బహుజనుల ‘మట్టిపొయ్యి’


ఆధునిక కథా రచనకు రాయలసీమ ప్రాంతం ఒక ముడి వనరులాంటిది. ఇక్కడ ఏ రాయిని పలకరించినా, ఏ మట్టిరేణువును తాకినా, ఏ మట్టిమనిషిని కదిలించినా ఒక దు:ఖపూరిత కథనే చాలా ఆర్ద్రంగా వినిపిస్తాయి. ‘గతమంతా తడిసె రక్తమున/ కాకుంటే కన్నీళులతో’ అని శ్రీశ్రీ అన్నట్లుగా వికటించిన మానవ సంబంధాలతోనో, కరువుతోనో, ఫ్యాక్షన్‍ కక్షలతోనో వణికిపోని ఊరు రాయలసీమలో లేదంటే అతిశయోక్తికాదు. ‘కడపటి పైసా’ కథ రచయిత దగ్గరి నుండి ఇవ్వాళ్లి డా. ఎం. హరికిషన్‍ దాకా ప్రతి ఒక్కరూ ఇక్కడి సామాన్యుడి గుండె కోతను, శిథిలత్వాన్ని కథీకరించిన వారే. అదిగో అట్లా కొన్ని హృదయ శకలాల్లాంటి జీవితాలను తీసుకొని వాటికి కథకు కావాల్సిన రక్త మాంసాలను అద్ది రాయలసీమ బతుకుపోరును చిత్రించిన కథకుడు డా. తుమ్మల రామకృష్ణ. ఆయన కలం నుండి జాలువారిన కథా సంపుటే ‘మట్టిపొయ్యి’. ‘ఇంటింటికి మట్టిపొయ్యే’నని సామెత చెప్పినట్లు ఈ కథా సంపుటిలోని ప్రతి కథ ఒక నిప్పుకణికలా మన దళసరి చర్మానికి వేడిని తాకించి ఒక సంఘర్షణను మనస్సంద్రంలో అలలు అలలుగా రేకెత్తిస్తుంది. ఇందులోని కథలన్నీ పాతికేళ్ల క్రితం నాటి రాయలసీమ ముఖచిత్రాన్ని పట్టిచూపుతాయి. ఇందులోని 12 కథలు ప్రధానంగా ఫ్యాక్షన్‍, మంగలి వృత్తి, వ్యవసాయ సంక్షోభం, మానవ సంబంధాల విచ్ఛిన్నత చుట్టే తిరుగుతాయి.


రాయలసీమలో రాళ్లెంత సహజమో ముఠా కక్షలు కూడా అంతే సహజం. ఇక్కడ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఫ్యాక్షన్‍ సెగ తాకని మనిషే లేడంటే ఆశ్చర్యం కలుగదు. అజ్ఞానం, నిరక్షరాస్యత, పేదరికం ఉన్నన్నినాళ్లు కొంత మంది బలవంతులు అమాయకులను అనుచరులుగా మార్చుకొని, వాళ్లను పావులుగా చేసుకొని రాజకీయాల్లోనో, వ్యాపారాల్లోనో తమ ఆధిపత్యం నిరూపించుకుంటూనే ఉంటారు. ఈ ఆంబోతుల కొట్లాటలో దాశరథి అన్నట్లు ‘ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో..’ ఈ వైనాన్నంతా చిత్రించిన కథ ‘ఊబి’. ఈ కథలో చివరికి కృష్ణారెడ్డి అనే విద్యావంతుడు ఫ్యాక్షన్‍ అంటువ్యాధి లాంటిదని చెప్పి ఫ్యాక్షన్‍ ఊబిలో కూరుకుపోయిన తన కుటుంబం నుండి దూరంగా వెళ్లిపోతాడు. ఒక మార్పును, శాంతిని ఆశించే కథ.


బహుజన వృత్తి కులాల గురించి ఇప్పటికే కొన్ని వందల కథలు వచ్చాయి. కాని మానవ సమాజానికి తొలి వైద్యులుగా పనిచేసిన మంగలి కులం గురించిన కథలు చాలా తక్కువ వచ్చాయి. ఎందుకంటే ఆ వర్గం నుంచి అక్షరాస్యులు కథా రంగంలోకి రావడం ఆలస్యం అయింది. కాస్త ఆలస్యంగానే అంటే 1994లో ‘పల్లెమంగలి కథలు’ వచ్చాయి. ఆ తరువాత ‘మట్టిపొయ్యి’ కథా సంపుటిలో మంగలి వృత్తిని చిత్రించిన కథలు కనిపిస్తాయి. విశ్రాంతి వర్గానికి చెందిన వాళ్లు కుల వృత్తుల్ని గౌరవించడం తక్కువ. పైగా ఆధిపత్యం ప్రదర్శించడం మొదటి నుండీ ఉన్నదే. ఇందులోని ‘అడపం’ (మంగలి వృత్తికి సంబంధించిన పనిముట్లు భద్రపరుచు పెట్టె) కథ దీనికి నిదర్శనంగా కనిపిస్తుంది. గ్రామీణ ప్రాంతాలలో ఉత్పత్తికులాల వారిని తమ చెప్పుచేతల్లో పెట్టుకొని ఆడించడానికి ఆధిపత్య కులాల వారు రకరకాల ఎత్తులు వేస్తారు. భూమిని నమ్ముకుంటే ఎవనికీ లొంగి ఉండక్కరలేదని చివరికి కుల వృత్తిని కూడా త్యజించి వ్యవసాయ రంగంలోకి దిగి ఆత్మగౌరవంతో బతుకుతాడు ఇందులోని మొగిలప్ప. Work in worship అని భావించకుండా కుల వృత్తిని లోకువ చేసి మాట్లాడడం నచ్చదు మొగిలప్పకు. అందుకే కుల వృత్తిని కూడా కాదని తన కాళ్ల మీద తాను నిలబడే రైతుగా మారిపోతాడు. తిరిపెం అడుక్కోవడం కాదు తిరిపెం పెట్టే స్థాయికి ఎదగాలనే ఒక ఆరాటం కనిపిస్తుంది ఆయన మాటల్లో.
ఇదే వరుసలో రాసిన మరో కథ ‘పరాభవం’. ఒకప్పుడు గ్రామాల్లో కరణాల పెత్తనం బాగా సాగేది. కలం పుల్ల పట్టుకొని ప్రజల నొసటి రాతల్ని రాసేవారు. ‘కాటికి పోయే వాడు కూడా కరణం మాట జవదాటడు. జవదాటితే కాటికి కూడా పోడు’. ఉత్పత్తి కులాల వాళ్లను కాళ్లకింద అణిచిపెట్టాలంటే వాళ్లకు ఎంతో కొంత మేలు చేసినట్లు కనబడేలాగా వాళ్లకు ఏదో పనికి రాని పది గుంటల కయ్యల్ని ఇనాంగా ఇచ్చేవారు. దానికి ప్రతిగా కుల వృత్తుల వాళ్లు వాళ్లకు వృత్తి సంబంధిత ఊడిగం చేసి వాళ్ల రుణం తీర్చుకునే వారు. తరాలకు తరాలు ఇలాగే సాగిపోయేవి. ఆ ఊరి కరణం ఐరాలాయన (మంగలి) కు ఇనామిచ్చిన పది గుంటల భూమిని వెంకటపతిరావు (కరణం కొడుకు) ఆడబిడ్డకు పసుపుకుంకుమల కింద ఇచ్చామనే నెపంతో మళ్లీ లాక్కోవాలని కుట్ర చేస్తాడు. దాంతో ఐరాలాయనకు కడుపులో నిప్పులు కుమ్మరించినట్లు అవుతుంది. వృత్తిని నమ్ముకొని బావుకునేదేందని గ్రహించి తన మంగలి వృత్తిని మానుకొని వెంకటపతిరావు గడ్డం చేయమని అడిగినపుడు తాను వృత్తి మానేశానని బదులిస్తాడు. ఒక వృత్తి పనివాడు తన నిరసనను, తన సహాయ నిరాకరణను, తన ప్రతీకారాన్ని ఈ విధంగా తీర్చుకుంటాడు. ఒక తిరుగుబాటును సూచించి ఆత్మవిశ్వాసంతో బతకాలని చెప్పే కథ.


ఇదే స్పిరిట్‍ను పంచే మరో కథ ‘రాలిన చింత’. రొట్టె – కోతి కథలో పిల్లుల తగవు కోతికి లాభమైనట్టు ఈ కథలో కూడా గ్రామంలోని ఇద్దరు వ్యక్తుల మధ్య తలెత్తిన చింత చెట్ల పంచాయితీ ఆ ఊరి కరణానికి బతుకుదెరువు అవుతుంది. ఈ కుట్రను గ్రహించకుండా ఎవరికి వారు శ్రీపతిరావు (కరణం) ఇంటి చుట్టూ తిరుగుతూనే ఉంటారు. చివరికి వెంకటస్వామి అనే శ్రేయోభిలాషి వాళ్లిద్దరినీ కూర్చోబెట్టి ‘‘ఆటాడే వాడు మొగానికి రంగేసుకుంటాడు. మీ కరణం మొగానికి రంగేసుకోకుండానే ఆట ఆడతావుండాడు. పంతాలకు పోయి మీరు మీరు కొట్లాడుకుంటే మీరు నష్ట పోతారు. మూడోవాడు లాభపడతాడు. చింత మాన్లలో మీకొచ్చే దానికంటే మీరు ఇప్పటికే ఎంతో నష్టపోయారు. ఆ సంగతి మీకు కూడా తెలుసు. మీరు కలిసుంటే వాళ్ల ఆటలు సాగవు. అంచేత వాళ్లు మీ జుట్లు ముడేస్తుంటారు. మీ చేతుల కష్టం తింటా కూర్చుంటారు. నా మాటింటే మీ చేతుల కష్టమన్నా మీకు మిగులుతుంది.’’ అని హితబోధ చేస్తాడు. రామన్న, మునెప్పలు జరిగిన మోసాన్ని గ్రహిస్తారు. ‘ఇంగ ఆయప్ప గడ్డం ఎవరు గొరుగుతారో గొరగనీ ఆయప్ప ఇంటి గడప కూడా తొక్కను. నా బిడ్డలతో పాటు నేను కూడా మడక దున్నుతా. పదిమందిలో గౌరవంగా బతుకుతా’’ నంటాడు రామన్న. గ్రామ రాజకీయాలతో పాటు కుల వృత్తి గౌరవాన్ని నిలిపే కథ.


ఇందులోని మరో కథ ‘మహా విద్వాంసుడు’. దేహానికి కులం ఉంటుంది కాని మేధస్సుకు కులం లేదని అయినా ఈ నిచ్చెన మెట్ల సమాజంలో మనిషికి కులాన్ని బట్టే విలువ ఉండటాన్ని ఒక సంగీత విద్వాంసుడు నిరసించిన తీరుకు గొప్ప ఉదాహరణ ఈ కథ. మంగలి కులంలో పుట్టిన కన్నదాసు మహావిద్వాంసుడై సంగీత సామ్రాజ్యాన్ని ఏలుతాడు. అయితే కన్నదాసు ఉన్నత కులానికి చెందిన వాడు కాదని అతనికున్న ప్రతిభను జీర్ణించుకోలేక ఒక అసూయపరుడు కన్నదాసు సంగీత ప్ఞ్రను హేళన చేస్తాడు. కన్నదాసు మనసు నొచ్చుకుంటాడు. ‘‘కన్నదాసుకు లోకం స్వరూపం తెలిసొచ్చింది. సంగీతానికి కులం, మతం ఉన్నాయని తెలిసి తల్లడిల్లిపోతాడు. తట్టుకోలేకపోయాడు. విలవిల్లాడిపోయాడు. అర్ధాంతరంగా తన గొంతు మూగబోతే బావుండుననుకున్నాడు. ఎవరైన తన గొంతును బలంగా పట్టి నులిమేస్తే బావుండుననుకున్నాడు. నిట్టనిలువునా ప్రాణం పోతే బావుండు ననుకున్నాడు. బతికుంటే పాట పాడకుండా ఉండలేడు. పాట పాడితే అది ఎంగిలి పాట మంగలి పాట అంటారు. తనకు లేని కులం తను ఎక్కడి నుండి తేగలడు? జ్ఞానంలో ఎవరితోనైనా పోటీ పడగలడే కాని లేనిది ఎలా సంపాయించగలడు. కులాలు పెట్టినోన్ని చెప్పుచ్చుక కొట్టాలన్నాడు. కులం చూసి గౌరవించే వాడు మనిషే కాదన్నాడు. ఆ మాటకొస్తే ఎవడి కులం వాడికి గొప్ప అనుకున్నాడు. నలుగురికి ఆనందం పంచే సంగీతానికీ, నలుగురిని అలరించే సంగీతానికీ, నలుగుర్ని సమ్మోహితుల్ని చేసే సంగీతానికి.. ఈ దేశంలో కులముందన్న వాస్తవాన్ని జీర్ణించుకోలేక పోయాడు’’ తన సంగీత పరిజ్ఞానాన్ని కులంతో తూచిన ఈ సమాజాన్ని ఈసడించుకుంటూ జీవితంలో తాను మళ్ళీ సంగీత కచ్చేరి చేసేది లేదని ప్రతినబూని ‘కులవృత్తిని మించింది లేదు గువ్వల చెన్నా’ అన్నట్లు జీవితం గడపాలి కదా! అనుకుంటూ మళ్లీ తన తాత ముత్తాతల కుల వృత్తి అయిన నాదస్వరం ఊదడం ప్రారంభిస్తాడు. కులం పునాదుల మీదనే నిర్మితమైన ఈ దేశ కుల వ్యవస్థ మీద చెంప పెట్టులాంటి కథ ఇది. జ్ఞానానికి పరిమితులు లేవని, కులం దేనికీ అడ్డం కాదని నిరూపించిన కథ. ఈ కుళ్లు వ్యవస్థను నిప్పులతో కడగాలని, సనాతన సంప్రదాయాల్ని, చాందసాలను కూకటి వేళ్లతో సహా పెకిలించి వేసినపుడే ఆరోగ్యకర సమాజం తయారవుతుందని తేల్చి చెప్పిన కథ. కథకుడు ఎక్కడా కథలోకి రాకుండా కథ నడిపించిన విధానం అద్భుతం. నిర్మలంగా ప్రవహించే గోదావరిలాగా సాగే కథ ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎగిసి మనసు మూలాల్ని కోస్తూ ప్రవహిస్తుంది. కొంత నిశిత పరిశీలన వల్ల ‘అడపం’ లాంటి కథ ఏ రచయితయినా రాయవచ్చేమో కాని ‘మహావిద్వాంసుడు’ కథ రాయడం చాలా కష్టం. కథంతా చదివిన తరువాత గుఱ్ఱం జాషువా అన్నట్టు ‘ఎంత కోయిల పాట వృధయయ్యెనో కదా! చిక్కు చీకటి వనసీమలందు. ఎన్ని వెన్నెల వాగులింకిపోయెనో కదా! కటిక కొండల మీద మిటకరించి’ అని అనిపించక మానదు.


వ్యవసాయం జూదమైన నేల మీద కూలీ రేట్లు కూడా విపరీతంగా పెరిగిపోతుంటే సాగు చేయడమా? మానడమా? అర్థం కాదు. ఎన్ని సార్లు చేయి కాలినా మళ్లీ మళ్లీ చేయి కాల్చుకునే తత్వం ఒక రైతుకే ఉంటుందేమో! ‘‘ఒక్కరోజు పనికాదు. మడి సేద్యం అంటే పుట్టారుగాలం పని వుంటాది. కర్ర కయ్యలో పెట్టింది మొదలు గింజ ఇంటికి తెచ్చుకునే వరకూ పనే ఉంటుంది. మడి సేద్దిం చేసేటోళ్లు అట్లా కూలిచ్చి పని చేయించాలంటే కష్టం. అంత కూలీలిచ్చి నాట్లు వేయించినా పండుతుందని గ్యారంటీ లేదు. వానలు పడి చెర్లోకి సగానికన్నా నీళ్లు వస్తే పంట చేతికి అందవచ్చు. లేకుంటే చేతుల కష్టం మిగలొచ్చు. దున్నింది, దోకింది, నాటింది చెత్తలు తీయించిందీ, ఎరువులు వేయించిందీ, కోతలు కోయించిందీ, కుప్ప కొట్టించిందీ అన్నీ లెక్కలు యేసుకుంటే చిందబోసి యేరుకున్నట్లుగా వుంటాది మడి సేద్యం.’’ అని ఆలోచించే నారప్పలు ఒక్క ‘రేగడిమిట్ట’ కథలోనే కాదు. రాయలసీమ నేల మీద నుండి వచ్చిన ప్రతికథలో కనిపిస్తారు.


దళారులు, వడ్డీవ్యాపారుల చేతుల్లో ఊర్లు సాలెగూడులో చిక్కుకున్న కీటకాలైపోతున్నాయి. పెట్టుబడి లేక రైతులు పంట పండక ముందే పంటను కుదువపెట్టి అప్పులు చేస్తున్నారు. తీరా పంట చేతికొచ్చినాక అమ్మడానికి అధికారం చాలదు. ఎందుకంటే అంతకుముందే వడ్డీవ్యాపారికి పంట తనఖా పెట్టబడింది. వాళ్లే పంటకు ధర నిర్ణయిస్తారు. వచ్చిన డబ్బును అప్పుకింద జమేసుకుంటారు. చివరికి రైతులకు రెక్కల కష్టం మిగులుతుంది. ఈ గందరగోళంతో పాటు మేడిపండులాంటి కుటుంబ వ్యవస్థ, చిట్లిపోతున్న అన్నదమ్ముల ప్రేమలను చాలా బలంగా చిత్రించిన కథ ‘మట్టిపొయ్యి’. కథంతా అయిపోయిన తరువాత నిజంగానే మనం పెనం మీది నుంచి పొయ్యిలో పడిపోతాం. కాళ్లు చేతులు కాలి రక్తం కూడా ఆ వేడికి మరిగిపోతుంది. ఇది ప్రతి ఊరి కథ. ప్రతి మనిషి కథ. ప్రతి రైతు కథ. సేద్యపు అవిటితనాన్ని దీనంగా విప్పిచెప్పే కథ.


గ్రామీణ ప్రాంతాల్లో సమాంతర న్యాయవ్యవస్థను, పోలీస్‍ స్టేషన్లకు నడుపుతూ భార్యా భర్తల గొడవకు, ఆడపిల్లల శీలానికి వేలం వెయ్యటాలు, కుల బహిష్కరణలు చేస్తూ అమాయక ప్రజలను కాల్చుకు తినే తీర్పులు చెప్పడం అక్కడి సోకాల్డ్ పెద్దమనుషులకు మామూలే. అలాంటి పెద్ద మనుషుల నైతికతను, అడ్డగోలు వ్యవహారాన్ని చీల్చిచెండాడిన కథ ‘ఊరి మద్దిస్తం’. పెళ్లయినంత మాత్రాన ఆడది బానిస కాదని, తనకు ఇష్టం లేని కాపురం చేయించలేరని చెప్పే కథ. పెళ్లాం సంపాదించిన రూకలతోనే తాగుతూ పైగా ఆమెనే రోజూ ఇష్టమున్నట్లు కొడుతుంటే ఏ ఆడ కూతురు మాత్రం కాపురం చేస్తుంది. ‘‘ఆడది తిండికోసమూ.. గుడ్డకోసమూనే కాపురం చేస్తుందా? మానం మర్యాద ఉండనక్కర లేదా? కూల్జేసుకొనే వాల్లయితే మాత్రం మర్యాదగా బతకాల్సిన పని లేదా?’’ అని నాగమ్మ ఊరి పెద్దమనుషులను కడిగిపారేస్తుంది. స్త్రీ స్వతంత్రను, స్వేచ్ఛను కోరుకునే కథ. ముఖం మీద ముక్కు లేని వాళ్లు, చేతికి వేళ్లు లేని వాళ్లు, అసలు హృదయమే లేని వాళ్లు, కాలంతో వ్యాపారం చేసే వాళ్లు, క్షణాల్ని రూపాయలుగా మార్చే వాళ్లు బాగా బతుకుతున్నారు. కాని ఒక ‘సత్యం’ కోసం శోధించే వాళ్లు మాత్రం బతకడం చేతగాక కుప్పకూలి పోతున్నారు. జీవితాన్ని ప్రేమించిన వాళ్లకి చివరికి పుస్తకాలు తప్ప ఏమీ మిగలడం లేదు. మనిషి చుట్టూ పరుచుకున్న సంక్షోభం, విధ్వంసమవుతున్న మానవీయ విలువలు, పీడన, అసత్యం, సంఘర్షణ అంతా చిత్రితమైన కథ ‘ఓ సాయంత్రం’. సత్యం కోసం ఎదురు చూస్తూ ఆ ‘సత్యం’ ఏమిటో సంకేతంగా ముగిస్తాడు కథకుడు.


దొంగా చీకటి ఒక్కటయితే దోపిడీ పరాకాష్ఠ ఎలా వుంటుందో చూపించే కథ ‘స్పెషల్‍ స్క్వాడ్‍’. ఈ కాలంలో ఒకనికి లొంగకుండా బతకాలంటే కులమన్నా ఉండాల. చేతినిండా దుడ్లన్నా ఉండాల లేకుంటే సామాన్యుని బతుకు ఏమవుతుందో వివరించే కథ ఇది. ఒక్కటిగా వున్న ఊరును నాలుగు ముక్కలు చేసి ఆధిపత్య వర్గాల వాళ్లు తమ పబ్బం ఎలా గడుపుకుంటారో చెప్పే కథ కూడా. అడవి నుండి రైతులు నాలుగు కొయ్యముక్కలు కొట్టుకొచ్చుకున్నారని స్పెషల్‍ స్క్వాడ్‍ ఊరు మీద దాడి చేసి వాళ్ల మీద కేసులు పెడదామని సిద్ధమవుతుంటే గోయిందప్పనాయుడనే పెద్ద మనిషి బ్రోకరు వేషం వేసి ఊరు వాళ్లను బెదిరించి ఫారెస్టాఫీసర్లకు దగ్గరుండి లంచం ఇప్పించి ఏదో మేలు చేసిన వాడిలాగా ఫోజు పెడ్తాడు. ఈ దోపిడి అంతం కావాలంటే ఊరి వాళ్ల అడుగులన్ని ఒక్కటి కావాలని హెచ్చరించే కథ.
ఏ ఎండకు ఆ గొడుగు పడుతూ మనిషి అవకాశవాదిగా, స్వార్థంగా బతికితేనే భవిష్యత్తు బాగుంటుందని భావించి ఎన్నో మెట్లెక్కుతున్న వారి మోసపూరిత బతుకుపై ఒక సెటైర్‍ ‘డాక్టర్‍ గుర్నాథం’ కథ.


ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్‍మహల్‍ అందం వెనక దాగియున్న కన్నీటి పొరను చూపించి మనల్ని కదిలించే కథ ‘తాజ్‍మహల్‍’. రాజుల సొమ్ము రాళ్లపాలు అన్నట్లు భారతదేశాన్ని పాలించిన రాజులు అనేక మంది తాము చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవాలని అనేక చారిత్రాత్మకమైన కట్టడాలను కట్టించారు. అట్లా వాళ్లపేరును చరిత్రపుటల్లో లిఖించుకున్నారు. కాని దీని వెనక ప్రజల రక్తం, చెమట ఎంత ఉందో గ్రహించాలనే ఒక స్పృహను కలిగించే కథ ఇది.
ఇందులోని 12 కథల్లో కథకుడు శిల్పపరంగా పెద్దగా ప్రయోగాలు చేయకున్నా ఒక సరళ శిల్పం పాటించి పాఠకులకు గందరగోళం కలిగించకుండా చేయి పట్టి తన వెంట తీసుకపోతాడు. కథల్లో ఎక్కువ శాతం చిత్తూరు జిల్లా మాండలికం వాడడం వల్ల ఆ భాషలోని నాదత్వం (Dialecttical Music) హృదయానికి పరవశత్వాన్ని పంచుతుంది. ఇంతేగాక అక్కడక్కడ మద్దిస్తం, అడపం, పోబిడీ, మూగి, బిలబిత్తిలి, ఉంపడాలు, మెరవని, ఎగదాల, గొత్తులు, దమ్మిడి, బీగం, మడిచేతులు, కడిసగించడం, యాసిరికొచ్చింది, రొంద, వారా, కుదిమట్టం, గెంతి, కొక్కిరి, మేరసార, బొలుసు కంప, సదర, సట్టికుండ, అనుసు లాంటి పదాలు మనం నిర్మించుకున్న నిఘంటువుల అసమగ్రతను పట్టిచూపుతున్నాయి.


ఈ కథలు బహుజనుల కథలు, బీసీల కథలు, మట్టిమనుషుల కథలు. రాయలసీమ గ్రామాల ఆత్మను పట్టుకున్న కథలు. రాయలసీమ ప్రాంతీయ అస్తిత్వానికి నిలువెత్తు పతాకలు ఈ కథలు. పల్లెటూరును వేదికగా చేసుకొని అక్కడి విధ్వంసాన్ని, కుట్రలను, కుతంత్రాలను, దోపిడీని, సంఘర్షణను, సంక్షోభాన్ని, కుల వృత్తుల విచ్ఛేదాన్ని, పల్లీయుల ఆత్మగౌరవాన్ని, వ్యవసాయంలోని లోతులను, దళారుల మోసాలను.. ఇలా ఎన్నింటినో చిత్రించిన కథలివి. కథల్లోని పాత్రలన్నీ మన మీదికే వచ్చేసి మనతోనే పోట్లాట పెట్టుకుంటాయి. మేమిలాగే ఎందుకున్నామని ప్రశ్నిస్తాయి. ఒక్కో కథ ఒక్కో జీవిత శకలం. జీవితం మీద ప్రేమ ఉన్న వాళ్లు, బాధ్యత ఉన్నవాళ్లు తప్పకుండా ఈ కథల్ని వాళ్ల రక్తంలో కలుపుకుంటారు. జీవితాలు ఎందుకు ఇంతగా చితికిపోతున్నాయని ఒక మనోవ్యధకు గురవుతారు.

  • డా।। వెల్దండి శ్రీధర్‍,
    ఎ : 98669 77741

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *