ప్రస్తుతకాలంలో మనిషి తెలిసి కొంత తెలియక కొంత చేస్తున్న తప్పు ఏదైనా ఉందంటే ప్రకృతిని కాలుష్యం చేయడం. ప్రకృతి కాలుష్యం అవడం వల్ల మనిషి చుట్టూ ఎన్నో సమస్యలు ఏర్పడుతున్నాయి. ప్రతి సంవత్సరం జులై 28వ తేదీన ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవ సందర్భంగా ప్రపంచమంతటా ఏర్పడుతున్న కాలుష్యం, ప్రకృతి విషయంలో మనుషులు చేస్తున్న తప్పులు, ప్రకృతిని కాపాడుకునే మార్గాలు. ప్రణాళికలు వంటివి చర్చించడం, నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది.
ప్రపంచవ్యాప్త అన్నీ దేశాలు తీసుకునే ఈ నిర్ణయాల గురించి పక్కన పెడితే ఈ ప్రపంచం మీద అధిపత్యం చూపిస్తున్న మనుషులమైన మనం ప్రక•తి పరిరక్షణ కోసం ప్రకృతిని అంతో ఇంతో మనకు తోచినంత కాపాడుకుంటే ఆ ప్రకృతి మన రేపటితరాలకు మంచి చేస్తుంది.
విశాల విశ్వంలో భూమిపై ఉన్న ప్రకృతి మాత్రమే జీవకోటికి అవసరమైన నీరు, ఆహారం, ప్రాణవాయువు అందిస్తుంది. సకల జీవరాశిలో మానవుల వాటా తక్కువ, కానీ ప్రకృతికి మానవుడు చేసే హని మాత్రం ఎక్కువ. ప్రకృతిని పరిరక్షించడం, భూమి మీద ఉన్న సహజ వనరులు క్షీణించకుండా కాపాడటం, జీవవైవిధ్యాన్ని సంరక్షించడం అనే ప్రాముఖ్యతను ఈ దినోత్సవం మనకు గుర్తు చేస్తుంది. పర్యావరణ సమస్యలపై అవగాహన పెంచడానికి అనేక సంస్థలు చాలా కృషి చేస్తున్నాయి. సుస్థిరమైన జీవనం కోసం ప్రజలందరూ సమిష్టిగా తీసుకోవాల్సిన చర్యలను ప్రేరేపించడానికి పర్యావరణ సమతుల్యత అనేది చాలా అవసరం. మానవ చర్యలు పర్యావరణానికి హాని కలిగించడమే కాకుండా, ప్రకృతిలోని సహజ వనరులన్నీ హరించుకు పోయేలా ఉన్నాయి. భవిష్యత్తులో మనుగడ చాలా కష్టంగా మారుతుంది. ప్రకృతిని కాపాడటం అనేది ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలి.
ప్రకృతి ప్రాముఖ్యత గురించి..
ప్రకృతిని సంరక్షించడం కోసం చెట్లను నాటడం, రీ సైకిల్ చేసిన ఉత్పత్తులను ఉప యోగించడం వంటివి చేయాలి. నీటి కాలుష్యం, నేల కాలుష్యం, కరువు, వరదలు, వన్యప్రాణులు అంతరించి పోవడం, సహజ వనరులు క్షీణించడం వల్ల ఇతర వినాశకరమైన ప్రభావాల వల్ల తీవ్రమైన పరిణామాలను ఎదురు కొంటున్నందున ప్రపంచవ్యాప్తంగా అన్ని స్థాయిలలో పరిరక్షణ ప్రయత్నాలు చేయాలి. ప్రభుత్వాలు, సామాజిక సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యా సంస్థలు ప్రకృతి ప్రాముఖ్యత గురించి విస్తృతంగా కార్యక్రమాలను నిర్వహించాలి. స్థిరమైన జీవనం వైపు గణనీయమైన మార్పులు తీసుకురావడానికి ప్రయత్నించాలి. ప్రకృతిని కాపాడు కున్నప్పుడే భవిష్యత్ తరానికి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఇవ్వగలం.
- జుగాష్‍విలి
ఎ : 8309452998