వజ్రాలు సహజ పరిస్థితిలో భూమి అడుగున లోతుల్లో అధికపీడనం ఉష్ణోగ్రత వద్ద ఏర్పడి పైపొర లోపలికి అంతర్గమాల ద్వారా చేరిన కర్బన రూపాలు. ఇవి చాలా అరుదుగా మాత్రమే దొరుకుతాయి. వజ్రాలకు ఉన్న వాణిజ్య విలువవల్ల అందరికీ అందుబాటులో ఉండవు. ఈ కారణంగా అనేక ఇతర ఖనిజ/కృత్రిమ పదార్థాలు వజ్రాలకు ప్రత్యామ్నాయంగా వాడ బడుతున్నాయి. వాణిజ్యపరంగా వీటిని కూడా ‘‘వజ్రాలు’’ అనే అంటారు. వీటికిగల వజ్రాన్ని పోలిన లక్షణాలవల్ల తరచుగా వజ్రాలు అనే పదం వీటికి కూడా వర్తింప చేస్తున్నారు.
వాటిలో కొన్ని
మార్క్విస్ వజ్రం:
మార్క్విస్ ఆకారంలో మలచిన సింథటిక్ జిర్కాన్. దాని అసాధారణ ప్రకాశం కారణంగా వజ్రం అని పిలువబడుతుంది.
తెల్ల పుష్పరాగము:
(సింథటిక్ లేదా సహజమైనది) దాని రంగులేని రూపాన్ని కలిగి ఉండటం వలన వజ్రాలు అని పిలుస్తారు. వక్రీభవన సూచిక 1.61 నుండి 1.63 వరకు మరియు కాఠిన్యం మోహ్స్ స్కేలుపై 8గా ఉంటుంది. ఇది తెల్లగా మెత్తగా కనిపించేలా ఉంటుంది.
క్యూబిక్ జిర్కాన్(గ్):
ఇది ఒక సింథటిక్ జిర్కాన్, దాని వజ్రం లాంటి రూపం కారణంగా్గ అని ప్రసిద్ది చెందింది. జిర్కాన్ వక్రీభవన సూచిక 1.81 నుండి 2.01 మరియు కాఠిన్యం 6 నుండి 7.5 వరకు ఉంటుంది.
సహజ వజ్రాల లభ్యత తక్కువ ఉండటం, అందులోను జెమ్ గ్రేడ్ వజ్రాలు అరుదుగా ఉండటం వల్ల వీటి ప్రత్యామ్నాయాల కోసం మార్కెట్లో నిరంతరం ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీటిలో కొన్ని వజ్రాలకు దగ్గరి పోలికలు ఉన్న ఇతర రత్నాలు కాగా ఇంకొన్ని కృత్రిమ రత్నాలు, అనుకరణలు (Imitations) ఉన్నాయి. రత్నం రూపాన్ని అనుకరించేవి, కానీ విభిన్న రసాయనిక కలయికలను కలిగి ఉండే పదార్థాన్ని సిమ్యులెంట్స్ (సమరూపకాలు) అంటారు. మరొక రత్నం స్థానంలో దానికి బదులుగా ఉపయోగించే పదార్థాన్ని ప్రత్యామ్నాయం (substitute) అంటారు.
మోయిసనైట్:
CZ వంటి తక్కువ ధరకు దొరికే సమరూపాలు కాకుండా, మోయిసనైట్ (Moissanite) అనే ఖనిజం (ల్యాబ్ సృష్టించిన కుత్రిమ పదార్థాన్ని) డైమండ్ సిమ్యులేంట్‍గా కూడా ఉపయోగిస్తారు. ఇది చాలా తక్కువ పరిమాణంలో సహజంగా కూడా లభిస్తుంది. హెన్రీ మోయిసన్ అనే ఫ్రెంచ్ శాస్త్రజ్ఞుడు దీన్ని 1893లో అరిజోనాలో ఒక మీటియోరైట్ క్రేటర్ లో కనుగొన్నారు. ప్రస్తుతం ఎక్కువభాగం కృత్రిమంగా తయారు చేయబడుతుంది. ఇది ఒక Silicon Carbide(SIC)దీని ప్రకాశం మరియు కాఠిన్యం వజ్రానికి చాలా దగ్గరగా ఉంటుంది. 2.65 వక్రీభవన సూచిక, డబుల్ వక్రీభవనం మరియు తక్కువ కాఠిన్యం (9.25) కారణంగా దీనిని వజ్రం నుండి వేరుగా గుర్తించవచ్చు. అయితే ధర ్గ కంటే ఎక్కువ కానీ వజ్రంతో పోలిస్తే చాలా తక్కువ. సాధారణంగా ఇది రంగు లేకుండా ఉంటుంది కాని అరుదుగా ఇతర రంగుల్లో కూడా ఉంటుంది. ఆభరణాల తయారీ, వజ్రానికి ప్రత్యామ్నాయం గానే కాకుండా దీనికి ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ, ఎనర్జీ స్టోరేజ్, తదితర పారిశ్రామిక ఉపయోగాలు ఉన్నాయి.

White Sapphire:
రంగులేని రూపం మరియు తేజస్సు కారణంగా తెల్లని నీలమణి వజ్రాన్ని తలపిస్తుంది. వక్రీభవన సూచిక 1.76 నుండి 1.82 వరకు, మోహ్స్ స్కేల్ పై కాఠిన్యం 9 ఉంటుంది. వజ్రం కంటే తక్కువ ధర ఉన్నప్పటికీ నాణ్యతలో దగ్గరగా ఉండటం వల్ల ఇది వజ్రానికి ఉత్తమ ప్రత్యామ్నాయం కావచ్చు.
స్పినెల్:
సింథటిక్ స్పినెల్ వజ్రం యొక్క మెరుపును అనుకరిస్తుంది కాబట్టి దీనిని వజ్రం యొక్క సిమ్యులెంట్‍గా కూడా పరిగణిస్తారు. దీని వక్రీభవన సూచిక 1.71 మరియు కాఠిన్యం 7.5 నుండి 8 వరకు ఉంటుంది. వజ్రం యొక్క అగ్ని మరియు వ్యాప్తి దీనికి లోపించింది.
హెర్కిమర్ డైమండ్స్:
హెర్కిమర్ డైమండ్స్ అనేవి ప్రధానంగా హెర్కిమర్ కంట్రీ న్యూయార్క్లో కనిపించే ఒక రకమైన క్వార్టజ్ స్ఫటికాలు. అవి మంచి స్పష్టత మరియు ప్రకాశం కలిగిన డబుల్ కోణాకార స్పష్టమైన స్ఫటికాలు. వజ్రంలా మెరిసే ప్రత్యేక లక్షణాల కారణంగా వాటిని హెర్కిమర్ వజ్రాలు అని పిలుస్తారు.
ఇవి భారతదేశంలో కూడా దొరుకుతాయని తెలిసింది. కెరిమెరి సమీపంలోని ఇంటర్‍ట్రాపియన్ బెడ్స్ నుండి హెర్కిమర్ డైమండ్స్ను మా కొత్త తెలంగాణచరిత్రబృందం నివేదించడం గమనార్హం.
కృత్రిమ వజ్రాలు:
ప్రయోగశాలలో తయరుచేసిన వజ్రాలు లేదా కల్చర్డ్ వజ్రాలు అని కూడా పిలువబడే సింథటిక్ వజ్రాలు ఇటీవలి సంవత్సరాలలో ప్రజాదరణ పొందుతున్నాయి. ఈ వజ్రాలు సహజ వజ్రాలను ప్రతిబింబించే అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సృష్టించబడ్డాయి. కానీ పర్యావరణ ప్రభావాలు మరియు ఖర్చు గణనీయంగా తక్కువగా ఉంటుంది.ప్రస్తుతం మార్కెట్లో సింథటిక్ వజ్రాలు ట్రెండ్ అవుతున్నాయి. ప్రపంచ సింథటిక్ వజ్రాల మార్కెట్ 2020 నుండి 2025 వరకు 21.4 CARGతో వృద్ధి చెందుతుంది అని మార్కెట్ వర్గల అంచనా. ఈ అసాధారణ వృద్ధికి ప్రధాన కారణం కృత్రిమవజ్రాలు సహజవజ్రాల కంటే చాలా చౌకగా ఉండటం, సహజవజ్రాల రూపాన్ని మరియు అనుభూతిని కోరుకునే వినియోగదారులకు కృత్రిమ వజ్రాలు ఆకర్షణీయమైన ప్రత్యమ్నాయంగా మారాయి.
కాని ఈ వజ్రాలకు కొన్ని నాణ్యతా నియంత్రణ సమస్యలతో పాటు, పునఃవిక్రయ విలువ లేకపోవటం వంటి ప్రతికూలతలు ఉన్నాయి. పైగా గ్రాహకులు వీటిని నిజమైన సహజ వజ్రాలుగా భావించి మోసపోయే అవకాశం కూడా ఉంటుంది.
కృత్రిమ వజ్రాలు ప్రయోగశాలలో సృష్టించబడి, వజ్రాల యొక్క రసాయనిక భౌతిక లక్షణాలు కల పదార్థాలు. వీటిని సహజ వజ్రాల నుండి వేరుగా గుర్తించడం చాలా కష్టతరం. ఇవి రెండు రకాలు ఒకటి హై ప్రెషర్ హై టెంపరేచర్ (HPHT) పధ్ధతిలో తయారు చేసినవి. రెండు కెమికల్ వేపర్ డిపాజిషన్ పక్రియ ద్వారా తయారు చేసినవి (CVD). అతి సూక్ష్మ వజ్రాలను తయారు చేసే ‘‘డెటోనేషన్ సింథసిస్’’ అనే మూడవ పక్రియ కూడా (Detonation synthesis) ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. Crystalization inside Liquid metal మరియు Ultra sound cavitation అనే ఇంకో రెండు పక్రియల పైకూడా పరిశోధనలు జరుగుతున్నాయి. (తరువాయి వచ్చే సంచికలో)
-చకిలం వేణుగోపాలరావు
డిప్యూటి డైరెక్టర్ జనరల్ జిఎస్సై(రి)
ఎ: 9866449348
శ్రీరామోజు హరగోపాల్,
ఎ : 99494 98698