బ్లాక్‍ చైన్‍ టెక్నాలజీ విధానంలో ఏదైనా ఒక లావాదేవీ (Transaction) జరిగినపుడు ఒకటికన్నా ఎక్కువ నోడ్‍లు ధృవీకరించాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఆ లావాదేవీపూర్తి అయినట్లుగా భావించవచ్చు. ఈ విధంగా బ్లాక్‍చైన్‍ విధానంలో జరిగే ప్రతిలావాదేవీనీ ధృవీకరించే వారిని ‘‘మైనర్స్’’ అని వ్యవహరిస్తారు.


బ్లాక్‍చైన్‍ విధానంలో, కొత్త బ్లాకులలో సమాచారాన్ని నమోదు చేసి వాటిని ముందు బ్లాకులకు జతచేయవచ్చు. కానీ బ్లాకులలోని సమాచారాన్ని మార్చడానికి ఎట్టి పరిస్థితుల్లో వీలుకాదు. ఒకవేళ మార్చాలని ప్రయత్నిస్తే, ఏ బ్లాకులో ఉన్న సమాచారాన్ని మార్చాలని ప్రయత్నిస్తామో, ఆ బ్లాకు యొక్క హ్యాష్‍కోడ్‍ వెంటనే మారిపోతుంది. ఎప్పుడైతే హ్యాష్‍కోడ్‍ మారిపోతుందో, తరువాత బ్లాకులో ఇదివరకే పాత హ్యాష్‍కోడ్‍ ఉంటుంది. అప్పుడు కొత్తగా వచ్చిన హ్యాష్‍కోడ్‍, ముందున్న హ్యాష్‍కోడ్‍తో సరిపోలదు. అప్పుడు ఏ బ్లాకులో సమాచారాన్ని మార్చాలని ప్రయత్నిస్తామో, అక్కడి నుండి దాని ముందున్న బ్లాకులకు సంబంధం పూర్తిగా తెగిపోతుంది. ఒకవేళ ప్రతిబ్లాకుకు హ్యాష్‍కోడ్‍ తయారుచేసి, దాని ముందున్న బ్లాక్‍ హ్యాష్‍కోడ్‍ మార్చి, ఆ బ్లాకులో డేటా నమోదు చేసి తద్వారా మిగిలిన బ్లాకులోని డేటాని మార్చాలని ప్రయత్నించినా, ఒక బ్లాకుకు పై మూడు రకాల మార్పులు చేసేందుకు కనీసం 10 ని।।ల సమయం పడుతుంది. దీనినే ‘‘ప్రూఫ్‍ఆఫ్‍ వర్క్’’ అంటారు. కొన్ని సం।।ల పాటు లావాదేవీలు జరిగినపుడు వేల సంఖ్యలో బ్లాకులు ఉంటాయి. వేల సంఖ్యలో నున్న బ్లాకులలోని సమాచారాన్ని మార్చడం అసంభవం అని చెప్పవచ్చు. అందులోనూ బ్లాకులన్నీ అందరికీ అనుసంధానమై ఉంటాయి. కాబట్టి, ఏ మాత్రం మార్పు జరిగినా, అది మిగిలిన వారికి తెలిసిపోతుంది. ఇలా క్రిప్టో కరెన్సీ ద్వారా జరిగే లావాదేవీలన్నీ సురక్షితంగా, ఎటువంటి అక్రమాలకు తావులేకుండా జరుగుతాయని చెప్పవచ్చు.


క్రిప్టోకరెన్సీకి ఎందుకంత ప్రాధాన్యం?
ఎటువంటి ప్రభుత్వ నియంత్రణ లేకుండా ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాల సహాయంతో సునాయసంగా క్రిప్టో కరెన్సీ ద్వారా లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. క్రిప్టోకరెన్సీల యొక్క చెల్లింపులలో ఎటువంటి అక్రమాలు చేయడానికి వీలుకాదు.
కరెన్సీ రూపంలో నగదు ముద్రణ, చలామణీకయ్యే ఖర్చులు క్రిప్టోకరెన్సీల వంటి డిజిటల్‍ కరెన్సీల తగ్గిపోతాయి. 2019-20లో కరెన్సీ ముద్రణ, నకిలీ కరెన్సీలను అరికట్టడం వంటి కార్యకలాపాలపై రిజర్వ్బ్యాంక్‍ రూ.4400 కోట్లు ఖర్చు పెట్టవలసి వచ్చింది. అయినప్పటికీ ఒక కరెన్సీ నోటు రెండు సం।।ల కంటే తక్కువ కాలం మాత్రమే మనగలుగుతుంది.
కానీ క్రిప్టోకరెన్సీ అయితే బ్లాక్‍ చెయిన్‍ సాంకేతిక పరిజ్ఞానం వల్ల ఫోర్జరీకి అవకాశమే ఉండదు. ఈ తరహా కరెన్సీలు డిజిటల్‍ రూపంలో శాశ్వతంగా ఉండిపోతాయి. డిజిటల్‍ చెల్లింపులు, డిజిటల్‍ కరెన్సీలు ఆర్థిక చకభ్రమణాల వేగం పెంచుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.


ప్రతికూలతలు సైతం!!
2008 ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడానికి ప్రభుత్వాలు భారీఎత్తున రుణాలు, గ్రాంట్లును విడుదల చేయడం అధికార కరెన్సీల విలువను దిగజార్చిందని, అందుకే బ్లాక్‍చైన్‍ సాంకేతికత సహాయంతో ప్రభుత్వాలు, బ్యాంకుల యొక్క ప్రమేయం లేకుండా తమలో తామే లావాదేవీలు జరుపుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ధనవంతులు మరియు విభిన్న కంపెనీలు బిట్‍కాయిన్‍ వంటి క్రిప్టోకరెన్సీలను సృష్టించారని విశ్లేషకుల అభిప్రాయం.
అయితే తన పర్యవేక్షణ లేకుండా ఏ ప్రభుత్వమూ స్వేచ్ఛాయుత ఆర్థికలావాదేవీలను సాగనివ్వదు. అలా సాగనిస్తే నల్లధనాన్ని తెలుపుకింద మార్చేవాళ్లకు, మూలధనాన్ని సరిహద్దులు దాటించేవాళ్ళకు పట్టపగ్గాలు లేకుండా పోతాయనడం సత్యదూరం కాదు. మారకద్రవ్యాలు, అక్రమ ఆయుధాల క్రయ విక్రయాలకు అడ్డూఅదుపు లేకుండా పోతుంది. ప్రభుత్వ నియంత్రణ లేకపోతే సాధారణ మదుపరుల క్రిప్టో పెట్టుబడులకూ భద్రత ఉండదు. కంపెనీలు, సంపన్నులు పూర్తిగా క్రిప్టోలావాదేవీలవైపు వెళితే ప్రభుత్వాలకు పన్నుల ద్వారా వచ్చే ఆదాయానికి గండి పడుతుంది. ఉపాధికల్పన, రక్షణ, మౌళిక వసతుల సృష్టి, పేదల సంక్షేమ పథకాలకు నిధులు మృగ్యమౌతాయి. ఆర్థికాభివృద్ధికి పెట్టుబడులు చిక్కవు. ఇలా లెక్కకు మిక్కిలి ఇబ్బందులున్నాయి. కాబట్టే ప్రభుత్వాలు క్రిప్టోకరెన్సీల లావాదేవీలను అనుమతించడానికి వెనుకడుగు వేస్తున్నాయి.


అంతర్జాతీయంగా వివిధ దేశాల వైఖరి ఏంటి?
ముందే చెప్పుకున్నట్లు ప్రభుత్వ నియంత్రణ లేని అడ్డూ అదుపూ లేకుండా కొనసాగే క్రిప్టోకరెన్సీ లావాదేవీలను సార్వభౌమాధికారం కలిగిన ప్రభుత్వమూ అంగీకరించడనడంలో ఎలాంటి సందేహంలేదు. అందుకే ప్రపంచంలో చాలా దేశాలు ప్రైవేటు క్రిప్టోకరెన్సీలను నిషేధించి, తమ ఆధ్వర్యంలోని కేంద్రబ్యాంకు ఆమోదంతో సొంత డిజిటల్‍ కరెన్సీలను (సీబీడీసీ – సెంట్రల్‍ బ్యాంక్‍ డిజిటల్‍ కరెన్సీ) విడుదల చేసే దిశగా సన్నాహాలు చేస్తున్నాయి.
ఈ దిశగా మొదటి అడుగు వేసి, సొంత డిజిటల్‍ కరెన్సీని విడుదల చేసిన మొట్టమొదటి దేశంగా బహమాస్‍ రికార్డు సృష్టించింది. 2020 అక్టోబర్‍లో విడుదలైన ఈ డిజిటల్‍ కరెన్సీని ‘శాండ్‍డాలర్‍’గా వ్యవహరిస్తున్నారు. మన భారత రిజర్వ్ బ్యాంక్‍ మొదలుకొని, ప్రపంచంలో ఉన్న 80 శాతం కేంద్రబ్యాంకులు డిజిటల్‍ కరెన్సీపై పరిశోధన ప్రయోగాలు జరుపుతున్నాయని బ్యాంక్‍ ఆఫ్‍ ఇంటర్నేషనల్‍ సెటిల్‍మెంట్స్ (బీఐఎస్‍) వెల్లడించింది. వీటిలో అమెరికా, బ్రిటన్‍, కెనడా, జపాన్‍ లాంటి అగ్రదేశాల కేంద్రబ్యాంకులు కూడా ఉన్నాయి. ఐరోపా కేంద్ర బ్యాంకు కూడా ఈ ఏడాది డిజిటల్‍ యూరో ప్రాజెక్ట్ను మొదలు పెట్టనుంది. లిధువేనియా, స్వీడన్‍, దక్షిణ కొరియా, కాంబోడియా, బ్రెజిల్‍ కూడా ఇదే బాటలో ఉన్నాయి.
చైనా ఇప్పటికే తన డిజిటల్‍ యువాన్‍తో షాంఘై, సుఝౌ, చెంగ్డూ నగరాల్లో పైలట్‍ ప్రాజెక్టులు నిర్వహించింది. ఈ ఏడాదే తమ కేంద్రబ్యాంకు అండతో డిజిటల్‍ యువాన్‍ను ప్రవేశపెట్టదలిచింది. దీనికి ముందేచైనా అన్ని ప్రైవేటు క్రిప్టోకరెన్సీలను నిషేధించింది. వాటితో లావాదేవీలు జరపకూడదని, పెట్టుబడులు పెట్టకూడదని ఆదేశించింది.


భారత్‍ ఏమంటోంది?

భారత ప్రభుత్వానికి మొదటి నుండీ క్రిప్టో కరెన్సీలపట్ల సానుకూలత లేకపోయినా, క్రిప్టో మదుపరులు, ట్రేడర్ల లావాదేవీలు పెరుగుతూనే ఉన్నాయి. దీన్ని నియంత్రించడానికి రిజర్వ్బ్యాంకు 2018లో బ్యాంకులు, ఆర్థిక సంస్థలు క్రిప్టోట్రేడింగ్‍ ఎక్సేంజీలను ప్రోత్సహించ కూడదని సర్కులర్‍ జారీచేసింది. అయితే 2020లో సుప్రీంకోర్టు ఆ సర్కులర్‍ను కొట్టివేసింది. సుప్రీంతీర్పు ప్రతికూలంగా ఉన్నప్పటికీ, భారత ప్రభుత్వం బిట్‍కాయిన్‍ వంటి ప్రైవేటు క్రిప్టోకరెన్సీలను నిషేధించి, రిజర్వ్బ్యాంక్‍ ఆధ్వర్యంలో సాధికార డిజిటల్‍ కరెన్సీని ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఇందుకనుగుణంగా రాబోయే రోజుల్లో ఒక చట్టాన్ని తీసుకు రానున్నట్లు ఇటీవల విడుదలైన లోక్‍సభ బులెటిన్‍ ద్వారా తెలుస్తోంది.


పరిష్కరించాల్సిన చిక్కుముళ్లెన్నో?
ప్రస్తుతం అంతర్జాతీయ వాణిజ్య చెల్లింపులన్నీ అమెరికన్‍ డార్లలో జరుగుతున్నాయి. కాబట్టే అమెరికా తనకు గిట్టని రష్యా, ఇరాన్‍, వెనిజులా, క్యూబా తదితర దేశాల ఎగుమతి, దిగుమతుల చెల్లింపులన్నీ డాలర్లలో జరగకుండా అడ్డుకుంటోంది. అయితే ఆసియా, ఆఫ్రికా, ఐరోపా దేశాలలో భారీగా పెట్టుబడులు పెడుతూ చైనా, అమెరికాకు సవాల్‍ విసురుతోంది. అంతర్జాతీయ మారకంగా డాలర్‍ కాకుండా తాను త్వరలో ప్రవేశపెడుతున్న డిజిటల్‍ కరెన్సీ డిజిటల్‍ యువాన్‍ను ముందుకు తీసుకురావాలనుకుంటోంది. ఇందుకు చేపట్టాల్సిన చర్యలన్నీ చాపకింద నీరులా చక్కబెట్టు కుంటోంది. ఫలితంగా ఇది రెండు అగ్రదేశాల మధ్య పోటీకి దారితీసే అవకాశాలున్నాయని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇలా ఏ దేశానికాదేశం సొంత సీబీడీసీ (సెంట్రల్‍బ్యాంక్‍ డిజిటల్‍ కరెన్సీ)లను ప్రవేశపెడితే అంతర్జాతీయ లావాదేవీలు ఎలా జరుగుతాయి. ఒకదేశ కరెన్సీని మరోదేశం ఆమోదిస్తుందా అన్న ప్రశ్న తలెత్తుతోంది. అదేవిధంగా సీబీడీసీ అంతర్జాలం లేనిచోట్ల పనిచేస్తాయా, సైబర్‍ చోరుల దాడులను ఎలా తట్టుకుంటాయి, వ్యక్తిగత గోప్యత పరిరక్షణ ఎలా అన్న ప్రశ్నలకు పరిష్కారాలు చూపాల్సిన అవసరం ఉంది.
ప్రస్తుత క్రిప్టో కరెన్సీలు, ప్రైవేటు కరెన్సీలు కావడం వల్ల వాటిని సాధారణ కరెన్సీలలోకి తేలికగా మార్చుకోవచ్చు. అవి కొన్ని సెకన్లలో దేశాల సరిహద్దులు దాటుతాయి. అందుకే అవి మదుపరులకు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. కానీ సీబీడీసీలు రకరకాల నియంత్రణలు పాటించాల్సి ఉంటుంది. కాబట్టి క్రిప్టో కరెన్సీలకున్న వేగం, సౌలభ్యం సీబీడీసీలకు ఉండవు. రహస్య లావాదేవీలు జరపాలనుకునేవారు, ఎప్పటికీ క్రిప్టోకరెన్సీలనే ఆశ్రయిస్తారు తప్ప ప్రభుత్వాల కనుసన్నల్లో మెలిగే సీబీడీసీలను కాదు. వీటన్నిటినీ సమగ్రంగా అధ్యయనం చేయాలి.


చివరిగా..!
క్రిప్టో కరెన్సీలకు ప్రయోజ నాలతో పాటు, ప్రతికూలతలు కూడా మెండుగా ఉన్న నేపథ్యంలో దీనిని ‘‘రెండువైపుల పదునున్న కత్తిగా’’ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. కరోనామహమ్మారిగా కారణంగా తలెత్తిన ద్రవ్యోల్బన పరిస్థితుల నుండి తమ పెట్టుబడులను రక్షించుకునేందుకు సంపన్నులతో పాటు, మధ్యతరగతి వర్గం కూడా క్రిప్టోలలో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. పరిస్థితులు ప్రతికూలంగా మారి క్రిప్టో మార్కెట్‍ కుప్పకూలితే మధ్యతరగతి ప్రజలు దారుణమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. దీన్ని నివారించేందుకు క్రిప్టోలను కరెన్సీగా కన్నా షేర్లు, బాండ్లు, ఎఫ్‍డీల వంటి మదుపు సాధనాలుగా పరిగణించి, ప్రజలు తమ పొదుపులో కొంత భాగాన్ని మూడు నుండి ఐదు సం।।ల కాలావ్యవధికి క్రిప్టోలలో మదుపు చేసే విధంగా ప్రోత్సహించాలి. సీబీడీసీలకు మాత్రమే సాధికార కరెన్సీగా గుర్తింపు నివ్వడం ద్వారా అక్రమ ధన చలామణీని, ఇతర చట్ట విరుద్ధ కార్యకలాపాలను అరికట్టే విధంగా తగు కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుంటే బాగుంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ఏదేమైనా రాబోయే కాలమంతా ‘సాధికార డిజిటల్‍ కరెన్సీలదే’ నన్న అభిప్రాయం బలంగా వినిపిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో త్వరలో మనదేశం క్రిప్టో కరెన్సీల నియంత్రణకు తీసుకొచ్చే చట్టంలో కూడా ఇలా అన్ని అంశాలను సమగ్రంగా చర్చించి ముందడుగు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


-పుట్టా పెద్ద ఓబులేసు,
ఎ : 9550290047

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *