బోయ జంగయ్య

 ‘కృషి వుంటే మనుష్యులు ఋషులౌతారు మహా పురుషులౌతారు’ అన్నది డా।। బోయ జంగయ్య విషయంలో అక్షరసత్యం. కవి, కథకుడు, నాటకకర్త, నవలాకారుడు, బాలసాహిత్య రచయిత ఎన్నెన్నో పక్రియలల్లో దిట్ట జంగయ్య అతి సామాన్య నిరుపేద దళిత కుటుంబంలో పుట్టి ఇంతింతై వటుడింతై అన్నట్లు అంచెలంచెలుగా ఎదిగి తెలుగు సాహితీ చరిత్రలో ఆణిముత్యంలా నిలిచారు.


నిజాం నిరంకుశపాలన, రజాకార్ల దౌర్జన్యాలు, దొరలు, దేశ్‍ముఖ్‍ల ఆగడాలు ప్రజలను భయభ్రాంతులు చేస్తున్న రోజులు. 1 అక్టోబర్‍ 1942లో నల్లగొండ జిల్లాలోని పంతంగి అనే మారుమూల గ్రామంలో జంగయ్య జన్మించాడు. వీరి తల్లిదండ్రులు ఎల్లమ్మ, మల్లయ్య. రెక్కాడితే డొక్కాడె కుటుంబం. నిత్యం కూలి కెళితే గాని పూట గడవని పరిస్థితి. అతిపేద దళిత కుటుంబంలో పుట్టి స్వయంకృషితో సాహిత్య శిఖరాగ్రం చేరాడు జంగయ్య.


పల్లెటూళ్లో పుట్టి పెరగడం వల్ల గ్రామీణ వాతావరణం తన జాతి జనుల బాధలను అర్థం చేసుకున్నాడు. అంటరానితనం, కుల వివక్ష కారణంగా జంగయ్యను పాటశాలలో దూరంగా కూర్చోబెట్టేవారు. ఎన్ని అవమానాలు ఎదురైనా ఎదుర్కొని జంగయ్య నల్లగొండలో డిగ్రీ చదువు పూర్తిచేశాడు. బస్సు కిరాయిలేక నల్లగొండకు నడిచివెళ్లి చదువుకున్నాడు. సెలవురోజుల్లో తల్లిదండ్రులతో కూలికి వెళ్లేవాడు. ఇన్ని కష్టాలు పడ్డాడు కనుకనే తన రచనల్లో దళితుల జీవితాలను కళ్లకు కట్టినట్లు చూపించాడు. పేదల వేదనలు చూసిన జంగయ్య చదువుకునే రోజుల్లోనే ‘కష్టసుఖాలు’ నాటిక రాశాడు. డిగ్రీ పూర్తికాగానే నల్లగొండ ట్రెజరీ కార్యాలయంలో క్లర్క్ ఉద్యోగంలో చేరాడు. ఎ.టి.వో.గా పదవీ విరమణ చేశాడు.


తెలుగు సాహిత్యంలో
జంగయ్యది విశిష్టస్థానం. అన్ని సాహితీ పక్రియలలో అందెవేసిన చేయి. అందరిలాగానే జంగయ్య ముందుగా కవిత్వం రాశాడు. ఆ తర్వాత కథలు, నవలలు, నాటికలు, బాలసాహిత్యం తనదైన శైలిలో రాశాడు. ఏది రాసినా తను నమ్మింది నిక్కచ్చిగా, నిర్భయంగా రాసి పాఠకుల మన్ననలను పొందాడు. వారు రాసిన సాహితీ పక్రియల్లో ఒక్కోదాని గురించి పరిశీలిద్దాం.
నడుస్తున్న చరిత్ర, వెలుతురు, భోజకవితలు, పంచనామా ఇవి వారు రాసిన కవితా సంపుటాలు.
ఇక కథల విషయానికొస్తే లోకం, గొర్రెలు, ఎచ్చరిక, దున్న రంగులు, చీమలు, తెలంగాణ వెతలు, భోజ కథలు, బొమ్మలు, ఉప్పు నీరు, ఇప్పపూలు, ఆమె, అడవిపూలు, బొగ్గులు దాదాపు 14 కథల పుస్తకాలు వెలువరించాడు జంగయ్య. 200పై చిలుకు కథలు వీరి కలం నుండి వెలువడ్డాయి.
ఇక నవలా సాహిత్యంలో జాతర 1978లో, ఓగడం 2003లో, పుట్టుమచ్చ 2011లో వచ్చాయి. బాలసాహిత్యంలో బడిలో చెప్పని పాఠాలు, గుజ్జన గూళ్ళు, ఆటలపాటలు, మాటల ఆటలు, కొత్త పాఠాలు, మన నేతలు, టీవీ ముచ్చట్లు మొదలగు పిల్లల పుస్తకాలు పిల్లల మనసులను రంజింప చేశాయి.


జీవిత చరిత్రల విషయానికొస్తే భారతరత్న అంబేద్కర్‍, సమతావాది జగజీవన్‍రామ్‍, కె.ఆర్‍. నారాయణన్‍, గుఱ్ఱం జాషువా పుస్తకాలు రాశారు. దాదాపు యాభై పైచిలుకు పుస్తకాలు వెలువరించాడు. వయోజన సాహిత్యంలో ముందుచూపు, తోబోడు తొడగోసుకుంటే, స్వయం నిర్ణయం, న్యూమోనియా మొదలైనవి. ఇలా అన్ని పక్రియలల్లో తనదైన శైలిలో అట్టడుగు వర్గాల రచయితగా నిలిచాడు జంగయ్య. ఇక ఒక్కొక్క పక్రియ గురించి పరిశీలిద్దాం.
ముందుగా కవిత్వం గురించి చూద్దాం. జంగయ్యది సరళమైన కవిత్వం. ముఖ్యంగా మినీ కవిత్వం ఆయన కత్యంత ఇష్టం. సామాజిక స్పృహ వున్న కవిత్వం, మూఢ నమ్మకాలు, కుల వివక్ష, దోపిడీల మీద ఎక్కుబెట్టిన సాహితీ బాణం జంగయ్య కవిత్వం.


వారి ‘పావురాలు’ కవిత ఆణిముత్యం. ఎంతో పేరు తెచ్చింది.
ఆలయ గోపురాల నుండి ఎగిరిన పావురాలు ప్రభువు ప్రార్థన కోసం ఫాస్టర్‍ తలుపు తెరిచినపుడు ఎగిరిన పావురాలు
అల్లాహో అక్బర్‍ మౌజమ్‍ పిలుపుకు ఎగిరిన పావురాలు
అన్నీ కలిసి తిరుగుతున్నాయి. అన్నీ కల్సి తింటున్నాయి. కాని పూజారి ఫాస్టర్‍ మౌజమ్‍!!!?
ఇక్కడే ప్రశ్నార్థకంతో కవితను ముగిస్తాడు జంగయ్య.
ఇంకో కవితలో
‘అమ్మా కుంటోన్ని – పోయిరా – తల్లీ గుడ్డోన్ని – వెళ్లిరా
మా తల్లి ముసులోన్ని పోపో!
ఏడుకొండలవాడా! వెంకటరమణా!
వస్తున్నా వుండు’. మినీ కవితా వుద్యమంలో
అందరినోట వినిపించిన కవిత ఇది.
నల్లగొండ జిల్లాలో దొరలు, దేశ్‍ముఖ్‍లు రజాకార్లని నిరసిస్తూ రాసిన మరో కవిత.
‘భూమి కోసం భుక్తికోసం తుపాకుల రొమ్ము లొడ్డి
వడిసేలు రువ్విన నేల గుండ్రాలపల్లి రజాకార్ల
గుండాగిరికి గోరికట్టి పటేల్‍ పాశం పుల్లారెడ్డి
పనిపట్టిన ప్రాంతమిది’
తెలంగాణా సాయుధ పోరాటంలో ప్రజల పోరాటాల పటిమ ఈ కవితలో వివరించారు.
మతం గురించి రాసిన మరో కవిత ‘ఎక్కడ ఈ మొగ్గలు పరిమళాన్ని విరజిమ్ముతాయోనని వెలుతురు చూడకుండా చుట్టూరా

మూఢనమ్మకాల ముల్లపొదలు అజ్ఞానపు చీకటి తెరలు
ఇలా జంగయ్య రాసిన కవితలన్నీ ప్రజల పక్షాన నిలబడి నిబద్దతతో రాసిన కవితలే. తన కవితల్లో బలమైన వస్తువు, శిల్పానికి ప్రాధాన్యత నిచ్చాడు బోయ జంగయ్య.


