శాతవాహనులు తమ పరిపాలన ప్రారంభించింది ప్రతిష్ఠాన (పైథాన్)పురం నుంచి కాదనీ, తెలుగుకు ‘ఆణ’మైన తెలంగాణాలోని కోటలింగాల కోటనుంచి అని తెలిసిన తరువాత తెలంగాణాతో పాటు తెలుగునేలంతా పులకించింది. గర్వంతో తొణికిసలాడింది. 1978లో రాష్ట్ర పురావస్తుశాఖ, వి.వి.కృష్ణశాస్త్రి, ఎన్నెస్ రామచంద్రమూర్తిల ఆధ్వర్యంలో కోటలింగాల (ప్రస్తుతం జగిత్యాల జిల్లా)లో జరిపిన తవ్వకాల్లో విస్తుబోయే పురాతన ఆనవాళ్లు బయల్పడినాయి. శాతవాహన వంశ మూలపురుషుడైన ఛి(సి)ముక శాతవాహనుడు సా.శ.పూ. 1వ వతాబ్దిలో సామంత స్థాయి నుంచి, రాజుగా ఎదిగి, సొంత రాజ్యానికి హద్దుల్ని, సరిహద్దుల్నీ నిర్ణయించి, శతృతుర్భేద్యమైన కోటను కట్టుకొన్నాడు. కోటలింగాలను రాజధానిగా చేసుకొని పాలించాడు. తవ్వకాల్లో సా.శ.పూ.4వ శతాబ్ది (మౌర్యుల సమకాలీనం)కి చెందిన మట్టి, ఇటుకలతో కట్టిన కోటగోడలు, నాలుగు మూలల్లో బురుజులు, ఎదురుగా రాజప్రాసాదం, ప్రవేశగోపురంతో పాటు, ఇళ్లు, మరెన్నో కట్టడాల పునాదులు, పురావస్తువులు వెలుగుచూశాయి. మెగస్తనీసు ఇండికాలో పేర్కొన్న ముప్పై కోట గోడలతో నున్న ఆంధ్రుల నగరాల్లో కోటలింగాల కూడ ఒకటని తెలుసుకొన్న పురావస్తు పరిశోధకుల ఆంనదానికి అవధులు లేవు.

కోటలింగాల్లో దొరికిన నాణేలను ప్రముఖ శాసన పరిశోధకులు పీపీ పరబ్రహ్మశాస్త్రి, నాణేలను తనదైన శైలిలో పరిశోధించి, శాతవాహనుల కంటే ముందు కాలానికి చెందిన స్థానిక పాలకులు, గోబధ, నరన, కంవాయ, సమగోవుని నాణేలను పరిశీలించి అవి సా.శ.పూ.3వ శతాబ్ది నాటివనీ, వాటిపై నున్న పేర్లు తెలుగువని డా. దేమె రాజారెడ్డి తెలియజేశారు. తద్వారా, కోటలింగాల నుంచి మౌర్య సమకాలికులైన ఈ నలుగురు తెలంగాణా తొలి తరం రాజులుగా పాలించారనీ, చుట్టూ మట్టి కోటగోడను కట్టుకొని, కోటలింగాలను తమ రాజధానిగా చేసుకొన్నారనీ, కోటలింగాలే, తెలుగువారి తొలి రాజధాని అని చెప్పటానికి వీలు చిక్కింది. అస్మకరాజధాని బోధన్ (బోదన) అని సాహిత్యాధారమున్నా, మౌర్యుల కంటే ముందే తెలంగాణాలో రాచరికం పురుడు పోసుకొందని, కోటలింగాల్లో బయల్పడిన పురాతన మట్టికోట, వస్తుసామగ్రి నిరూపించాయి. తెలంగాణా చరిత్రలో నిలువెత్తు మైలురాయిలా నిలిచాయి.
-ఈమని శివనాగిరెడ్డి-స్థపతి,
ఎ : 9848598446