పర్యావరణ వ్యవస్థలు కొనసాగాలంటే జీవవైవిధ్యం కొనసాగాలి. జీవవైవిధ్యం కాపాడబడాలి. సామాజిక జీవితంలో, చరిత్రలో మానవాళి పాత్ర ఎలా మారుతూ వచ్చిందనేది ముఖ్యంగా చూడాలి. కొన్ని ప్రత్యేక కాలాల్లో, స్థలాల్లోకి మన దృష్టిని సారించినప్పుడు మన చారిత్రక అనుభవాలు నేడు ఏమి జరుగుతుందనేది అర్థం చేసుకోవడానికి ఉపకరిస్తుంది. మానవ చరిత్రలో పర్యావరణ పరంగా మాట్లాడితే నిజంగా ఏం జరిగిందనేది తెలుసుకోగలం. మానవులు బహువిధాలుగా భూవ్యవస్థలతో సంబంధాన్ని కలిగి ఉన్నారనేది వాస్తవం. ఈ సంబంధాలు కొన్ని విధాలుగా సుస్థిరమైన సంతులనాన్ని కలిగి ఉండి, అవి మనకొక వాగ్దానాన్ని కూడా ఇస్తుంటాయి. కొన్ని మాత్రం విధ్వంసభరితంగా ఉండి అసలు విషయాన్ని తేటతెల్లం చేస్తుంటాయి. ఏది ఏమైనా చరిత్ర ఇచ్చిన అనుభవం ఏది ఏమిటనే విషయాన్ని మనకు బోధిస్తుంది.
ఇప్పుడు మనం చూస్తున్నది, జరుగుతున్న విధ్వంస క్రమం. యిలాగే కొనసాగుతుందా అంటే లేదని కాదని చెప్పగలం. జీవ భౌతిక ఆవరణాన్ని తీవ్రగా విధ్వంసపరుస్తున్న కార్యకలాపాలు ఏమిటి? ఏవి ఆధిక్యాన్ని కలిగి ఉన్నాయి? ఏవి సమతుల్యతను కలిగి ఉన్నాయనేది అర్థమవుతుంది. కలుషితమైన నీరు. గాలి, ఆమ్ల నిక్షేపాలు, ఓజోన్‍పొర క్షీణత, గ్లోబల్ వార్మింగ్, అణుధార్మికత గల పదార్థాల విస్తరణ, అడవుల తరుగుదల, జీవవైవిధ్య క్షీణత, జీవ జాతుల అంతరింపు, భూసారం కోల్పోవటం, అధిక జనాభా పెరుగుదల ఇత్యాదులన్నీ మానవ చర్యా ఫలితాలే. అయితే గతంలో ఇటువంటి విధ్వంసక దశలు ఇంత తీవ్రంగా కాకపోయినా పరిమిత భూభాగాలలో జరిగాయి అనేది వాస్తవం. అయితే ఇవి క్షీణించిన ఆవరణ వ్యవస్థలను ఇవి రూపుదిద్దాయి. అప్పటి ఆర్థిక అభివృద్ధిని బట్టి రూపొంది ఉంటాయి. నేలలో లవణత వృద్ధి పొందటమనే మొసపటేమియా అనుభవం, దక్షిణ దిగువ భూభాగంలో అడవుల తరిగిపోవటమనే మయన్ అనుభవం, అదే అటవి సంపద క్షీణించటమనే రోమన్ల అనుభవాలు, మధ్య ధారా తీరంలోని నేలలు, వణ్యప్రాణులలో తరుగుదల కూడా ఈ కోవకే చెందుతాయి.
అయితే ఆయా ప్రత్యేక స్థలకాలాల్లో మానవులు సుస్థిరమైన జీవన విధానాలను సాధించారా లేదా అనేది ప్రశ్నార్థకం. అదే నిజమైతే ఆవరణ వ్యవస్థలను మానవులు దోపిడీ చేయటమనేది పరిమితం చేయబడిందనేది కూడా నిజమే. నిజానికి ఈ విధ్వంసాలను, నిలువుదోపిడీ పద్ధతులను మానవాళి సరైన వైఖరులు కలిగి ఉండి సరైన చర్యలను మానవ సమాజాలు చేపట్టడం ద్వారా మొత్తం సమాజాన్ని విధ్వంసాల బారినపడకుండా కాపాడుకోగల వీలును, అవకాశాలను సృష్టించుకున్నట్లు అవుతుంది. స్థానిక హోపి, బాలినీస్ వ్యవసాయ విధానాలు ప్రాచీన ఈజిప్టు వాసులు నైలునదితో లాభదాయక సంపర్కం, ఇంకా ఆర్థికం లాంటివి ఒక సానుకూల ఆశావహ స్థితిని స్పష్టం చేస్తున్నాయి. నిజానికి ఇవన్నీ అత్యంత పురాతన వ్యవసాయ ఆధారిత ఆర్థికాలు. అయితే ఇటువంటి జన సమూహాల విజయాలు వేర్వేరు దశల్లో భిన్నభిన్నంగా అమలు పరచబడ్డాయి. అయితే ఇటువంటివి ఆధునిక పారిశ్రామిక సమాజాలలో కనుగొనటం అత్యంత కష్టం. ఎందుకంటే ఆధునిక పారిశ్రామికాలు అత్యంత వేగవంతమైన మార్పులకు కారణమవుతాయి. సమయం కూడా తక్కువే. పొందిన ఫలితాలు అంత స్పష్టంగా కనిపించవు. అయితే ఉత్తర ఐరోపా దేశాలు స్థిర జనాభాను కలిగి ఉండటం ద్వారా సాపేక్షంగా స్వచ్ఛమైన పర్యావరణాన్ని నిలుపుకోగలిగాయి. ప్రజలకు, ప్రభుత్వాలకు పర్యావరణం పట్ల శ్రద్ధ కలిగి ఉండి విశ్వసించదగిన ప్రజాస్వామ్యం కలిగి ఉన్నట్లయితే ఇవి పర్యావరణాన్ని విధ్వంసం నుండి కాపాడేందుకు మంచి నమూనాలుగా నిలవగలిగి ఉండేవి.
సమీప చరిత్రలో విధ్వంస పద్ధతుల ఆధిక్యతను ప్రతిఘటించిన ఉదంతాలు ఉన్నాయి. సహజ ఆవరణ వ్యవస్థలు ఎలా పని చేస్తాయి అనే జ్ఞాన అవగాహన పెరగాలి. అలాగే ఎకాలజీకి సంబంధించిన శాస్త్ర పరిజ్ఞానం కూడా పురోగమించాలి. అయితే ఇది కేవలం సమాచార వృద్ధిగా మిగల కూడదు. ఎంతో శ్రమించి అర్థం చేసుకున్న శాస్త్రజ్ఞానంగా ఆచరణకు ఉద్యుక్తం కావాలి.
మనం పర్యావరణ విషయంగా తీసుకునే ప్రతి నిర్ణయం ఆవరణ వ్యవస్థకు విధేయంగా ఉంటూ ఉండాలి. మనకు శాస్త్రం సూచించే సహజ వ్యవస్థలు నిర్వహణ అనేది ఒక ఉమ్మడి అవగాహన, ఆచరణగా మారాలి. శాస్త్రం ఎప్పుడూ ఒక డాగ్మా కాదు. అది అవగాహన పరచుకునేందుకు సాగే అన్వేషణ. శాస్త్రం పట్ల పలు సందేహాలు ఎప్పుడూ ఉండేవే. శాస్త్ర ప్రాతిపదిక లేని దేనినీ విశ్వసించకపోవటం ఒక ఎత్తయితే, అసలు శాస్త్రం ఆవిష్కరించే విషయాలను అనాలోచితంగా నిరాకరించటం ఒక ప్రమాదకర ధోరణి. పర్యావరణ విధ్వంసాన్ని నిలువరించడానికి తగిన సాంకేతికత కూడా ఒక ఆశను కలిగిస్తుంది. ఆధునిక యుగంలో టెక్నాలజీ అనేది విధ్వంస పూరితంగానే మారిందనేది సత్యం. ప్రతి పర్యావరణ విధ్వంసానికి టెక్నాలజీ సూచించే పరిష్కారాల మీదనే ఆధారపడకూడదు. పర్యావరణ వివేక, విజ్ఞతలు నేటి అవసరం.
- డా।। ఆర్. సీతారామారావు
ఎ : 9866563519