నిర్మల్ బొమ్మలు, చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా పేరుపొందాయి. ఈ బొమ్మలను నిర్మల్ కళాకారులు చాలా శ్రద్ధ, ఏకాగ్రతతో తయారు చేస్తారు. ప్రతి బొమ్మను శ్రద్ధగా తయారు చేయవలసిందే. మూసపోసి చేయటానికి వీలులేదు. అడవులలో దొరికే పొనికి అనే తేలికపాటి చెక్కతో ఈ బొమ్మలను తయారు చేస్తారు. వీటికి వేసే రంగులు కూడా సహజమైనవే. వీటిని కళాకారులే చెట్ల ఆకులు, బెరడులు, కూరగాయల నుండి స్వయంగా తయారు చేసుకుంటారు. నిర్మల్ బొమ్మలకు 400 సంవత్సరాల చరిత్ర కలదు.
పరిచయం
భారతదేశంలోని దక్షిణ ప్రాంతం వైపు ఉన్న రాష్ట్రాలలో ఒకటి తెలంగాణ. ఈ ప్రత్యేక రాష్ట్రం 2 జూన్ 2014న ఏర్పడింది. హైదరాబాద్ తెలంగాణా రాష్ట్రానికి రాజధాని నగరం. తెలంగాణ రాష్ట్రం 1948లో హైదరాబాదు నిజాం పాలనలో ఉన్న తెలుగు మాట్లాడే ప్రాంతంగా గుర్తింపు పొందింది. ఇది 1948లో భారత యూనియన్‍లో చేరింది. తెలంగాణకు తూర్పు మరియు దక్షిణాన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలు, పశ్చిమాన కర్ణాటక, చత్తీస్‍గఢ్. ఉత్తరం మరియు ఉత్తరం వాయువ్యం మహారాష్ట్ర రాష్ట్రాలు సరిహద్దులుగా ఉన్నాయి.
తెలంగాణ, ఈ పేరు త్రిలింగ దేశ పదం నుండి వచ్చింది. దీని అర్థం ‘‘మూడు లింగాల దేశం’’. హిందూ పురాణాల ప్రకారం శివుడు మూడు పర్వతాల మీద లింగ రూపంలో అవతరించాడు. కాళేశ్వరం, శ్రీశైలం మరియు ద్రాక్షారామం అనే ఈ మూడు పర్వతాలు త్రిలింగ దేశ సరిహద్దులను సూచిస్తాయి. తరువాతి రోజుల్లో త్రిలింగ దేశం అనే పేరు తెలుంగా లేదా తెలింగగా రూపాంతరం చెందింది. కాలక్రమంలో ఈ పేరు తెలింగ ‘‘తెలంగాణ’’ గా మారింది. ఈ ‘‘తెలంగాణ’’ అనే పేరు పూర్వపు హైదరాబాద్ రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాన్ని ప్రధానంగా మరాఠీ మాట్లాడే మరాఠ్వాడా ప్రజల నుండి వేరు చేయడానికి రూపొందించబడింది. తెలంగాణ పదం యొక్క తొలి ఉపయోగాలను తిలంగాణి అని కూడా పిలుస్తారు.
2011 సంవత్సరంలో నిర్వహించిన జనాభా లెక్కల ప్రకారం 35.19 మిలియన్ల జనాభాతో తెలంగాణ రాష్ట్రం 114,840 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోని పన్నెండవ అతిపెద్ద రాష్ట్రంగా మరియు పన్నెండవ అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రంగా పరిగణించ బడుతుంది. తెలంగాణలోని ప్రధాన నగరాలు హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, రామగుండం, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, ఆదిలాబాద్, సూర్యాపేట మరియు మిర్యాలగూడ.
నిర్మల్ పట్టణం 32.06 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. 2014లో నిర్వహించిన సర్వే ప్రకారం ఈ పట్టణంలోని జనాభా దాదాపు 96,000. నిర్మల్ పట్టణం రహదారులతో చక్కగా అనుసంధానించబడి ఉంది. హైదరాబాద్ నుండి 210 కి.మీ, మహారాష్ట్రలోని నాగ్‍పూర్ నుండి 270 కి.మీ మరియు ముంబైలోని కళ్యాణ్ నుండి 658 కి.మీ దూరంలో ఉంది. నిర్మల్ బస్ స్టేషన్ జిల్లాలోనే అతి పెద్దదిగా పరిగణించ బడుతుంది. ఈ పట్టణంలో పూర్వం మాట్లాడే భాషలు మరాఠీ మరియు గోండు. కానీ నేడు ప్రధానంగా ఉపయోగించే భాషలు తెలుగు మరియు ఉర్దూ. 1956 నుండి ఇక్కడ తెలుగు అధికారిక భాషగా ప్రకటించబడింది.
చరిత్ర
కాకతీయుల సామంతరాజు నిమ్మనాయుడు పద్మనాయక వంశానికి చెందినవాడు. స్వతంత్ర రాజ్యంగా ప్రకటించుకొని నిర్మల్ ప్రాంతాన్ని పాలించాడు. కళారాధన, కళాపోషణ అభిమాన వ్యాపకాలుగా గల నిమ్మనాయుడు మరట్వాడ ప్రాంతంలో నివసించే ‘‘నకాశి’’ కళాకారులను రప్పించి వారికి ఉపాధి కల్పించాడు. ‘‘నకాశి’’ కళాకారులకు కసుబా ప్రాంతంలో గృహాలు నిర్మించాడు. సారగమ్మ దేవాలయం కసుబాకు తూర్పున అభిముఖంగా ఉన్న గ్రామదేవత. సారగమ్మ దేవాలయం వెనుక నకాని కళాకారుల నివాస గృహాలున్నాయి. వీరు తయారుచేసిన బొమ్మలు, వీరు వేసిన చిత్రాలు పొరుగు రాజ్యాధిపతులను ఆకట్టుకోవడం వీరి సృజనాత్మక కళా వైశిష్ట్యానికి మచ్చుతునకగా నిలిచాయి. ఇక్కడి కళాఖండాలు, బొమ్మలు 17వ శతాబ్దంలోని ఇరుగు పొరుగు రాజులైన నిజాం రాజులు, మహారాష్ట బోంస్లేరాజులు, గోండు రాజులు బహమనీ సుల్తానులు, వెలమరాజులు మొదలగు ఎందరో రాజులకు ఇవి ప్రీతి పాత్రమైనాయి. నిమ్మనాయుడి ఆదరణతో నకాశి కుటుంబీకులకు గౌరవప్రదమైన జీవనోపాధి లభించింది. ఆయన పాలనలో నిర్మల్ పేరు నాలుగు దిక్కులా వ్యాపించి విశ్వవ్యాప్తమైంది. వీరి అనంతరం పాలించిన శ్రీనివాసరావు, జలపతిరావు, వెంగళరావు, కుంటి వెంకవూటాయుడు, థంసా ఈ కుటుంబాలను ఆదుకొని నిర్మల్ కళలు అంతరించి పోకుండా వెన్నుదన్నుగా నిలిచారు. వీరి కళాఖండాలను నిశితంగా పరిశీలిస్తే శాతవాహన కాలం నుండే ఈ కళ పరంపరగా వస్తున్నట్లు తెలుస్తుంది. అజంతాలోని వర్ణచిత్రాలను పోలిన బొమ్మలు వేయడమే ఇందుకు సాక్ష్యం.
విశేషాలు
ఈ నిర్మల్ నకాశి కుటుంబాల నుండి ఒక కళాకారుని కుటుంబం ఈ చిత్రకళలో వివిధ శైలులను చేర్చి నిర్మల్ చిత్రాల ఖ్యాతిని పెంచారు. నిర్మల్ కళాకారులు కర్ణాటక నుండి ఈ ప్రాంతానికి వచ్చారు. కొయ్యబొమ్మలు, చిత్రాలను ఆద్భుతంగా తయారుచేసి ఆ ప్రాంతనామాన్ని చరిత్రలో నిలిపారు. కొయ్యబొమ్మలు, నకాశీ కుటుంబాల ద్వారా తయారవుతున్నాయి. కానీ చిత్రకళ మాత్రం బ్రహ్మరౌతు పద్మారావు ద్వారా సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఈ చిత్రాలను డ్యూకో రంగుల నుపయోగించి చెక్కతో చేసిన చట్రాలపై వేస్తారు. ఈ చట్రాల పరిమాణం 1.6 అడుగులు × 1 అడుగు ఉంటాయి. ఈ చిత్రాలు బహుమతులుగా ఎక్కువగా
ఉపయోగిస్తుంటారు. ఈ చిత్రాలలో గీతోపదేశం, కృష్ణుడు, మీరాబాయి వంటి ఇతిహాసాలు, చేపలవాడు వలతో ఉన్నట్లు ఉన్నవి ఉంటాయి. ఇక్కడ వివిధ రకాల 150 శైలులతో చిత్రాలు లభ్యమవుతాయి.
ఈ పట్టణంలో బొమ్మల తయారీ చిన్న తరహా పరిశ్రమ. బొమ్మల తయారీకి ఉపయోగించే కలప టేకు మరియు పోనికి (ఒక ప్రత్యేకమైన లేత చెక్క). నిర్మల్ బొమ్మల తయారీ సంప్రదాయ కళ 400 ఏళ్ల నాటి కళారూపం. ఈ కళారూపం వాస్తవిక కళ యొక్క శైలికి చెందినది. కర్ణాటక నుండి ఉద్భవించిన నకాష్ కళాకారులచే అభ్యసించబడింది. ఈ కళాకారులు మొదట్లో వర్క్షాప్‍లలో వారి సీనియర్లచే శిక్షణ పొందుతారు. జంతువులు, పక్షుల భౌతిక లక్షణాలు, పండ్ల ఆకారాల అధ్యయనం వారి ప్రాథమిక అభ్యాసం. డ్రాయింగ్‍ల ద్వారా చూపిన నిష్పత్తిలో పరిపూర్ణతను సాధించడం ద్వారా కళాకారులు తమ నైపుణ్యాన్ని నిరూపించుకొనే మార్గం ఇది సుగమం చేసింది. నకాశి కళాకారులు శిక్షణ సెషన్ తర్వాత డ్రాయింగ్‍లో నైపుణ్యం సాధించిన తర్వాత మాత్రమే చెక్క బొమ్మలను రూపొందించడానికి అనుమతించ బడతారు. ఆ విధంగా బొమ్మల తయారీ కళ బాగా అభ్యసించి అభివృద్ధి చెందింది. ఇంకా ఈ హస్తకళాకారుల కుటుంబాలు కూడా ప్రస్తుత ప్రదేశంలో బాగా అభివృద్ధి చెందాయి.
ఈ చిత్రాలు సహజంగా వివిధ రంగులతో ఉండి చూడడానికి ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ చిత్రాలను చెట్ల రసాలనుండి, పువ్వుల నుండి తీసిన రంగులతో కళాకారులు వేస్తారు. వర్ణచిత్రాల్ని కొత్త అందాల్లో సజీవ రీతుల్లో చిత్రించగల నేర్పుగలవారు నిర్మల్ కళాకారులు.
-సువేగా,
ఎ : 9030 6262 88