కథల విషయానికొస్తే 14 కథల పుస్తకాలు అందులోని కథలు ఒక్కోకథ ఒక్కో ఆణిముత్యం. నిత్యం తాను చూసిన అనుభవించిన తన చుట్టూ వున్న బాధాతప్త బడుగు జీవులు, అట్టడుగు దళితులు, బహుజనుల జీవిత చిత్రాలే జంగయ్య కథలు. తన కథలల్లో మూఢవిశ్వాసాలు, కుల వివక్ష, స్త్రీలు, పిల్లలపై అత్యాచారాలు వీటన్నిటిని చీల్చి చెండాడాడు. జంగయ్య కథలలో తెలంగాణా మట్టివాసనలు కన్పిస్తాయి. గ్రామీణ జీవితాలు మన కళ్ల ముందు కదులుతాయి. జాతిని జాగృతం చేసి కళ్లు తెరిపించేవి జంగయ్య కథలు.
ముఖ్యంగా భోజ కథలలో బొమ్మలు, ఒయాసిస్‍ కథలు ఆలోచింప చేస్తాయి. కులంమతం అడ్డుగోడలు, పరస్పర విద్వేషాలు, మారణ హోమానికి కారణమనే విషయం తెలియజేస్తాయి. ‘బొమ్మలు’ కథ దేవుడు చేసిన మనిషి కంటే మనిషి చేసిన దేవుని బొమ్మకు ఎక్కువ విలువనిస్తూ వందలు, వేలు దేవునికి సమర్పిస్తూ, ఆకలితో నకనకలాడే మనిషిని ఈసడించుకుంటూ ఒక్కరూపాయి కూడా ఇవ్వని వైనం ఈ కథలో మన ముందుంచాడు.
బోయ జంగయ్య ‘ఎర’ కథలో బడుగు జీవులకోసం పనిచేస్తు న్నామని గొప్పలు చెప్పుకునే రాజకీయ నాయకులను ఎండగడితే, ‘సుడిగాలి’ కథలో దేవతలుగా పూజలందుకునే ఆడస్వాముల కథలు బయటపెడతాడు.
ఎచ్చరిక కథలో వెట్టిచాకిరి, శ్రమదోపిడిపై తిరుగుబాటు చేయమంటాడు. ‘దొంగలు’ కథలో లంచగొండులైన ఆఫీసర్ల భరతం పట్టమంటాడు. ‘గత్తర’ కథలో గత్తరపేరుతో గ్రామాల్లో జరిగే అమానుష కృత్యాలను బట్టబయలు చేస్తాడు. ‘ఇప్పపూలు’ కథలో పోలీసుల దౌర్జన్యా లను నిరసిస్తాడు. ‘గొర్రెలు’ కథలో రాజకీయ నాయకులు ఏ కులానికి చెందినా కార్యకర్తలను గొర్రెల్లా వాడుకుంటారని చెబుతాడు జంగయ్య.
ఇక నవలల విషయానికొస్తే జాతర, జగడం, పుట్టుమచ్చ, ఈ నవలల్లో సమకాలీన సమాజముంది. వాస్తవ చిత్రీకరణ వుంది. మూఢనమ్మకాలు మనుష్యుల జీవితాలతో ఎలా ఆడుకుంటాయో ‘జాతర’ నవల తెలియజేస్తుంది. భక్తిపేరుతో సాగిన మోసాలకు అక్షరరూపం ‘జాతర’, దేవుడి పేరు చెప్పి తమ అవసరాలు తీర్చుకోవడం ఈ నవలలో అడుగడుగాన కన్పిస్తుంది. ఈ నవల ఆరు ముద్రణలు పొందింది. మైసూరు విశ్వవిద్యాలయం ఉపవాచకంగా నిర్ణయించింది. 2003లో తెలుగు యూనివర్శిటీ ఈ నవలకు పురస్కారం యిచ్చి జంగయ్యకు గౌరవ డాక్టరేట్‍ ప్రధానం చేసింది.


‘జగడం’ నవల నైజాం పరిపాలన, రజాకార్ల దుష్కృత్యాలు ఎదుర్కొని రాజం అనే దళిత యువకుడు యూనివర్శిటీ దాకా చదివి ప్రయోజకుడైన విషయం ఇందులో వుంది. ఇక మూడో నవల ‘పుట్టుమచ్చ’ ఓ దళిత గిరిజన యువతి ‘మోతీ’ కథ. ఇందులో రాజకీయ నాయకుల ఆకృత్యాలు, ఆఫీసర్ల ఆగడాలు, ఆడవారి వైపు వెకిలి చూపులు, అన్నిటిని ఎదిరించిన ‘మోతీ’ అనే లంబాడా ఆడపిల్ల కథ. మూడు నవలలు ఆణిముత్యాలే.
ఇక నాటక రంగంలో మొదటిది ‘కష్టసుఖాలు’, తర్వాత ‘కొత్తబాట, దేశం కోసం’, ఎయిడ్స్ మీద రాసిన ‘ఆలోచించండి’. ఈ నాటకాలన్నీ దేశభక్తి, జనహితం కోసం వ్రాయబడ్డాయి. కొన్ని నాటకాలలో జంగయ్య స్వయంగా నటించాడు కూడా!
బాలసాహిత్యంలో వీరివి ఐదుపుస్తకాలు వచ్చాయి. ఇవి పిల్లల మనస్సులు రంజింప చేశాయి. ‘అంబేద్కర్‍’ కవిత 8వ తరగతి తెలుగు విద్యార్థులకు పాఠ్యాంశంగా చేర్చబడింది. నూతన అక్షరాస్యుల కోసం ఐదు పుస్తకాలు రాశాడు జంగయ్య. అంబేద్కర్‍, జగ్జీవన్‍రామ్‍, కె.ఆర్‍. నారాయణ్‍ ‘జాషువా’ జీవిత చరిత్రలు మనముందుంచాడు. వీరి కవితలు, కథలు ప్రసంగాలు రేడియోలో వచ్చాయి. టి.వీ.లో వీరి రచనలు ప్రసారమయ్యాయి.


తొలినాళ్లలో ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు సాహితీవేత్త కాంచనపల్లి చిన వెంకట రామారావు మార్గదర్శకంలో రచనా వ్యాసాంగం చేశాడు. సాహితీ మిత్రులు, యువ రచయితల సమితి, జిల్లా రచయితల సంఘాలలో క్రియాశీలక పాత్ర పోషించాడు. నాలుగుసార్లు జిల్లా రచయితల సంఘానికి ప్రధాన కార్యదర్శిగా పనిచేశాడు.
బోయ జంగయ్యకు వచ్చిన అవార్డులు రివార్డులు లెక్కలేనన్ని. ఎచ్చరికకు శ్రీశ్రీ మెమోరియల్‍ పురస్కారం, ‘జాతర’కు తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం, చా.సో. (చాగంటి సోమయాజులు) స్ఫూర్తి అవార్డు, స్వరాజ్యలక్ష్మీ అవార్డు, మలయశ్రీ పురస్కారం, విశాల సాహితీ పురస్కారం, జాషువా పురస్కారం ఇలా ఎన్నో.


దేశవిదేశాలలో సాహితీ కార్యక్రమాలలో పాల్గొన్నారు జంగయ్య. మలేషియాలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలలో పాల్గొన్నారు. ఢిల్లీ, బెంగుళూరు, చెన్నైలలో అనేక కథా సదస్సులలో పాల్గొన్నారు. చివరి రోజులలో తన శరీరం సహకరించకున్నా ‘అవసరం’ పేరిట తన ఆత్మకథను పుస్తకరూపంలో మనముందుంచారు. సాహితీ మిత్రులు తన పుస్తకాలను ప్రచురించారు.


అంచెలంచెలుగా ఎదిగి తెలుగు సాహితీరంగంలో అగ్రభాగాన నిలిచిన అభ్యుదయ రచయిత జంగయ్య. అందుకే ఆయన రచనలు శ్రీశ్రీ, రావిశాస్త్రిలాంటి వారి ప్రశంసలు పొందాయి. డా।। బోయ జంగయ్య 2018 మే నెల 7వ తేదీన పరమపదించి సాహితీలోకాన్ని దుఃఖసాగరంలో ముంచాడు. ఆయన లేకపోయినా ఆయన రచనలు తెలుగు సాహిత్యం వున్నంతవరకు సజీవంగా వుంటాయి. తెలంగాణ సాహితీరంగంలో ధృవతార జంగయ్య.


(తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ప్రచురించిన
‘తెలంగాణ తేజోమూర్తులు’ నుంచి)
-మేరెడ్డి యాదగిరి రెడ్డి

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *