పర్యావరణ హితంగా భారతదేశం


గ్లాస్గో సదస్సులో ప్రధాని మోదీ


భారతదేశం రాబోయే యాభైయేళ్ళలో శూన్యస్థాయి కర్బన ఉద్గారాల లక్ష్యాన్ని సాధిస్తుందని ప్రధాని మోదీ గ్లాస్గో సదస్సులో ఇచ్చిన హామీ పర్యావరణ ప్రేమికులను ఆనందాశ్చర్యాల్లో ముంచెత్తింది. పారిస్‍ ఒప్పందానికి కట్టుబడి ఉన్నది మేమేనంటూ భారత్‍ ఈ దిశగా వేసిన అడుగులను వివరించారు ప్రధాని. ప్రపంచ జనాభాలో 17శాతం ఉన్న దేశం, కర్బన ఉద్గారాల వాటాలో మాత్రం ఐదుశాతంగానే ఉందని గుర్తుచేస్తూ, పునరుత్పాదక ఇంధన సామర్థ్యంలో భారత్‍ ప్రపంచంలో నాలుగోస్థానంలో ఉన్నదని గుర్తుచేశారు. పర్యావరణ పరిరక్షణలో భారత్‍ సంకల్పాన్ని పునరుద్ఘాటిస్తూ ఐదుసూత్రాల ఎజెండాను ప్రకటించారు.


సంప్రదాయేతర ఇంధన వనరుల ద్వారా సాగే విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని 2030 నాటికి 500 గిగావాట్లకు పెంచడం, యాభైశాతం దేశ ఇంధన అవసరాలను పునరుత్పాదక వనరుల ద్వారా తీర్చుకోవడం, కర్బన ఉద్గారాలను బిలియన్‍ టన్నుల మేరకు తగ్గించడం ఇత్యాది హామీలను అటుంచితే, నెట్‍ జీరో లక్ష్యాన్ని యాభైయేళ్ళలోనే సాధిస్తామని మోదీ చేసిన ప్రమాణం ఊహకు అందనిది. ఈ విధమైన హామీలకు భారత్‍ సిద్ధంగా ఉన్న సంకేతాలు జీ 20 సదస్సులో కూడా లేవు. కర్బన ఉద్గారాల నిలిపివేతకు ఏ గడువులూ పెట్టుకోలేదని అక్కడ పీయూష్‍ గోయల్‍ వ్యాఖ్యానించారు కూడా. ఒకపక్క హామీ ఇచ్చిన మేరకు అభివృద్ధి చెందిన దేశాలనుంచి ఆర్థికసాయం దక్కకుండా, ఆధునిక సాంకేతికతల బదలాయింపులు జరగకుండా భారత్‍ గడువులు ఎలా ప్రకటించ గలుగుతుందని ఆయన ప్రశ్నించారు. బొగ్గు ఆధారిత విద్యుత్‍ ప్లాంట్లకు స్వస్తిచెప్పడం, శిలాజ ఇంధనాలకు దూరం కావడం వంటివి నూక్లియర్‍ సప్లయర్స్ గ్రూపులో చోటు దక్కకుండా మాకు ఎలా సాధ్యమని ప్రశ్నించారు కూడా. ఎన్‍ఎస్‍ జీలో భారత్‍ ప్రవేశానికి చైనా మోకాలడ్డుతున్న విషయం తెలిసిందే.


ఈ నేపథ్యంలో, మిగతా ప్రపంచానికి సరిగ్గా లెక్కలేసుకొనే మోదీ ఈ హామీలు ఇచ్చారా? అన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. వందకోట్ల టన్నుల కర్బన ఉద్గారాలను నిలువరించడం అంటే, దేశం మొత్తం కర్బన ఉత్పత్తిలో దాదాపు ఐదోవంతు తగ్గించుకోవడం. దేశ విద్యుదవసరాల్లో పునరుత్పాదక ఇంధన వనరుల వాటా 12శాతం మాత్రమే ఉన్న స్థితినుంచి గట్టిగా మాట్లాడుకుంటే కేవలం ఎనిమిదేళ్ళలో యాభైశాతానికి చేరడం చాలా కష్టమైన ప్రయాణం. బ్రిటన్‍ ప్రకటించిన ‘ఇండియా గ్రీన్‍ గ్యారంటీ’ కొంతమేరకు మాత్రమే వెసులుబాటు కల్పిస్తుంది. ఇరుదేశాలూ చేయీచేయీ కలిపి ప్రకటించిన గ్లోబల్‍ స్థాయి సోలార్‍ పవర్‍ గ్రిడ్‍ ప్రాజెక్టు ఈ దిశగా మంచి అడుగే కానీ ఓ సుదీర్ఘ ప్రయాణం. సౌర, పవన విద్యుదుత్పత్తి వ్యవస్థలమీద భారీ పెట్టుబడులు పెట్టి ఆయా దేశాలను అనుసంధానించాలన్న బృహత్తర లక్ష్యం చేరుకోవడానికీ, ఫలితాలను అందుకోవడానికీ ఎంతో సమయం పడుతుంది. ‘నెట్‍ జీరో’ గడువు ప్రకటించని ఏకైక జీ 2-0 దేశంగా భారత్‍ కు ఉన్న అప్రదిష్ట మోదీ ప్రకటనతో తీరిపోయింది. దాదాపు వందదేశాలు 2050 గడువును చెప్పుకున్నప్పటికీ, పదిపదిహేను దేశాలు మాత్రమే తమ చట్టాలను తదనుగుణంగా సవరించు కున్నాయట. ఈ ‘కార్బన్‍ నెట్‍ జీరో’ లక్ష్యాన్ని ఇప్పటికి చిన్నదేశాలైన భూటాన్‍, సురినామ్‍ మాత్రమే సాధించాయి. మోదీ పంచసూత్రాలు మిగతాదేశాలకు ఉత్ప్రేరకంగా పనిచేయవచ్చు. అభివృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థలకు అండగా ఉంటామని ఎన్నడో హామీ ఇచ్చిన బడాదేశాలు ఇప్పటికైనా ఆచరణలోకి దిగితే మంచిది. పర్యావరణ పరిరక్షణ సదస్సు నిమిత్తం రోమ్‍ నుంచి గ్లాస్గోకు తరలివచ్చిన జీ 20దేశాల అధినేతల ప్రత్యేక విమానాలు వాతావరణంలోకి 14టన్నుల కార్బన్‍ ను విడుదల చేశాయని స్వీడన్‍ సంస్థ ఒకటి లెక్కకట్టింది. దేశాల ప్రతినిధులు, వ్యాపారవేత్తలు, కంపెనీల అధికారులు మొత్తం వెయ్యిమందికి పైగా 400 చిన్నాపెద్దా విమానాల్లో వచ్చి అతికొద్ది గంటల్లో వాతావరణాన్ని అత్యధికంగా కలుషితం చేశారని పర్యావరణ ప్రేమికులు వాపోతున్నారు. మాటల్లో చెప్పింది మనసులో లేకపోతే ఇలాగే ఉంటుంది. ఆశయానికీ, ఆచరణకూ మధ్య ఎండం ఉన్నప్పుడు లక్ష్యం ఎంత దూరంలో ఉన్నా చేరుకోవడం అసాధ్యం.

  • దక్కన్‍న్యూస్‍
    ఎ : 9030 6262 88

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *