జనగామ, జనం ఉన్న గ్రామం జనగామ. గోదావరి ఒడ్డునున్న గోదావరిఖని శివారులోనున్న గ్రామం. అక్కడ ఒకటి కాదు, రెండు అపురూప ఆలయాలున్నాయి. ఒకటి త్రిలింగేశ్వరాలయం. మరొకటి త్రిలింగ రాజరాజేశ్వరాలయం. రెండూ త్రికూటాలయాలే. మూడు గర్భగుళ్లు, మూడు అర్ధమండపాలు, ఒక రంగమండపం, మధ్య ఆలయాలకెదురుగా ప్రవేశద్వార మండపాలు. ఊరుబయట రోడ్డుకు ఎడమవైపున్నది త్రిలింగేశ్వరాలయం, కుడి వైపున కొంచెంలోపలికున్నది త్రిలింగ రాజరాజేశ్వరాలయం. రెండు ఆలయాలూ, విలక్షణ వాస్తు వైవిధ్యంతో అరుదైన కట్టడాలుగా గుర్తింపుకు నోచుకొన్నాయి.
ఎడమవైపు ఆలయం చిక్కి శిథిలావస్థలో ఉన్నా రూపలావణ్యం ఇంకా తొణికిసలాడుతూనే ఉంది. ఎత్తైన ఉప పీఠం, దానిపైన ఒక చిన్నపాటి కొండను స్థంభాలుగా, దూలాలుగా, చూరుగా, చిన్న ఆలయాలుగా మలచిన నాటి శిల్పుల హస్త కళాలాఘవానికి అద్దం పడుతున్న ద్వారశాఖలు, చిత్ర విచిత్ర విన్యాసంతో తీర్చిదిద్దబడిన కప్పురాళ్లు. అంతాబాగానే ఉంది గానీ, పునాదులు కదిలాయి. గోడలు ఒరిగి పోయాయి. కప్పులు జారి పడ్డాయి. మూడు శివలింగాల్లో ఒకటి మాత్రమే ఉంది.
ఇక కుడి వైపు ఆలయం నేలపైనే నిర్మించినా, విశాలమైన మూడు ఆలయాలను కలిపే రంగమండపం, రంగమండపంలో మధ్య స్థంభాలు ఒక్కొక్కటి మూడు స్థంభాల కలయికగా అఖండ శిలల్ని తొలచి మలచిన శిల్పుల నేర్పరితనం చూపరులను ఇట్టే ఆకట్టుకొంటుంది. ఆలయ ప్రవేశ ద్వారం చిన్నగా ఉన్నా, రెండు వైపులా నిలువెత్తున్న నంది, మహాకాల అనే శివ ద్వారపాలక విగ్రహాలు, ఆలయం బయటి గోడలకు అమర్చిన సురసుందరి శిల్పాలు, మండపం మధ్య కప్పు అమరిక చూస్తుంటే, రామగుండం నుంచి క్రీ.శ.12వ శతాబ్దిలో ఈ ప్రాంతాన్ని పాలించిన ఏడరాజు, దేవశిల్పి విశ్వకర్మను ఆకాశం నుంచి భువికి రప్పించి ఈ ఆలయ నిర్మాణ బాధ్యతలనప్పగించాడా అనిపిస్తుంది.
ద్భుత ఆలయాల అపురూప వాస్తు శిల్ప వైభవం ఒకవైపు, తావులు దప్పి, కన్నులు లొట్టబోయి, కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ మమ్మల్ని ఇలాగే వదిలేస్తారా? అని ప్రశ్నిస్తున్న శిథిల శివాలయాల గోడు పట్టించుకొంటే బాగుండు అనిపిస్తుంది మరో వైపు. చక్కటి సమాచారాన్నందించిన శ్రీ మల్లేపల్లి లక్ష్మయ్యగారికి, ఫోటోలను పంపిన శంకర్ గారికి కృతజ్ఞతలు.
-ఈమని శివనాగిరెడ్డి-స్థపతి,
ఎ : 9848598446